సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే- మొదటి భాగం


శాంతారాం బల్వంత్ నాచ్నే థానే జిల్లాలోని దహను గ్రామ నివాసి. అతని తండ్రి శ్రీ బల్వంత్ హరిభావు నాచ్నే, తల్లి శ్రీమతి రమాబాయి బల్వంత్ నాచ్నే. శ్రీ బల్వంత్ హరిభావు నాచ్నేకి సంబంధించి చెప్పుకోదగ్గ ఒక విశేషమేమిటంటే, అతను 1850వ సంవత్సరంలో పవిత్రమైన విజయదశమి రోజున జన్మించి, 1929లో అదే విజయదశమి రోజున మరణించాడు. అతను నాడిని చూసి వ్యాధిని నిర్ధారించగల గొప్ప నైపుణ్యం గలవాడు. అతనికి మూలికా వైద్యం పట్ల చాలా ఆసక్తి ఉండేది. అతనెప్పుడు తన పంటపొలాలకు వెళ్ళినా వివిధ రకాలైన ఔషధ మూలికలను సేకరించి, వాటిని నూరి, ద్రావకాలను తయారుచేసేవాడు. అతను పేద ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం చేస్తుండేవాడు. ఎప్పుడూ ఎవరి వద్ద నుండి ధనాన్ని స్వీకరించేవాడు కాదు. అతనిచ్చిన మందులు చాలా ప్రభావవంతంగా పనిచేసేవి. దహనులోనే కాక చుట్టుపక్కల గ్రామాలలో కూడా అతను గొప్ప హస్తవాసి గల వైద్యునిగా ప్రసిద్ధిగాంచాడు. అతని భార్య శ్రీమతి రమాబాయి కూడా అవసరంలో ఉన్న పేద ప్రజలకు సహాయం చేస్తుండేది. అలా సహాయం చేయడంలో ఆమె ఆనందం పొందేది. ఆమె ఎల్లప్పుడూ పూజాపునస్కారాలలో నిమగ్నమై ఉండేది. సాధు సత్పురుషులను తమ ఇంటికి ఆహ్వానించి, వారికి సేవ చేస్తుండేది. ఈ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం. కుమారులు: ఆనంద్, శాంతారాం, జనార్థన్, రఘునాథ్, బాలచంద్ర. కుమార్తెలు: గులాబ్, బైజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే సుమారు 1889లో జన్మించాడు. అతనిని తన కుటుంబసభ్యులతో సహా అందరూ 'నానా' అని పిలిచేవారు. నాచ్నే కూడా తన తల్లిదండ్రుల మాదిరిగా మంచిపనులలో, ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొంటుండేవాడు. అతను తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి ముందే దహనులోని మామల్తదార్ కార్యాలయంలో ఉద్యోగం పొందాడు. అతనెప్పుడూ తన కుటుంబసభ్యులకు, తనను కలిసే వ్యక్తులకు సాయిబాబాతో తనకు గల అనుభవాలను పంచుకుంటూ ఉండేవాడు.

1909వ సంవత్సరంలో శాంతారాం బల్వంత్ నాచ్నేకు బాబా అద్భుతమైన అనుభవం ఇచ్చారు. నిజానికప్పటికి శ్రీసాయిబాబా గురించి అతనికి ఏమీ తెలీదు. ఆ సంవత్సరంలో నాచ్నే అన్నగారికి ముంబాయిలోని బజేకర్ ఆసుపత్రిలో గొంతు దగ్గర ఒక శస్త్రచికిత్స జరుగుతోంది. అతని తండ్రి అతనికి సహాయంగా అక్కడ ఉన్నాడు. మరోవైపు మిగతా కుటుంబసభ్యులంతా దహనులో శస్త్రచికిత్స గురించి ఆందోళనపడుతూ ఉన్నారు. నాచ్నే కూడా ఇంటిలోనే ఉన్నాడు. ఆ సమయంలో అతని వద్దకు ఒక సాధువు వచ్చి "రెండు రొట్టెముక్కలు పెట్టమ"ని అడిగాడు. కుటుంబసభ్యులు అతన్ని లోపలికి ఆహ్వానించి భోజనం పెట్టారు. నాచ్నే వదినగారు అతనికి అన్ని పదార్థాలు వడ్డించింది కానీ, బెండకాయ కూర సాధువులకు వడ్డించ తగినది కాదని దాన్ని మాత్రం వడ్డించలేదు. ఆశ్చర్యకరంగా ఆ సాధువు తనంతట తానుగా "నాకు బెండకాయ కూర కావాలి" అని అడిగి దాన్ని పెట్టించుకుని తిన్నాడు. తరువాత ఆ సాధువు వారందరినీ ఆశీర్వదించి, ముంబాయి ఆసుపత్రిలో ఆపరేషన్ సురక్షితంగా జరిగిందని, రోగికి ప్రాణాపాయమేమీ లేదని చెప్పాడు. తరువాత అదేరోజు నాచ్నే స్నేహితుడు హరిభావు మోరేశ్వర్ ఫన్సే వారి ఇంటికి వచ్చి మాటల సందర్భంలో, 'శ్రీసాయిబాబా' దయతో ఆపరేషన్ విజయవంతమవుతుందని ఆశిస్తున్నాన"ని అన్నాడు. అదే మొదటిసారి నాచ్నే "సాయిబాబా" గురించి వినడం. అదేరోజు సాయంత్రం ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిన అతని తండ్రి తన కుటుంబసభ్యులతో, "ఆపరేషన్ చక్కగా జరిగింది, ఎటువంటి ప్రమాదం లేదు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఒక సాధువు రోగి వద్దకు వచ్చి, ఆపరేషన్ జరిగిన శరీరభాగంపై తన హస్తాన్నుంచి 'అంతా బాగుంటుంద'ని చెప్పి వెళ్లారు" అని చెప్పాడు. కొద్దిరోజుల్లో నాచ్నే సోదరుడు పూర్తిగా కోలుకున్నాడు.

1909వ సంవత్సరంలో ఒకసారి శ్రీదాసగణు చేసిన కీర్తనకు నాచ్నే తండ్రి హాజరయ్యాడు. ఆ కీర్తనలో దాసగణు శ్రీసాయిబాబా సాక్షాత్తూ దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తిమంతులని, అత్యంత కరుణామయులని అభివర్ణించాడు. తరువాత 1911లో నాచ్నే తండ్రి తన కుమారుడి ఉద్యోగానికి సంబంధించిన పనిమీద బాంద్రాలో ఉన్న శ్రీఅన్నాసాహెబ్ దభోల్కర్‌ని కలవడానికి వెళ్ళాడు. అక్కడ అతడు అందమైన శ్రీసాయిబాబా ఫోటోను చూశాడు. ఆ ఫోటో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ ఫోటో ఎవరిదని తన పక్కన ఉన్న వ్యక్తిని అడగగా, అది శ్రీసాయిబాబా ఫోటో అని అతడు చెప్పాడు. తరువాత అతను ఒక సాయిబాబా ఫోటో తెచ్చుకుని, ప్రతిరోజూ సాంబ్రాణికడ్డీలు వెలిగించి పూజించడం ప్రారంభించాడు.

1912లో నాచ్నే మొదటిసారి శిరిడీ సందర్శించాడు. అక్కడికి వెళ్ళడానికి ముందు అతను రెవెన్యూ సబార్డినేట్ పదవికి సంబంధించిన పరీక్షకు హాజరయ్యాడు. దాని ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఆ సమయంలో అతడు శంకర్ బాలకృష్ణ వైద్య, అచ్యుత దాతే అను ఇద్దరు స్నేహితులతో కలిసి శిరిడీ ప్రయాణమయ్యాడు. వాళ్ళు రైలులో కోపర్‌గాఁవ్ చేరుకున్నారు. వాళ్ళు శిరిడీ వెళ్తున్నారని విన్న అక్కడి స్టేషన్ మాస్టర్, సాయిబాబా తన గారడీ విద్యలతో ప్రజలను ఆకర్షించే మోసగాడని, ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని విమర్శించాడు. అతని వ్యాఖ్యలను విన్న నాచ్నే మనస్సు కలత చెందింది. "సాయిబాబా నిజంగా గొప్ప మహాత్ములేనా? ఆయన దర్శనానికి వెళ్లడం సమంజసమేనా?" అన్న సందేహాలు తలెత్తి శిరిడీ పోవడానికి సంశయించాడు. కానీ చివరికి ఎలాగో సమాధానపడి ముగ్గురూ శిరిడీ చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి సాయిబాబా లెండీనుండి మసీదుకొస్తూ దారిలో వాళ్ళకి ఎదురయ్యారు. ముగ్గురూ ఆయనకు నమస్కరించుకున్నారు. బాబా నాచ్నేను చూస్తూ, "ఏమిటి? మామల్తదార్ అనుమతి తీసుకోకుండా ఇక్కడికి వచ్చావా?" అని అడిగారు. ఆ విషయం గురించి బాబాకెలా తెలుసునని ఆశ్చర్యపోతూ 'అవున'ని బదులిచ్చాడు నాచ్నే. అప్పుడు బాబా అతనితో, "అలా ఎప్పుడూ చేయకు" అని అన్నారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నాచ్నే మనస్సులో ఏర్పడిన సందేహాలన్నీ బాబా మాటలతో తొలగిపోయాయి. బాబా సర్వజ్ఞులని అతనికి అర్థమైంది. బాబా అంతర్యామి అనీ, ఆయనకన్నీ తెలుసునని అతను గ్రహించాడు. వాళ్ళు మూడురోజులు శిరిడీలో బసచేశారు. ఆ మూడురోజులలో నాచ్నే పొందిన అనుభవాలకి ఇది ఆరంభం మాత్రమే. అతనికి కలిగిన ప్రతి అనుభవమూ బాబా మహిమను, భక్తులపై వారికి గల వాత్సల్యాన్ని తెలియజేసాయి. మూడురోజులు ముగిసేసరికి బాబా నిజంగా దత్తావతారమని అతనికి పూర్తి నమ్మకం ఏర్పడింది.

రెండవరోజు బాబా తమ ఆశీస్సులు నాచ్నే కుటుంబమంతటిపై ఉన్నాయని నిరూపణ ఇచ్చారు. ఆరోజు నాచ్నే బాబా సమక్షంలో కూర్చుని ఉండగా ఆయన తమ వేలితో అతని వైపు చూపుతూ కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ జోగ్, అన్నాసాహెబ్ దభోల్కర్ మొదలైన భక్తులతో, "ఒకప్పుడు నేను ఇంతనింటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు ఇతడు నాకు బెండకాయకూర వడ్డించలేదు" అని అన్నారు. ఆ మాటలు వింటూనే 3 సంవత్సరాల క్రితం భోజనం కోసం వచ్చిన సాధువును గుర్తుచేసుకున్నాడు నాచ్నే. బాబానే ఆ సాధువు రూపంలో వచ్చి తన సోదరుడికి ఆపరేషన్ బాగా జరిగిందని భరోసా ఇచ్చి, కుటుంబమంతటినీ ఆశీర్వదించారని గ్రహించాడు. అప్పుడు నాచ్నే తాను ఇటీవల వ్రాసిన డిపార్ట్‌మెంటల్ పరీక్షా ఫలితాల గురించి బాబాను అడిగాడు. బాబా "అల్లా మాలిక్ హై" అని తమ వరదహస్తాన్ని అతని తలపై ఉంచి ఆశీర్వదించారు. తరువాత ఆ పరీక్షలో నాచ్నే ఉత్తీర్ణత సాధించాడు. ఆ తరువాత దీక్షిత్, జోగ్, దాభోల్కర్‌లతో దహనులో తన ఇంటికి సాధువు వచ్చినప్పుడు తన వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించని సంగతిని తెలియజేశాడు నాచ్నే. 

ఆ విషయం గురించి శ్రీబి.వి.నరసింహస్వామితో నాచ్నే ఇలా చెప్పాడు: "చిత్రమైన విషయమేమంటే, ఆరోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు, బాబాకు ఎలాంటి పోలికలూ లేవు. అతను నల్లని రంగు, పొడవైన గడ్డంతో ఉన్న హిందూ సాధువు. అతను సాయిబాబావలె కాక, మీవలె (బి.వి. నరసింహస్వామి వలే) ఉన్నాడు. అంతేగాక ఆపరేషన్ జరిగిన రెండు, మూడురోజుల తరువాత దహనులో నేను అతనిని చూసి దగ్గరగా పరిశీలించాను కూడా! కొన్నిరోజుల తరువాత అతను దహను నుండి వెళ్ళిపోయినట్టున్నాడు, నాకు మళ్ళీ కనపడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి, బాహ్యంగా రూపురేఖలలో తేడాలున్నప్పటికీ వారు ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిరారణ అయింది!"

బాబా నాచ్నేపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించారు. ఆయన స్వయంగా అతని చేతిలోని ఊదీ తీసి అతని నుదుటన పెట్టారు. అది అందరికీ లభించే భాగ్యం కాదు. చాలా తక్కువమంది భక్తులు మాత్రమే బాబా నుండి అటువంటి అభిమానాన్ని పొందారు.

తరువాత ఆరతి సమయానికి భక్తులందరూ మశీదు చేరుకుంటున్నారు. వాళ్లలో నాచ్నే కూడా ఒకడు. బాబా అతన్ని చూసి, "వాడాకి వెళ్లి భోజనం చేసిరా!" అన్నారు. అందుకతడు, "బాబా! ఈరోజు ఏకాదశి" అని బదులిచ్చాడు. చాలామంది ఉపవాసం ఉండే పవిత్ర దినమది. సాధారణంగా అయితే నాచ్నే ఆరోజు ఉపవాసం ఉండడు. కానీ తన స్నేహితులిద్దరూ ఉపవాసముండగా తాను మాత్రమే తినడం బాగుండదని అతను కూడా ఉపవాసముంటున్నాడు. బాబా ఎన్నడూ ఉపవాసాలను ప్రోత్సహించేవారు కాదు. ఆయన అతని స్నేహితులను చూపిస్తూ, "వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్లి భోజనం చేసిరా!" అని అన్నారు. సరేనని అతడు భోజనం కోసం వాడాకు వెళ్లగా, భోజనం వడ్డించే వ్యక్తి చికాకుపడి 'ఏకాదశిరోజున కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నావే!' అని గొణుక్కుంటూ, "ఆరతి అయ్యాకనే భోజనం పెడతాన"ని మశీదుకు బయలుదేరాడు. అందువల్ల నాచ్నే భోజనం చేయకుండానే మసీదుకు తిరిగి వచ్చాడు. బాబా అతనిని "భోజనం చేశావా?" అని అడిగారు. అందుకతను, "లేదు బాబా, ఆరతి అయిన తరువాత భోజనం చేస్తాను" అని బదులిచ్చాడు. కానీ బాబా పట్టుబట్టి, "ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే ఆరతి మొదలవుతుంది" అని చెప్పి, "ఉపవాసంతో భగవంతుని కనుగొనలేవు" అని అన్నారు. ఇక తప్పనిసరై భోజనశాల అతను నాచ్నేకు వడ్డించాడు. నాచ్నే భోజనం చేసి తిరిగి మశీదుకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి మావ్‌సీబాయి (పిన్నమ్మ లేక పెద్దమ్మ) బాబాకు తాంబూలం సమర్పించింది. ఆయన అందులో సగం నాచ్నేకిచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూల సేవనం నిషిద్ధమని అతను సంశయిస్తుంటే, బాబా మళ్ళీ "తిను" అని అన్నారు. దాంతో అతను తాంబూలం వేసుకున్నాడు. తరువాత ఆరతి ప్రారంభమైంది.

ఆరతి తరువాత బాబా నాచ్నే వద్దనుండి 4 రూపాయలు, వైద్య వద్దనుండి 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. కానీ దాతేను బాబా దక్షిణ అడగలేదు. కారణం, అతనికి దక్షిణ ఇవ్వడం ఇష్టంలేదు. అప్పుడొక  మార్వాడీ బాలిక బాబా వద్దకొచ్చి తనకు నారింజపండు కావాలని మారాం చేసింది. దాతే కొన్ని నారింజపండ్లను వాడాలో దాచుకుని మిగిలినవి మాత్రమే మశీదుకు తీసుకొచ్చి తమకు సమర్పించాడని తెలిసిన బాబా, వాటిని తీసుకుని రమ్మని అతనితో అన్నారు. తాను వాటిని ఏకాదశినాడు అల్పాహారంగా తినడానికి దాచుకున్నాని చెప్పి, వాటిని తెచ్చివ్వడానికి నిరాకరించాడు దాతే. ఆపై వాటిని తెమ్మని బాబా అడగలేదు.

మూడవరోజు నాచ్నే, అతని స్నేహితులు శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవడానికి సన్నద్ధమవుతున్నారు. అంతవరకూ బాబాపట్ల నాచ్నే మనసులో ముద్రించుకుపోయిన సద్భావనలు చెదిరిపోతాయేమో అనిపించే సంఘటన ఆరోజు జరిగింది. ఆరోజు ఉదయం మశీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఆయన కనులు ఎర్రబారిపోయాయి. మశీదులో ఉన్నవారంతా అక్కడినుండి పారిపోయారు. బాబా దగ్గరకు వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో ఎవరికీ అర్థం కాలేదు. 15 నిమిషాలపాటు బాబా అందరినీ భయభ్రాంతులను చేశారు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లు ఆయన పిచ్చివారేమో అన్న అనుమానం నాచ్నేకు కలిగింది. కానీ కాసేపటికి బాబా శాంతించి మామూలు స్థితికి వచ్చారు. నాచ్నే, అతని స్నేహితులు బాబా దగ్గరకెళ్ళి శిరిడీ నుంచి వెళ్ళడానికి అనుమతి కోరారు. బాబా ఊదీ ఇచ్చి, వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు.

ఆ సమయంలో నాచ్నే బాబా నుండి మరో అనుభవాన్ని పొందాడు. అతను దహనులో పనిచేస్తూ ఉండేవాడు. ఆరోజుల్లో గ్రామప్రాంతాల నుండి నగరాలకు బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. అతను తనకి ముంబాయికి బదిలీ కావాలని ఆశపడుతుండేవాడు. ఆ విషయం అతడు బాబాతో చెప్పకపోయినప్పటికీ బాబా తమంతట తాముగా, "ఉద్యోగానికి ముంబాయి రా" అని అన్నారు. బాబా నోటివెంట వచ్చిన ఆ మాట ఆరు సంవత్సరాల తరువాత నిజమైంది. బాబా ఆశీర్వాద ప్రభావం వల్ల నాచ్నేకు 1918లో ముంబాయి పరిసరప్రాంతమైన బాంద్రాకు బదిలీ అయ్యింది.

నాచ్నే అతని స్నేహితులు తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. బాబా కృప వలన 'అనుమతి లేకుండా తన ఉద్యోగ విధులకు గైర్హాజరైన' విషయంలో నాచ్నేని అతని పైఅధికారి, మామల్తదారు అయిన బి.వి.దేవ్ ఏ విధమైన శిక్ష వేయకుండా ఇంకోసారి ఇలా చేస్తే చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించి వదిలేశాడు.

నాచ్నే శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత, అతని స్నేహితుడు గోపాల్ కేశవ్ వైద్య శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. అతడు శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత తన అన్నగారైన ఆత్మారాం కేశవ్ వైద్యకు శిరిడీ వెళ్లి బాబాను దర్శించమని చెప్పాడు. ఆత్మారాం గారికి 42 సంవత్సరాలు, అతని భార్య వయసు 38 ఏళ్ళు. కొన్ని సమస్యల కారణంగా ఆమె అప్పటివరకు తన భర్త ముఖాన్ని చూడలేదు. దంపతుల మధ్య సమస్యలు తొలగించడానికి ఇరు కుటుంబసభ్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె పుట్టింటిని విడిచి వెళ్ళడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. గోపాల్ కేశవ్ వైద్య శిరిడీ ప్రసాదాన్ని ఆమెకు పంపించాడు. అవి చేరిన వెంటనే ఆమె తన భర్త ఇంటికి వచ్చేసింది. ఆమె తన మరిదితో, "ఇదే నా నిజమైన ఇల్లు, పుట్టింట్లో సుఖమేమున్నది?" అని అన్నది. ఆమె మాటలు విన్న అతను ఆశ్చర్యపోయాడు. అప్పటినుండి ఆ దంపతులు సంతోషకరమైన జీవితాన్ని గడిపారు. బాబా అనుగ్రహంతో వాళ్లకు చక్కని సంతానం కూడా కలిగింది.

నాచ్నే మొదటిసారి 1912లో బాబాను దర్శించినప్పటినుండి తరచూ శిరిడీ వెళ్లి బాబాను దర్శిస్తూ ఉండేవాడు. 1913లో ఒకసారి అతను శిరిడీ ప్రయాణమవుతున్నప్పుడు అతని స్నేహితుడు హెచ్.ఎం.ఫన్సే అతన్ని కలిశాడు. అతడు నాచ్నేతో, 'ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాననే నేరంపై తనను దోషిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, జామీనుపై తనని విడుదల చేశార'ని చెప్పాడు. అంతేకాదు, 'తాను కోర్టులో అప్పీలు చేసుకున్నానని, అది ఒకటి రెండు రోజుల్లో విచారణకొస్తుంద'ని చెప్పి, తాను నిర్దోషినని, ఇబ్బందుల్లో ఉన్న తనకు సహాయం చేయమని తన తరపున బాబాను ప్రార్థించమని చెప్పాడు. నాచ్నే తెల్లవారుఝామున శిరిడీ చేరుకునేసరికి చావడిలో కాకడ ఆరతి జరుగుతోంది. ఆ సమయంలో బాబా చాలా కోపంగా ఉన్నారు. అయినప్పటికీ నాచ్నేను చూస్తూనే బాబా, "ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అతనితో చెప్పు. అతను అప్పీలు మీద నిర్దోషిగా ప్రకటించబడతాడు" అని చెప్పారు. అదే జరిగింది. నాచ్నే శిరిడీ నుండి తిరిగి వెళ్లి ఫన్సేతో ఆ విషయం చెప్పేసరికే అతను అప్పీలు మీద నిర్దోషిగా విడుదలై ఉన్నాడు. బాబా అభయమిచ్చిన వెంటనే ఆ కార్యం నెరవేరిందన్న మాట.

అదే సంవత్సరంలో ఒకసారి నాచ్నే శిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనితో, "పిచ్చివాళ్ళను నమ్మకూడదు" అని అన్నారు. అది అందరినీ ఉద్దేశించి చెప్పినదేగానీ తనకు ప్రత్యేకించి చెప్పినది కాదని నాచ్నే అనుకున్నాడు. కానీ అది సాధారణ హితవాక్యం కాదని, బాబా తనకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ద్వారా అతడు గ్రహించాడు. 1914లో నాచ్నే దహనులో కోశాధికారిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు అతను తన రోజువారీ అలవాటు ప్రకారం బాబా మరియు ఇతర దేవతామూర్తుల పూజలో నిమగ్నమై ఉన్నాడు. రామకృష్ణ బల్వంత్ ఫన్సే అనే మానసికరోగి పూజగదికి కొంత దూరంలో ఉన్న తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. అతను ఎవరికీ ఏ హానీ తలపెట్టేవాడు కాదు. అందువలన నాచ్నే అతన్ని పట్టించుకోలేదు. అకస్మాత్తుగా అతడు నాచ్నే మీద పడి రెండు చేతులతో నాచ్నే మెడ పట్టుకుని, "నేను నీ రక్తం తాగుతాను" అని అరుస్తూ నాచ్నే గొంతు కొరికే ప్రయత్నం చేశాడు. క్షణం పాటు నాచ్నేకు ఏమీ అర్థం కాలేదు. బాబా దయవల్ల మరుక్షణంలో అతనికొక ఆలోచన స్ఫురించి ఉద్ధరణి తీసుకుని ఫన్సే గొంతులో గుచ్చాడు. దానితోపాటు అతని నోట్లోకి వెళ్లిన నాచ్నే వేళ్ళను ఆ పిచ్చివాడు గట్టిగా కొరకసాగాడు. నాచ్నే మరో చేత్తో తన మెడను అతని పట్టునుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని గోళ్ళు నాచ్నే మెడలోకి గుచ్చుకుపోయాయి. అంతలో నాచ్నే తల్లి పరుగున వచ్చి ఆ పిచ్చివాడి పట్టునుండి విడిపించడానికి సహాయం చేసింది. అప్పటికే నాచ్నే స్పృహ కోల్పోయాడు. తరువాత ఏవో చికిత్సలు చేశాక అతను కోలుకున్నాడు. కానీ నాచ్నే మెడ భాగంలో లోతుగా గుచ్చుకుపోయిన ఆ పిచ్చివాడి చేతిగోర్ల గుర్తులు పోవడానికి చాలాకాలం పట్టింది. నాచ్నే దాదాపు చావు అంచుల వరకు వెళ్ళాడు, కానీ బాబా ఆశీస్సుల వలన అదృష్టవశాత్తూ బ్రతికి బయటపడ్డాడు. ఆ తరువాత నాచ్నే శిరిడీ వెళ్ళినప్పుడు, బాబా అతని వైపు చూపిస్తూ అణ్ణాచించణీకర్‌తో, "అణ్ణా, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉన్నా ఇతడు చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతును నులిమేసేవాడు. కానీ, నేను అతని బారినుండి ఇతనిని విడిపించాను. ఏం చేస్తాం? నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు?" అని అన్నారు. బాబా యొక్క ఈ మాటలు ఆయనకు తమ భక్తులపట్ల ఎనలేని దయ, ప్రేమను సూచిస్తున్నాయి. తమను ప్రేమించే వారి విషయంలో ఆయన ఎంతో అప్రమత్తంగా ఉంటారనడానికి నిదర్శనమే ఈ అనుభవం.

 source:  Personal Interview with Shri.Ravindra Shantaram Nachane Son of Late Shri.Shantaram Balavant Nachane, and Akhanda Shree Sai Krupa Marathi Book written and published by Shri.Ravindra Shantaram Nachane)
devotees experiences of saibaba by b.v. narasimha swamy.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.




తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.





5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo