సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఎం.బి. రేగే - మొదటి భాగం



clip_image002
ఇండోర్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన మేఘశ్యామ్.బి.రేగే శ్రీసాయిబాబాకు అత్యంత సన్నిహిత భక్తుడు. రత్నగిరి జిల్లాలోని నహీబాబ్ గ్రామంలో 1888, జూలై 5, యోగిని ఏకాదశినాడు ఇతను జన్మించాడు. నాటికి ఆరవరోజున ఆ బిడ్డ ప్రక్కన హఠాత్తుగా ఒక ఫకీరు ప్రత్యక్షమై, బిడ్డనెత్తుకుని, బిడ్డ తలపై తమ చేతితో నిమిరి తిరిగి పడుకోబెట్టారు. ఆయనెవరోనని ఆ ఇంటివారు విచారించేలోగానే ఆ ఫకీరు అదృశ్యులయ్యారు. తమకు కనిపించింది దయ్యమో, భూతమోనని ఆ కుటుంబీకులంతా భయపడ్డారు. చాలాకాలం తరువాత 1910లో రేగే శిరిడీ వెళ్ళినప్పుడు బాబా తనను ఆశీర్వదించి ఇచ్చిన ఫోటో ఒకటి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఫోటో చూసిన అతని తల్లి ఆశ్చర్యపడి, రేగే జన్మించిన ఆరవరోజున దర్శనమిచ్చిన ఫకీరు సాయేనని గుర్తించి ఆ సంగతి అతనితో చెప్పింది. అలా చిన్నవయస్సులోనే బాబా ఆశీస్సులు పొందిన భాగ్యశాలి రేగే.

చిన్ననాటినుండి రేగేకున్న మతపరమైన ఆసక్తి సాయిబాబా వైపు ఆకర్షితుడు కావడానికి దోహదమైంది. గోవాలో కొలువై ఉన్న శాంతదుర్గాదేవి వీరి ఇలవేల్పు. రేగే తన చిన్నవయస్సు నుండి ఆ దేవిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఎనిమిదవ ఏట ఉపనయనం చేశాక సంధ్యవార్చడం, గాయత్రిజపం శ్రద్ధగా చేస్తుండేవాడు. తరువాత ఇతని ఆరాధన విష్ణువు వైపుకు మళ్ళింది. ప్రముఖ చిత్రకారుడు రవివర్మ చిత్రించిన ధృవుడు-మహావిష్ణువు ఉన్న చిత్రపటమొకటి వారి ఇంట ఉండేది. ఆ పటంలోని విష్ణువు రూపం రేగే మనస్సులో బలంగా ముద్రించుకుపోయింది. అతనెప్పుడూ ఆ విష్ణువు రూపాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. విష్ణువుపై ఏకాగ్రత నిలుపుదామని ప్రయత్నించినపుడల్లా ప్రక్కన ఉన్న ధృవుని రూపం వల్ల అతని ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుండేది. అందువల్ల అతను ఆ పటంలోని ధృవుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగిస్తుండేవాడు. అంతేకాక, ధృవుని స్థానంలో తనను ఉంచమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుండేవాడు. చిన్నతనంనుండి ప్రాణాయామం, ఆసనాలు అభ్యసిస్తుండటం వలన సిధ్ధాసనంలోగాని, పద్మాసనంలోగాని గంటా, రెండుగంటలు స్థిరంగా కూర్చుని 15 నిమిషాలపాటు ఒకే మూర్తిని నిలుపుకుని ధ్యానిస్తుండేవాడు. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతిని సాధించాడు. ఇవన్నీ గురువు లేకుండానే అతను చేయగలుగుతుండేవాడు. అతను చేసే విష్ణురూప ధ్యానం, ప్రార్థనలు అతని 21వ ఏట ఫలవంతమయ్యాయి. 

అది 1910వ సంవత్సరం. ఒకరోజు రాత్రి రేగే నిద్రిస్తుండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలో గోచరమైన దృశ్యమో తెలియదుగాని వరుసగా మూడు అనుభవాలు అతనికి కలిగాయి. మొదటి అనుభవంలో అతనొక మంచం మీద పడుకుని ఉండగా తనలో ఏదో మార్పు జరిగినట్లుగా అతనికి అనిపించింది. తన నుండి తన దేహం విడిపోయినట్లు, దానినుండి తాను వేరుగా ఉన్నట్లు భావన కలిగింది. అతని ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం అయిపోయింది. ఒక గంట తరువాత రేగేకి మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొక వ్యక్తి నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి ఆ వ్యక్తిని చూపిస్తూ, “శిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు. ఈయనను నీవు తప్పక ఆశ్రయించాలి” అని చెప్పారు.

మరికొంతసేపటి తరువాత రేగేకి మూడవ అనుభవమయింది. గాలిలో తేలుతున్నట్లుగా అతనొక వింత అనుభవానికి లోనయ్యాడు. అలా గాలిలో తేలుతూ అతనొక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తే, అతనిని 'ఇది ఏ గ్రామం?' అని రేగే ప్రశ్నించాడు. అందుకు ఆ వ్యక్తి, 'ఇది శిరిడీ గ్రామం' అని బదులిచ్చాడు. 'అయితే, ఇక్కడ సాయిబాబా అనే పేరుగల వారెవరైనా ఉన్నారా?' అని రేగే అడిగాడు. అప్పుడా వ్యక్తి, 'ఉన్నారు. రండి, చూపిస్తాను' అని రేగేను ఒక మసీదుకి తీసుకుని వెళ్ళాడు. మసీదులో బాబా కాళ్ళు చాపుకుని కూర్చుని ఉన్నారు. రేగే భక్తితో బాబా పాదాల వద్ద తన శిరస్సునుంచాడు. వెంటనే బాబా లేచి, “నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు ఋణగ్రస్తుణ్ణి. నేనే నీ దర్శనం చేసుకోవాలి!” అని అంటూ తమ శిరస్సును రేగే పాదాలపై ఉంచారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. ఈ మూడు దృశ్యాలు రేగేపై ఎంతో ప్రభావాన్ని చూపాయి.

ఈ అనుభవాలు పొందడానికి ముందే రేగే సహజరీతిలో కూర్చుని ఉన్న సాయిబాబా ఫొటో ఒకటి చూసి ఉన్నాడు. కానీ అప్పటికి బాబా గురించిగాని, తరచుగా వారు కాళ్ళు చాపుకుని కూర్చుంటారన్న విషయంగాని అతనికి తెలియవు. కొంతకాలం తరువాత అతను తనకు కలిగిన దృశ్యానుభవాల ప్రకారం సాయిబాబా తనకు నిర్ణయింపబడిన గురువు అవునో కాదో నిర్ధారించుకోవడానికి శిరిడీకి ప్రయాణమయ్యాడు.

రేగే శిరిడీ చేరుకుని మసీదుకు వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలామంది భక్తులున్నారు. రేగే బాబా పాదాలపై తన శిరస్సునుంచి సాష్టాంగ నమస్కారం చేసుకోగా, బాబా, “ఏంటి? నువ్వు మానవమాత్రుణ్ణి పూజిస్తావా?” అని అన్నారు. వెంటనే అతను వెనక్కి తగ్గి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. బాబా తిరస్కరణ అతని మనసును గాయపరిచింది. అయితే, పుస్తక పరిజ్ఞానం వల్ల మానవులను పూజించరాదనే అభిప్రాయం అతనికి ఉన్నమాట నిజమే! బాబా తనను ఆదరించకపోవడానికి ఆ అభిప్రాయమే కారణమేమోనని అతనికి అనిపించింది. అతని మనసులో ఆలోచనలు సాగుతూ మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా అణగారింది. కానీ తనకు వచ్చిన దృశ్యానుభవంలో లాగా బాబా తనను భక్తునిగా అంగీకరించనందుకు కృంగిపోయాడు. కొన్ని గంటలపాటు అలాగే కూర్చుండిపోయాడు. మధ్యాహ్నమయింది, భక్తులందరూ వెళ్లిపోయారు. మసీదులో బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా వద్దకు వెళ్ళకూడదు, అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. ఆ విషయాలేవీ పట్టించుకునే స్థితిలో అతను లేడు. "ఏ ఆశయంతో శిరిడీ వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలుకొడతారేమో, కొట్టనీ" అని ఆలోచిస్తూ నెమ్మదిగా అతను బాబాను సమీపించసాగాడు. అది గమనించిన బాబా అతన్ని తమ దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో అతను ధైర్యం తెచ్చుకుని నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సునుంచాడు. వెంటనే బాబా అతన్ని లేవదీసి తమ హృదయానికి హత్తుకున్నారు. తరువాత అతన్ని తమకు దగ్గరగా కూర్చుండబెట్టుకుని, “నీవు నా బిడ్డవు. ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాం” అని అన్నారు. ఉదయం బాబా తనపట్ల చూపిన నిరాదరణకు సంతృప్తికరమైన సమాధానం అతనికి లభించింది. బాబా చూపిన గాఢమైన ప్రేమకు అతని హృదయం ప్రతిస్పందించింది. 'బాబానే తన గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగలవార'ని తెలుసుకున్నాడు. అతనికొచ్చిన దృశ్యానుభవం నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు. అతని ఆనందానికి అవధులు లేవు.

బాబా రేగేతో, "రాధాకృష్ణఆయీ ఇంటికి వెళ్ళు. ఆమె నీకు, నాకు తల్లి" అని చెప్పారు. ఆమె ఎంతో ఔదార్యం గల ప్రేమమూర్తి. ఆమెకు బాబాయందు ప్రగాఢమైన భక్తి. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా ఇచ్చే ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, సకల కార్యాలను నిర్వహిస్తూ, బాబాకు కావలసినవన్నీ సమకూరుస్తూ అందులోనే ఆనందాన్ని పొందుతుండేది. బాబా ఆదేశానుసారం రేగే అప్పటినుండి ఆమె చనిపోయేంతవరకు ఎప్పుడు శిరిడీ వెళ్లినా ఆమె ఇంటనే బస చేస్తుండేవాడు. బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయమంతా అతను ఆమె ఇంటనే గడిపేవాడు. 'ఆయీ' అంటే తల్లి. అందుకు తగ్గట్టే ఆమె అతనిని తల్లిలా ఆదరించేది. అతను కూడా మొదటినుండి ఆమెను తల్లిగానే భావించేవాడు. ప్రతిరోజూ బాబా ఆమెకు రొట్టెను పంపిస్తూ ఉండేవారు. ఆ రొట్టెతోనే ఆమె తన జీవితాన్ని గడిపేది. రేగే ఎప్పుడు శిరిడీ వచ్చినా బాబా మరొక రొట్టెను అదనంగా పంపిస్తుండేవారు. అతను శిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి రొట్టె అదనంగా వచ్చిదంటే, ‘రేగే దారిలో ఉన్నాడని, కొద్దిసేపట్లో శిరిడీ చేరుకుంటాడ’ని ఆమె గ్రహించేది.

రేగే ఇలా చెప్పారు: "రాధాకృష్ణఆయీతో నాకు చాలా అనుబంధం ఉంది. నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఆమెకు ఎంతో ఋణపడి ఉన్నాను. బాబా ఆమెను 'రామకృష్ణీ' అని పిలిచేవారు. వారి ఆదేశం, సహాయం ఆయీ ద్వారా నాకు ప్రత్యేకరీతిలో అందేవి. ఆమె చాలా దయామయి, నిష్కపట స్వభావి. తొలిరోజు నుండి నేను ఆమెతో నా అభిప్రాయాలు, ప్రణాళికలు మొదలైన అన్ని విషయాలను పంచుకునేవాడిని. ఆమె కూడా తన ఆలోచనలను, ప్రణాళికలను నాతో చెప్పేది. 'ఆధ్యాత్మిక పురోగతికోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందని విధంగా మనం వ్యవహరించాలని, ఆధ్యాత్మిక సాధనా సాఫల్యానికి గోప్యత అవసరమ'ని ఆమె నాతో చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే!"

రాధాకృష్ణఆయికి సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఆమె అద్భుతమైన గాయని. శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. ఆమె సితార్ కూడా వాయించేది. రేగేకు కూడా సంగీతం పట్ల చాలా మక్కువ ఉండేది. ఆమె పాటలు వింటున్నప్పుడు, ఆ భక్తిపారవశ్యంలో అతనికి సులభంగా మనోలయమయ్యేది. బాబాకు మంచి సంగీత పరిజ్ఞానముంది. చక్కటి సంగీతాన్ని మెచ్చుకుని ప్రశంసించేవారు. ముఖ్యంగా వారికి భజన కీర్తనలంటే చాలా మక్కువ. అర్థరాత్రివేళ బాబా రేగేను పిలిపించుకుని కీర్తనలు పాడించుకుని వినేవారు. అతని రాగాలలో దొర్లిన తప్పులను సవరించి, సంగీతంలోని మెళకువలను బోధించేవారు. స్వయంగా బాబా కూడా మధురమైన కంఠంతో పాడేవారు.

ఒకరోజు రేగే, ఆయీ ఏ విధమైన సాధన తమకు ఉపయుక్తంగా ఉంటుందనే విషయంపై చర్చించుకున్నారు. భజనలు, కీర్తనలు ఒకవిధంగా మంచివే అయినా అవి బయటివాళ్ళ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. అందువల్ల ఆ పద్ధతి తమ పురోగతికి సరిపోదని అనుకున్నారు. దాంతో, జపమైతే తమ సాధనకు బాగుంటుందని భావించారు. అప్పుడు ఏ నామజపం చేయాలన్న ప్రశ్న తలెత్తింది. అప్పుడు ఆయీ రేగేతో, "ఎక్కువమంది రామనామం, విఠలుని నామం జపిస్తారు. కానీ నాకు సాయే దైవం కాబట్టి, వారి నామం నాకు చాలు. నువ్వు కావాలంటే, విఠలుని నామం చేసుకోవచ్చు" అని చెప్పింది. అందుకతను, "నేను విఠలుని చూడలేదు. మీకేది మంచిదైతే నాకూ అదే మంచిది. నేను కూడా బాబా నామమే జపిస్తాను" అని చెప్పాడు. తరువాత వారిద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఒక గంటసేపు సాయి నామజపం చేశారు. అదేరోజు బాబా అతనిని రమ్మని కబురుపెట్టారు. అతను మసీదుకు వెళ్ళగానే,

బాబా: ఉదయం ఏం చేశావు?

రేగే: నామజపం చేసుకుంటూ గడిపాను.

బాబా: ఎవరి నామం జపించావు?

రేగే: నా దేవుడి నామం. 

బాబా: ఎవరు నీ దేవుడు?

రేగే: నా దేవుడెవరో మీకు తెలుసు.

బాబా చిరునవ్వుతో ‘సరే’ అన్నారు. దాంతో, నేరుగా తెలియజేయకున్నా జపం చేయడానికి స్ఫూర్తినిచ్చింది బాబానేనని, నామజపమే తనకు సాధనగా ఆయన ఆమోదించారని రేగే గ్రహించాడు. ఆ విధంగా రాధాకృష్ణఆయి ఇచ్చిన స్ఫూర్తితో, బాబా ఆమోదించిన నామజపం ద్వారా రేగే ఆధ్యాత్మిక అభివృద్ధిపథంలో పయనించసాగాడు.

ఇకపోతే, 'బాబా నిర్దేశించిన గమ్యం లేదా జీవిత పరమార్థం ఏమిటి? ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవుడు సాధన చెయ్యాలి?' అన్నవాటి గురించి రేగే ఇలా చెప్పాడు: "బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేసినట్లే గమ్యం విషయం కూడా పరోక్షంగా తెలియజెప్పారు. వారు చెప్పిన, ఆచరించిన విషయాలన్నింటిని బట్టి "గాఢమైన ప్రేమ ద్వారా దేవుని (ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని) చేరుకోవాలి" అని స్పష్టమౌతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమౌతుంది. మేము ఆచరించిందీ అదే, వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపచేసిందీ అదే!"

రేగే ఒక లేఖలో ఇలా తెలిపారు: “1911లో నేను యోగసాధన గురించి ఆలోచించి ఆ విషయంలో సహాయం చేయమని నా గురువైన సాయిబాబాను ప్రార్థించాను. వేరే ఏ గురువూ నాకు ఉండాలని నేను అనుకోలేదు. మట్టితో చేయబడిన ద్రోణాచార్యుని ప్రతిమను గురువుగా భావించి అస్త్రశస్త్ర విద్యలనభ్యసించిన ఏకలవ్యుని వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని నేను నా గురువైన సాయిబాబా చిత్రపటం ముందు కూర్చుని ఆసన, ప్రాణాయామాలను ప్రారంభించాను. బాబా అనుగ్రహం వలన నేను సంవత్సరకాలంలో నా శ్వాసను మరియు ఐదు నుండి ఆరు హృదయస్పందనలను నియంత్రించగలిగాను. 1912లో ఒకసారి నేను యోగసాధన గురించి, శరీర విధుల నియంత్రణ గురించి మాట్లాడుతున్నప్పుడు నా తల్లి 'ఆయీ' రాజయోగం ద్వారా తన ఋతుక్రమాన్ని అదుపు చేసుకోగలిగానని చెప్పింది. ఆయీ అయిదు అడుగుల ఎత్తుతో సాధారణ స్త్రీలా ఉండేది. కానీ లోహం వంటి దృఢసంకల్పాన్ని, గొప్ప బలాన్ని కలిగి ఉండేది. ఆమె పెద్ద పెద్ద కుండలతో ఫర్లాంగు దూరాన ఉన్న బావి నుండి నీళ్ళు తీసుకుని వచ్చేది. మామూలుగా ఆ పని చేయడానికి బలశాలి అయిన వ్యక్తికి కూడా మరొకరి సహాయం అవసరమయ్యేది. కానీ ఆమె తన స్వహస్తాలతో ఎవరి సహాయం లేకుండా ఆ పని చేసేది. ఒకసారి ఆయీ నా ఛాతీపై ఒక దెబ్బ వేసి, "నువ్వు సంసారివి. నీ హృదయం బోళాగా ఉందా?" అని ప్రశ్నించి, "నేను నీకన్నా బలశాలిని" అని నొక్కి మరీ చెప్పింది. అందుకు "నేను చిన్నపిల్లవాడిన"ని బదులిచ్చాను. ఆ విషయమై బలనిరూపణ చేసుకుందామని ఆమె చెప్పింది. నేను వద్దని చెప్పినప్పటికీ ఆమె పట్టుబట్టింది. మధ్యాహ్నవేళ రహతాకు వెళ్లే మార్గం ఎడారిలా ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లి ఒకరిని మరొకరు తమ వీపుపై ఎక్కించుకుని పరుగుతీయాలని ఆమె చెప్పింది. నేను ముందుగా ఆమెను నా వీపుపై ఎక్కించుకుని పరుగుతీశాను. రెండు ఫర్లాంగుల దూరం వెళ్ళాక ఆమె, "నేను సంతృప్తి చెందాను. ఇక నువ్వు ఆగిపో" అని చెప్పింది. తరువాత ఆమె నన్ను తన వీపుపై ఎక్కించుకుని రెండు ఫర్లాంగుల కంటే ఎక్కువ దూరం పరుగుతీసి, "నేను నీకన్నా బలంగా ఉన్నాను కదా?" అని అడిగింది. అందుకు నేను "నిస్సందేహంగా" అని బదులిచ్చాను. అప్పుడు ఆమె తన వీపు మీద నుండి నన్ను దిగమని చెప్పింది. "నా తల్లి వీపుపై నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఈ సంతోషాన్ని వదులుకోను" అని చెప్పాను. అప్పుడు ఆమె, "నిన్ను క్రిందపడేస్తాన"ని బెదిరించింది. అందుకు నేను, "ప్రేమమయి అయిన తల్లి అలా చేస్తే ప్రపంచం విడ్డూరంగా చూస్తుంద"ని బదులిచ్చాను. చివరికి ఆమె, "ఆధ్యాత్మిక మార్గంలో నిన్ను నా వెనుక తీసుకెళ్తాను" అని నాకు వాగ్దానం చేసింది. ఇదంతా సాయిబాబా ముందుగానే నిర్ణయించినట్లు నాకు తోచింది. తరువాత మేము ఆయీ నివాసానికి తిరిగి చేరుకున్నాక, బాబా నన్ను పిలిపించి, "మీరు ఏమి చేస్తున్నార"ని అడిగారు. నేను మా పందెం గురించి, ఆయీ వాగ్దానం గురించి బాబాతో చెప్పాను. అప్పుడు బాబా, "ఆమె నిన్ను తన వెనుక తీసుకెళ్తుంది. అలాగే నేను కూడా నిన్ను నా వెనుక తీసుకెళ్తాను" అని చెప్పారు. తరువాత ఆయన, "యోగాభ్యాసం మానేయమ"ని నన్ను ఆదేశించి, "భక్తితో ఉండు, ఇంకేమీ అవసరం లేదు" అని చెప్తూ, తమ శిరస్సును, హృదయాన్ని, చేతులను చూపుతూ, "బుద్ధిని, మనసును, చేతలను ఒకటి చేయి!" అని చెప్పారు.

Source: http://www.saiamrithadhara.com/mahabhakthas/m.b.rege.html
http://bonjanrao.blogspot.com/2012/10/j-u-s-t-i-c-e-m-b-r-e-g-e.html
Devotees' Experiences of Sri Sai Baba Sri.B.V.Narasimha Swamiji)




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

 



6 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌷🙏 ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి🙏🌷🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. ఓం సాయిరాం... 🌹🙏🏻🌹

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo