సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 516వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం - పనిచేసిన లాప్‌టాప్
  2. సాయిఅమ్మ దయవల్ల మా బాబు ఆరోగ్యం కుదుటపడింది

బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం - పనిచేసిన లాప్‌టాప్

సాయిభక్తురాలు శ్రీమతి అనుపమ తనకు, తన అత్తగారికి బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. మా అత్తగారికి బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఆవిడ తరఫున నేను పంచుకుంటున్నాను. గత నెలలో మా అత్తగారికి ఉన్నట్టుండి ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. ఆ తరువాత రెండు రోజులకు కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. ఏమీ తినాలని కూడా అనిపించేది కాదు. పైగా ఈ లక్షణాల వల్ల తనకు కరోనా వచ్చిందేమో అని అనుమానం. ఇంటిపనులు చేయడానికి పనిమనిషి వస్తోంది. తన వల్ల ఆ అమ్మాయికి ఎక్కడ కరోనా సోకుతుందేమోనని ఆవిడ భయపడ్డారు. ఎందుకంటే, పనమ్మాయికి కరోనా వస్తే తనకు ఎవరూ పని ఇవ్వరు. ఇప్పుడున్న కష్టకాలంలో తనకు పని ఉండదు. వాళ్ళకు అదే ఆధారం కదా! అందుకే, ‘తనకు వచ్చిన లక్షణాలు కరోనాకి సంబంధించినవి కాకూడదు’ అని బాబాను వేడుకున్నారు. ఆ తరువాత రెండు రోజులకు మా అత్తగారికి తలలో ఒకవైపు నొప్పి మొదలైంది. ఆ తలనొప్పి ఎంత తీవ్రంగా ఉండేదంటే, అంతటి తలనొప్పిని ఆవిడ భరించలేకపోయారు. దాంతో ఆవిడ తన బాధను బాబాకు చెప్పుకుంటూ, “బాబా! ఈ తలనొప్పిని భరించటం నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ తలనొప్పిని ఎలాగైనా తగ్గించు తండ్రీ!” అని ఒకరోజు రాత్రంతా బాబాను వేడుకుంటూనే ఉన్నారు. ఇంకా తనకున్న తలనొప్పి, ఒళ్ళునొప్పులన్నీ తగ్గిపోయి ఆరోగ్యం బాగుంటే తన అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని, స్తవనమంజరి రోజుకు మూడుసార్లు చొప్పున 11 రోజుల పాటు పారాయణ చేస్తానని కూడా ఆవిడ బాబాకు మ్రొక్కుకున్నారు. ఆ రాత్రి ఎప్పుడో తెల్లవారుఝామున తనకు నిద్ర పట్టింది. అప్పుడు కలలో రెండు రాక్షసబల్లులు తలలో నుండి వెళ్ళిపోయినట్టు ఆవిడకు అనిపించింది. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు నుండి తన తలనొప్పి తగ్గిపోయింది. దాంతోపాటు ఒళ్ళునొప్పులు కూడా తగ్గిపోయాయి. “బాబా! మా వెన్నంటే ఉండి కాపాడుతున్నందుకు శతకోటి ప్రణామాలు తండ్రీ!”.

నేను మరొక అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వారంరోజుల క్రితం మావారు నా వద్దకు వచ్చి, తన లాప్‌టాప్ సడన్‌గా పనిచేయట్లేదని అన్నారు. “వారం రోజుల నుండి అందులో ఒక వర్క్ చేసిపెట్టుకున్నాను. ఇప్పుడు లాప్‌టాప్ పనిచెయ్యకపోతే ఆ వర్కంతా మళ్ళీ చేయాలి, ఎందుకంటే బ్యాకప్ ఏమీ తీసుకోలేదు” అని చెప్పి, “సరే, నేను స్నానానికి వెళ్ళొచ్చి మళ్ళీ చూస్తాను” అని బాత్రూంకి వెళ్ళారు. నేను ఆ సమయంలో వంటగదిలో వంట చేస్తూ, “బాబా! నేను బ్లాగులో చాలా అనుభవాలు చదివాను, ‘బాబాను కోరుకుంటే మా లాప్‌టాప్ వర్క్ అయింది’, ‘మా మొబైల్ వర్క్ అయింది’ అంటూ. అవన్నీ నిజమే అయితే మావారు స్నానం చేసి వచ్చి చూసేసరికి తన లాప్‌టాప్ మళ్ళీ వర్క్ అయ్యేలా చేయండి” అని మనసులో అనుకున్నాను. ‘అలా జరిగితే నేను సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను’ అని బాబాకు మ్రొక్కుకున్నాను. మావారికి కూడా చెప్పలేదు ఇలా కోరుకున్నట్టు. ఇంతలో మావారు స్నానం చేసి వచ్చి, మళ్ళీ లాప్‌టాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించి, ‘ఇప్పుడు లాప్‌టాప్ వర్క్ అవుతోంది’ అన్నారు. అప్పుడు అనిపించింది, “ఏంటి, నేను బాబాకు పరీక్ష పెట్టానా? ఎంత సిల్లీగా ఆలోచించాను!” అని. “క్షమించండి బాబా! అందరినీ చల్లగా చూడండి బాబా!”

సాయిఅమ్మ దయవల్ల మా బాబు ఆరోగ్యం కుదుటపడింది

సాయిభక్తురాలు శ్రీమతి పావని తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకోవటానికి బాబా నాకు అవకాశమిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు పావని. మా బాబు పేరు నాగసాయివిష్ణుభరద్వాజ్. బాబు వయసు 5 నెలలు. మా పుట్టింట్లో బాబుకి బారసాల వేడుక జరుపుకున్న తరువాత మేము మా అత్తగారింటికి వచ్చాము. ఇక్కడి వాతావరణం వల్లనో లేదా వేరే కారణం వల్లనో తెలియదుగానీ మా బాబుకి విరేచనాలు మొదలయ్యాయి. దాంతో బాబు నీరసించిపోయాడు. మరుసటిరోజుకి విరేచనాలు తగ్గి బాబు ఆరోగ్యం బాగయిపోతుందని అనుకున్నాము. కానీ, మరుసటిరోజుకి బాబుకి జ్వరం వచ్చేసింది. ఎప్పుడూ బాగా హుషారుగా ఉండే మా బాబు జ్వరంతోను, విరేచనాలతోను బాగా నీరసించిపోయాడు. తనను అలా చూస్తుంటే నాకు చాలా భయమేసింది. ఏడుపు కూడా వచ్చేసింది. ఆ సమయంలో మా అమ్మ నాకు అండగా ఉండి ధైర్యం చెప్పింది. బాబానే మా అమ్మ రూపంలో నాకు దారిచూపుతున్నారనిపించింది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! బాబు జ్వరం, విరేచనాలతో బాగా నీరసించిపోయాడు. మీ అనుగ్రహంతో జ్వరం, విరేచనాలు తగ్గి బాబు హుషారుగా ఉంటే ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించి, బాబుకి సిరప్ వేసి నిద్రపుచ్చాను. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు ఉదయానికల్లా బాబుకి జ్వరం, విరేచనాలు కూడా తగ్గిపోయాయి. నా సాయిఅమ్మ (బాబా) దయవల్ల మా బాబు ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడు బాబు బాగానే ఉన్నాడు. నిజంగా సాయిఅమ్మ నా దగ్గరే ఉన్నారని అనిపించింది. “సాయిఅమ్మా! నాకు చాలా ఆనందంగా ఉంది. మా బాబు త్వరగా కోలుకునేలా అనుగ్రహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సాయి అమ్మా! మీకు ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే సాయిఅమ్మా!”


6 comments:

  1. Baba please kapadu thandri sainatha ��

    ReplyDelete
  2. Baba nuvee dikku thandrii sai

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Baba మీ దయ సాటిలేనిది.

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏🌹 🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo