సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 913వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా లీలల ఆస్వాదన ఎంతో సంతోషదాయకం
2. బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు
3. బాబా రక్షణ

బాబా లీలల ఆస్వాదన ఎంతో సంతోషదాయకం

ముందుగా, సాయిభక్తులందరికీ మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. నేను ఇదివరకు బాబా ప్రసాదించిన ఐదు అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 2021, సెప్టెంబర్ 1న నా సీమంతం అనగా ముందురోజు పెద్ద వర్షం పడింది. దాంతో నేను బాబాకి నమస్కరించుకుని, "బాబా! రేపు నా సీమంతం. రేపు వర్షం పడకుండా చూడండి. మీ దయవల్ల వర్షం పడకుండా ఉంటే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆరోజు వర్షం పడలేదు. అతిథులు ఫంక్షన్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. బాబా ఆశీస్సులతో ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఇంకో విషయం, నేను ఈ బ్లాగులోని అనుభవాలు చదివి, "బాబా! మీరు నా సీమంతానికి వచ్చి నన్ను ఆశీర్వదించండి" అని అనుకున్నాను. అద్భుతం! ఒక అక్క నా వాట్సాప్ స్టేటస్ ఆధారంగా నాకు బాబా అంటే ఇష్టమని గ్రహించి, శిరిడీ నుండి ఒక బాబా విగ్రహం మరియు ఊదీ తెప్పించి, నాకు కానుకగా ఇచ్చారు. ఆ విధంగా బాబా నా కోరిక మన్నించినందుకు నేను ఎంత ఆనందం పొందానో మాటల్లో చెప్పలేను.

సీమంతం అయిన తరువాత మొదటి కాన్పు పుట్టింట జరగాలన్న కారణంగా 6 గంటల ప్రయాణ దూరంలో ఉన్న మా పుట్టింట్లో నన్ను విడిచిపెట్టడానికి మావారు సన్నద్ధమయ్యారు. అయితే, పెద్ద వర్షం కారణంగా ప్రయాణాన్ని రెండు రోజులు వాయిదా వేసుకోవలసి వచ్చింది. అప్పుడు నేను, "సాయినాథా! నా భర్త నన్ను మా అమ్మావాళ్ళ ఇంట్లో దించి, తిరిగి మా ఇంటికి క్షేమంగా చేరుకునేవరకు వర్షం పడకుండా చూడు బాబా" అని వేడుకున్నాను. తరువాత 2021, సెప్టెంబర్ 4న నేను, నా భర్త, మా అన్నయ్య మా పుట్టింటికి బయలుదేరాము. దారిలో ఎక్కడా అస్సలు వర్షం లేదు. మేము క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాము. మరుసటిరోజు 5వ తేదీన నా భర్త ఒక్కరే తిరిగి మా ఇంటికి వెళ్ళారు. తను ఇంటికి చేరేదాకా వర్షం లేదు. ఆయన ఇంటికి చేరుకున్న తరువాత అటు అత్తగారి ఊరిలోనూ, ఇటు మా ఊరిలోనూ పెద్ద వర్షం మొదలైంది. ఇది నిజంగా బాబా లీల.

సీమంతమైన మరుసటిరోజు లేదా ఆ మరుసటిరోజు నుండి మూడు రోజులపాటు నా ఎడమ చేయి భుజం దగ్గర విపరీతమైన నొప్పి ఉంది. గర్భవతిని అయినందున పెయిన్ కిల్లర్స్ వాడకూడదని జండూబామ్, వోలిని, ఇలా చాలా ప్రయత్నించాను, కానీ నొప్పి తగ్గలేదు. రెండు, మూడు రోజుల తరువాత బాబా ఊదీని భుజానికి రాసుకుని, మరికొంత ఊదీని నోట్లో వేసుకున్నాను. అంతే, కొద్ది నిమిషాల్లో నొప్పి మటుమాయమైంది. నిజం! బాబా లీలలు ఆస్వాదిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. "బాబా! అన్నిటికీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మీ ఆశీస్సులతో సుఖప్రసవమైతే (నాకు నా బాబాపై పూర్తి నమ్మకం ఉంది.) ఆ నా అనుభవాన్ని మరలా ఈ బ్లాగులో పంచుకుంటాను".

ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః.

బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు


నేనొక సాయిభక్తురాలిని. ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి లీలలు అనంతము, వర్ణనాతీతము. వాటిలోనుండి కొన్ని లీలలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. నేను గత 20 సంవత్సరాల నుండి బాబా భక్తురాలిని. నాలో అంచెలంచెలుగా ఆ బ్రహ్మాండనాయకుడిపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ఒకరోజు మా నాన్నగారికి హఠాత్తుగా హై-ఫీవర్ వచ్చింది. దాంతో కొంచెం భయపడ్డాను. ఆ తరువాత తనకు బి.పి. చెక్ చేయిస్తే 190 ఉంది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నీ బిడ్డను ఇబ్బందిపెట్టకు. నాన్నకు ఆరోగ్యం బాగుంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవలన నాన్న కోలుకోవడంతో ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


మా నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను కదా! కానీ, ఆ లీలను పంచుకోవటంలో కొంచెం ఆలస్యం చేశాను. తరువాత నాకొక చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది. అప్పుడు నేను నా షుగర్ లెవల్స్ చెక్ చేయించుకుంటే షుగర్ ఎక్కువగా ఉందని చెప్పారు. అప్పుడు నేను బాబాకిచ్చిన మాట గుర్తుకొచ్చింది. వెంటనే, ఆలస్యం చేసినందుకు బాబాకు క్షమాపణలు వేడుకుని, "నా ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించమ"ని ప్రార్థించి, "నా ఆరోగ్యం బాగుంటే ఈ రెండు అనుభవాలను, వాటితోపాటు మరికొన్ని నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ఏమి చేసినా ఆ సాయినాథుని ఋణం తీర్చుకోలేము. మనం తెలుసుకోవలసిన విషయమేమిటంటే, బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు. బాబా ప్రేమమయుడు, సర్వాంతర్యామి. బాబా పాదాలకు అనంతకోటి వందనాలు. ‘నన్ను, నా తల్లిదండ్రులను, నా బిడ్డలను ఎల్లప్పుడూ క్షేమంగా చూసుకోవాలనీ, మేము ఎల్లప్పుడూ వారి సేవ చేసుకోవాల’నీ మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటున్నాను. ఇకపోతే, బాబా నాకు చేసిన సహాయానికి సంబంధించి మరికొన్ని అనుభవాలు...


1) ఒకసారి నాకు కొన్ని ఆర్థిక సమస్యలొచ్చాయి. వాటినుండి బయటపడటానికి నేను ప్లాట్లు అమ్మాలనుకున్నప్పుడు బాబా నాకు ఎంతో సహాయం చేశారు.

2) మా అమ్మ డయాలసిస్, ఏ.వి. ఫిస్టులా శస్త్రచికిత్స విషయంలో బాబా మాకు మార్గనిర్దేశం చేశారు.

3) మా పెద్దబ్బాయికి పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చేలా సహాయం చేశారు.


ఇవే కాకుండా, నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి విషయంలో నేను ధైర్యం వహిస్తూ, "మా సమస్యలను పరిష్కరించమ"ని శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూ సాయిచరిత్ర పారాయణలు చేశాను, చేస్తూనే ఉన్నాను. బాబా ఎంతో కరుణతో మా సమస్యలన్నింటినీ తీరుస్తున్నారు. ‘బాబాను నమ్ముకుంటే మనకు తప్పకుండా మంచి జరుగుతుంద’ని అనటానికి ఇవే నిదర్శనాలు. "బాబా! నేను ఒకచోట ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి దయతో తొందరగా మాకున్న సమస్యలను తొలగించి నా కోరిక తీరేలా ఆశీర్వదించండి బాబా".

 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


బాబా రక్షణ


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి సాయిబాబా ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అరుణ. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఇటీవల మా అన్నయ్య వాళ్ళింట్లో అందరికీ జ్వరం వచ్చింది. ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నా తగ్గలేదు. ఒకరోజు మా వదిన ఫోన్ చేసి, "ఇంట్లో అందరూ అనారోగ్యంగా ఉండడం వలన నా మనసు ఏం బాగోలేద"ని చాలా బాధపడ్డారు. అప్పుడు నేను, "అన్నయ్యకి, పిల్లలకి రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోవాలి బాబా. అలా జరిగితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. రెండు రోజుల తర్వాత మెల్లగా జ్వరం తగ్గి ఇప్పుడు అందరూ బాగున్నారు. "బాబా! మీ అనుగ్రహం వలనే జ్వరం తగ్గిందని నా పూర్తి విశ్వాసం. మీ కృప ఎప్పటికీ ఇలానే ఉండనీయండి బాబా".


నేను ఈమధ్య ప్రతి చిన్న విషయానికీ బాబా మీద ఆధారపడుతున్నాను. ఎంత చిన్న సమస్య అయినా భారం బాబా మీదే వేస్తున్నాను. ఒక నెలరోజుల క్రితం మేము ఒక రాష్టం నుంచి ఇంకొక రాష్ట్రానికి ప్రయాణమవ్వాల్సి వచ్చింది. ‘కరోనా సమయంలో ప్రయాణం ఎలా చేయాల’ని చాలా భయపడ్డాను. చివరికి బాబా మీద భారం వేసి బయలుదేరాము. బాబా దయవల్ల ప్రయాణమంతా సవ్యంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. నా ఆరోగ్యం, పిల్లల భద్రత మీకే అప్పగించాను బాబా. మమ్మల్ని సదా రక్షించండి బాబా. ఇంకా, నా కోపాన్ని తగ్గించండి బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 912వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాని నమ్మితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారు
2. అడిగినంతనే అనుమతి ఇప్పించిన బాబా
3. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణం బాబా, గురువుగారే!

బాబాని నమ్మితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారు

సాయిబంధువులందరికీ నమస్తే. నా పేరు గంగాభవాని. మాది వైజాగ్. సాయిబాబాతో నాకు 1998 నుండి అనుబంధం. అప్పటినుండి ఆయన మమ్మల్ని అడుగడుగునా రక్షిస్తూ ఉన్నారు. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను ఆ సర్వాంతర్యామి గురించి? శిరస్సు వంచి సర్వస్య శరణాగతి వేడుకున్నవారి అన్ని విషయాలూ ఆయనే చూసుకుంటారు, మనం ఏమీ చెప్పవలసిన పనిలేదు. కాకపోతే మనకు కాసింత శ్రద్ధ, సబూరీ, ప్రేమ, నమ్మకం ఉండాలి, అంతే. పరీక్ష పెట్టేదీ ఆయనే, పాస్ చేయించేదీ ఆయనే. ఇక బాబాతో అనుభవం విషయానికి వస్తే... ఈ గ్రూప్ గురించి నాకు తెలియదు. కానీ, బాబా అనుభవాలు ఎవరు చెప్పినా ఆనందంగా వింటాను. ఈమధ్య రాఖీ పండుగరోజు మా బాబుకి జ్వరం వచ్చింది. తను పదవతరగతి అయ్యి, డిప్లొమా చేయడానికి ఎంట్రన్స్ పరీక్ష నిమిత్తం కోచింగ్‌కి వెళ్తున్నాడు. ఆరోజు కూడా తను ఎప్పటిలాగే క్లాసుకి వెళ్లి, మధ్యలో తలనొప్పి అని వచ్చేశాడు. వెంటనే తనను హాస్పిటల్‌కి తీసుకెళ్తే, "ఇప్పుడేగా జ్వరం వచ్చింది, రేపు టెస్టులు చేద్దాం, ప్రస్తుతం మందులు వాడండి" అని పంపించేశారు. ఆ రాత్రంతా జ్వరం తగ్గలేదు. మాకు కంగారుగా అనిపించి, పొద్దున్నే తనను మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాం. టెస్టుల్లో డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. ప్లేట్లెట్స్ లక్ష లోపుకు పడిపోయాయి. డాక్టర్, "పరిస్థితి విషమంగా ఉంది, పెద్ద హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళండి" అని పంపించేశారు. అప్పుడు బాబుకి జ్వరం 104 డిగ్రీలు ఉంది. వాళ్ళు వస్తారని ఇంట్లో ఎదురుచూస్తున్న నాకు మావారు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే బాబుని హాస్పిటల్‌కి తీసుకువెళ్లాము. అక్కడ అడ్మిట్ అయ్యాక వాళ్ళు, "ఇప్పుడే ఏం చెప్పలేము, అవసరమైతే తనకు ప్లేట్లెట్స్ ఎక్కించాలి" అని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.

మా బాబు చాలా హైపర్ యాక్టివ్. వాడికి ఎప్పుడూ మందులు వేసింది లేదు. వాడి బ్లడ్ గ్రూప్ అరుదని నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. అందునా మాకు ఒక్కడే బాబు. అటువంటి తన పరిస్థితి ఇలా ఉండేసరికి ఇక నా కంగారు చూసుకోండి. బాబు స్పృహ లేకుండా బెడ్ మీద ఉంటే నాకు ప్రాణం ఆగలేదు. బాబానే తలచుకుని ఏడుస్తూ కూర్చున్నాను. ఆరోజు సోమవారం. "ఎందుకు ఇలా చేశావు బాబా? ఆ కష్టమేదో నాకు పెట్టవచ్చు కదా!" అని ప్రార్థించుకుంటూ ఉన్నాను. డాక్టర్లు, ‘వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి’ అన్నారు. నేను అక్కడే పారాయణ మొదలుపెట్టి, పగలు, రాత్రి తేడా లేకుండా చదివాను. మూడవరోజు డాక్టర్ వచ్చి, "కొద్దిగా పరవాలేదు" అన్నారు. ఆ మాటతో నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఇప్పుడు అసలు విషయం చెప్పాలి. అలా హాస్పిటల్లో ఉన్న నాకు రాత్రి నిద్రపట్టక ఫేస్‌బుక్ చూస్తున్నాను. అనుకోకుండా ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' గ్రూపు కన్పించింది. అందులో ఉన్న అనుభవాలన్నీ చదువుతూ, "బాబా! మా బాబుని రేపు ఇంటికి పంపించేస్తే నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అంతే, మరుసటిరోజు తెల్లవారి డాక్టర్ వచ్చి, "మీ అబ్బాయికి ఇప్పుడు పరవాలేదు, తనను ఇంటికి తీసుకెళ్లిపోండి" అని అన్నారు. నేను సంతోషం పట్టలేకపోయాను. ఇంటికొచ్చిన మరుసటిరోజు గురువారం బాబా దివ్యపూజ చేశాను. మా బాబు ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఇప్పుడు నాకు సచ్చరిత్రలోని కమ్మరివాని బిడ్డను బాబా కాపాడిన లీల గుర్తుకొస్తోంది. అదేవిధంగా బాబా మమ్మల్ని కాపాడారు. ఇలా బాబాతో నాకు ప్రతిరోజూ అనుభవాలే. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే, అష్టోత్తర నామాలలోని మన సమస్యకి దగ్గరగా ఉన్న నామాన్ని పఠించాలి. ఎలా అంటే, కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా, ఏమి చేస్తున్నా సరే ఆ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. నేను అలాగే చేస్తాను. ఉదాహరణకు ఆరోగ్యం కోసమైతే 'ఓం ఆరోగ్యప్రదాయ నమః', ఏదైనా కష్టమొస్తే 'ఆపద్బాంధవాయ నమః'... అలా. బాబాని నమ్మితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారు. మళ్ళీ ఇంకో అనుభవంతో మీ ముందుకు వస్తాను. అందరికీ బాబా అనుగ్రహసిద్ధిరస్తు!

అడిగినంతనే అనుమతి ఇప్పించిన బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

నా పేరు అరుణదేవి. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని లీలలు అనంతం, వర్ణనాతీతం. అందులోనుండి ఒక చిన్న లీలను మీతో పంచుకుంటాను. మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నాము. దాని ప్రహరీగోడ హద్దుల దగ్గర స్థలం కొంచెం క్రాస్ రావడంతో ఒక అడుగున్నర స్థలం ప్రక్కింటివాళ్ళ స్థలంలోకి జరగవలసి వచ్చింది. వాళ్ళని అనుమతి అడిగితే వాళ్ళు, "మాకు ఏమీ అభ్యంతరం లేదు, మీరు మా స్థలంలోకి జరగవచ్చు" అని అనుమతించారు. దాంతో మేము పని మొదలుపెట్టాం. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ప్రక్కింటివాళ్ళ బంధువు ఒకావిడ వచ్చి, "మా స్థలంలోకి రావడానికి వీల్లేదు. మీ హద్దు వరకు మీరు నిర్మించుకోండి" అని చెప్పి పనిచేసేవాళ్ళని పని ఆపేయమని చెప్పింది. పనివాళ్ళు మాకు ఆ విషయం చెప్పి పని ఆపేశారు. మాకు ఏం చేయాలో అర్థంకాక, "బాబా! ఏమిటి ఈ ఆటంకాలు? మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు. ఎలాంటి వాదనలు, గొడవలు లేకుండా మంచిగా అనుమతించేలా సహాయం చేయండి బాబా" అని ప్రార్థించి 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని జపించసాగాను. అలా బాబాను ప్రార్థించిన తరువాత ఒక గంటలో ఆ స్థలం యజమాని మాకు ఫోన్ చేసి, "ఆవిడ మాటలు పట్టించుకోకండి, నేను చూసుకుంటాను. మీరు పని మొదలుపెట్టుకోండి" అని చెప్పారు. అడిగిన వెంటనే బాబా మాకు అనుమతిని ఇప్పించినందుకు మాకు ఎంతో సంతోషం కలిగింది. అడుగడుగునా మా వెంట ఉండి మమ్మల్ని కాపాడుతున్న సాయికి ఏమిచ్చినా ఆయన ఋణం తీరదు. "బాబా! మీకు శతకోటి పాదాభివందనాలు. ఎల్లప్పుడూ ఇలాగే కనికరించి కాపాడండి బాబా. మీ దయవలన ఇప్పుడు పని జరుగుతోంది. మా పని మొత్తం పూర్తయ్యేవరకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా మీరే ముందుండి నడిపించండి బాబా. మీ బిడ్డలమైన మేము తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించి మంచి మార్గంలో నడిచేలా చేయండి".

ఇప్పుడు నేను మీతో నేను చేసిన తప్పు గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందు అది తప్పని నాకు తెలియదు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్నాను అనుకుని చేశాను. కానీ ఇప్పుడు వాటి ఫలితం అనుభవిస్తున్నాను. నా దగ్గర ఉన్న ఆరు లక్షల పదమూడు వేల రూపాయలు వెనకా ముందూ చూసుకోకుండా అడిగినవాళ్ళకి ఇచ్చేశాను. ఇప్పుడు నాకు అవసరమై అడుగుతుంటే, ఒక్కరు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయం నాకు, నా బాబాకు తప్ప ఎవరికీ తెలీదు. ప్రతిరోజూ నేను, "వాళ్ళ మనసులు కరిగించి నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించమ"ని బాబాను ప్రార్థిస్తున్నాను. ఈ విషయమై ఒకరోజు బాబా ముందు చీటీలు వేద్దామని మనసులో అనుకుని ఏదో ధ్యాసలో పడి మర్చిపోయాను. కొద్దిసేపటికి వాట్సాప్ గ్రూపు ఓపెన్ చేస్తే, "నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్వు ప్రశాంతంగా ఉండు" అనే బాబా మెసేజ్ కనిపించింది. 'బాబా వాక్కు, ఇక నాకు భయంలేద'ని అనుకున్నాను. కానీ నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఎవ్వరూ సహకరించడం లేదు. మీ అందరితో చెప్పుకోవాలనిపించి ఇలా చెప్పుకున్నాను. ఈ సమస్య నుండి గట్టెక్కితే ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. "బాబా! వాళ్ళకి ఏమి సమస్యలున్నాయో, ఏమో? వాటినుండి వాళ్ళను కాపాడి, నా సమస్యను అతిత్వరలో పరిష్కరించండి బాబా. నాకు సహాయం చేసి నన్ను సమస్యల నుండి కాపాడండి సాయీ. మీకు శతకోటి ధన్యవాదాలు".

ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణం బాబా, గురువుగారే!

శ్రీసాయిబాబాకు, శరత్‌బాబూజీకి, అలివేలుమంగమ్మ సహిత భరద్వాజ మాస్టారుకి జై!

నా పేరు దేవి. నాకు జనవరిలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కానీ ఎలాంటి బాధా లేకుండా దాని బారినుండి బయటపడ్డాను. కానీ కోవిడ్ తగ్గిన తరువాత 'స్పాండిలోసిస్' రావడం వలన నొప్పితో పదిరోజులు మంచం మీదనే ఉన్నాను. ఆ సమయంలో సాయి గ్రూప్ అడ్మిన్ కి ఏడుస్తూ నా తరఫున బాబాను ప్రార్థించమని మెసేజ్ పెట్టాను. తనకు అలా మెసేజ్ పెట్టిన మరుసటిరోజు నుండి నొప్పి చాలావరకు తగ్గింది. కానీ నాకు విపరీతమైన నీరసంగా ఉంటూ, చనిపోతానేమో అనేంతగా భయం వేసేది. ఆ నీరసం పోవాలని ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా తగ్గలేదు. అందరూ ‘పోస్ట్ కోవిడ్ వలన అలా నీరసంగా ఉంటుంద’ని చెప్పారు. ఆ సమయంలోనే మా స్కూల్లో పనిచేసే సార్ ‘శరీరంలో ఉప్పుశాతం తగ్గిందేమో చూసుకోమ’ని సలహా ఇచ్చారు. దాంతో నాలుగు రోజులపాటు ఓఆర్ఎస్ తాగాను. ఇవన్నీ చేస్తూ నా బాధనంతా బాబాకి, గురువుగారికి చెప్పుకుంటూ ఉండేదాన్ని. తెలిసిన ఒక సాయికి కూడా నా ఆరోగ్య సమస్య గురించి మెసేజ్ చేశాను. వారు కూడా నా తరఫున బాబాను ప్రార్థించారు. అదేరోజు రాత్రి కలలో ఏదో ఒక నల్లని ఆకారం నా వైపు వస్తుంటే, మా గురువుగారైన శరత్‌బాబూజీ దాన్ని తరిమికొట్టమని నాతో చెప్తూ, తామూ దానిని తరిమికొట్టారు. మరుసటిరోజు నుండి నా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. నాలో ఏదో తెలియని కొత్త శక్తి సంతరించుకుని నేను పూర్తి ఆరోగ్యవంతురాలినయ్యాను. ఇది కేవలం బాబా, గురువుగారి వలననే సాధ్యమైంది. నాకు రావాల్సిన ఆపదను ఆ కల రూపంలో తొలగించారని నా నమ్మకం. నేనీరోజు బ్రతికి ఉన్నానంటే కారణం బాబా, గురువుగారే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం మా అమ్మానాన్నలకు కరోనా వచ్చింది. అమ్మకు జ్వరం తగ్గడం లేదు. వారిరువురి ఆరోగ్య భారం మీ మీదే వేస్తున్నాను బాబా. కరోనా బారినుండి వారిని రక్షించండి బాబా".

సాయివంటి దైవంబు లేడోయి లేడోయి!

సాయిభక్తుల అనుభవమాలిక 911వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టకాలంలో తమ ఉనికిని సదా చాటిన బాబా
2. ఎలాంటి సమస్యనైనా తీర్చగలరు సాయితండ్రి
3. బాబా దయతో ఎటువంటి నిబంధనలూ లేవు

కష్టకాలంలో తమ ఉనికిని సదా చాటిన బాబా


అందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. కష్టకాలంలో బాబా సదా నాకు తోడుగా ఎలా ఉన్నారో తోటి భక్తులతో పంచుకోవాలని నేనీరోజు మీ ముందుకు వచ్చాను. నేను యు.ఎస్.ఏ లో ఉంటున్నాను. నా భర్త ఉద్యోగరీత్యా ఇటీవలే మేము ఇక్కడికి వచ్చాము. 2021, జూలై 16 వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న నాకు ఉన్నట్టుండి చాలా అసౌకర్యంగా అనిపించింది. నా శరీరంలో ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. నా నాలుక మీద లాలాజలం అంటూ లేకుండా ఎండిపోయింది. దానివల్ల తిన్నది మింగడానికి కూడా కష్టపడుతూ నేను చాలా నరకం చూశాను. నాకు ఆ సమస్య రావడం అదే మొదటిసారి. ఇక్కడ హాస్పిటల్స్ అంతగా అందుబాటులో ఉండవు. రెండు రోజులు ఎలాగో తట్టుకున్నాను. కానీ నా నాలుక ఏ మాత్రం లాలాజలాన్ని స్రవించకపోవడం వల్ల, అనుభవిస్తున్న నరకాన్ని భరించలేక ఒకరోజు అర్థరాత్రి మేము ఎమర్జెన్సీకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కూడా నాకు ఎటువంటి ఆశా కనిపించలేదు. అయినా కూడా వాళ్ళు ఎమర్జెన్సీ బిల్లు అని చాలా వేశారు. అప్పుడు నేను, "బిల్లులో సగం ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టి, మిగిలింది మాకు పడేలా చేయమ"ని బాబాని మ్రొక్కుకున్నాను. బాబా నా మొర విని, మాకు సగం బిల్లు వచ్చేలా చేశారు.  నా సమస్యకు చికిత్స నిమిత్తం మేము మొత్తం ఐదుసార్లు హాస్పిటల్‌కి వెళ్ళాము. ప్రతిసారీ వాళ్ళు అన్ని టెస్టులూ చేస్తుండేవాళ్లు, నేను రిపోర్టుల విషయంలో చాలా భయపడుతూ ఉండేదాన్ని. కానీ బాబా దయవల్ల రిపోర్టులు సానుకూలంగా వచ్చేవి. కానీ నా సమస్య తీరలేదు. మూడు వారాలపాటు ఘనపదార్థాలు తీసుకోకుండా కేవలం ద్రవాహారమే తీసుకుంటూ బ్రతుకు సాగించాను. ఒకసారి బాబా ముందు, "తిండి కూడా తినలేని దుస్థితి నాకు పట్టింది. ఎందుకు నాకీ నరకాన్ని ఇచ్చావు?" అని చాలా ఏడ్చాను. ఈ కష్టకాలంలో, "నీ ఆరోగ్య సమస్య బాగవుతుంది" అని బాబా నాకు చాలాసార్లు మెసేజ్‌ల రూపంలో సమాధానమిచ్చారు. అది చూసినప్పుడు సంతోషంగా ఫీలయ్యేదాన్ని, కానీ ఆ నరకాన్ని భరించలేకపోయేదాన్ని. యు.ఎస్.ఏ వచ్చాక నేను అప్పుడప్పుడు వైన్ త్రాగేదాన్ని. ఒకరోజు బాబాతో, "వైన్ త్రాగటం మానేస్తాను, పారాయణ చేస్తాను" అని అనుకున్నాను. అంతేకాదు, నేను ఏదో యూట్యూబ్ ఛానల్‌లో దత్త స్తవనం యొక్క గొప్పతనం గురించి విని 11 రోజులపాటు రోజుకు తొమ్మిదిసార్లు దత్త స్తవనం పారాయణ చేశాను. అది చదవడం మొదలుపెట్టాక ఘనపదార్థాలు తినే శక్తిని ఇచ్చాడు ఆ భగవంతుడు. దత్త స్తవనం చదివిన చివరిరోజు, అంటే 11వ రోజు నేను ఎలాంటి భయం లేకుండా ఆహారం తినగలిగాను. అయితే, ఆ సమయంలో నా మనసు నిలకడగా లేనందున నిశ్చలమైన మనస్సుతో పారాయణ చేయలేదు. అందుకు నా మనసులో ఉన్న బాధ భగవానునికి తెలుసు. 11 రోజులు చదివినదానికి మంచి జరుగుతుందని మనసులో ఏదో మూల ఉన్న నమ్మకంతో చదివాను. దాని ఫలితమే ఈరోజు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది. అందుకే అన్నారు 'స్మరణమాత్రేణ సంతుష్టయ' అని.


ఒకరోజు నేను బాధని భరించలేక బాబా ముందు తల బాదుకున్నాను. సరిగా అప్పుడే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో, "నేను తోడుగా లేకుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది" అని ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు బాబా నా ప్రతి మాటి వింటున్నారని, నా కర్మఫలాన్ని నేను అనుభవించాలని నాకు అర్థమై నిత్యమూ బాబాని, దత్తదేవుని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 40 రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాను. అయితే, ఇప్పటికీ రాత్రిళ్ళు కొంచెం ఇబ్బందిపడుతున్నాను. దాన్ని కూడా బాబా, దత్తస్వామి తొలగిస్తారని భావిస్తున్నాను. "మనం అనుభవించాల్సింది అనుభవించక తప్పద"ని బాబా అంటారు కానీ, బాబా మనకు తోడుగా ఉండి, దానిని భరించగలిగే శక్తిని ఇస్తారు. అవసరమైతే మన బాధని ఆయన స్వీకరిస్తారు. నేను ఈ అనుభవాన్ని పంచుకుంటానని బాబాకి మాటిచ్చాను. అలానే, ఇంతటి నరకాన్ని ఎవరికీ ఇవ్వొద్దని వేడుకున్నాను. ఎలా రాయాలో తెలియక నా మనసులో ఉన్నది రాశాను. తప్పులు ఉంటే మన్నించండి. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి’ని నడిపిస్తున్న అన్నయ్యకి సదా బాబా ఆశీస్సులు ఉంటాయి.


ఎలాంటి సమస్యనైనా తీర్చగలరు సాయితండ్రి


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!


శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!! 


ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను తెలియపరుస్తున్నాను. నా పేరు చక్రవర్తి. నేను రోజూ ఈ బ్లాగులో ప్రచురితమయ్యే తోటి సాయిభక్తుల అనుభవాలన్నీ చదువుతుంటాను. అలా  చదువుతున్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చి, 'ప్రతి సాయిబంధువూ ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని మనసులో అనుకోగానే బాబా వారి సమస్యను తీరుస్తున్నారు. అలా అనుకోకపోతే వారి సమస్య తీరదా బాబా?' అని అనుకున్నాను. తరువాత ఒకరోజు నేను 2004 సంవత్సరం మోడల్ బండి మీద వేరే ఊరికి వెళ్తున్నాను. దారిలో ఉన్నట్టుండి నా బండి ఆగిపోయింది. ఒకప్రక్క వర్షం పడుతోంది. పదినిమిషాల పాటు నేను ఎంత ప్రయత్నించినా బండి ఇంజన్ ఆన్ అవలేదు. వెంటనే నా మనసులో ఒక ఆలోచన వచ్చి, "బాబా! నా బండి స్టార్ట్ అయ్యేలా చూడు తండ్రీ. నా అనుభవాన్ని మీ బ్లాగ్ ద్వారా సాటి సాయి గురుబంధువులతో పంచుకుంటాను" అని అనుకుని, నా నుదుటన ఉన్న సాయిబాబా శిరిడీ ఊదీని(బాబా పాదధూళి) బండికి పెట్టాను. వెంటనే నా బండి స్టార్ట్ అయ్యింది. ఇది బాబా చేసిన అద్భుతం. నా మనసులో కలిగిన సందేహానికి బాబా ఈ విధంగా సమాధానమిచ్చారు. మీరు కూడా మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ బ్లాగ్ చాలా మహిమ గలది.  


మరో అనుభవం: లాక్‌డౌన్ సమయంలో నా దగ్గర ఉండాల్సిన శిరిడీ నుండి తెచ్చుకున్న ఊదీ(బాబా పాదధూళి) అంతా అయిపోయింది. అప్పుడు నేను నా మనసులో, "బాబా! నా దగ్గర ఊదీ అయిపోయింది. నా పిల్లలకు ఏ ఆరోగ్య సమస్యలొచ్చినా నీ పాదధూళినే వాడుతాను. అలాంటిది ఇప్పుడు నా దగ్గర నీ పాదధూళి అయిపోయింది బాబా" అని అనుకున్నాను. తరువాత ఒకరోజు నేను బజారుకి వెళ్తుంటే, శిరిడీ ఊదీ పొట్లం ఒకటి రోడ్డు మీద నాకు దొరికింది. లాక్‌డౌన్ సమయంలో శిరిడీ ఊదీ రోడ్డు మీద దొరకడం ఒక్కసారిగా నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. బాబా భక్తులైన ప్రతి ఒక్కరికీ బాబా పాదధూళి యొక్క మహిమ తెలుసు. అది వెలకట్టలేనిది. అంతటి అమూల్యమైన దానిని ఎవరు నిర్లక్ష్యంగా పారవేసుకుంటారు? నా అవసరాన్ని, బాధను గుర్తించిన బాబానే స్వయంగా నాకోసం వచ్చి ఆ ఊదీ పొట్లాన్ని నాకు అందించారు. లేకపోతే, 'శిరిడీ ఊదీ' రోడ్డు మీద దొరకడం ఏమిటి? బాబా ఇవ్వలేనిది లేదు. ఎలాంటి సమస్యనైనా తీర్చగలరు నా సాయితండ్రి. అవసరమైతే మన విధివ్రాతను కూడా మార్చగల సద్గురువు నా సాయితండ్రి. "సృష్టిలో అన్ని రూపాలూ నేనే" అని చెప్పిన పరబ్రహ్మ స్వరూపం నా సాయితండ్రి.  'సాయిబాబా' అనే నామాన్ని నిరంతరం జపించండి. ఎలాంటి ఆపదలూ మన దరిచేరవు.


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!  

శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!

సాయిబాబా సాయిబాబా సాయిబాబా!!!


బాబా దయతో ఎటువంటి నిబంధనలూ లేవు

ముందుగా బాబాకి మరియు సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. మేము బెంగుళూరులో నివాసముంటున్నాము. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో మేము ఒకసారి మా అన్నయ్య కొడుకు పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. మేము వెళ్ళడానికి ఏ నిబంధనలూ లేవు కానీ, తిరిగి వచ్చేటప్పుడు ‘ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళకి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి’ అని నిబంధన ఉంది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళకి ఆ నిబంధన వర్తిస్తుందని మాకు తెలుసు కానీ, ఆంద్రప్రదేశ్ నుండి వచ్చేవాళ్ళకు ఆ నిబంధన ఉందో, లేదో మాకు తెలియదు. కానీ పెళ్ళికి వెళ్ళడం తప్పనిసరై మేము బాబాను ప్రార్థించి ఊరికి వెళ్ళాము. అక్కడ పెళ్లి బాగా జరిగింది. బాబా దయవలన తిరిగి వచ్చేటప్పుడు ఎటువంటి నిబంధనలూ లేవు. మేమందరం క్షేమంగా బెంగుళూరు చేరుకున్నాము. అక్కడ మా ఊరిలో కూడా అందరూ క్షేమంగా ఉన్నారు. ఇదేవిధంగా బాబా దయ ఎల్లప్పుడూ మాపై ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 910వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అన్నివేళలా మా వెంటే ఉంటూ మమ్మల్ని నడిపించే బాబా
2. ప్రతి విషయంలోనూ అందుతున్న బాబా సహాయం
3. బాబా ప్రసాదించిన అనుభవం

అన్నివేళలా మా వెంటే ఉంటూ మమ్మల్ని నడిపించే బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ముందుగా, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి మరియు సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంగీత. మేము నిజామాబాద్‌లో నివసిస్తున్నాము. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ప్రతి చిన్న పనీ బాబాను తలచుకుంటే, ఆ పని అయిపోతుంది. అది నా నమ్మకం. ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇదివరకు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇక ప్రస్తుత అనుభవానికి వస్తే...  ఈమధ్యకాలంలో ఒకసారి నాకు ఆరోగ్యం బాగాలేక మా అన్నయ్యవాళ్ల ఇంటికి వెళ్లి, నాలుగైదు రోజులుండి, ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాను. అయితే, నా గోల్డ్ పర్సును అక్కడే మరచిపోయాను. రాత్రి పదిగంటలకి నా పర్సు సంగతి గుర్తొచ్చి, నేను తీసుకొచ్చిన బ్యాగులోనూ, బీరువాలోనూ వెతికాను. కానీ పర్స్ ఎక్కడా లేదు. నేను మా అన్నయ్యవాళ్ళ ఇంట్లోనే పర్సును మరచి వచ్చిన సంగతి కూడా నాకు గుర్తుకు రావడం లేదు. చాలా టెన్షన్ పడ్డాను. అందులో చాలా బంగారం, డబ్బులు ఉన్నాయి. అప్పుడు నేను బాబాకు నమస్కరించి, "బాబా! మీ దయవలన పర్సు మా అన్నయ్యవాళ్ళ ఇంట్లో ఉండాలి" అని బాబాతో చెప్పుకుని, అన్నయ్యవాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్లు చూసి, ‘పర్సు ఇక్కడే ఉంది’ అన్నారు. చాలా సంతోషం అనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


మరొక అనుభవం: అదేరోజు రాత్రి 12 గంటల సమయంలో అప్పటివరకు బాగున్న మా అమ్మాయికి  ఉన్నట్టుండి దగ్గు మొదలయింది. అమ్మాయి విపరీతంగా ఆగకుండా దగ్గుతూనే ఉంది. ఉదయం నాలుగు గంటలవుతున్నా తనకి నిద్రలేదు, ఒకటే దగ్గుతూ ఉంది. ఇక అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల పాపకి దగ్గు తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల మూడు రోజుల్లో పాపకి దగ్గు తగ్గింది. "ధన్యవాదాలు బాబా. ఈవిధంగానే ఎల్లప్పుడూ మీ కృప మా మీద ఉంచు తండ్రీ". నాకొక దీర్ఘకాలిక వ్యాధి ఉంది. దానిగురించి కూడా బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఆ వ్యాధి కూడా తగ్గుతుందని నా నమ్మకం. తగ్గాక మళ్ళీ నా అనుభవాన్ని పంచుకుంటాను.

     

శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!


ప్రతి విషయంలోనూ అందుతున్న బాబా సహాయం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


నా పేరు తిలోత్తమ. ముందుగా, సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలను ప్రతిరోజూ చదువుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. ఆ ఆనందంతో నా అనుభవాలను కూడా సాటి సాయిభక్తులతో పంచుకోవాలనిపించి ఇదివరకు మూడు అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు బాబాకు మాటిచ్చిన ప్రకారం మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఈమధ్యకాలంలో మా అమ్మగారు జ్వరం, తలభారం, దగ్గుతో బాధపడ్డారు. మందులు వేసుకుంటే, ఆ క్షణానికి తగ్గి మరలా ఆ సమస్యలు ఉంటుండేవి. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే అమ్మ ‘వద్దు’ అనేది. రోజులు గడుస్తున్నా జ్వరం తగ్గకపోతుండటంతో ఒకరోజు నేను కొంచెం బాబా ఊదీని అమ్మ నుదుటన పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. దానితోపాటు 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' మంత్రాన్ని పఠించాను. అద్భుతం! మరుసటిరోజు ఉదయానికి అమ్మకి జ్వరం, దగ్గు లేవు. తలభారం మాత్రం కొంచెం ఉండింది. బాబా దయతో ఆ సాయంత్రానికల్లా అది కూడా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".


ఇప్పుడు బాబా ప్రసాదించిన మరో అనుభవం గురించి చెప్తాను. మా తమ్ముడి ఉద్యోగం గురించి మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ, చివరివరకు వచ్చి ఏదో ఆటంకంతో ఆగిపోతూ ఉండేది. మేము చాలా బాధపడేవాళ్ళం. అప్పుడు మా పెద్దమ్మగారు, "ధునిలో కొబ్బరికాయ సమర్పించండి, మీ సమస్య పరిష్కారమవుతుంది" అని చెప్పారు. అంతేకాదు, తనే ఈ బ్లాగ్ గురించి మాకు చెప్పారు. అప్పుడు నేను ఈ బ్లాగ్ ద్వారా ‘మా తమ్ముడికి ఉద్యోగం ప్రసాదించమ’ని బాబాను వేడుకున్నాను. అది బ్లాగులో పబ్లిష్ అయిన మూడు నెలలకి, అలాగే మా నాన్న ప్రతి గురువారం ధునిలో కొబ్బరికాయ సమర్పించడం మొదలుపెట్టిన మూడువారాలకి మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. మా సంతోషానికి అవధులు లేవు. ఇలా ప్రతి విషయంలోనూ సహాయం చేస్తున్న బాబాకు అనంతకోటి ధన్యవాదాలు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


బాబా ప్రసాదించిన అనుభవం


అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ సానుకూలము, ఆనందకరము అయిన జీవితాన్ని గడిపేలా సహాయపడుతున్న ప్రియమైన 'సాయి మహరాజ్ సన్నిధి' గ్రూపుకు చాలా చాలా ధన్యవాదాలు. సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు శ్వేత. నా భర్త ఆరోగ్య విషయంలో బాబా చూపిన దయ గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. రెండు సంవత్సరాల క్రితం నా భర్తకి ఉన్నట్టుండి కాలినొప్పి వచ్చింది. ఆ నొప్పి నెమ్మదిగా పాదం వరకు వ్యాపించడంతో మావారు చాలా బాధను అనుభవించారు. డాక్టరుని సంప్రదిస్తే, ‘ఆ నొప్పి కేవలం కండరాలు తిమ్మిరి వల్ల వస్తుంది’ అన్నారు. అయితే, మందులు వాడుతున్నప్పటికీ నొప్పి తగ్గడానికి బదులు రానురాను పెరగసాగింది. ఆ సమయంలో నేను బాబాను నమ్ముకుని, నిరంతరం వారిని స్మరిస్తూ ఉండేదాన్ని. బాబా దయవల్ల ఒక వారం రోజుల తర్వాత మేము న్యూరాలజిస్ట్‌ని కలిస్తే, MRI స్కాన్ తీసి, "డిస్క్ సమస్య ఉంది. ఆపరేషన్ చేయాలి" అని అన్నారు. విషయం ఏమిటంటే, ఒక వారం రోజులు ఆలస్యం చేయడం వల్ల మావారికి 'ఫుట్‌ డ్రాప్' అయ్యింది. అప్పుడు నేను ‘నవగురువారవ్రతం’ మొదలుపెట్టాను. బాబా దయవల్ల మావారు మెల్లగా కోలుకున్నారు కానీ, ఫుట్ డ్రాప్ సమస్యలో మాత్రం మెరుగుదల లేదు. దాంతో, ‘ఆపరేషన్ అవసరం లేద’ని బాబా చాలాసార్లు చెబుతునట్లు అనిపించినప్పటికీ మావారు డాక్టర్ సలహామేరకు మైక్రో డిసెక్టమీ చేయించుకున్నారు. ఆ సర్జరీ జరగడానికి ఒక వారం ముందు నేను సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. బాబా దయవల్ల ఆపరేషన్ విజయవంతమై మావారు కొంచెం కోలుకున్నారు. కానీ ఆరు వారాల తరువాత మళ్లీ నొప్పి అనిపించి MRI తీస్తే, మళ్లీ డిస్క్ వాచిందని డాక్టరు చెప్పారు. కానీ బాబా కృపవల్ల కొద్ది రోజుల్లోనే నొప్పి తగ్గి, మావారు నార్మల్ అయ్యారు. కానీ పాదం పూర్తిగా కుదురుకోలేదు. నేను అప్పటినుంచి ఇప్పటివరకు మావారికి నయం కావాలని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఆ స్వామి కృపవల్ల మావారు మామూలు స్థితికి వస్తారని నా ఆశ. "ధన్యవాదాలు బాబా".


సర్వేజనాః సుఖినో భవంతు.



మహల్సాపతి - మూడవ భాగం...



1896లో జన్మాష్టమినాడు బాబా మహల్సాపతితో, "అరే భగత్, ఈ ఫకీరు మాటలు విను, అవి ఎల్లప్పుడూ సత్యాలు. నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావుగానీ నీ భార్యతో ఉండట్లేదు. నీకు కూతుర్లు మాత్రమే ఉన్నారు. కూతుళ్లు చింతపండులాంటివాళ్ళు; కొడుకులు మామిడిపండువంటివాళ్ళు. వెళ్లి, ఇంట్లో పడుకో! నీకు ఒక కొడుకు పుడతాడు" అని ఒత్తిడి చేసినప్పటికీ కుటుంబాన్ని పెంచుకోవడంలో ఎంత మాత్రమూ ఆసక్తి లేని మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి నిరాకరించాడు. అప్పుడు బాబా అక్కడే ఉన్న కాశీరాంషింపీ, తాత్యాకోతేపాటిల్, లక్ష్మీబాయిషిండే తదితరులతో, "భగత్ మరీ పిచ్చివాడైపోతున్నాడు. అతన్ని సంసారం చెయ్యమనాలె!" అని అన్నారు. బాబా మాటపై మహల్సాపతి మిత్రుడైన కాశీరాంషింపీ బలవంతంగా అతనిని ఇంటికి తీసుకొని వెళ్లి, ఇంట్లో విడిచిపెట్టాడు. ఆరోజు నుండి మహల్సాపతి ఇంట్లో నిద్రించడం మొదలుపెట్టాడు. మరుసటి సంవత్సరం(1897) జన్మాష్టమినాడు బాబా ఆశీస్సులతో అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. మహల్సాపతి ఆ బిడ్డను బాబాకు చూపించి, బిడ్డను ఆశీర్వదించి ఏ పేరు పెట్టాలో తెలియజేయమని అడిగాడు. బాబా ఆ బిడ్డకి ‘మార్తాండ్’ అని నామకరణం చేయమని చెప్పి, "ఈ బిడ్డని 25 ఏళ్ళ వరకు చూసుకో, సరిపోతుంది" అని అన్నారు. 25 సంఖ్య తన ఆయుఃప్రమాణాన్నే సూచిస్తుందని ఆ సమయంలో మహల్సాపతికి అర్థంకాక ఎంతో వినయంగా, "బాబా! బిడ్డను చూసుకోవడం నా శక్తికి మించినది. అది మీ చేతుల్లోనే ఉంది" అని అన్నాడు. అందుకు బాబా, "నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి" అని అన్నారు. మహల్సాపతి శరణాగతి చెందిన భక్తుడైనప్పటికీ అహాన్ని విడిచిపెట్టలేదు, శరీరం ద్వారా జరిగే చర్యలన్నీ భగవంతుని చర్యలుగా పరిగణించే స్థాయికి ఎదగలేదు. అయితే బాబా ఇటువంటి పలు సందర్భాల ద్వారా ఆ స్థాయికి పరిణతి చెందేలా మహల్సాపతికి మార్గనిర్దేశం చేస్తుండేవారు.

(బహుశా మహల్సాపతి తన ఇంట నిదురించిన ఆ సంవత్సర కాలంలోనే) ఒకసారి బాబా కటికనేలపై నిద్రించటం చూసి సహించలేని నానాసాహెబ్ డేంగ్లే నాలుగు మూరల పొడవు, జానెడు వెడల్పు గల ఒక చెక్కబల్లను బాబాకు సమర్పించాడు. బాబా ఆ చెక్కబల్లను సన్నని గుడ్డపీలికలతో మసీదు పైకప్పు నుండి మూరెడు క్రిందకు ఉయ్యాలలా వ్రేలాడదీశారు. రాత్రిపూట దానికి నాలుగు మూలలా వెలుగుతున్న ప్రమిదల్ని ఉంచి వాటిమధ్య పడుకునేవారు. ఆ బల్లనే మోస్తాయో లేదోనన్పించే ఆ గుడ్డపీలికలు బాబాను కూడా మోయడమే చిత్రం! అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. నిచ్చెన సహాయం లేకుండా బాబా ఆ బల్లమీదకు ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవరికీ తెలిసేది కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా అంతలోనే దానిపై పడుకొని కన్పించేవారు. అలాగే దిగేవారు. అది చూడడానికి జనం విరగబడుతుంటే బాబా ఒకరోజు ఆ చెక్కబల్లను విరిచి ధునిలో వేశారు. చాలా సంవత్సరాల తరువాత ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ బాబాతో, “బాబా, మీరు నిద్రించడానికి నేను ఒక చెక్కబల్లను తీసుకువస్తాను. మీరు మునుపటిలా దానిపై నిద్రించవచ్చు” అన్నాడు. అప్పుడు బాబా, “వద్దు. మహల్సాపతిని క్రింద విడిచి నేను దానిపై ఎలా నిద్రపోగలను?” అని అన్నారు. "మీరు కోరితే, నేను అతని కోసం మరొక చెక్కబల్లను ఏర్పాటు చేస్తాను" అని అన్నాడు దీక్షిత్. బాబా నవ్వి, “అతను చెక్కబల్లపై నిద్రించగలడా? అది అంత సులభం కాదు. నేను అతనితో, 'నువ్వు నా హృదయంపై నీ చేయి ఉంచి, నా హృదయంలో నామస్మరణ ఎలా జరుగుతుందో గమనించు. నేను నిద్రపోతున్నానని నీకు అనిపిస్తే, నన్ను మేల్కొలుపు!' అని చెప్తాను. కానీ, అతను అది కూడా చేయలేకపోతున్నాడు. అతను కూర్చొని కునికిపాట్లు పడుతుంటాడు. అతనికి నిద్ర తూగినపుడు అతని చేయి నా గుండెపై ఒక బండరాయిలా బరువుగా అనిపిస్తుంది. అప్పుడు నేనతణ్ణి గట్టిగా పిలిచి లేపితే కంగారుగా కళ్ళు తెరుస్తాడు. నేలపైనే సరిగ్గా కూర్చోలేనివాడు, నిద్రకు బానిసైనవాడు వ్రేలాడే చెక్కబల్లపై ఎలా పడుకోగలడు? కాబట్టి, నాకు ఇలా నేలమీదే బాగుంది" అని అన్నారు.

ఇకపోతే, పుత్రుడు జన్మించిన తరువాత మహల్సాపతి తిరిగి మునుపటిలా రాత్రిళ్ళు బాబా సాంగత్యంలో నిద్రించనారంభించాడు. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే మహల్సాపతి తన వస్త్రాన్ని మసీదులో నేలపై పరిచాడు. ఆ వస్త్రంపై ఒకవైపు బాబా, మరోవైపు మహల్సాపతి పడుకున్నారు. కాసేపటికి బాబా అతనితో, "భగత్! నేను చెప్పేది విను. ఈరోజు మనం అత్యంత జాగరూకతతో ఉండాలి. ఆ మొరటువాడైన రోహిల్లా (ప్లేగు) నిగోజ్ పాటిల్ భార్యను తీసుకుపోవాలని చూస్తున్నాడు. నామస్మరణ ద్వారా నేను ఆ అనర్థం జరగకుండా చూడమని అల్లాను ప్రార్థిస్తాను. ఎవరూ రాకుండా, నేను చేసే నామస్మరణకు అంతరాయం కలగకుండా నువ్వు చూడు" అని చెప్పారు. బాబా ఆదేశం మేరకు మహల్సాపతి మేలుకొని వారి నామస్మరణకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు అర్థరాత్రి దాటాక నెవాసా నుండి ఆ గ్రామ మామల్తదారు, అతని సహచరులు ఎలాగైనా బాబా దర్శనం చేసుకోవాలని అక్కడికి వచ్చారు. వాళ్లతో వచ్చిన జవాను మహల్సాపతి ఎంత చెప్పినా వినకుండా తమకప్పుడే బాబా దర్శనం, ఊదీ కావాలని బలవంతం చేయసాగాడు. వాళ్ళను నిలువరించడానికి మహల్సాపతి ఎంతగానో ప్రయత్నించాడుగానీ అధికార మదాన్ని ఎవరు అడ్డుకోగలరు? చివరికెలాగో అతి కష్టం మీద కొంత ఊదీ తీసుకొని వెళ్ళమని వాళ్ళను ఒప్పించి, ఊదీ తీసుకోవడానికి ధుని వద్దకు వచ్చాడు మహల్సాపతి. వాళ్ళ మాటల శబ్దానికి, మహల్సాపతి అడుగుల సవ్వడికి బాబాకు ధ్యానభంగమైంది. బాబా కోపోద్రిక్తులై, "అరే భగత్, నీకూ ఒక కుటుంబం ఉంది! నిగోజ్ ఇంట ఏమి జరుగుతుందో నీకు తెలియదా? ఈ అంతరాయం వలన నా ప్రయత్నం విఫలమైంది. పాటిల్ భార్య మరణించింది" అని శాపనార్థాలు పెడుతూ పడుకోవడానికి పరచిన వస్త్రాన్ని తీసి మహల్సాపతిపై విసిరికొట్టారు. మరుక్షణమే ఆయన శాంతించి, "సరే, జరిగిందేదో మంచికే జరిగింది" అని అన్నారు.

రానురానూ మహల్సాపతి తన సమయమంతా బాబా చెంతనే గడుపుతుండేవాడు. భోజనానికి, ఇంకా ముఖ్యమైన పనులేమైనా ఉంటే తప్ప అతను ఇంటికి వెళ్ళేవాడు కాదు. అతనలా వెళ్ళిన కాసేపటికే బాబా అతనిని పిలుచుకు రమ్మని ఒకరిద్దరిని పంపుతుండేవారు. అంతలా వారివురి మధ్య అనుబంధం ఉండేది. మహల్సాపతి శ్రీసాయిని ఎంతగానో సేవించేవాడు. ఆయన పాదాలొత్తేవాడు. చిలిం వెలిగించడం, బాబా శయనించేందుకు పడకను సిద్ధం చేయడం వంటి కొన్ని ప్రత్యేకమైన సేవలు మహల్సాపతి మాత్రమే చేసేవాడు. ప్రతిరోజూ రాత్రి భోజనాలయ్యాక బాబా సేవకుడైన మాధవ్‌ఫస్లే బాబా వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకను, ఒక చింకిగుడ్డను మహల్సాపతికి అందించేవాడు. బాబా తలపెట్టుకొనేవైపు ఆ ఇటుకను ఉంచి, దానిపై ఆ పాతగుడ్డను ఉంచి, ఆపై దుప్పటి పరచి బాబాకు పడక అమర్చేవాడు మహల్సాపతి. బాబా ఆ ఇటుకపైనే తలపెట్టుకొని నిద్రపోయేవారు. కొంతసేపటి తర్వాత మహల్సాపతి లేచి, ప్రమిదలలో నూనె నింపి, వత్తులు సవరించి, బాబా రొట్టెలు పెట్టుకొనే కుండమీద మూతపెట్టి, ధునిలో కట్టెలు వేసేవాడు.

ఒకరోజు శిరిడీలో కుంభవృష్టి కురిసి మసీదంతా తడిసిపోయి, బాబాకు కూర్చునేందుకు కూడా చోటు లేకపోయింది. భక్తులంతా బాబాను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. బాబా అంగీకరించకపోయేసరికి సాయిభక్తుడైన నారాయణతేలి బాబాను ఎత్తుకొని బలవంతంగా తీసుకొని వెళ్లి చావడిలో కూర్చోబెట్టాడు. నాటి రాత్రి బాబా చావడిలోనే విశ్రమించారు. ఆనాటినుండి బాబా ఒకరాత్రి మసీదులో, ఒకరాత్రి చావడిలో నిద్రించనారంభించారు. మహల్సాపతి కూడా బాబాతోపాటే మసీదులోనూ, చావడిలోనూ నిద్రించేవాడు. వారివురి మధ్య అనుబంధం వింతగానూ, చమత్కారంగానూ ఉండేది. ఏకాంత పరిసరాలలో చిలిం త్రాగుతూ వారివురి మధ్య జరిగే సంభాషణ మరింత ఆసక్తికరంగా ఉండేది. ఈ విషయానికి సంబంధించి శ్రీమతి కాశీబాయి కనీత్కర్ 1906లో తమకు జరిగిన అనుభవం గురించి ఇలా చెప్పింది: “బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు. మేము శిరిడీలో ఉన్న రోజు బాబా తమ అలవాటు ప్రకారం మహల్సాపతితో కలిసి మసీదు నుండి చావడికి వచ్చారు. వారిరువురు చావడి ప్రవేశద్వారం వద్ద చీకటిలో కూర్చున్నారు. నా భర్త గోవిందరావు కనీత్కర్ కూడా వెళ్లి అక్కడ కూర్చున్నారు. బాబా, మహల్సాపతిల మధ్య చక్కటి ఆహ్లాదకరమైన సంభాషణ జరుగుతుండగా బాబా చిలిం వెలిగించి, తాము పీల్చి మహల్సాపతికి అందించారు. తరువాత నా భర్తకి కూడా ఇచ్చారు. తరువాత కూడా బాబా, మహల్సాపతిల మధ్య సంభాషణ కొనసాగింది. బాబా మాటల మధ్యలో అప్పుడప్పుడు మహల్సాపతిని, "అంతేకదా భగత్?” అని అడుగుతుండేవారు. అందుకతను పదేపదే “బేషక్, బేషక్” (నిస్సందేహంగా, నిస్సందేహంగా) అని ఒకే పదాన్ని రెండుసార్లు అంటుండేవాడు. అయితే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మూడో వ్యక్తి గ్రహించలేకపోయేవారు. అంతలో చిలిం మరోసారి వెలిగించాల్సి వచ్చింది. కానీ చిలిం గొట్టంలో ఉండే చిన్నరాయి ఎక్కడో పడిపోయింది. దాంతో బాబా ఆగ్రహించి తీవ్రంగా తిట్టిపోయసాగారు ....”

సహజంగానే ప్రాపంచిక విషయాలపట్ల అనురక్తిలేని మహల్సాపతి ఎటువంటి కోరికలూ లేక అతి నిరాడంబరమైన జీవితాన్ని సాగిస్తుండేవాడు. బాబా కూడా అతన్ని అలానే ఉండనిచ్చారు. మహల్సాపతి ఆర్థికంగా నిరుపేదవాడైనప్పటికీ జీవనోపాధికి అవసరమయ్యే ధనసంపాదన కోసం తన సమయాన్ని ఏ మాత్రమూ వెచ్చించక పూర్తి సమయాన్ని బాబా సేవలోనే గడిపేవాడు. బాబా సేవలోనే అతను అమితమైన ఆనందాన్ని పొందుతుండేవాడు. అతనికి బాబాపట్ల ఎనలేని భక్తిప్రపత్తులుండేవి. అందుకే బాబా అతనిని చాలా ఇష్టపడేవారు. అతని ప్రభావం బాబాపై చాలా ఉండేది. ఇంకెవరు చెప్పినా విన్పించుకోని సందర్భాలలో సైతం మహల్సాపతి చెబితే బాబా వినేవారు. బాబా నివాసముండే మసీదు చాలా పురాతనమైనది, శిథిలావస్థలో ఉండేది. దానిని పునర్నిర్మించాలని నానాసాహెబ్ చందోర్కర్ సంకల్పించి బాబా అనుమతిని అర్థించాడు. కానీ బాబా మొదట అందుకు ఒప్పుకోలేదు. బాబా అనుమతి కోసం వేచివున్న సమయంలో ఒకరోజు చందోర్కర్ మసీదు బయట ఉండగా మహల్సాపతి మసీదుకి వచ్చాడు. బాబా అతన్ని తమ దగ్గరకు పిలిచి, "భగత్, బయట నిలుచున్న ఆ వ్యక్తి ఎవరు?" అని అడిగారు. అందుకు మహల్సాపతి, "అతను నానాసాహెబ్" అని బదులిచ్చి, చిలిం వెలిగించి బాబాకు అందించాడు. అప్పుడు బాబా, "అరే భగత్, నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. బయట నిలబడివున్న ఈ నానా మసీదును క్రొత్తగా పునర్మిస్తానని అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? మనం క్రొత్త మసీదు నిర్మించాలా? లేక మనకు ఈ పాత భవనం సరిపోతుందా? అసలు క్రొత్తది ఎందుకు నిర్మించాలి?" అని అడిగారు. అందుకు మహల్సాపతి సౌమ్యంగా పరిహాసమాడుతూ, "అతన్ని క్రొత్తది నిర్మించనివ్వండి. అది మనిద్దరికీ కూర్చోవడానికి, పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది" అని అన్నాడు. ఈ విధంగా చిలిం త్రాగుతూ వారివురి మధ్య సంభాషణ జరిగాక బాబా మసీదు పునరుద్ధరించడానికి అనుమతిని ఇచ్చారు. తరువాత బాబా ఆదేశం మేరకు మహల్సాపతి నానాను పిలిచి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించాడు.

ధనప్రలోభానికి లోనుకాని సాయిభక్తుడు:

ఆధ్యాత్మికోన్నతి విషయంలో ఇతర భక్తులకు బాబా యొక్క మద్దతు, అభయం అవసరమయ్యేవి. కానీ మహల్సాపతి విషయంలో వాటి ఆవశ్యకత లేకపోయేది. ఎందుకంటే, అతను అప్పటికే తనకున్న పరిస్థితుల్లో సాధ్యమైనంతవరకు నైతికతను, మనోపవిత్రతను, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అతను ఇంద్రియాలపై గొప్ప నియంత్రణను కలిగివుండేవాడు. కోరికలను, అవసరాలను అదుపులో ఉంచుకునేవాడు. అతనిలో గుర్తించదగ్గ గొప్ప విషయమేమిటంటే, మహల్సాపతి తన కుటుంబ పోషణ కోసం భిక్షావృత్తిపైనే ఆధారపడినప్పటికీ ఇతరులిచ్చిన ధనాన్ని గానీ, వస్తువులను గానీ స్వీకరించేవాడు కాదు. ఆధ్యాత్మిక సాధనలో ఈ ‘అపరిగ్రహ’ నియమాన్ని ఉత్తమ నియమంగా కీర్తిస్తారు. మహల్సాపతి మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం ఆశ్చర్యం! ఆ అపరిగ్రహ నియమాన్ని ఖచ్చితంగా పాటించే క్రమంలో ఒక్కోసారి మహల్సాపతి, అతని కుటుంబం పక్షం రోజులపాటు తినడానికేమీ లేక పస్తులుండాల్సి వచ్చేది. అయినా మహల్సాపతి తన అపరిగ్రహ నియమాన్ని తప్పేవాడు కాదు. ఇతరుల నుండి ధనాన్ని, కానుకలను స్వీకరించడం వలన నిలకడగా అత్యంత జాగరూకతతో సద్గ్రంథ పఠనం మొదలైనవాటివల్ల సంపాదించుకున్న పుణ్యం హరించుకుపోతుందనీ లేదా ఆ పుణ్యంలో కొంతైనా ఆ కానుకలిచ్చే దాతల పరమవుతుందనీ అతను నమ్మేవాడు. అంతేకాదు, తాను పొందాలనుకునే ఉన్నత స్థితిని చేరడానికి అది అవరోధమని కూడా అతను విశ్వసించేవాడు. కాబట్టి తానూ, తన కుటుంబం పస్తులున్నాసరే భిక్ష ద్వారా లభించే ఆహారాన్ని మినహాయిస్తే ఇతరులు ఇచ్చే కానుకలను నిష్కర్షగా తిరస్కరించేవాడు. ఒకసారి చింతామణ్‍రావు అనే భక్తుడు 1,000 రూపాయలు, మరోసారి యం.ఏ సేఠ్ అనే భక్తుడు 100 రూపాయలు, ఇలా మరెందరో సాయిభక్తులు ఎంతో డబ్బు మహల్సాపతికిచ్చి స్వీకరించమని ఒత్తిడి చేసినప్పటికీ ఆ కానుకలను స్వీకరించడానికి అతను సుతరామూ ఒప్పుకోనేవాడు కాదు. బాబా కూడా అతనెప్పుడూ ధనప్రలోభానికి లోనుకాకుండా చూసేవారు. 1917లో ప్రముఖ వ్యాపారవేత్త హంసరాజ్ ఆస్తమాతో బాధపడుతూ తన భార్యతో సహా శిరిడీ వచ్చి, బాబాను దర్శించి, వారి ఆదేశం మేరకు రెండు మూడు నెలలు శిరిడీలో ఉన్నాడు. అతను మహల్సాపతి పేదరికాన్ని చూసి చలించిపోయి పదిరూపాయలు అతనికివ్వబోయాడు. కానీ మహల్సాపతి ఆ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో హంసరాజ్ ఆ డబ్బును కాకాసాహెబ్ దీక్షిత్‌కిచ్చి, బాబా సమక్షంలో మహల్సాపతికిమ్మని కోరాడు. మహల్సాపతి బాబాను పూజిస్తున్న సమయం చూసుకొని దీక్షిత్ ఆ మొత్తాన్ని మహల్సాపతికి ఇవ్వబోయాడు. కానీ ఆ మొత్తాన్ని తీసుకునేందుకు మహల్సాపతి ఒప్పుకోలేదు. అప్పుడు దీక్షిత్ బాబాతో, "బాబా! దయచేసి ఈ మొత్తాన్ని తీసుకోమని మహల్సాపతితో మీరైనా చెప్పండి, లేదా మీరే ఈ మొత్తాన్ని తీసుకొని అతనికి ఇవ్వండి" అని అన్నాడు. అందుకు బాబా, "ప్రస్తుతానికి ఆ డబ్బులు నీ దగ్గరే ఉండనివ్వు" అని అన్నారు. కొంతసేపటికి మహల్సాపతి బాబా పూజ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా దీక్షిత్‌ను, "ఎన్ని రూపాయలవి?" అని అడిగారు. అందుకతను, "పది రూపాయల"ని బదులిచ్చాడు. బాబా "ఆ మొత్తాన్ని తమ దిండుపై ఉంచమ"ని చెప్పి, నానాసాహెబ్ నిమోన్కర్‌తో, "ఈ మొత్తాన్ని అందరికీ పంచిపెట్టు" అన్నారు. ఆ విధంగా ఆ మొత్తం నుండి మహల్సాపతికి పైసా కూడా చేరలేదు.

కానీ, అంతటి భక్తుడు, అతని కుటుంబం ఆకలితో అలమటిస్తుంటే బాబా చూస్తూ ఊరుకుంటారా? పరిస్థితి విషమించినప్పుడు ఆయన తన భక్తుని అపరిగ్రహ నియమాన్ని సడలింపజేసేవారు. ఒకసారి కొన్నిరోజులపాటు పస్తులుండటం వలన మహల్సాపతి కుటుంబం ప్రమాదంలో ఉందని గ్రహించిన కాకాసాహెబ్ దీక్షిత్ మహల్సాపతికి పదిరూపాయలు పంపాలనుకున్నాడు. అయితే మహల్సాపతి తన నియమానుసారం ఆ డబ్బును తిరస్కరిస్తాడని సంశయించి, అలా జరగకూడదని భావించి, ఆ పదిరూపాయలను ఒక కవరులో పెట్టి, దాన్ని తీసుకొని బాబా వద్దకు వెళ్లి, "బాబా! ఇది పంపనా?" అని అడిగాడు. అంతర్‌జ్ఞాని అయిన బాబా ‘ఎవరికి, ఏమిటి’ అనైనా అడగకుండా "పంపించు" అన్నారు. బాబా ఆదేశానుసారం దీక్షిత్ ఆ డబ్బును మహల్సాపతికి పంపాడు. నిజానికి దీక్షిత్ బాబా వద్దకు రావడానికి కొన్ని గంటల ముందు మహల్సాపతి భార్య బాబా దర్శనానికి వచ్చింది. అప్పుడు బాబా ఆమెతో, "అమ్మా! 'బాబా ఇంటికి వస్తున్నారు, తిరస్కరించవద్దు' అని నీ భర్తతో చెప్పు" అని అన్నారు. తరువాత కొంతసేపటికి దీక్షిత్ తనకు పంపిన కవరుని చూడగానే, బాబా చెప్పింది దానిగురించేనని మహల్సాపతి గ్రహించి, తన నియమాన్ని ప్రక్కన పెట్టి ఆ ధనాన్ని స్వీకరించాడు. అంతేకాదు, బాబా ఎన్నోసార్లు తామిచ్చే ధనాన్ని స్వీకరించమని మహల్సాపతిని ఒత్తిడి చేసేవారు. 1880 తరువాత బాబాకు దక్షిణ రూపంలో రోజూ అధిక మొత్తంలో ధనం వస్తుండేది. బాబా ఆ మొత్తం నుండి ఒకరికి 50, మరొకరికి 30, ఇంకొకరికి 4 రూపాయల చొప్పున భక్తులకు పంచేస్తూ ఉండేవారు. బాబా మహల్సాపతితో చాలాసార్లు, "ఇదిగో, ఈ మూడు రూపాయలు తీసుకో! ఇలా రోజూ తీసుకుంటూ ఉండు" అని అనేవారు. బాబా అలా చెప్పిన ప్రతిసారీ మహల్సాపతి నిరాకరిస్తుండేవాడు. అయినప్పటికీ, "నేనిచ్చే మూడు రూపాయలు తీసుకుంటూ ఉండు. నేను నిన్ను శ్రీమంతుణ్ణి చేస్తాను. నీ జీవితాన్ని సుఖమయం చేసుకో! ఇతరులు సహాయం కోసం నిన్ను ఆశ్రయిస్తారు, నీపై ఆధారపడతారు" అని బాబా అంటుండేవారు. కానీ మహల్సాపతి మాత్రం ధనప్రలోభానికి లోనుకాకుండా ఎంతో స్థిరంగా, "బాబా! నాకివేమీ అక్కర్లేదు. నిరంతరం మీ పాదాలను పూజించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి, అది చాలు" అని అనేవాడు. ఎందుకంటే, బాబా సాంగత్యంలో తాను పొందే గొప్ప సంతృప్తి కంటే భౌతిక సంపదలు విలువైనవి కావని మహల్సాపతికి బాగా తెలుసు. మహల్సాపతి ఎన్నడూ మంచం మీద నిద్రించేవాడు కాదు. అవి అందుబాటులో ఉన్నా, లేదా ఎవరైనా సమకూర్చినా అతను మాత్రం సుఖాలను పట్టించుకునేవాడు కాదు. హేమాడ్‌పంత్ తాను రచించిన శ్రీసాయిసచ్చరిత్రలో మహల్సాపతి గురించి, 'అతను ధనాన్ని ఆశించే భక్తుడు కాదు, అతను పరమార్థాన్ని కాంక్షించే గొప్ప భక్తుడు. అతను నిస్వార్థ ప్రేమమయ భక్తుడు. అతను తన దేహాన్ని, ఆత్మను బాబా పాదాలకు సమర్పించాడు’ అని వ్రాశాడు.


సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ,
శ్రీసాయిబాబా బై శ్రీసాయిశరణానంద,
లైఫ్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి,
సాయిలీల మ్యాగజైన్ జూలై-ఆగస్టు 2005 సంచిక.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


సాయిభక్తుల అనుభవమాలిక 909వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి దయ
2. డెంగ్యూ జ్వరం నుండి కాపాడిన బాబా
3. బాబాని మనం వదిలినా, ఆయన మనలను వదలరు

సాయి దయ


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాటి సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఈమధ్య బి.ఇడి చేసేందుకు నాకు క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం వచ్చింది. అప్పటికే నేను టీచరుగా పనిచేస్తున్నందున క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం ఏముంటుందని కాస్త నిర్లక్ష్యం చేశాను. కానీ తప్పనిసరిగా ఆ సర్టిఫికెట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను, "వారం రోజుల్లో నాకు క్యాస్ట్ సర్టిఫికెట్ వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని సాయిగణేశుని ప్రార్థించాను. బాబా దయవలన సరిగ్గా గురువారంనాడు క్యాస్ట్ సర్టిఫికెట్ నా చేతికి వచ్చింది. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం మా క్యాస్ట్‌ని బీసీలో చేర్చారు. అప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నిస్తే, మా తమ్ముడికి, చెల్లికి చేశారు గానీ, నాకు సర్టిఫికెట్ రాదని అన్నారు. నాకు ఉద్యోగం ఉన్నందువల్ల నేను కూడా దానిగురించి పెద్దగా పట్టించుకోలేదు. అలా కొన్ని సంవత్సరాలుగా ఆశ వదిలేసిన సర్టిఫికెట్ కేవలం పదిరోజుల్లోనే నా చేతికి వచ్చింది. ఇదంతా సాయిగణేశుని కృపకాక మరేంటి?


ఇకపోతే, ఈమధ్య ఒకసారి మా అమ్మగారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించింది. అమ్మని డాక్టరు వద్దకు తీసుకువెళితే, "గుండె సంబంధిత సమస్య అయుండొచ్చు" అని అన్నారు. అప్పుడు నేను, "బాబా! అమ్మ రిపోర్టులన్నీ నార్మల్ అని వస్తే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. మా అమ్మవాళ్లు కూడా అదేవిధంగా బాబాను ప్రార్థించారు. బాబా దయవలన రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చాయి. నేను, అమ్మ బాబాకి మాటిచ్చినట్లు నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఇటీవల మావారు తనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందేమోనన్న సందేహంతో డాక్టరుని సంప్రదించారు. డాక్టరు సలహా మేరకు మావారు షుగర్ టెస్ట్, సీరం టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారు. షుగర్ కాస్త ఎక్కువ ఉండటం తప్ప బాబా దయవలన మిగతా అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. ఇలా నా జీవితంలో అడుగడుగునా నన్ను రక్షిస్తున్న నా సాయినాథునికి శతకోటి ప్రణామాలు. "ధన్యవాదాలు బాబా. మీ దయవలన షుగర్ లెవెల్స్ కూడా నార్మల్‌‌కి వస్తాయని ఆశిస్తున్నాను". 


ఈమధ్యనే క్రొత్త స్కూలుకి మార్చిన మా పాప అక్కడ ఎలా ఉంటుందోనని భయపడ్డాను. అయితే తను కొంచెం అల్లరి చేస్తున్నాగానీ స్కూలుకి వెళ్తోంది. బాబా దయవలన త్వరలోనే స్కూలుకి అలవాటుపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా నాకున్న ప్రధానమైన మనోవ్యధని బాబా త్వరలోనే తొలగించి, ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకునే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. "బాబా! తెలిసో, తెలియకో నేను చేసిన తప్పులను మన్నించండి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!


డెంగ్యూ జ్వరం నుండి కాపాడిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


అందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ వలన మనమంతా మన సాయితండ్రికి చాలా దగ్గరవుతున్నాము. అంతేకాదు, బాబా మనల్ని మాయలో పడకుండా కాపాడుతూ ఉన్నారు. సాయితో మనకి ప్రతిరోజూ ఏదో ఒక అనుభవం ఉండనే ఉంటుంది. నేను ఇదివరకే మూడు అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మా పెద్దబాబు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. 2021, ఆగస్టు 8న కాలేజీ రీ-ఓపెన్ చేయడంతో మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు. వెళ్లేటప్పుడు తను ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ కాసేపటికి మా అబ్బాయికి హై-ఫీవర్ వచ్చిందనీ, కాలేజీకి వచ్చి తనను ఇంటికి తీసుకుని వెళ్ళమని మాకు ఫోన్ వచ్చింది. అప్పుడు మావారు కాలేజీకి వెళ్లి, బాబుని ఇంటికి తీసుకుని వచ్చారు. బాబుకి 104 నుండి 105 డిగ్రీల టెంపరేచర్ ఉంది. తను బాగా నీరసించిపోయాడు. మాకు చాలా భయమేసి హాస్పిటల్‌కి వెళ్దామంటే, ‘నేను రాలేన’ని చెప్పి తను పడుకున్నాడు. అప్పుడు తనకి డోలో టాబ్లెట్ వేసి పడుకోమన్నాము. కానీ జ్వరం కంట్రోల్ కాలేదు. అప్పుడు నేను బాబా ఊదీని బాబుకి పెట్టి, 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే నామాన్ని అనుకున్నాను. మరుసటిరోజుకి జ్వరం 100 నుండి 101 డిగ్రీలకు వచ్చింది. కానీ రెండు రోజులైనా జ్వరం తగ్గలేదు. ఇంక అప్పుడు తనకి బ్లడ్ టెస్ట్ చేయిస్తే, రిపోర్టులో 'డెంగ్యూ పాజిటివ్' అనీ, ప్లేట్లెట్ కౌంట్ కూడా తక్కువగా ఉందనీ వచ్చింది. అప్పుడు హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ కొన్ని టాబ్లెట్లు ఇచ్చి, "మూడు రోజుల తరువాత మళ్ళీ రండి" అని చెప్పారు. డెంగ్యూ ఫీవర్ అనగానే నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను, "బాబా! బాబుకి జ్వరం తగ్గేలా చూడండి. మీ కృపతో జ్వరం తగ్గితే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు జ్వరం 100 - 99 డిగ్రీలకు వచ్చి మూడు రోజులకి పూర్తిగా తగ్గింది. అప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే తనను పరీక్షించిన డాక్టర్, "అంతా బాగానే ఉంది. బాబుకు జ్వరం తగ్గిపోయింది. ఇక మందులవసరం లేదు" అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇలా బాబా మా కుటుంబాన్ని ఎల్లవేళలా వెన్నంటి కాపాడుతూ ఉన్నారు. "బాబా! ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేస్తూ ఉండే భాగ్యాన్ని మాకు కల్పించు తండ్రీ. కరోనాను పారద్రోలి అందరినీ చల్లగా కాపాడండి, ప్రపంచాన్ని రక్షించండి సాయీ. నాకున్న నడుమునొప్పిని, మావారి గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గేలా చేసి మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రీ. ఇంకా మా తమ్ముడి సమస్యకు ఒక పరిష్కారం చూపించండి. ఆ అనుభవాన్ని కూడా తోటి సాయిభక్తులతో పంచుకోవాలని ఆశపడుతున్నాను సాయీ. ధన్యవాదాలు సాయీ”.


బాబాని మనం వదిలినా, ఆయన మనలను వదలరు


నేనొక సాయిభక్తురాలిని. చాలా రోజుల తరువాత ఈరోజు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని వ్రాయకుండా ఉండలేక మీకోసం ఇలా వ్రాస్తున్నాను. నిజానికి నేను వ్యక్తిగతంగా పడుతున్న ఇబ్బందుల వలన బాబా మీద శ్రద్ధను కోల్పోయే స్థితిలో ఉన్నాను. నేను ఆర్థికంగా, మానసికంగా చాలా కష్టాల్లో ఉన్నాను. 2021, ఆగస్టు నెల చివరిలో నేను వైభవలక్ష్మిపూజ మొదలుపెట్టాను. ఆగష్టు 30న మా పాపకి ఒక బంగారు గొలుసు వేసి, అది జారిపోకుండా ఒక పిన్ కూడా పెట్టాను. తరువాత నేనే తనని మా బావగారి ఇంటిలో దింపి వచ్చాను. కాసేపటి తరువాత వెళ్లి తనని ఇంటికి తీసుకొచ్చాను. తరువాత తనకి డ్రెస్ మారుస్తుంటే తన మెడలో గొలుసు కనపడలేదు. ఆ సమయంలో నేను పడ్డ టెన్షన్ ఆ దేవుడికే తెలుసు. ‘లక్ష్మీపూజ మొదలుపెట్టిన వారంలోనే గొలుసు పోవటం ఏమిట’ని బాధేసింది. ఇంట్లో అంతా వెతికి, మంచాలన్నీ దులిపినా గొలుసు దొరకలేదు. అప్పుడు మా తోడికోడలు, "గొలుసు దొరికితే కొబ్బరికాయ కొడతాన"ని బాబాకి మ్రొక్కుకుంది. వెంటనే ఇంటి గుమ్మం దగ్గర గొలుసు కనిపించింది. ఆశ్చర్యమేమిటంటే, గొలుసు దొరికిన అదేచోట నేను అంతకుముందు కూడా వెతికాను. కానీ అప్పుడు దొరకలేదు. బాబాని మనం వదిలినా, ఆయన మనలను వదలరు. ఇది నిజం! "ధన్యవాదాలు బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 908వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తన బిడ్డలు ఇబ్బందిపడుతుంటే బాబా సహించలేరు
2. సాయినాథుని దయ
3. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఏ సమస్యా లేకుండా చూసిన బాబా

తన బిడ్డలు ఇబ్బందిపడుతుంటే బాబా సహించలేరు


సాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. బాబా దయవల్ల నేను ఇదివరకు చాలా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఒకరోజు నేను, మా అమ్మానాన్నలు మా బంధువుల ఫంక్షన్‌కి వెళ్లాల్సి వచ్చింది. అయితే, మేము బయలుదేరే సమయానికి వర్షం మొదలైంది. ఆ కారణంగా ఫంక్షన్‌కి ఆలస్యం అవుతుండటంతో నేను బాబాకి నమస్కరించుకుని, "బాబా! మేము ఫంక్షన్‌కి వెళ్లేంతవరకు వర్షం పడకుండా ఉండేలా చూడు సాయీ" అని చెప్పుకున్నాను. వెంటనే వర్షం తగ్గిపోయింది. ఫంక్షన్ నుండి తిరిగి వచ్చేవరకు మేము ఎక్కడా వర్షానికి దొరకలేదు. కానీ, మేము ఇంటికి వచ్చాక తెలిసింది, 'మేము వెళ్ళిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది' అని. అంతా బాబా కృప. ఆయన తన బిడ్డలు ఇబ్బందిపడుతున్నా, బాధపడుతున్నా చూసి సహించలేరు. తప్పక సహాయం అందిస్తారు. "శతకోటి వందనాలు బాబా".


కొన్ని సంవత్సరాలుగా నేను ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నాను. వర్షాకాలంలో అయితే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు నేను ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటాను. ఆ కారణంగా ఈమధ్య ఒకసారి శ్వాసనాళాలు కుదించుకుపోయి నాకు ఊపిరాడటం కష్టమైంది. దాంతో నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు నేను కాస్త బాబా ఊదీని తీసుకుని నోట్లో వేసుకుని, బాబా నామస్మరణ చేస్తూ, "బాబా! మీ దయవల్ల నా సమస్య తీరితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. బాబా దయవలన కాసేపటికి నాకు ఉపశమనం కలిగింది. "థాంక్యూ సో మచ్ బాబా. ఎల్లప్పుడూ మీకు ఋణపడివుంటాను".


నేను చాలారోజుల వ్యవధి తర్వాత ఈమధ్య ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాలని అనుకున్నాను. అయితే, అదే సమయంలో నాకు నెలసరి ఉందని చాలా దిగులుచెందాను. అయినా, బాబా ఉండగా దిగులెందుకని బాబాకి నమస్కరించుకుని, "బాబా! నేను ఊరికి వెళ్లి తిరిగి వచ్చేంతవరకు నాకు నెలసరి రాకూడదు. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. నేను భయపడ్డట్టు ఏ ఇబ్బందీ లేకుండా బాబా దయవలన సంతోషంగా ఊరికి వెళ్లి తిరిగి వచ్చాను. "చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ".


సాయినాథుని దయ


సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శిరీష. మాది నెల్లూరు. నాకు చిన్నప్పటినుంచి బాబా అంటే ఎంతో ప్రేమ. మా ఇంట్లో అందరం బాబా భక్తులం. ఇదివరకు రెండుసార్లు బాబా నన్ను అనుగ్రహించిన సంఘటనల గురించి మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరోసారి ఆ సాయినాథుడు నాకు అవకాశం ఇచ్చారు. ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డ మా కుటుంబం బాబా సచ్చరిత్ర పారాయణతో ఇప్పుడు కాస్త కుదుటపడుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మా కుటుంబంలో అందరికీ కరోనా వచ్చింది. సాయినాథుని దయవల్ల ఎవరికీ ఏ హానీ జరగకుండా బయటపడ్డాం.


మా బాబుకి 17 సంవత్సరాలు. తనకి ఉన్నట్టుండి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. క్లోమం చుట్టూ వాపు వచ్చి రాత్రికి రాత్రే బాబును హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. బాబుని ఐ.సి.యులో ఉంచి ఆహారం, నీరు లేకుండా చికిత్స చేశారు. మేము చాలా భయపడ్డాము, తల్లడిల్లిపోయాము. ఆ కష్టకాలంలో మేము బాబానే నమ్ముకున్నాం. చిన్నగా బాబుకు నయమై పదిరోజుల తర్వాత ఇంటికి వచ్చాము. సాయి దయవల్ల ఇప్పుడు బాబుకి బాగుంది. అయితే, అదే సమయంలో మా బాబుకి ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ కూడా ఉండటంతో, 'ఈ సంవత్సరం కరోనా కారణంగా పిల్లలకు కాలేజీ జరగలేదు. ఆన్లైన్ క్లాసెస్ కూడా సరిగా నిర్వహించలేదు. పైగా ఆరోగ్యసమస్యలతో బాబు పరీక్షలు ఎలా రాస్తాడు? తనను ఎంసెట్‌కి ఎలా పంపాలి?' అని నేను, మావారు సతమతమయ్యాము. కానీ బాబా దయవలన ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. తర్వాత, "బాబు ఎంసెట్ క్వాలిఫై అయితే చాలు" అని బాబాను గట్టిగా వేడుకుని, నేను, మావారు క్రమం తప్పకుండా ప్రతి గురువారం సాయిసచ్చరిత్ర పారాయణ చేస్తుండేవాళ్ళం. బాబా దయతో మా బాబు ఎంసెట్ వ్రాసి వచ్చాడు. ఆగష్టు 26న ఎంసెట్ ‘కీ’ విడుదలైంది. మా బాబు క్వాలిఫై అయ్యాడు. ప్రిపరేషన్ లేకుండా ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం చదివిన చదువుతో పరీక్షలో క్వాలిఫై అవడమంటే అది కేవలం బాబా దయవల్లే. మా పాపకి కూడా బాబా దయవల్ల ఇంజనీరింగ్ కాలేజీలో అనుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. ఇలా అన్నిరకాలుగా మమ్మల్ని ఆదుకుంటున్న సాయినాథునికి మేమంతా సర్వస్య శరణాగతి చేసి, ఆయన పాదాలకు కోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాము. "బాబా! మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలాగే తోడుండి నడిపిస్తూ కాపాడండి తండ్రీ".


వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఏ సమస్యా లేకుండా చూసిన బాబా


'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు మరియు సాయిబంధువులందరికీ బాబా పరిపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటున్నాను. నా పేరు శ్రీదేవి. మా బాబు బీ.టెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. తను సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎప్పుడూ బలహీనంగా ఉంటాడు. అందువల్ల తనకి వ్యాక్సిన్ వేయించాలంటే మాకు భయంగా ఉండేది. కానీ ఇటీవల తన కాలేజీ ఓపెన్ చేయడం వల్ల తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చి, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అదేరోజు రెండవ డోసు వ్యాక్సిన్ వేయించుకున్న మా అన్నయ్యకి జ్వరం వచ్చింది. దాంతో నేను బాబా ఊదీని నీళ్ళల్లో కలిపి రోజూ బాబుకి త్రాగమని ఇస్తుండేదాన్ని. ఇంకా, బాబాకి నమస్కారం చేసుకుని, "బాబా! బాబుకి, అన్నయ్యకి వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సమస్యా రాకుండా ఉంటే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా ఊదీ మహత్యం వల్ల వాళ్లిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా! ఇలాగే మీ ఆశీస్సులు మీ బిడ్డలందరిపై ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించు తండ్రీ. మా ఊరిలో త్వరగా మీ మందిరం ఏర్పడేలా ఆశీర్వదించండి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo