సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 890వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలను పరిష్కరించిన సాయి
2. బాబా కృప
3. బాబా ఆశీస్సులతో దొరికిన బంగారు జుంకా

సమస్యలను పరిష్కరించిన సాయి

 

ఓం శ్రీసాయినాథాయ నమః


ముందుగా, బాబా మనకు ప్రసాదించిన అనుభవాలను పంచుకునే అవకాశాన్ని ఈ బ్లాగ్ ద్వారా అందరికీ కలిపిస్తున్న సోదర సమానులైన సాయిగారికి నా ధన్యవాదాలు. కొంతకాలం క్రితం ఒక వారం రోజుల వ్యవధిలో బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను సాటి సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను. 


ప్రక్కింటివారితో వివాదం: మేము ఒక ఇల్లు కొనుక్కున్నాము. ఆ ఇల్లు కొనుక్కునేసరికే ఆ ఇంటికి ఉన్న ఒక ఏటవాలు రేకులాంటి నిర్మాణాన్ని తొలగించమని మా ప్రక్కింటివాళ్ళు గొడవ చెయ్యడం మొదలుపెట్టారు. మేము ఆ ఇల్లు కొనుక్కున్నామేగానీ ఆ ఇంటిలో నివాసం ఉండడం లేదు. వేరే ఊరిలో ఉంటున్నాం. కరోనా పరిస్థితుల వల్ల ఆ ఇంటికి వేరే చిన్న చిన్న రిపేర్లు చేయించమని ఒకరికి అప్పచెప్తే, పనివాళ్ళు సరిగ్గా రాక గత 5 నెలల నుండి పనులు మందకొడిగానే సాగుతున్నాయి. ఈమధ్యలో ప్రక్కింటివాళ్ళ కంప్లైంట్ ఒకటి. వాళ్ళకు చెప్పినట్టుగానే కొన్ని రోజులలో వాళ్ళకి ఇబ్బంది కలిగించే అంశాన్ని కూడా సరిచేయించాము. అయినా సరే, వాళ్ళు ఆ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాల్సిందేనని పట్టుబట్టి పోలీసు కేసుల వరకు వెళ్లి మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టారు. మామూలుగానే గొడవ పెట్టుకునే మనుషులు వాళ్ళు. ఈ సంఘటనలతో మనశ్శాంతి లేక ఎంతో బాధపడి, ఒకరోజు బాబాకు నమస్కరించుకుని, “విషయం పెద్దది కాకుండా రెండు రోజుల్లో పరిష్కారమైతే కేసరి చేసి మీకు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీ భక్తులకు పంచుతాను” అని మ్రొక్కుకుని బాబాపైనే భారం వేశాను. ఆశ్చర్యంగా, ఎప్పుడూ నిదానంగా జరిగే ఆ పని బాబా ఆశీర్వాదం వల్ల ఆరోజు ఫోన్ చేయగానే వర్కర్ ఉదయం 6 గంటలకే వచ్చి చాలా భాగం పూర్తిచేసి వెళ్ళాడు. నిజానికి ఆ నిర్మాణాన్ని సగం వరకు తొలగించిన తరువాత ప్రక్కింటివాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది ఉండకూడదు. అయినా వాళ్ళు అహంభావంతో ఇన్నాళ్ళూ గొడవ పెడుతూ వచ్చారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఇలాగే గొడవ చేస్తుంటే ఇక ఆ మొత్తం నిర్మాణాన్ని తీసేద్దామని అనుకుంటున్నాం. ఏది ఏమైనా బాబా దయవల్ల వర్కర్ వెంటనే వచ్చి పనిచేయడం వల్ల గొడవ సద్దుమణిగినట్టే అనిపించింది. ఆ సమస్య పూర్తిగా తొలగిందో లేదో తెలియదుగానీ మనసుకి కొంచెం శాంతి కలిగి, బాబా ఎలాగూ ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడేస్తారన్న నమ్మకంతో ఆ గురువారంనాడు బాబా గుడికి వెళ్లి మ్రొక్కు తీర్చుకున్నాను.


రెండవ అనుభవం: గురువారం బాబా గుడికి వెళ్లినప్పుడే ఇంకొక అద్భుతం జరిగింది. ముందురోజు బుధవారంనాడు మా పాప తన ఉద్యోగానికి సంబంధించిన మెయిల్ వచ్చిందని చెప్పింది. ఇక్కడ మీ అందరికీ విషయం కొంత వివరించాల్సి ఉంది. మా పాప చాలా బాగా చదువుతుంది, బాగా కష్టపడుతుంది. కానీ, ప్రతిదానికీ బాగా టెన్షన్ పడుతుంటుంది. తను అన్నీ 100% పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటుంది. అది మంచి లక్షణమే అయినప్పటికీ దానివల్ల తను పడే ఇబ్బంది తక్కువేమీ కాదు. ఆల్రెడీ తను ఒక పెద్ద కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తూ ఉంది. దానితో పాటు వేరే కంపెనీ నుండి ఉద్యోగానికి ఆఫర్ కూడా ఉంది. తను ఇంటర్న్‌షిప్ చేసే కంపెనీలో పనివల్ల ఒత్తిడికి గురై ఇంటర్న్‌షిప్ పూర్తవగానే మానేసి వేరే కంపెనీకి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంది ఇన్ని రోజులూ. అతి కష్టం మీద ఇంటర్న్‌షిప్ పూర్తిచేసింది. మేము కూడా తన ఒత్తిడి, బాధ చూస్తుండటం వల్ల తన నిర్ణయాన్ని కాదనలేదు. “నీకెలా ఇష్టమైతే అలాగే చేసుకో, ఇబ్బందిపడవద్దు” అంటూ ఉన్నాం. తీరా ఇంటర్న్‌షిప్ చేస్తున్న కంపెనీ కూడా ఫుల్ టైం జాబ్ ఆఫర్ ఇచ్చాక తను బాగా డైలమాలో పడింది. ఎందుకంటే తను జాయిన్ అవ్వాలనుకున్న వేరే కంపెనీ ఇచ్చే జీతానికి రెట్టింపు కంటే ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేశారు వాళ్ళు. పైగా అది మంచి కంపెనీ కూడా. అలాంటి ఉద్యోగాన్ని వదిలేయడం అందరూ పిచ్చితనంగా అనుకుంటారేమోనని ఒకప్రక్క, కానీ పనిఒత్తిడి వల్ల అక్కడ పనిచేయలేనేమోనని ఒకప్రక్క చాలా సంఘర్షణకు లోనైంది. బుధవారం తనకు మెయిల్ వచ్చింది, గురువారం తన నిర్ణయాన్ని కంపెనీకి తెలియజేయాలి. నేను బాబాకు నమస్కరించుకుని, “నేను జీతానికి ఆశపడను బాబా. తనకి ఏది మంచిదో అక్కడే తనని ఉంచేలా చూడు. ఏ కంపెనీ ఎంచుకున్నా తను కూల్‌గా, సంతోషంగా ఉండాలి, అదే ముఖ్యం” అని మనస్ఫూర్తిగా వేడుకుని, “తను టెన్షన్ పడకుండా హాయిగా వర్క్ చేసుకుంటే ‘సాయి దివ్యపూజ’ 5 వారాలు చేస్తాను” అని మ్రొక్కుకున్నాను. అయినా మనసులో చాలా టెన్షన్ పడుతూనే ఉన్నాను. సరిగ్గా నేను గురువారం సాయంత్రం బాబా గుడికి వెళ్లి ఇంటికి సంబంధించిన మ్రొక్కును తీర్చుకుని, ఆరతికి కూడా హాజరై బయటికి వచ్చి ఫోన్ తీయగానే అంతకు ఒక్కనిమిషం ముందే ‘ఆఫర్ యాక్సెప్ట్ చేశాను’ అని మా పాప పెట్టిన మెసేజ్ కనిపించింది. అంటే, నేను బాబా ముందు ఉండగానే తను ఆ నిర్ణయం తీసుకుంది. అది నాకు చాలా సంతోషంగానూ, శుభసూచకంగానూ అనిపించింది. పాప పెట్టిన మెసేజ్ చూశాక మళ్ళీ వెనక్కు వెళ్లి బాబా పాదాలు పట్టుకుని మనసారా కృతజ్ఞతలు చెప్పుకుని ఇంటికి తిరిగి వచ్చాను. నేను తన టెన్షన్ తొలగించమనే బాబాను కోరాను కాబట్టి ఈసారి తను ఏ విధమైన కంగారుగానీ, ఒత్తిడిగానీ లేకుండా పనిచేసుకుంటుందని ఆశిస్తున్నాను. “బాబా! తనకు మంచి భవిష్యత్తుని ఇచ్చే ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు మీకు వేలవేల ధన్యవాదాలు. నేను అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మిమ్మల్ని కోరేది ఒకటే, తన మనసు నుండి ఆ ఒత్తిడిని కూడా తీసెయ్యి బాబా. నా కోరికను నెరవేరుస్తావని ఆశిస్తున్నాను బాబా”. ఆరోజు రాత్రి నాకు చాలా ప్రశాంతమైన నిద్ర కూడా పట్టింది. 


సాయిబంధువులందరికీ ఒక మనవి: ఏదైనా మన మనసులోనే ఉంది. “అందరిలోనూ నన్నే చూడు” అనే బాబా మెసేజ్ మనకు చాలా తరచుగా ఎక్కడో అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. మనకు నచ్చనివారి గురించి కొంచెమైనా సరే చెడుగా మాట్లాడినా, ఆలోచించినా, ఇలా మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు ఏవో ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయం గ్రహించి బాబాను క్షమాపణలు కోరగానే పరిస్థితులు వాటంతట అవే చక్కబడుతున్నాయి. ఇది నా అనుభవం. కాబట్టి సాయిబంధువులారా, బాబా మీకు ప్రసాదించిన జీవితాన్ని మీరు తృప్తిగా అనుభవించండి. ఎవరైనా మనలను బాధపెట్టి, ఏడిపిస్తే అది వాళ్ల ఖర్మ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోవద్దు. అదంతా బాబా చూసుకుంటారు.


సర్వం సాయిమయం.


బాబా కృప


సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఇదివరకు నేను ఈ బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇటీవల జరిగిన కొన్ని అనుభవాలను ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఈ మధ్య ఒక వెండి వస్తువు కనిపించలేదు. నాకు చాలా బాధేసి, "ఆ వస్తువు దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. కాసేపటి తర్వాత వెతికితే ఆ వస్తువు కనిపించింది. "చాలా సంతోషం బాబా".


ఇటీవల కరోనా సమయంలో మా నాన్నకి జ్వరం, ఒళ్ళునొప్పులు వచ్చాయి. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలున్నందున నాకు చాలా భయమేసి, "బాబా! నాన్నకి ఏ ఇబ్బందీ లేకుండా తొందరగా నయం కావాల"ని చెప్పుకున్నాను. మరుసటిరోజుకల్లా నాన్నకి జ్వరం తగ్గిపోయింది. తరువాత మా పిల్లలకి బాగా జలుబు, దగ్గు సమస్యలు వచ్చాయి. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయతో పిల్లలకి ఇబ్బంది లేకుండా తొందరగా జలుబు, దగ్గు తగ్గిపోవాల"ని బాబాతో చెప్పుకున్నాను. ఐదు రోజులు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇవ్వడంతో బాబా దయవల్ల పిల్లలకి తగ్గిపోయింది. "థాంక్యూ బాబా. ఇలాగే అందరినీ చల్లగా కాపాడు తండ్రీ. ఈ కరోనా మహమ్మారిని త్వరగా తరిమివేయండి బాబా. అది కేవలం మీకు మాత్రమే వీలవుతుంది".


బాబా ఆశీస్సులతో దొరికిన బంగారు జుంకా


సాయిబంధువులకు నమస్కారం. నేను యు.ఎస్.ఏ లో నివాసముంటున్న ఒక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మాయి జులై నెల నుండి సమ్మర్ స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టింది. ఒకరోజు తన చెవికున్న బంగారు జుంకాను స్కూల్లో ఎక్కడో పోగొట్టుకుంది. తను ఇంటికి వచ్చాక తన చెవికి జుంకా లేదని మేము గమనించాము. వెంటనే నేను, మా అమ్మాయి దాన్ని వెతకడానికి స్కూలుకి వెళ్ళాము. కానీ మేము వెళ్లేసరికి స్కూలు మూసివేసి ఉంది. అందువలన మేము లోపలికి వెళ్లలేక, స్కూలు బయట నేను రోజూ మా అమ్మాయిని దించే చోట, ప్లే గ్రౌండ్ తదితర అన్ని ప్రదేశాలలో వెతికాము. కానీ ప్రయోజనం లేకపోయింది. తర్వాత ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేశాము. నేను బాబాకు నమస్కరించుకుని, "జుంకా దొరికేలా చేయమ"ని ప్రార్థించాను. మరుసటిరోజు మా అమ్మాయి స్కూలుకి వెళ్లి తన తరగతి గదిలో వెతికింది. అప్పుడు బాబా ఆశీస్సులతో తన బంగారు జుంకా దొరికింది. నిజంగా ఇది బాబా అనుగ్రహమే. ఎవరైతే నమ్మకంతో బాబాను ప్రార్థిస్తారో వారికి బాబా సహాయం ఎప్పుడూ అందుతుంది. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టరు. నేను నా తుదిశ్వాస వరకు బాబాను ఆరాధిస్తాను. "ధన్యవాదాలు బాబా".


10 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤🌺🌹😊🌼🌸

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. 847 days
    sairam

    sai ran naa kodukuni naaku ippinchu tandri
    koduku lekunda uriki vellalenu sairam
    please sairam

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh, karthik ki health bagundali thandri

    ReplyDelete
  8. Baba, Nani ki engineering clg lo seat ippinchandi,please baba

    ReplyDelete
  9. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo