సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మహల్సాపతి - మూడవ భాగం...



1896లో జన్మాష్టమినాడు బాబా మహల్సాపతితో, "అరే భగత్, ఈ ఫకీరు మాటలు విను, అవి ఎల్లప్పుడూ సత్యాలు. నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావుగానీ నీ భార్యతో ఉండట్లేదు. నీకు కూతుర్లు మాత్రమే ఉన్నారు. కూతుళ్లు చింతపండులాంటివాళ్ళు; కొడుకులు మామిడిపండువంటివాళ్ళు. వెళ్లి, ఇంట్లో పడుకో! నీకు ఒక కొడుకు పుడతాడు" అని ఒత్తిడి చేసినప్పటికీ కుటుంబాన్ని పెంచుకోవడంలో ఎంత మాత్రమూ ఆసక్తి లేని మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి నిరాకరించాడు. అప్పుడు బాబా అక్కడే ఉన్న కాశీరాంషింపీ, తాత్యాకోతేపాటిల్, లక్ష్మీబాయిషిండే తదితరులతో, "భగత్ మరీ పిచ్చివాడైపోతున్నాడు. అతన్ని సంసారం చెయ్యమనాలె!" అని అన్నారు. బాబా మాటపై మహల్సాపతి మిత్రుడైన కాశీరాంషింపీ బలవంతంగా అతనిని ఇంటికి తీసుకొని వెళ్లి, ఇంట్లో విడిచిపెట్టాడు. ఆరోజు నుండి మహల్సాపతి ఇంట్లో నిద్రించడం మొదలుపెట్టాడు. మరుసటి సంవత్సరం(1897) జన్మాష్టమినాడు బాబా ఆశీస్సులతో అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. మహల్సాపతి ఆ బిడ్డను బాబాకు చూపించి, బిడ్డను ఆశీర్వదించి ఏ పేరు పెట్టాలో తెలియజేయమని అడిగాడు. బాబా ఆ బిడ్డకి ‘మార్తాండ్’ అని నామకరణం చేయమని చెప్పి, "ఈ బిడ్డని 25 ఏళ్ళ వరకు చూసుకో, సరిపోతుంది" అని అన్నారు. 25 సంఖ్య తన ఆయుఃప్రమాణాన్నే సూచిస్తుందని ఆ సమయంలో మహల్సాపతికి అర్థంకాక ఎంతో వినయంగా, "బాబా! బిడ్డను చూసుకోవడం నా శక్తికి మించినది. అది మీ చేతుల్లోనే ఉంది" అని అన్నాడు. అందుకు బాబా, "నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి" అని అన్నారు. మహల్సాపతి శరణాగతి చెందిన భక్తుడైనప్పటికీ అహాన్ని విడిచిపెట్టలేదు, శరీరం ద్వారా జరిగే చర్యలన్నీ భగవంతుని చర్యలుగా పరిగణించే స్థాయికి ఎదగలేదు. అయితే బాబా ఇటువంటి పలు సందర్భాల ద్వారా ఆ స్థాయికి పరిణతి చెందేలా మహల్సాపతికి మార్గనిర్దేశం చేస్తుండేవారు.

(బహుశా మహల్సాపతి తన ఇంట నిదురించిన ఆ సంవత్సర కాలంలోనే) ఒకసారి బాబా కటికనేలపై నిద్రించటం చూసి సహించలేని నానాసాహెబ్ డేంగ్లే నాలుగు మూరల పొడవు, జానెడు వెడల్పు గల ఒక చెక్కబల్లను బాబాకు సమర్పించాడు. బాబా ఆ చెక్కబల్లను సన్నని గుడ్డపీలికలతో మసీదు పైకప్పు నుండి మూరెడు క్రిందకు ఉయ్యాలలా వ్రేలాడదీశారు. రాత్రిపూట దానికి నాలుగు మూలలా వెలుగుతున్న ప్రమిదల్ని ఉంచి వాటిమధ్య పడుకునేవారు. ఆ బల్లనే మోస్తాయో లేదోనన్పించే ఆ గుడ్డపీలికలు బాబాను కూడా మోయడమే చిత్రం! అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. నిచ్చెన సహాయం లేకుండా బాబా ఆ బల్లమీదకు ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవరికీ తెలిసేది కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా అంతలోనే దానిపై పడుకొని కన్పించేవారు. అలాగే దిగేవారు. అది చూడడానికి జనం విరగబడుతుంటే బాబా ఒకరోజు ఆ చెక్కబల్లను విరిచి ధునిలో వేశారు. చాలా సంవత్సరాల తరువాత ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ బాబాతో, “బాబా, మీరు నిద్రించడానికి నేను ఒక చెక్కబల్లను తీసుకువస్తాను. మీరు మునుపటిలా దానిపై నిద్రించవచ్చు” అన్నాడు. అప్పుడు బాబా, “వద్దు. మహల్సాపతిని క్రింద విడిచి నేను దానిపై ఎలా నిద్రపోగలను?” అని అన్నారు. "మీరు కోరితే, నేను అతని కోసం మరొక చెక్కబల్లను ఏర్పాటు చేస్తాను" అని అన్నాడు దీక్షిత్. బాబా నవ్వి, “అతను చెక్కబల్లపై నిద్రించగలడా? అది అంత సులభం కాదు. నేను అతనితో, 'నువ్వు నా హృదయంపై నీ చేయి ఉంచి, నా హృదయంలో నామస్మరణ ఎలా జరుగుతుందో గమనించు. నేను నిద్రపోతున్నానని నీకు అనిపిస్తే, నన్ను మేల్కొలుపు!' అని చెప్తాను. కానీ, అతను అది కూడా చేయలేకపోతున్నాడు. అతను కూర్చొని కునికిపాట్లు పడుతుంటాడు. అతనికి నిద్ర తూగినపుడు అతని చేయి నా గుండెపై ఒక బండరాయిలా బరువుగా అనిపిస్తుంది. అప్పుడు నేనతణ్ణి గట్టిగా పిలిచి లేపితే కంగారుగా కళ్ళు తెరుస్తాడు. నేలపైనే సరిగ్గా కూర్చోలేనివాడు, నిద్రకు బానిసైనవాడు వ్రేలాడే చెక్కబల్లపై ఎలా పడుకోగలడు? కాబట్టి, నాకు ఇలా నేలమీదే బాగుంది" అని అన్నారు.

ఇకపోతే, పుత్రుడు జన్మించిన తరువాత మహల్సాపతి తిరిగి మునుపటిలా రాత్రిళ్ళు బాబా సాంగత్యంలో నిద్రించనారంభించాడు. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే మహల్సాపతి తన వస్త్రాన్ని మసీదులో నేలపై పరిచాడు. ఆ వస్త్రంపై ఒకవైపు బాబా, మరోవైపు మహల్సాపతి పడుకున్నారు. కాసేపటికి బాబా అతనితో, "భగత్! నేను చెప్పేది విను. ఈరోజు మనం అత్యంత జాగరూకతతో ఉండాలి. ఆ మొరటువాడైన రోహిల్లా (ప్లేగు) నిగోజ్ పాటిల్ భార్యను తీసుకుపోవాలని చూస్తున్నాడు. నామస్మరణ ద్వారా నేను ఆ అనర్థం జరగకుండా చూడమని అల్లాను ప్రార్థిస్తాను. ఎవరూ రాకుండా, నేను చేసే నామస్మరణకు అంతరాయం కలగకుండా నువ్వు చూడు" అని చెప్పారు. బాబా ఆదేశం మేరకు మహల్సాపతి మేలుకొని వారి నామస్మరణకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు అర్థరాత్రి దాటాక నెవాసా నుండి ఆ గ్రామ మామల్తదారు, అతని సహచరులు ఎలాగైనా బాబా దర్శనం చేసుకోవాలని అక్కడికి వచ్చారు. వాళ్లతో వచ్చిన జవాను మహల్సాపతి ఎంత చెప్పినా వినకుండా తమకప్పుడే బాబా దర్శనం, ఊదీ కావాలని బలవంతం చేయసాగాడు. వాళ్ళను నిలువరించడానికి మహల్సాపతి ఎంతగానో ప్రయత్నించాడుగానీ అధికార మదాన్ని ఎవరు అడ్డుకోగలరు? చివరికెలాగో అతి కష్టం మీద కొంత ఊదీ తీసుకొని వెళ్ళమని వాళ్ళను ఒప్పించి, ఊదీ తీసుకోవడానికి ధుని వద్దకు వచ్చాడు మహల్సాపతి. వాళ్ళ మాటల శబ్దానికి, మహల్సాపతి అడుగుల సవ్వడికి బాబాకు ధ్యానభంగమైంది. బాబా కోపోద్రిక్తులై, "అరే భగత్, నీకూ ఒక కుటుంబం ఉంది! నిగోజ్ ఇంట ఏమి జరుగుతుందో నీకు తెలియదా? ఈ అంతరాయం వలన నా ప్రయత్నం విఫలమైంది. పాటిల్ భార్య మరణించింది" అని శాపనార్థాలు పెడుతూ పడుకోవడానికి పరచిన వస్త్రాన్ని తీసి మహల్సాపతిపై విసిరికొట్టారు. మరుక్షణమే ఆయన శాంతించి, "సరే, జరిగిందేదో మంచికే జరిగింది" అని అన్నారు.

రానురానూ మహల్సాపతి తన సమయమంతా బాబా చెంతనే గడుపుతుండేవాడు. భోజనానికి, ఇంకా ముఖ్యమైన పనులేమైనా ఉంటే తప్ప అతను ఇంటికి వెళ్ళేవాడు కాదు. అతనలా వెళ్ళిన కాసేపటికే బాబా అతనిని పిలుచుకు రమ్మని ఒకరిద్దరిని పంపుతుండేవారు. అంతలా వారివురి మధ్య అనుబంధం ఉండేది. మహల్సాపతి శ్రీసాయిని ఎంతగానో సేవించేవాడు. ఆయన పాదాలొత్తేవాడు. చిలిం వెలిగించడం, బాబా శయనించేందుకు పడకను సిద్ధం చేయడం వంటి కొన్ని ప్రత్యేకమైన సేవలు మహల్సాపతి మాత్రమే చేసేవాడు. ప్రతిరోజూ రాత్రి భోజనాలయ్యాక బాబా సేవకుడైన మాధవ్‌ఫస్లే బాబా వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకను, ఒక చింకిగుడ్డను మహల్సాపతికి అందించేవాడు. బాబా తలపెట్టుకొనేవైపు ఆ ఇటుకను ఉంచి, దానిపై ఆ పాతగుడ్డను ఉంచి, ఆపై దుప్పటి పరచి బాబాకు పడక అమర్చేవాడు మహల్సాపతి. బాబా ఆ ఇటుకపైనే తలపెట్టుకొని నిద్రపోయేవారు. కొంతసేపటి తర్వాత మహల్సాపతి లేచి, ప్రమిదలలో నూనె నింపి, వత్తులు సవరించి, బాబా రొట్టెలు పెట్టుకొనే కుండమీద మూతపెట్టి, ధునిలో కట్టెలు వేసేవాడు.

ఒకరోజు శిరిడీలో కుంభవృష్టి కురిసి మసీదంతా తడిసిపోయి, బాబాకు కూర్చునేందుకు కూడా చోటు లేకపోయింది. భక్తులంతా బాబాను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. బాబా అంగీకరించకపోయేసరికి సాయిభక్తుడైన నారాయణతేలి బాబాను ఎత్తుకొని బలవంతంగా తీసుకొని వెళ్లి చావడిలో కూర్చోబెట్టాడు. నాటి రాత్రి బాబా చావడిలోనే విశ్రమించారు. ఆనాటినుండి బాబా ఒకరాత్రి మసీదులో, ఒకరాత్రి చావడిలో నిద్రించనారంభించారు. మహల్సాపతి కూడా బాబాతోపాటే మసీదులోనూ, చావడిలోనూ నిద్రించేవాడు. వారివురి మధ్య అనుబంధం వింతగానూ, చమత్కారంగానూ ఉండేది. ఏకాంత పరిసరాలలో చిలిం త్రాగుతూ వారివురి మధ్య జరిగే సంభాషణ మరింత ఆసక్తికరంగా ఉండేది. ఈ విషయానికి సంబంధించి శ్రీమతి కాశీబాయి కనీత్కర్ 1906లో తమకు జరిగిన అనుభవం గురించి ఇలా చెప్పింది: “బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు. మేము శిరిడీలో ఉన్న రోజు బాబా తమ అలవాటు ప్రకారం మహల్సాపతితో కలిసి మసీదు నుండి చావడికి వచ్చారు. వారిరువురు చావడి ప్రవేశద్వారం వద్ద చీకటిలో కూర్చున్నారు. నా భర్త గోవిందరావు కనీత్కర్ కూడా వెళ్లి అక్కడ కూర్చున్నారు. బాబా, మహల్సాపతిల మధ్య చక్కటి ఆహ్లాదకరమైన సంభాషణ జరుగుతుండగా బాబా చిలిం వెలిగించి, తాము పీల్చి మహల్సాపతికి అందించారు. తరువాత నా భర్తకి కూడా ఇచ్చారు. తరువాత కూడా బాబా, మహల్సాపతిల మధ్య సంభాషణ కొనసాగింది. బాబా మాటల మధ్యలో అప్పుడప్పుడు మహల్సాపతిని, "అంతేకదా భగత్?” అని అడుగుతుండేవారు. అందుకతను పదేపదే “బేషక్, బేషక్” (నిస్సందేహంగా, నిస్సందేహంగా) అని ఒకే పదాన్ని రెండుసార్లు అంటుండేవాడు. అయితే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మూడో వ్యక్తి గ్రహించలేకపోయేవారు. అంతలో చిలిం మరోసారి వెలిగించాల్సి వచ్చింది. కానీ చిలిం గొట్టంలో ఉండే చిన్నరాయి ఎక్కడో పడిపోయింది. దాంతో బాబా ఆగ్రహించి తీవ్రంగా తిట్టిపోయసాగారు ....”

సహజంగానే ప్రాపంచిక విషయాలపట్ల అనురక్తిలేని మహల్సాపతి ఎటువంటి కోరికలూ లేక అతి నిరాడంబరమైన జీవితాన్ని సాగిస్తుండేవాడు. బాబా కూడా అతన్ని అలానే ఉండనిచ్చారు. మహల్సాపతి ఆర్థికంగా నిరుపేదవాడైనప్పటికీ జీవనోపాధికి అవసరమయ్యే ధనసంపాదన కోసం తన సమయాన్ని ఏ మాత్రమూ వెచ్చించక పూర్తి సమయాన్ని బాబా సేవలోనే గడిపేవాడు. బాబా సేవలోనే అతను అమితమైన ఆనందాన్ని పొందుతుండేవాడు. అతనికి బాబాపట్ల ఎనలేని భక్తిప్రపత్తులుండేవి. అందుకే బాబా అతనిని చాలా ఇష్టపడేవారు. అతని ప్రభావం బాబాపై చాలా ఉండేది. ఇంకెవరు చెప్పినా విన్పించుకోని సందర్భాలలో సైతం మహల్సాపతి చెబితే బాబా వినేవారు. బాబా నివాసముండే మసీదు చాలా పురాతనమైనది, శిథిలావస్థలో ఉండేది. దానిని పునర్నిర్మించాలని నానాసాహెబ్ చందోర్కర్ సంకల్పించి బాబా అనుమతిని అర్థించాడు. కానీ బాబా మొదట అందుకు ఒప్పుకోలేదు. బాబా అనుమతి కోసం వేచివున్న సమయంలో ఒకరోజు చందోర్కర్ మసీదు బయట ఉండగా మహల్సాపతి మసీదుకి వచ్చాడు. బాబా అతన్ని తమ దగ్గరకు పిలిచి, "భగత్, బయట నిలుచున్న ఆ వ్యక్తి ఎవరు?" అని అడిగారు. అందుకు మహల్సాపతి, "అతను నానాసాహెబ్" అని బదులిచ్చి, చిలిం వెలిగించి బాబాకు అందించాడు. అప్పుడు బాబా, "అరే భగత్, నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. బయట నిలబడివున్న ఈ నానా మసీదును క్రొత్తగా పునర్మిస్తానని అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? మనం క్రొత్త మసీదు నిర్మించాలా? లేక మనకు ఈ పాత భవనం సరిపోతుందా? అసలు క్రొత్తది ఎందుకు నిర్మించాలి?" అని అడిగారు. అందుకు మహల్సాపతి సౌమ్యంగా పరిహాసమాడుతూ, "అతన్ని క్రొత్తది నిర్మించనివ్వండి. అది మనిద్దరికీ కూర్చోవడానికి, పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది" అని అన్నాడు. ఈ విధంగా చిలిం త్రాగుతూ వారివురి మధ్య సంభాషణ జరిగాక బాబా మసీదు పునరుద్ధరించడానికి అనుమతిని ఇచ్చారు. తరువాత బాబా ఆదేశం మేరకు మహల్సాపతి నానాను పిలిచి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించాడు.

ధనప్రలోభానికి లోనుకాని సాయిభక్తుడు:

ఆధ్యాత్మికోన్నతి విషయంలో ఇతర భక్తులకు బాబా యొక్క మద్దతు, అభయం అవసరమయ్యేవి. కానీ మహల్సాపతి విషయంలో వాటి ఆవశ్యకత లేకపోయేది. ఎందుకంటే, అతను అప్పటికే తనకున్న పరిస్థితుల్లో సాధ్యమైనంతవరకు నైతికతను, మనోపవిత్రతను, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అతను ఇంద్రియాలపై గొప్ప నియంత్రణను కలిగివుండేవాడు. కోరికలను, అవసరాలను అదుపులో ఉంచుకునేవాడు. అతనిలో గుర్తించదగ్గ గొప్ప విషయమేమిటంటే, మహల్సాపతి తన కుటుంబ పోషణ కోసం భిక్షావృత్తిపైనే ఆధారపడినప్పటికీ ఇతరులిచ్చిన ధనాన్ని గానీ, వస్తువులను గానీ స్వీకరించేవాడు కాదు. ఆధ్యాత్మిక సాధనలో ఈ ‘అపరిగ్రహ’ నియమాన్ని ఉత్తమ నియమంగా కీర్తిస్తారు. మహల్సాపతి మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం ఆశ్చర్యం! ఆ అపరిగ్రహ నియమాన్ని ఖచ్చితంగా పాటించే క్రమంలో ఒక్కోసారి మహల్సాపతి, అతని కుటుంబం పక్షం రోజులపాటు తినడానికేమీ లేక పస్తులుండాల్సి వచ్చేది. అయినా మహల్సాపతి తన అపరిగ్రహ నియమాన్ని తప్పేవాడు కాదు. ఇతరుల నుండి ధనాన్ని, కానుకలను స్వీకరించడం వలన నిలకడగా అత్యంత జాగరూకతతో సద్గ్రంథ పఠనం మొదలైనవాటివల్ల సంపాదించుకున్న పుణ్యం హరించుకుపోతుందనీ లేదా ఆ పుణ్యంలో కొంతైనా ఆ కానుకలిచ్చే దాతల పరమవుతుందనీ అతను నమ్మేవాడు. అంతేకాదు, తాను పొందాలనుకునే ఉన్నత స్థితిని చేరడానికి అది అవరోధమని కూడా అతను విశ్వసించేవాడు. కాబట్టి తానూ, తన కుటుంబం పస్తులున్నాసరే భిక్ష ద్వారా లభించే ఆహారాన్ని మినహాయిస్తే ఇతరులు ఇచ్చే కానుకలను నిష్కర్షగా తిరస్కరించేవాడు. ఒకసారి చింతామణ్‍రావు అనే భక్తుడు 1,000 రూపాయలు, మరోసారి యం.ఏ సేఠ్ అనే భక్తుడు 100 రూపాయలు, ఇలా మరెందరో సాయిభక్తులు ఎంతో డబ్బు మహల్సాపతికిచ్చి స్వీకరించమని ఒత్తిడి చేసినప్పటికీ ఆ కానుకలను స్వీకరించడానికి అతను సుతరామూ ఒప్పుకోనేవాడు కాదు. బాబా కూడా అతనెప్పుడూ ధనప్రలోభానికి లోనుకాకుండా చూసేవారు. 1917లో ప్రముఖ వ్యాపారవేత్త హంసరాజ్ ఆస్తమాతో బాధపడుతూ తన భార్యతో సహా శిరిడీ వచ్చి, బాబాను దర్శించి, వారి ఆదేశం మేరకు రెండు మూడు నెలలు శిరిడీలో ఉన్నాడు. అతను మహల్సాపతి పేదరికాన్ని చూసి చలించిపోయి పదిరూపాయలు అతనికివ్వబోయాడు. కానీ మహల్సాపతి ఆ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో హంసరాజ్ ఆ డబ్బును కాకాసాహెబ్ దీక్షిత్‌కిచ్చి, బాబా సమక్షంలో మహల్సాపతికిమ్మని కోరాడు. మహల్సాపతి బాబాను పూజిస్తున్న సమయం చూసుకొని దీక్షిత్ ఆ మొత్తాన్ని మహల్సాపతికి ఇవ్వబోయాడు. కానీ ఆ మొత్తాన్ని తీసుకునేందుకు మహల్సాపతి ఒప్పుకోలేదు. అప్పుడు దీక్షిత్ బాబాతో, "బాబా! దయచేసి ఈ మొత్తాన్ని తీసుకోమని మహల్సాపతితో మీరైనా చెప్పండి, లేదా మీరే ఈ మొత్తాన్ని తీసుకొని అతనికి ఇవ్వండి" అని అన్నాడు. అందుకు బాబా, "ప్రస్తుతానికి ఆ డబ్బులు నీ దగ్గరే ఉండనివ్వు" అని అన్నారు. కొంతసేపటికి మహల్సాపతి బాబా పూజ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా దీక్షిత్‌ను, "ఎన్ని రూపాయలవి?" అని అడిగారు. అందుకతను, "పది రూపాయల"ని బదులిచ్చాడు. బాబా "ఆ మొత్తాన్ని తమ దిండుపై ఉంచమ"ని చెప్పి, నానాసాహెబ్ నిమోన్కర్‌తో, "ఈ మొత్తాన్ని అందరికీ పంచిపెట్టు" అన్నారు. ఆ విధంగా ఆ మొత్తం నుండి మహల్సాపతికి పైసా కూడా చేరలేదు.

కానీ, అంతటి భక్తుడు, అతని కుటుంబం ఆకలితో అలమటిస్తుంటే బాబా చూస్తూ ఊరుకుంటారా? పరిస్థితి విషమించినప్పుడు ఆయన తన భక్తుని అపరిగ్రహ నియమాన్ని సడలింపజేసేవారు. ఒకసారి కొన్నిరోజులపాటు పస్తులుండటం వలన మహల్సాపతి కుటుంబం ప్రమాదంలో ఉందని గ్రహించిన కాకాసాహెబ్ దీక్షిత్ మహల్సాపతికి పదిరూపాయలు పంపాలనుకున్నాడు. అయితే మహల్సాపతి తన నియమానుసారం ఆ డబ్బును తిరస్కరిస్తాడని సంశయించి, అలా జరగకూడదని భావించి, ఆ పదిరూపాయలను ఒక కవరులో పెట్టి, దాన్ని తీసుకొని బాబా వద్దకు వెళ్లి, "బాబా! ఇది పంపనా?" అని అడిగాడు. అంతర్‌జ్ఞాని అయిన బాబా ‘ఎవరికి, ఏమిటి’ అనైనా అడగకుండా "పంపించు" అన్నారు. బాబా ఆదేశానుసారం దీక్షిత్ ఆ డబ్బును మహల్సాపతికి పంపాడు. నిజానికి దీక్షిత్ బాబా వద్దకు రావడానికి కొన్ని గంటల ముందు మహల్సాపతి భార్య బాబా దర్శనానికి వచ్చింది. అప్పుడు బాబా ఆమెతో, "అమ్మా! 'బాబా ఇంటికి వస్తున్నారు, తిరస్కరించవద్దు' అని నీ భర్తతో చెప్పు" అని అన్నారు. తరువాత కొంతసేపటికి దీక్షిత్ తనకు పంపిన కవరుని చూడగానే, బాబా చెప్పింది దానిగురించేనని మహల్సాపతి గ్రహించి, తన నియమాన్ని ప్రక్కన పెట్టి ఆ ధనాన్ని స్వీకరించాడు. అంతేకాదు, బాబా ఎన్నోసార్లు తామిచ్చే ధనాన్ని స్వీకరించమని మహల్సాపతిని ఒత్తిడి చేసేవారు. 1880 తరువాత బాబాకు దక్షిణ రూపంలో రోజూ అధిక మొత్తంలో ధనం వస్తుండేది. బాబా ఆ మొత్తం నుండి ఒకరికి 50, మరొకరికి 30, ఇంకొకరికి 4 రూపాయల చొప్పున భక్తులకు పంచేస్తూ ఉండేవారు. బాబా మహల్సాపతితో చాలాసార్లు, "ఇదిగో, ఈ మూడు రూపాయలు తీసుకో! ఇలా రోజూ తీసుకుంటూ ఉండు" అని అనేవారు. బాబా అలా చెప్పిన ప్రతిసారీ మహల్సాపతి నిరాకరిస్తుండేవాడు. అయినప్పటికీ, "నేనిచ్చే మూడు రూపాయలు తీసుకుంటూ ఉండు. నేను నిన్ను శ్రీమంతుణ్ణి చేస్తాను. నీ జీవితాన్ని సుఖమయం చేసుకో! ఇతరులు సహాయం కోసం నిన్ను ఆశ్రయిస్తారు, నీపై ఆధారపడతారు" అని బాబా అంటుండేవారు. కానీ మహల్సాపతి మాత్రం ధనప్రలోభానికి లోనుకాకుండా ఎంతో స్థిరంగా, "బాబా! నాకివేమీ అక్కర్లేదు. నిరంతరం మీ పాదాలను పూజించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి, అది చాలు" అని అనేవాడు. ఎందుకంటే, బాబా సాంగత్యంలో తాను పొందే గొప్ప సంతృప్తి కంటే భౌతిక సంపదలు విలువైనవి కావని మహల్సాపతికి బాగా తెలుసు. మహల్సాపతి ఎన్నడూ మంచం మీద నిద్రించేవాడు కాదు. అవి అందుబాటులో ఉన్నా, లేదా ఎవరైనా సమకూర్చినా అతను మాత్రం సుఖాలను పట్టించుకునేవాడు కాదు. హేమాడ్‌పంత్ తాను రచించిన శ్రీసాయిసచ్చరిత్రలో మహల్సాపతి గురించి, 'అతను ధనాన్ని ఆశించే భక్తుడు కాదు, అతను పరమార్థాన్ని కాంక్షించే గొప్ప భక్తుడు. అతను నిస్వార్థ ప్రేమమయ భక్తుడు. అతను తన దేహాన్ని, ఆత్మను బాబా పాదాలకు సమర్పించాడు’ అని వ్రాశాడు.


సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ,
శ్రీసాయిబాబా బై శ్రీసాయిశరణానంద,
లైఫ్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి,
సాయిలీల మ్యాగజైన్ జూలై-ఆగస్టు 2005 సంచిక.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


6 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🙏🙏😊❤🥰🌺😀🌸🌹🤗🌹😃🌼🌺

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo