సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 885వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయవల్లే మనకి సంతోషం
2. కంటికి రెప్పలా కాపాడుతున్న బాబా

బాబా దయవల్లే మనకి సంతోషం


ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః


సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం. నేను సాయి భక్తురాలిని. మన సాయి నాకు ప్రసాదించిన కొన్ని ఆశీర్వాదాలను మీ అందరితో పంచుకోవాలని వచ్చాను. ఇందులో మొదటి రెండు ఆశీర్వాదాలను ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పాను.


మొదటి ఆశీర్వాదం:


ఈమధ్య ఒకసారి మా తమ్ముడి ల్యాప్‌టాప్ పొరపాటున క్రిందపడి పనిచేయటం మానేసింది. తమ్ముడి వర్క్ అంతా దానితోనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ల్యాప్‌టాప్ పనిచేయలేదు. లోకల్ టెక్నీషియన్‌కి చూపించాడు. అయినా ల్యాప్‌టాప్ పనిచేయలేదు. అది అమెరికా నుంచి తెచ్చిన యాపిల్ కంపెనీ ల్యాప్‌టాప్ అవటం వల్ల లోకల్‌గా సెట్ అవదు. అందుకని దానిని రిపేర్ చేయించడానికి వేరే సిటీలో ఉన్న టెక్నీషియన్‌కి ఇచ్చాడు. నేను బాబాకు నమస్కరించుకుని, “ల్యాప్‌టాప్ బాగా పనిచేస్తే ఈ అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను బాబా” అని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ల్యాప్‌టాప్ రిపేర్ అయ్యి ఇప్పుడు చక్కగా పనిచేస్తోంది. “థాంక్యూ బాబా! మీ ఈ ఆశీర్వాదాన్ని త్వరగా పంచుకోలేకపోయినందుకు నన్ను క్షమించు బాబా!”


రెండవ ఆశీర్వాదం:


ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. నూటికి నూరుశాతం బాబా దయవల్ల మాత్రమే మేమిప్పుడు ఇలా సంతోషంగా ఉన్నాము. 2021, మే నెల రెండవ వారంలో మాకు కరోనా వచ్చింది. నాకు, మా అమ్మకి కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయి. కానీ మా తమ్ముడికి, మరదలికి జ్వరం కాస్త ఎక్కువగానే ఉంది. మాకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పినప్పుడు, ‘బాబానే చూసుకుంటారు’ అనే ధైర్యంతో నేను కొంచెం కూడా భయపడలేదు. అయితే, పిల్లల గురించే కొంచెం బెంగగా అనిపించింది. ఎందుకంటే, వాళ్ళని ఎవరి దగ్గరా ఉంచలేము. వాళ్ళు ఉండరు. అలా అని వాళ్ళను మా దగ్గర ఉంచుకోలేము. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక బాబా మీద భారం వేసి పిల్లల్ని మా దగ్గరే ఉంచుకున్నాము. మాకు కోవిడ్ పాజిటివ్ కన్ఫర్మ్ అయిన మర్నాడు మా తమ్ముడు, మరదలు హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ వాళ్ళను సీటీ స్కానింగ్ చేయించుకోమన్నారు. మేమున్న ఊర్లో అయితే చాలా ఆలస్యమవుతుందని ప్రక్కనున్న సిటీలో స్కానింగ్ చేయించుకోవటానికి వెళ్ళారు వాళ్ళిద్దరూ. తమ్ముడికి చాలా నీరసంగా ఉన్నా అలాగే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. అయితే, అక్కడ కూడా చాలామంది ఉన్నారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా స్కానింగ్ చేస్తారో లేదో తెలీదు. సమయం గడిచేకొద్దీ ఇద్దరూ నీరసపడిపోతున్నారు. ఆరోజు గురువారం. నేను బాబాకు నమస్కరించుకుని, బాబాను వాళ్ళకు తోడుగా ఉండమని ప్రార్థించాను. సరిగ్గా అప్పుడే ఎందుకో మా కజిన్(నా సాయి) మా తమ్ముడికి కాల్ చేశాడు. వీళ్ళు విషయమంతా తనతో చెప్పటం, తను స్కానింగ్ చేసేవాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు వెంటనే స్కానింగ్ చేసి రిపోర్ట్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. ఆ రిపోర్టులు తీసుకుని ఉదయం చూసిన డాక్టరుకి చూపించారు. అతను ఆ రిపోర్టులు పరిశీలించి, మా మరదలికి పరవాలేదని చెప్పి, మా తమ్ముడిని మాత్రం ఉన్నపళంగా హాస్పిటల్లో జాయిన్ అవమన్నారు. కానీ, వాళ్ళ హాస్పిటల్లో బెడ్స్ లేనందువల్ల తనను వేరే హాస్పిటల్‌కి వెళ్లమన్నారు. ఈ విషయం తెలిసిన మా తమ్ముడి ఫ్రెండ్ (నా సాయి) వెంటనే వాళ్ళ ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి బెడ్ రెడీ చేయించాడు. నిజానికి ఆ హాస్పిటల్లో ఒక్క బెడ్ మాత్రమే ఉన్న కారణంగా వాళ్ళు ముందు బెడ్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. కానీ, ఈ అబ్బాయి వాళ్ళని ఒప్పించాడు. అయితే, ఇప్పుడు సమస్యేమిటంటే, తమ్ముడు ఆ ఊరు ఎలా వెళ్ళాలా అని. ఎందుకంటే, ఆ ఊరు మాకు 50 కి.మీ దూరంలో ఉంది. మా తమ్ముడు తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానన్నాడు. కానీ మాకు అది ఇష్టం లేదు. అసలే ఉదయంకంటే చాలా నీరసంగా ఉన్నాడు, ఒక్కడే అంత దూరం ఎలా వెళ్తాడు అని మా భయం. ఆ సమయంలో మళ్ళీ మా కజిన్ (నా సాయి) ఒక డ్రైవరును ఏర్పాటు చేశాడు. కరోనా పేషెంటును తీసుకెళ్లటం అంటే ఎవరూ ఒప్పుకోరు కదా. అయినా ఆ డ్రైవర్ ఒప్పుకుని మా తమ్ముడిని జాగ్రతగా ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. సరిగ్గా వాళ్ళు బయలుదేరేముందు తమ్ముడికి కావాల్సినవి సర్దుతూ, దిండు కవర్లో బాబా ఫోటోను, ఊదీని పెడుతూ, “నువ్వే తోడుగా ఉండి తమ్ముడిని క్షేమంగా ఇంటికి తీసుకురా బాబా” అని బాబాకు చెప్పుకున్నాను. నేను అలా అనుకుంటున్న సమయంలో మా తమ్ముడి ఫ్రెండ్ కాల్ చేశాడు. తమ్ముడి రిపోర్టులను వాట్సప్‌లో పంపితే అక్కడి డాక్టరుకి చూపించారట. ఆ డాక్టర్ రిపోర్టులు చూసి, “అంతా బాగానే ఉంది, హాస్పిటల్లో జాయిన్ అవాల్సిన అవసరం లేదు, మందులు వాడితే సరిపోతుంది” అన్నారట. బాబా ఎలా అనుగ్రహించారో చూశారా? కానీ మా తమ్ముడు మాత్రం, ‘నేను హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటాను’ అని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ మా తమ్ముడి ఫ్రెండ్స్ దగ్గరుండి అంతా చూసుకున్నారు. అలాగే మా ముగ్గురికీ మెడిసిన్స్ పంపారు. ఒక వారంలో మా తమ్ముడికి నయమైందని తనను ఇంటికి పంపించారు డాక్టర్లు. ఆ వారంరోజుల్లో మా తమ్ముడికి ఆక్సిజన్ పెట్టారు, ఇంజెక్షన్లు ఇచ్చారు. కేవలం బాబా అనుగ్రహంతో మా తమ్ముడు క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇక్కడ మేము కూడా మెడిసిన్స్ వాడుతూ ఉన్నాము. బాబా దయవల్ల జూన్ రెండవ తేదీన అందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ మాకు అవసరమైనవన్నీ మా ఇంకొక కజిన్(నా సాయి), మా తమ్ముడి దగ్గర పనిచేసే అబ్బాయి(నా సాయి) తెచ్చిపెట్టారు. ఆ 20 రోజులు ఎలా గడిపామో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. అన్ని రోజులూ ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రజపం చేస్తూనే ఉన్నాను. కేవలం అంటే కేవలం నా సాయి మాత్రమే మమ్మల్ని ఆ గండం నుంచి బయటికి తీసుకొచ్చారు. మాకు కోవిడ్ కన్ఫర్మ్ అయిన వెంటనే పిల్లలిద్దరికీ కొంచెం జ్వరం వచ్చింది. మాకు ఏం చేయాలో కూడా తెలియలేదు. బాబా ఉండగా ఎందుకు భయం? పిల్లలు త్వరగా కోలుకోవాలని బాబాను ప్రార్థస్తూ ఉన్నాను. బాబా దయవల్ల రెండు మూడు రోజుల్లో ఇద్దరికీ జ్వరం తగ్గిపోయింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే మా మహాపారాయణ చీఫ్స్ ముగ్గురూ నేను అడగకుండానే మా గురించి ‘సంకల్ప పారాయణ’ చేయించారు. పారాయణ చేసేవాళ్ళు చాలామంది మేము త్వరగా కోలుకోవాలని మా కోసం బాబాను ప్రార్థించారు. నా సాయి నాకు ఎంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారో అప్పుడు నాకు అర్థమైంది. ఇంతలా మమ్మల్ని అనుగ్రహించిన నా సాయికి థాంక్యూ అని చెప్తే సరిపోతుందా? తల్లికి థాంక్యూ అని చెప్తే చాలా? లేదు! ఆ తల్లికి తగిన బిడ్డలుగా ఉండటమే మనము చూపే కృతజ్ఞత. “మేము ఎప్పటికీ నీకు తగిన బిడ్డలుగా ఉండాలని మమ్మల్ని దీవించు సాయిమాతా”.


మూడవ ఆశీర్వాదం:


ఇది సరదాగా మీతో పంచుకోవాలని అనిపించింది. చిన్న విషయమే, కానీ అడిగిన వెంటనే సాయి ఎలా స్పందిస్తారో చెప్పే సంఘటన ఇది. ఒకరోజు మా ఇంటి కిటికీలోంచి బుల్లి పిట్ట ఒకటి వచ్చి ఇంట్లో ఉన్న అరటిపళ్ళు తింటోంది. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించి ఇంట్లోవాళ్ళని పిలిచి వాళ్ళకు ఆ దృశ్యాన్ని చూపించాను. అయితే, వాళ్ళు వచ్చిన అలికిడికి ఆ పిట్ట ఎగిరిపోయింది. అది చూసి, ‘నేను అలా సందడి చేయకుండా ఉంటే అది కడుపునిండా తినేది కదా, నా వల్లనే అది తినకుండా వెళ్ళిపోయింది’ అని నాకు చాలా బాధగా అనిపించింది. ఆ పిట్ట తిరిగి వస్తుందేమోనని ఎంతో ఎదురుచూశాను. కానీ ఎంతసేపటికీ అది రాలేదు. చీకటిపడుతోంది. చీకటిపడితే ఇక పిట్టలు రావు కదా. అలా బాధపడుతూనే ఎప్పటిలానే బాబాకు నమస్కరించుకుని, “బాబా, నా వల్ల అది పళ్ళు తినకుండా వెళ్ళిపోయింది. “ 'నేను అన్ని ప్రాణులలో ఉంటాను' అని నువ్వు అంటావు కదా. మరి వచ్చి తిను” అని చెప్పుకున్నాను. నేను బాబాను అడిగిన అయిదు నిమిషాలలోపు రెండు పిట్టలు వచ్చి కడుపునిండా అరటిపళ్ళు తిని వెళ్ళాయి. అప్పటినుంచి పక్షుల కోసం రోజూ ఒక అరటిపండు పెడుతున్నాం. కొన్ని పిట్టలు వచ్చి తింటున్నాయి. ‘పిలిస్తే పలుకుతా’ అని బాబా చెప్పిన మాట ఎంత సత్యం! “అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు సాయీ. ఎప్పటికీ నీ పాదసేవ నుంచి మమ్మల్ని దూరం చేయవద్దు”.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

శుభం భవతు!


కంటికి రెప్పలా కాపాడుతున్న బాబా


అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. మావారి పేరు సుధాకర్. మేము నెల్లూరులో ఉంటాము. మాకిద్దరు పిల్లలు. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. మా ఇంటికి దగ్గరలోనే "సద్గురు సాయి సత్సంగ నిలయం" ఉంది. అక్కడ ప్రతి ఆదివారం సాయంత్రం భజన, సత్సంగం జరుగుతూ ఉండేది. నేను అప్పుడప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళేదాన్ని. ఎందుకంటే, ఆదివారం కావటం వలన పిల్లలు, మావారు ఇంట్లోనే ఉండేవారు. దాంతో ఇంట్లో పనుల వలన తరచూ సత్సంగానికి వెళ్ళడం కుదిరేది కాదు. అందువల్ల సత్సంగానికి వెళ్ళాలని ఉన్నప్పటికీ తరచూ వెళ్ళలేకపోయేదాన్ని. ఒకసారి, “వీళ్లు సత్సంగాన్ని గురువారానికి మారిస్తే బాగుండు బాబా” అని మనసులో అనుకున్నాను. ఆ మరునాడే నాకు తెలిసింది, ఇకనుండి అక్కడ సత్సంగం గురువారం జరుగుతుందని. ఆ సమయంలో నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ విధంగా సాయిమార్గంలో నా ప్రయాణం మొదలైంది. ఆ తరువాత మా అమ్మాయి లక్ష్మికి వివాహం చేశాము, అది కూడా ముందుగా అనుకోకుండా. కేవలం బాబా దయవల్లనే మేము మా బిడ్డ పెళ్ళి చేశాము. మన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఆ సాయితండ్రికి తెలుసు. కాబట్టే చక్కని పెళ్లిసంబంధం వచ్చేలా చేసి, మా అమ్మాయికి పెళ్లి చేయాలనే ఆలోచనను మాలో కలిగించారు. బాబా అనుమతి తీసుకుని మా అమ్మాయికి పెళ్ళి చేశాము. ఆ తరువాత అనుకోని విధంగా మావారు ఒక యాక్సిడెంటులో చనిపోయారు. ఇది నేను ఊహించని, కోలుకోలేని పెద్ద ఎదురుదెబ్బ. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నన్ను, “నువ్వు ఎప్పుడూ ‘సాయిబాబా, సాయిబాబా’ అంటావు కదా, బాబా నీకేం మేలు చేశారు?” అని అందరూ అడిగేవారు. మా పాప కూడా కొన్నిరోజులు బాబాపై అలిగింది. కొంతమందైతే బాబాను వదిలేయమని సలహా కూడా ఇచ్చారు. కానీ సాయిమార్గంలో నడుస్తున్నాను కదా, సత్సంగ సాంగత్యం వలన ‘ప్రారబ్ధకర్మలు అనుభవిస్తేగానీ తొలగవ’ని అర్థమైంది. అన్నీ తట్టుకొని నిలబడగలిగే మనోధైర్యాన్ని బాబా నాకు ఇచ్చారు. మా ఇంటి పెద్దకొడుకు స్థానంలో అల్లుడినిచ్చారు. ఎటువంటి అరమరికలూ లేకుండా అండగా ఉండే వియ్యాలవారిని సాయిబాబా నాకు ఇచ్చారు. ప్రతి నిమిషం బాబా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు. దానికి నిదర్శనం మొన్నీమధ్య జరిగిన ఈ చిన్న సంఘటన. 


నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురించే ‘సాయిభక్తుల అనుభవమాలిక’ చదువుతూ ఉంటాను. ఒకరోజు "నిస్వార్థసేవకు అనుగ్రహం" అనే శీర్షికతో ఉన్న అనుభవాన్ని చదువుతున్నాను. అది బెంగళూరుకు చెందిన సాయిభక్తుని అనుభవం. అందులో, వారు కరోనాకు గురికావటం, వారి చిన్నపాపకు కూడా కరోనా పాజిటివ్ రావటం గురించి చదివి కొంచెం బాధగా అనిపించింది. చదవటం పూర్తయిన వెంటనే మా అమ్మాయి దగ్గరనుండి ఫోన్, ‘ఆద్యాపాపకు (మా మనవరాలికి) విపరీతంగా జ్వరం వచ్చింద’ని. ఇప్పటి పరిస్థితులు తెలిసినవే కదా. నా కాళ్లల్లో వణుకు, టెన్షన్, విపరీతమైన ఆందోళన. ‘ఇదేంటి? ఇప్పుడే ఆ చిన్నపాప గురించి చదివాను. ఇంతలోనే ఇలాంటి వార్త విన్నాను’ అని భయంవేసింది. అంతలోనే, ‘రాబోయే ప్రమాదాలను బాబా ముందుగా తెలియచేసి మరీ తొలగిస్తారు. ఇదంతా కూడా ఆయనపై మన భక్తివిశ్వాసాలను దృఢపరచటానికే’ అనుకుని, బాబా ఫోటో ముందు నిలిచి బాబాకు నమస్కరించుకుని, “బాబా! అంతా, అన్నీ నువ్వే మాకు. నా మనవరాలిని చల్లగా చూడు” అని మనస్ఫూర్తిగా బాబాను వేడుకున్నాను. “నాకు, నా చిత్రపటానికి భేదం లేదు” అని బాబా సచ్చరిత్రలో చెప్పారు కదా. బాబా నా ప్రార్థన విన్నారు. బాబా అనుగ్రహంతో మరునాటికల్లా నా మనవరాలికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తండ్రిని నమ్ముకుంటేచాలు, కొండంత దాన్ని గోరంతలా చేసి తీసేస్తారు. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈ విషయం చిన్నదే అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో అది నన్ను భయాందోళనలకు గురిచేసింది. నమ్మి సాయి దరి చేరితే, మన వెంటవుండి అంతా తానే నడిపిస్తారు


బి.సుజాత,

మైపాడ్ రోడ్,

కిసాన్ నగర్, 

నెల్లూరు.


7 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  3. Baba santosh life happy ga vundali thandri

    ReplyDelete
  4. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤🌸😀🌼🌺🌹

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo