1. సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది2. రెండే రెండు నిమిషాల్లో బాబా చూపిన అద్భుతం
సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది
సాయిబంధువులకు, ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా వందనాలు. నా పేరు లక్ష్మి. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదివి, వాటిని కొన్ని గ్రూపులకు ఫార్వర్డ్ చేయడంతో నా పని మొదలవుతుంది. మనం బాబాపై నమ్మకముంచి ఓర్పుతో ఉంటే, మనకు వచ్చే కష్టాలను బాబా తమ అనుగ్రహంతో సులభంగా తీసివేస్తారు. కొన్ని వారాల క్రిందట నా అనుభవాలను మీతో పంచుకున్న నేను ఇప్పుడు మరికొన్ని అనుభవాలతో మీ ముందుకు వచ్చాను.
మా అమ్మానాన్నలు విజయవాడలో ఉంటారు. ఒకరోజు మా నాన్నగారి పైపెదవి లోపలి భాగంలో ఒక చిన్న పొక్కు లేస్తే, నాన్న దాన్ని గిల్లారు. మరుసటిరోజుకి ఆ ప్రాంతంలో వాపు, నొప్పి మొదలయ్యాయి. 'అదే తగ్గిపోతుందిలే' అని నాన్న ఊరుకున్నారు. అయితే, ఆ రాత్రికి నొప్పి బాగా ఎక్కువయ్యేసరికి మరుసటిరోజు నాన్న డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకున్నారు. డాక్టర్ టాబ్లెట్స్ వ్రాసిచ్చి, బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. ఆరోజు నాన్నకి జ్వరం కూడా వచ్చింది, పైగా నొప్పి విపరీతంగా పెరిగిపోయింది. మరుసటిరోజు మళ్ళీ డాక్టరు వద్దకు వెళితే, నాన్నను షుగర్ టెస్ట్ చేయించుకోమన్నారు. సరేనని నాన్న షుగర్ టెస్ట్ చేయించుకొంటే, రిపోర్టులో షుగర్ 450 ఉన్నట్లు వచ్చింది. దాంతో ఆ డాక్టర్, "నా వల్ల కాదు, మీరు డయాబెటిక్ డాక్టరుకి చూపించుకోండి" అని చెప్పేశారు. అమ్మానాన్నలు చాలా కంగారుపడ్డారు. నిజానికి అప్పటివరకు నాన్నకి షుగర్ లేదు. అసలు మా తాతయ్యవాళ్ళ కుటుంబంలో ఎవరికీ షుగర్ వ్యాధి లేదు. జూన్ నెల చివరిలో విజయవాడలో కరోనా చాలా తీవ్రంగా ఉంది. హాస్పిటల్‌కి వెళ్ళాలంటేనే భయపడే రోజులు. అయినా తప్పనిసరై నాన్న ఒక డయాబెటిక్ నర్సింగ్ హోమ్‌కి వెళ్లి చూపించుకుంటే, వాళ్ళు నాన్నకు టెస్ట్ చేసి, "షుగర్ 650 ఉంది. మీరు వెంటనే హాస్పిటల్లో చేరి నాలుగైదు రోజులు హాస్పిటల్లో ఉండాలి" అని అన్నారు. హాస్పిటల్‌కి వెళ్లడానికి భయపడే రోజుల్లో, నాలుగైదు రోజులు అక్కడే ఉండాలి అనేసరికి అందరమూ చాలా కంగారుపడ్డాం. అయినా తప్పదు, నాన్న హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి. సాయిభక్తులకు కష్టాల్లో ముందు గుర్తుకు వచ్చేది బాబానే. వారిని గట్టిగా పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. "కష్టసమయంలో నాన్న వద్దనే ఉండి తనను ఆదుకోండి బాబా. నాన్నకి ఆయాసం కూడా ఉంది. ఇతరత్రా ఏ సమస్యలూ రాకుండా షుగర్ కంట్రోల్ అయ్యేలా, పుండు నయమయ్యేలా చేసి నాన్నని క్షేమంగా ఇంటికి తీసుకుని రమ్మ"ని బాబాని మేము వేడుకోని క్షణం లేదు. అమ్మని ఇంట్లోనే ఉండమని, నాన్న ఒక్కరే హాస్పిటల్లో ఉండేవారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మేము హైదరాబాదు నుండి వెళ్లలేకపోయినా, మా పిన్నిగారి అబ్బాయి(తమ్ముడు) నాన్నకోసం ఆహారం తీసుకుని వెళ్లడం, డాక్టరుతో మాట్లాడటం చేసేవాడు. ఐదురోజుల తర్వాత నాన్న క్షేమంగా ఇంటికి వచ్చారు. షుగర్ కంట్రోల్లోకి వచ్చి ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బాబా ఎంతో దయతో మమ్మల్ని ఆదుకున్నారు. "బాబా! మీకు మాటిచ్చిన ప్రకారం వెంటనే మా అనుభవాన్ని పంచుకోలేకపోయాను, అందుకు నన్ను క్షమించండి. దయగల తండ్రీ! అన్నివిధాలా మా మనసులకు సాంత్వన కలిగించావు. సాయితండ్రీ! మీకు శతకోటి ప్రణామాలు. మాకు ఎల్లవేళలా రక్షగా ఉండండి బాబా".
మరో అనుభవం: మా బాబుకి తరచూ తుమ్ములు వస్తుంటాయి. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఆ తుమ్ములు మరీ ఎక్కువగా ఉంటాయి. రోజంతా తను తుమ్ములతో చాలా ఇబ్బందిపడుతుంటాడు. రెండు, మూడు తుమ్ములొస్తేనే తట్టుకోలేము, అలాంటిది రోజంతా తుమ్ములు వస్తుంటే ఎంత బాధగా ఉంటుందో కదా! కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక బాబుకి కాస్త తుమ్ములు తగ్గాయి, కానీ ఈమధ్య మరలా మొదలయ్యాయి. ఆగస్టు రెండవ వారం ప్రారంభంలో తను ప్రతిరోజూ తుమ్ములతో చాలా ఇబ్బందిపడుతూ ఉండేవాడు. వరుసగా మూడు రోజులు టాబ్లెట్లు వేసుకున్నా తుమ్ములు తగ్గలేదు. తను అలా ఇబ్బందిపడుతుంటే నా ప్రాణం పోతున్నట్లుండేది. నేను తన బాధను చూడలేక, "బాబా! బాబుకి ఈ తుమ్ముల బాధనుండి విముక్తి కలిగించండి. తనకి పూర్తిగా తగ్గేలా చేయండి బాబా. నేను చూడలేకపోతున్నాను. మీరు ప్రసాదించిన బిడ్డ ఇలా బాధపడటం భావ్యమా? రేపటినుండి తనకి తుమ్ములు, దగ్గు తగ్గిపోయేలా చేయండి సాయీ. మా ఈ దివ్యానుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని, నా ఈ కోరికను బాబా మన్నిస్తారని శ్రద్ధ, సబూరితో ఉండసాగాను. మరుసటిరోజు బాబు నాలుగైదుసార్లు తుమ్మినట్లున్నాడు. ఆ తర్వాత నుండి చాలావరకు తుమ్ములు తగ్గాయి. ఈరోజు బాబు బాగున్నాడంటే అంతా సాయితండ్రి దయ. "సాయితండ్రీ! మీ బిడ్డ పడుతున్న మానసిక ఆందోళనను, శారీరక బాధలను పూర్తిగా నయంచేయండి. తనకి విద్యాలాభాన్ని అనుగ్రహించండి. మీరే మాకు ఉన్న ఏకైక ఆశాజ్యోతి. కరుణించి కాపాడండి బాబా".
ఇంకొక అనుభవం: మాకు విజయవాడలో కొన్ని షాపులున్నాయి. వాటిలో ఒక షాపతను మా తోడికోడలు వాళ్ళ నాన్నగారి ప్రోద్బలంతో మాకు అద్దె ఇవ్వక, షాప్ ఖాళీ చేయక చాలా నెలల నుండి బాగా ఇబ్బందిపెడుతున్నాడు. తను షాపు ఖాళీ చేయాలంటే మేమే ఎదురు డబ్బులివ్వాలని (తను పెట్టిన ఇంటీరియర్ వర్క్ కొరకు) నలుగురి వద్దా చెప్పడం ప్రారంభించాడు. ఆ విషయం మావారికి చాలా బాధ కలిగించేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్లి దగ్గరుండి సమస్యని పరిష్కరించుకునే అవకాశం చాలా తక్కువ. అక్కడనుండి ఫోన్ వచ్చినప్పుడు మావారు చాలా బాధపడుతుండేవారు. ఈ సమస్య వలన ఆయనకి నిద్ర ఉండేదికాదు. ఆగష్టు రెండవ వారం చివరిలో మావారి బాధ చూడలేక నేను, "సాయితాతా! ఎన్నిరోజులు మేము ఇలా సమస్యలతో బాధపడుతూ ఉంటాము? ఆ చెప్పుల షాపతనిని ఎటువంటి సమస్యా లేకుండా ఖాళీ చేయించండి తండ్రీ. ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా ఎంత అద్భుతం చేశారో చూడండి! ఆగస్టు 16న మా నాన్నగారు తన బైక్ రిపేర్ కోసం షాపులో ఇచ్చి బస్సు కోసం వేచి చూస్తూ, ఆ బస్టాప్ వెనుక ఉన్న ఒక చెప్పులషాపులోని వ్యక్తితో మాట్లాడారు. మాటల మధ్యలో నాన్న అతనితో, "మా షాపులో ఉన్న చెప్పుల షాపతను అటు అద్దె ఇవ్వకుండా, ఇటు షాపు ఖాళీ చేసి తాళాలు అప్పజెప్పకుండా ఇబ్బందిపెడుతున్నాడ"ని చెప్పారు. అప్పుడు ఆ షాపు గుమస్తా మా నాన్నతో, “మీ షాపులో ఉన్న వ్యక్తి మాకు బంధువు అవుతారు. నేను అతనితో మాట్లాడతాను” అని చెప్పాడు. వెంటనే అతను తన బంధువులతో మాట్లాడి, మా నాన్నగారితో, "అతను రెండు, మూడు రోజుల్లో మీతో మాట్లాడి తాళం ఇస్తానని అన్నాడు" అని చెప్పాడు. అన్నట్లుగానే ఆ చెప్పుల షాపతను నాలుగు రోజులలో మా షాపు తాళంచెవి మా నాన్నకి అందచేశాడు. ‘మాకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకపోయినా ఫరవాలేదు, తాళాలు ఇచ్చి మా షాపు మాకు అందజేస్తే చాలు’ అని మేము అనుకున్నట్లే అతను చేశాడు. బాబా దయవల్లనే ఈ సమస్య పరిష్కారమైంది. సాయితండ్రిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. "సాయీ! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఆ షాపుతో పాటు మరి రెండు షాపుల్లోకి మంచివాళ్ళు అద్దెకు వచ్చేలా ఆశీర్వదించండి. మాకున్న ఆరోగ్య సమస్యలతో సహా అన్ని సమస్యలనూ పరిష్కరించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
రెండే రెండు నిమిషాల్లో బాబా చూపిన అద్భుతం
ఓం శ్రీసాయినాథాయ నమః. ఈ బ్లాగ్ నిర్వాహకులకు మరియు సాయిబాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. ఇది ఈ బ్లాగులో నేను పంచుకుంటున్న ఐదవ అనుభవం. 2021 ఆగస్టు 25, ఉదయం 11 గంటలకి నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా (సుమారు నెలరోజులు అనుకుంటా) నా ఆధార్ కార్డు కనిపించట్లేదు. చిరునామా మార్పు చేసుకున్న తర్వాత వచ్చిన కొత్త కార్డు అది. రెండుసార్లు ఇల్లంతా వెతికినా అది దొరక్కపోయేసరికి పాత కార్డు ఉంది కదా అని దాని గురించి పెద్దగా ఆందోళన చెందక వదిలేశాను. అయితే, ఎందుకో కొన్నిరోజుల నుండి 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామానికి సంబంధించిన అనుభవాలు నేను చదువుతూ ఉండేసరికి నేను కూడా నా ఆధార్ కార్డు కోసం ఒకసారి ప్రయత్నిద్దామని అనుకున్నాను. తరువాత 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని మూడుసార్లు అనుకుని ఆధార్ కార్డు వెతకడం మొదలుపెట్టాను. అద్భుతం! రెండే రెండు నిమిషాల్లో నా ఆధార్ కార్డు దొరికింది. అసలు ఎంత ఆనందం, ఆశ్చర్యం కలిగాయో నేను మాటల్లో చెప్పలేను. వెంటనే నా భర్తతో ఈ విషయం పంచుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. మీరు మాకోసం ఉన్నారు. మీపై భక్తి భావనలు పెంపొందేలా, మేము ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించేలా మమ్మల్ని దీవించండి బాబా. నాకు ఒక ఉద్యోగం కావాలి. అలాగే మీ సేవ చేసుకోవాలని, మీ దివ్యపూజలు, నవగురువార వ్రతాలు, ఇంకా మందిరానికి వెళ్లి ప్రసాద వితరణ, 108 ప్రదక్షిణలు మొదలనవన్నీ చేసుకుని మనసుని శుభ్రపరుచుకోవాలని ఉంది. ఇవన్నీ జరిగేట్టు ఆశీర్వదించండి సాయిబాబా".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJai sairam
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤😊🌸🥰🌼😀🌺🌹
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
863 days
ReplyDeleteSairam
🕉Sri Sai Ram 🕉🌺🌼🙏🙏🙏🙏🙏🌺🌼
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri
ReplyDeleteBaba Santosh, karthik, nikhil sai arogya lu bagundali thandri
ReplyDelete