సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మహల్సాపతి - రెండవ భాగం...



బాబా తమ భక్తుల పారమార్థిక పురోగతి విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా జాగ్రత్త తీసుకొనేవారు. ఆ ప్రయత్నంలో ఆయన తమ భక్తులను కఠినంగా పరీక్షించేవారు. బాబా తాము మహాసమాధి చెందడానికి 32 సంవత్సరాల ముందు మహల్సాపతికి చాలా విచిత్రమైన, కఠినమైన పరీక్షను పెట్టారు. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడేవారు. 1886వ సంవత్సరం మార్గశిరమాసంలో కూడా ఒకసారి బాబా తీవ్రమైన ఉబ్బసంతో బాధపడసాగారు. మహల్సాపతి బాబా చెంతనే ఉంటూ అహర్నిశలు బాబాను సేవించుకుంటున్నాడు. మార్గశిర శుద్ధపౌర్ణమినాటి రాత్రి సుమారు పది గంటల సమయంలో బాబా అకస్మాత్తుగా మహల్సపతితో, "భగత్! నేను అల్లా వద్దకు వెళుతున్నాను. మూడు రోజుల్లో తిరిగి వస్తాను. అంతవరకు ఈ దేహాన్ని జాగ్రత్తగా చూసుకో. మూడవరోజు ముగిసే సమయానికి ఒకవేళ నేను తిరిగి రాకపోతే, (మసీదు వద్దనున్న ఆరుబయలు ప్రదేశాన్ని చూపిస్తూ) అక్కడొక సమాధి త్రవ్వి, అందులో ఈ దేహాన్ని ఉంచి, గుర్తుగా రెండు జెండాలు నాటు" అన్నారు. మహల్సాపతికి బాబా మాటలు అర్థమయ్యేలోగానే బాబా దేహం అచేతనంగా మారి మహల్సాపతి ఒడిలో ఒరిగిపోయింది. వారి శ్వాస, నాడి ఆగిపోయాయి. ఈ హఠాత్పరిణామానికి ఏం చేయాలో మహల్సాపతికి తోచలేదు. అయినప్పటికీ బాబా ఆదేశాన్ని స్మరించి వారి దేహాన్ని సంరక్షిస్తూ అక్కడే కూర్చున్నాడు. అప్పటికింకా బాబా మహిమ అంత ప్రఖ్యాతం కాలేదు. బాబా మహాత్మ్యాన్ని గుర్తించిన కొందరు భక్తులకు కూడా బాబా మరణించిన తరువాత మేల్కొనగలంతటి మహిమాన్వితుడనే పూర్తి విశ్వాసం లేదు. అందువలన అందరూ బాబాపై ఆశను వదులుకున్నారు. గ్రామపాటిల్ (కులకర్ణి) పంచనామా జరిపించి, అంత్యక్రియల కొరకు ఏర్పాట్లు ప్రారంభించాడు. కానీ మహల్సాపతి మాత్రం ఆశను విడవలేదు. బాబా శరీరాన్ని తన ఒడిలో నుండి ఒక్క అంగుళం కూడా కదలనివ్వలేదు. నిద్రాహారాలు మాని పగలనక, రేయనక కంటికిరెప్పలా బాబా దేహాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మూడురోజులూ అలాగే కూర్చున్నాడు. మూడురోజులు గడిచాక తెల్లవారుఝామున మూడుగంటలకు బాబా శరీరంలో జీవం వచ్చినట్లుగా అనిపించింది. బాబా శ్వాస తీసుకోనారంభించారు. ఆపై నెమ్మదిగా కనులు తెరిచి, కాళ్ళుచేతులు సాగదీస్తూ లేచి కూర్చున్నారు. అటుపై బాబా 32 సంవత్సరాలు తమ అవతారకార్యాన్ని కొనసాగించారు. బాబా దేహాన్ని ఖననం చేయాలని పట్టుబట్టిన అధికారులను సైతం ఎదిరించి మూడురోజులపాటు బాబా దేహాన్ని సంరక్షించి, బాబాకే కాక, యావత్ సాయిభక్తులకు, సామాన్య ప్రజానీకానికి మహల్సాపతి చేసిన సేవ అరుదైనది. అంతటి కార్యాన్ని నెరవేర్చడంలో అతను ఏ మాత్రం వైఫల్యం చెందినా, బాబా దేహాన్ని ఖననం చేసి ఉన్నా చరిత్ర గమనం మరోలా ఉండేదేమో! కానీ మహల్సాపతి ఆ కార్యాన్ని ఎంతో నిబద్ధతతో సమర్థవంతంగా పూర్తిచేశాడు. అది బాబాపట్ల మహల్సాపతికి ఉన్న నిజమైన ప్రేమకు, భక్తికి, విశ్వాసానికి నిదర్శనం. ఇంతటి అనుబంధానికి గుర్తింపుగా బాబా అతనిని 'భగత్' ('భక్తా') అని పిలిచేవారు. సాయిభక్తుడు బి.వి.దేవ్ ‘మహల్సాపతి స్మృతులు’ అనే పుస్తకం యొక్క ముందుమాటలో మహల్సాపతిని 'భక్తమాణిక్యం' అనీ, 'మహాత్మా' అనీ సంబోధించారు. అవి అతనికి సరిగా సరిపోతాయి.

మహల్సాపతికి బాబాపట్ల ఉన్న ప్రేమకు అద్దంపట్టే మరో సంఘటన గురించి తెలుసుకుందాం. బాబా ఒక్కొక్కప్పుడు తనను గ్రామంలోని వర్తకులు, నూనె వ్యాపారులు ఎంతగానో బాధించారంటూ, తాము శిరిడీ విడిచి వెళ్ళిపోతామని కోపంగా బయల్దేరేవారు. ఒకసారి ఆయన అలానే కోపగించుకొని ఎవరికీ చెప్పకుండా శిరిడీ విడిచి వెళ్ళిపోయారు. బాబా శిరిడీలో కన్పించడంలేదని భక్తులందరూ ఆందోళనగా చెప్పుకోసాగారు. ఆ వార్త ఖండోబా ఆలయంలో పూజ చేసుకుంటున్న మహల్పాపతికి చేరింది. అతడు వెంటనే వచ్చి గ్రామంలో విచారించగా, “బాబా రహతాకు గానీ, నీమ్‌గాఁవ్‌కు గానీ వెళ్ళలేదనీ, ఆయన గ్రామం విడిచి వెళ్ళే ముందు తీవ్రమైన కోపావేశంలో వున్నార”నీ కొందరు గ్రామస్థులు చెప్పారు. ఇంతలో, “బాబా లెండీ నుండి నీమ్‌గాఁవ్‌ వైపుకు బయల్దేరడం మాత్రం చూచామ”ని ఎవరో చెప్పారు. వెంటనే మహల్సాపతికి బాబా శిరిడీలో మొదటిసారి ప్రకటమైన కొద్దికాలానికి ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం గుర్తొచ్చి, ఈసారి బాబా మళ్ళీ తిరిగి శిరిడీ వస్తారో లేదోనని భయమేసింది. అంతే! మహల్సాపతికి కాలు, మనసు నిలువలేదు. బాబా లేని ఆ గ్రామంలో జీవించడం అతడికి అసాధ్యమనిపించింది. వెంటనే మహల్సాపతి ఆ రోడ్డు మీద ఉత్తరంగా కొద్దిదూరం వెళ్ళి, అక్కడ ఎదురైనవారిని బాబా గురించి వాకబు చేశాడు. తరువాత నీమ్‌గాఁవ్‌ రోడ్డు మీద నుంచి తూర్పుగా రూయీ గ్రామం వైపు నడిచి అక్కడొక పొలంలో పనిచేసుకునేవారిని విచారించగా, “బాబా రూయీ గ్రామం మీదుగా వెళ్ళార”ని చెప్పారు. అంతేకాదు, వారాయనను పలకరించినపుడు ఆయన పట్టరాని కోపంతో శిరిడీ గ్రామస్థులను తిట్టిపోశారనీ, ‘తాము తిరిగి ఆ గ్రామానికి రాబోన’ని అన్నారనీ చెప్పారు. ఆ విషయం వినగానే మహల్సాపతిలో ఆశాజ్యోతి పొడజూపింది. అతడు తిరిగి వెంటనే ఇల్లు చేరి, ‘తాను రూయీ గ్రామంలో బాబా చెంతకు వెళ్తున్నానని, ఆయన తిరిగి రాకుంటే తాను కూడా రాన’ని తన భార్యకు చెప్పి వెంటనే రూయీ బయల్దేరాడు. నాటివరకూ శిరిడీని వరించిన మహాభాగ్యం ఇప్పుడు విడిచి పెట్టిందేమోనని భయపడ్డాడు మహల్సాపతి. అయితేనేమి, తాను మాత్రం ఆ మహాత్ముని సేవను, సాన్నిధ్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోదల్చుకోలేదు.

మహల్సాపతి రూయీ గ్రామం చేరేసరికి ఆ గ్రామ ప్రవేశంలోనే వున్న మారుతి ఆలయం సమీపంలోని ఒక చెట్టుక్రింద బాబా కూర్చొని కనిపించారు. మహల్సాపతిని చూస్తూనే బాబా ఉగ్రులై, ‘తమ చెంతకు రావద్దని, తిరిగి పొమ్మ’ని కేకలేశారు. మహల్సాపతి తన నడక వేగం తగ్గించి ఆయనను సమీపించ యత్నిస్తుంటే, బాబా అతనిపై రాళ్ళు రువ్వసాగారు. చివరకు మహల్సాపతి బాబాతో, "బాబా! ఎన్నటికైనా నేను మీ భగత్‌నే. మీరు నన్ను చంపినా సరే, నేను మీ సన్నిధిని విడిచిపెట్టను. శిరిడీలో మిమ్మల్ని తిట్టినవారిని నేను దండిస్తాను. మీకు శిరిడీ రాకపోవడం ఇష్టంలేకపోతే నేను మీ దగ్గరే ఉండిపోతాను. నేనూ ఇక్కడే వుంటాను. మిమ్మల్ని విడిచిపోను. ఆ విషయం ఇంట్లోవారికి కూడా చెప్పి వచ్చాను!" అన్నాడు. మహల్సాపతి పట్టుదల చూచి బాబా రాళ్ళు రువ్వడం మానేశారుగానీ, అతనిని తన పాదాలనంటనివ్వలేదు. “నేనిక ఆ గ్రామానికి రాను. మేము ఫకీర్లం, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీవు సంసారివి. నీవు ఇల్లు విడిచి మావెంట రాగూడదు. నీవు తిరిగి ఇంటికి వెళ్ళు” అని నచ్చజెప్పారు. బాబా కంఠంలో ధ్వనించిన నిశ్చయం చూసి మహల్సాపతి నివ్వెరబోయాడు. చివరికి, బాబా తనతో పాటు శిరిడీకి రాకపోతే తాను అన్నము, నీళ్ళు ముట్టుకోనని ఆయన చెంతనే కూర్చున్నాడు. బాబా తిరిగి మహల్సాపతిని తిట్టిపోశారు, నచ్చచెప్పారు. కనీసం రూయీ గ్రామంలోకి వెళ్ళయినా భోజనం చేయమని చెప్పారు. వీరిద్దరి మధ్య సాయంత్రం వరకూ ఇదే కొనసాగింది. చివరికి భక్తుడి మాటే నెగ్గింది. బాబా, మహల్సాపతి ఇద్దరూ తిరిగి శిరిడీ చేరారు. మనందరికీ బాబా తిరిగి లభించారు. మనందరికీ శిరిడీ దర్శనం ప్రాప్తిస్తుందంటే అది మహల్సాపతి చలువే!

ఒకసారి శ్రీఅక్కల్కోటస్వామి శిష్యులైన శ్రీఆనందనాథ్ మహరాజ్ ఏవలా దగ్గరనున్న సవర్‌గాఁవ్‌లోని మఠంలో కొద్దిరోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. ఆ సమయంలో శిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, నందూరామ్ మార్వాడీ మొదలైనవారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమవుతుంటే, అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వారి వద్దకు వచ్చి, "నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరూ?" అని చిన్నపిల్లవానిలా మారం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. శిరిడీ చేరిన శ్రీఆనందనాథస్వామి శ్రీసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన, శ్రీసాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారుగానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ తరువాత ఆయన బాబాను ఉద్దేశించి, "ఈయన ఎక్కడనుండి వచ్చారు? ఈయన మానవులలో చాలా ఉన్నతశ్రేణికి చెందిన రత్నం. ఇప్పుడీ చెత్తకుప్ప మీద ఉన్నా, ఈయన రాయి కాదు, నిజమైన రత్నం. ఇది నిజంగా శిరిడీవాసుల భాగ్యం. నా మాటలను గుర్తుంచుకోండి, ముందు ముందు మీకే అర్థమవుతుంది" అని అన్నారు.

మరోసారి, పుంతంబా సమీపంలో నివసించే శ్రీగంగగిర్ మహరాజ్ శిరిడీ వచ్చారు. ఆయన గొప్ప మహాత్ముడుగా ప్రఖ్యాతుడు. ఆయన గృహస్థుగా ఉంటూనే నిస్వార్థంగా వివిధ ప్రదేశాల్లో నామసప్తాహాలు, సత్సంగాలు నిర్వహిస్తుండేవారు. కాపూస్‌వాడ్గాం వద్ద నామసప్తాహం పూర్తిచేసి కొందరు శిరిడీ గ్రామస్థుల ఆహ్వానంపై శిరిడీ వచ్చి 7 రోజులపాటు భగవన్నామ సప్తాహం, సత్సంగం, హోమం, అన్నదానం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. దైవచింతన గల మహల్సాపతి తదితరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సప్తాహం పూర్తయిన తరువాత అక్కడున్న వారందరికీ భోజన ప్రసాద వినియోగం జరుగుతోంది. ఆ సమయంలో శ్రీసాయిబాబా తమ రెండు చేతులతోనూ మట్టికుండలు పట్టుకొని మసీదువైపు వెళుతున్నారు. అక్కడే ఉన్న గంగగిర్ మహరాజ్ బాబాను చూచి, “ఈ మహరాజ్ ఎవరు?” అని ప్రక్కనే ఉన్న మహల్సాపతిని అడిగాడు. “ఆయన సాయి మహరాజ్!” అని సమాధానమిచ్చాడు మహల్సాపతి. “ఈయన గొప్ప రత్నం. ఈ అమూల్య రత్నాన్ని పొందిన శిరిడీ ప్రజలు ధన్యులు. ఈరోజు ఈయన భుజాన నీరు మోస్తున్నారు. కానీ ఈయన సామాన్యులు కాదు. మీకింకా ఆయన సంగతి తెలియలేదు. ఆయన్ను జాగ్రత్తగా సేవించుకోండి!” అంటూ బిరబిరా బాబా వెళ్తున్న వైపు నడిచారు శ్రీగంగగిర్. మహల్సాపతి తదితరులు ఆయన్ను అనుసరించారు. త్వరగా మసీదు చేరాలనే ఉద్దేశంతో హడావుడిగా అడ్డత్రోవన మసీదు చేరారు గంగగిర్ మహరాజ్. అప్పటికే మసీదు చేరిన బాబా తమ చేతిలో ఉన్న కుండలను క్రిందపెట్టి, ప్రక్కనే వున్న ఇటుకరాయిని చేతిలోకి తీసుకొని, మసీదు మెట్లు ఎక్కుతున్న గంగగిర్ మహరాజ్‌ను ఉద్దేశించి, “ఇలా కాదు, అట్లా వెళ్ళి ఇట్లా రా!" అని మసీదు ముందుండే బాటవైపు చూపారు. (బాబా లెండీకిగానీ మరెక్కడికిగానీ వెళుతున్నప్పుడు దూరమయినాసరే ప్రధాన రహదారి గుండానే వెళ్ళేవారు! దగ్గరదారి అని అడ్డత్రోవన ఎప్పుడూ నడిచేవారు కాదు.) వెంటనే శ్రీగంగగిర్ వెనక్కి వెళ్ళి, చుట్టూ తిరిగి మామూలు దారిలో మసీదు చేరారు. శ్రీగంగగిర్ దగ్గరకు రాగానే బాబా, “ఆవో, చాంగ్‌దేవ్‌ మహరాజ్!” అంటూ ఆయనను మసీదులోకి ఆహ్వానించారు. ఆ తరువాత బాబా, శ్రీగంగగిర్ మహరాజ్, మహల్సాపతి చిలిం త్రాగుతూ చాలాసేపు మాట్లాడుకున్నారు. (చాంగ్‌దేవ్‌ మహరాజ్ 13వ శతాబ్దంలో అత్యంత ప్రఖ్యాతుడైన గొప్ప హఠయోగి. శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్ దర్శనంతో ఆయనకున్న యోగశక్తుల వ్యామోహం, జ్ఞానగర్వం పటాపంచలవుతుంది. శ్రీజ్ఞానదేవులు ఆ యోగికి చేసిన బోధ 'చాంగ్‌దేవ్‌ ప్రశస్తి' పేరున ప్రఖ్యాతం. బాబా శ్రీగంగగిర్ మహరాజ్‌ను చాంగ్‌దేవ్‌గా ఎందుకు సంబోధించారో ఆ సద్గురుమూర్తికే ఎఱుక!)

ఇలా మహాత్ములు సైతం సాయిబాబాను కీర్తిస్తుండటంతో బాబా సామాన్య సత్పురుషులుకారని గుర్తించిన మహల్సాపతి, అతని మిత్రులు బాబానే తమకు తగిన గురువని భావించారు. వారిలో మహల్సాపతి బాబాను దైవంగా పూజించనారంభించాడు. ఒకరోజు మహల్సాపతి చందనం, పువ్వులు, పాలు తీసుకొని మసీదుకు వెళ్లి, బాబా పాదాలకు పువ్వులు సమర్పించి, వారి పాదాలకు, కంఠానికి చందనమద్ది, బాబాకు పాలను నివేదించాడు. ఆ రోజులలో బాబా తమను పూజించేందుకు ఎవరినీ అనుమతించేవారు కాదు. కానీ మహల్సాపతిలోని తీవ్రమైన భక్తి, ప్రేమలకు కరిగిపోయి అతని పూజకు బాబా అభ్యంతరం చెప్పలేదు. ఇక అప్పటినుండి ప్రతిరోజూ ఆవిధంగానే బాబాను ఆరాధించనారభించాడతను. తరువాత ఒకసారి మహల్సాపతికి బాబా స్వప్నదర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో బాబా నుదుటికి, రెండు చేతులకి గంధం పూయబడి ఉండటం గమనించాడు మహల్సాపతి. మరుసటిరోజు అతను మసీదుకొచ్చి బాబా నుదుటికి, చేతులకి గంధమద్ది పూజించాడు. అందుకు బాబా అడ్డు చెప్పలేదు. అప్పటినుండి మహల్సాపతి ప్రతినిత్యమూ ఆవిధంగానే బాబాను పూజిస్తూ ఉండేవాడు. అది ముస్లిం మతస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మసీదులో హిందూ పద్ధతిననుసరించి బాబాను పూజించడం వాళ్లకు అపచారమనిపించింది. ఈ విషయంపై వాళ్ళు బాబాకు ఫిర్యాదు చేసినా బాబా ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో వారంతా మహల్సాపతిని దండించదలచి సంగమనేరు నుండి ఖాజీని(ముస్లిం మతపెద్ద) తీసుకొచ్చారు. అది తెలిసి మహల్సాపతి భయపడి తన అలవాటు ప్రకారం ఖండోబా, శని, మారుతి మరియు గణపతిలను పూజించి, ఆపై బాబాను పూజించకుండా వెళ్లిపోదలచి మసీదు ముందునుండి వెళ్ళిపోతున్నాడు. ఇంతలో బాబా అతనిని ఆపి, "అరే భగత్, నన్ను పూజించకుండా బయటనుండే వెళ్ళిపోతున్నావెందుకు?" అని అడిగారు. అందుకతను, "బాబా! నేను మిమ్మల్ని పూజించటం ఖాజీసాహెబ్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అందుకే మిమ్మల్ని పూజించకుండానే వెళ్ళిపోతున్నాను" అని అన్నాడు. అప్పుడు బాబా తమ నుదుటిని, కంఠాన్ని, చేతులను చూపిస్తూ కోపావేశంతో, "ఇక్కడ, ఇక్కడ చందనమద్ది పూజించుకో! నిన్నెవరడ్డగిస్తారో చూస్తాను" అని అన్నారు. బాబా మాటలతో మహల్సాపతికి ధైర్యం చేకూరి మసీదు లోపలికి వెళ్లి ఎప్పటిలాగే బాబాను పూజించాడు. అదంతా చూస్తున్న ఆ ఖాజీ అక్కడినుండి వెళ్ళిపోయాడు. అప్పటినుండి మహల్సాపతి బాబాను యధేచ్చగా పూజించుకోసాగాడు. మహల్సాపతి తమను పూజించడానికి బాబా అనుమతించినప్పటికీ, నానాసాహెబ్ డేంగ్లే వంటి స్థానికులు ఎంతగా ప్రాధేయపడినా వాళ్ళు తమను పూజించడానికి మాత్రం బాబా అనుమతించేవారు కాదు. బాబా వాళ్లతో, "మసీదులో ఉన్న స్తంభాన్ని పూజించుకో”మని మాత్రమే అనేవారు. అయితే, వాళ్ళు అలా చేయలేదు. తరువాత బాబాకు స్థిరమైన అనుచరుడైన దగడూభావ్ మధ్యవర్తిత్వంతో నానాసాహెబ్ డేంగ్లే బాబాను పూజించేందుకు అనుమతి పొందాడు. ఆ తరువాత బాబాను పూజించుకునే భాగ్యం నూల్కర్‌కు, మేఘకు, బాపూసాహెబ్ జోగ్‌కు దక్కింది. అంతకుమునుపు ఒకసారి నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకైన నాలుగు సంవత్సరాల బాపును తమకి చందనమద్దమని అడిగి పెట్టించుకున్నారు బాబా. అలా క్రమంగా బాబాను పూజించేందుకు అందరికీ అనుమతి లభించి వారిని పూజించడం సాంప్రదాయమైంది. ఏదేమైనా సాయిపూజకు అంకురార్పణ చేసిన అదృష్టం మాత్రం మహల్సాపతికే దక్కింది. బాబా మహాసమాధి చెందేవరకు ప్రతినిత్యమూ ఎంతో శ్రద్ధాభక్తులతో బాబాను పూజించేవాడు మహల్సాపతి. ప్రతిరోజూ అతని ఇంటినుండి బాబాకు నైవేద్యం వచ్చేది. అలాగే బాబా ఆదేశం మేరకు సాఠేసాహెబ్, బాలాసాహెబ్ భాటేల ఇళ్ళవద్దనుండి కూడా నైవేద్యాన్ని మసీదుకు తీసుకొని వచ్చేవాడు మహల్సాపతి.

సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ,
శ్రీసాయిబాబా బై శ్రీసాయిశరణానంద,
లైఫ్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి,
సాయిలీల మ్యాగజైన్ జూలై-ఆగస్టు 2005 సంచిక.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


3 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram baba pleaseeee save me thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo