సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 889వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి చిన్న కష్టాన్నీ తీరుస్తున్న బాబా
2. చెప్పుకుంటే అన్నీ సరిచేస్తారు బాబా
3. పెన్ డ్రైవ్ దొరికేలా అనుగ్రహించిన బాబా

ప్రతి చిన్న కష్టాన్నీ తీరుస్తున్న బాబా


నా పేరు అంజలి. నేనిప్పుడు బాబా ప్రేమను మీతో పంచుకోబోతున్నాను. 2021, ఆగష్టు మొదటి వారంలో నాకు కడుపులో ఎడమవైపు కొంచెం క్రింద చాలా ఎక్కువగా నొప్పి అనిపిస్తూ ఉండేది. దానంతటదే తగ్గుతుందేమోనని రెండు రోజులు వేచి చూశాను, కానీ తగ్గలేదు. ఇంక నేను మన బాబాకు నమస్కరించి, "బాబా! మీరే ఎలాగైనా నా ఈ నొప్పిని తగ్గించండి. మీ దయవల్ల నొప్పి తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. ఆరోజు రాత్రి బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాను. బాబా దయవల్ల రెండు రోజులుగా ఉన్న నొప్పి తెల్లవారేసరికి తగ్గిపోయింది. చాలా దయామయుడు నా తండ్రి బాబా. 


2021, ఆగష్టు 8వ తేదీకి రెండు రోజుల ముందు నుండి మా పాపకి కొంచెం జలుబు, గొంతులో కఫం ఉంది. 8వ తేదీన తన ఒళ్ళు కూడా కొంచెం వేడిగా అనిపించింది. దాంతో నేను బాబాకి నమస్కరించి, "ఎలాగైనా తెల్లవారేసరికల్లా పాప నార్మల్ అయ్యేలా చూడండి బాబా" అని చెప్పుకుని, కొద్దిగా బాబా ఊదీని పాప నోట్లో వేసి నిద్రపుచ్చాను. బాబా దయవల్ల తెల్లవారేసరికల్లా పాప నార్మల్ అయింది.


నాకు ఏనాడూ సక్రమంగా రాని పీరియడ్స్ సరిగ్గా నేను కోవిడ్ బారినపడిన సమయంలో వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! ఈ సమయంలో పీరియడ్స్ వల్ల నేను చాలా బలహీనురాలినైపోతాను. దయచేసి ఈ సమయంలో నాకు పీరియడ్స్ వద్దు బాబా. నేను కరోనా నుంచి కోలుకున్నాక ఇవ్వండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఒక్కరోజులోనే నాకు పీరియడ్స్ ఆగిపోయాయి. ఆనందంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. మరుసటి నెల కూడా నాకు పీరియడ్స్ రాలేదు. రెండు నెలల తరువాత వచ్చింది. అది కూడా 'పీరియడ్స్ వచ్చేలా అనుగ్రహించమనీ, నా అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాన'నీ బాబాతో చెప్పుకున్న తరువాతే.


ఈమధ్య నా కుడిపాదం కొంచెం వాచి నొప్పిగా ఉండేది. నిజానికి అలా చాలా రోజుల నుండి ఉంది. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ఒకరోజు బాగా గమనించి చూసిన తరువాత, "బాబా! వాపు, నొప్పి తగ్గి మామూలుగా ఉండేటట్లు చూడు తండ్రీ. మీ దయవల్ల కాలికి నయమైతే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. అంతే, కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే నా పాదం మామూలుగా అయిపోయింది. అంతా బాబా దయ. ఈవిధంగా పంచుకోవడానికి బాబా నాకు ఎన్నో అనుభవాలు ఇస్తున్నారు. ఈ బ్లాగులో చెప్పుకుంటే నిజంగా బాబాతో చెప్పుకుంటున్నట్లే ఉంటుంది. ఈమధ్య నేను ఒక పార్ట్ టైమ్ ఉద్యోగంలో కలిసొచ్చేలా చూడమని బాబాను వేడుకున్నాను. అది ఇంకా పూర్తిగా సక్సెస్ కాలేదుగానీ, బాబా నన్ను అందులో సక్సెస్ చేస్తారనీ, తొందర్లో ఆ అనుభవంతోనూ, ఇంకా మరికొన్ని అనుభవాలతోనూ మళ్లీ మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. "బాబా! మీకు మాట ఇచ్చినట్లుగానే నా అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను. ఇలాగే అందరినీ కాపాడండి బాబా. థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


చెప్పుకుంటే అన్నీ సరిచేస్తారు బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్వేత. నేను సాయికి ఒక చిన్న భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2021, ఆగస్టు 1, ఆదివారంనాడు ఒక చిన్న పని మీద మావారు, నేను మా పిల్లల్ని ఇంట్లో వదిలి బయటికి వెళ్ళాము. అక్కడ కాస్త ఆలస్యమవడం వలన మావారు ఆకలిగా ఉందంటే, ఇంటికి వెళ్ళడానికి ఇంకా కాస్త సమయం పడుతుందని అక్కడకి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్‌కి వెళ్లి తిన్నాము. కరోనా వల్ల చాలారోజులుగా మేము బయట ఫుడ్ తినలేదు. మా పిల్లలకి రెస్టారెంట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను మావారితో "పిల్లల కోసం కూడా పార్సెల్ చేయించుకుందాం, వాళ్ళకి కూడా బయట ఫుడ్ తిన్నట్టుంటుంది" అని అన్నాను. మావారు 'సరే' అన్నారు. మేము తిన్నాక పిల్లల కోసం ఫుడ్ ప్యాక్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లాము. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. కానీ కాసేపటికి మా పెద్దబ్బాయి, "పొట్టలో ఎలాగో ఉంది, వాంతి వస్తున్నట్టుంది" అన్నాడు. దాంతో నాకు, 'అయ్యో! ఇన్నిరోజులు బయట ఫుడ్ పెట్టకుండా ఉన్నాము, పిల్లలిద్దరూ బాగున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాం? అబ్బాయి ఇలా బాధపడుతున్నాడు' అని చాలా బాధేసింది. వెంటనే, "బాబా! వాడికి ఏమీ కాకుండా చూడు తండ్రీ" అని బాబాను వేడుకుని, బాబుకి కొద్దిగా బాబా ఊదీని పెట్టి సాయిస్మరణ చేస్తూ ఉన్నాను. కాసేపటికి వాడికి వాంతి అయింది. తర్వాత బాబు మామూలు అయ్యాడు. అడిగినంతనే కాపాడారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా".


ఇంకో చిన్న అనుభవం:


2021, జూలై చివరి వారంలో హఠాత్తుగా నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నేను ఆ ఇంటర్వ్యూకి హాజరు కావాలంటే లాప్టాప్ ఉండాలి. కానీ ఆరోజే నా లాప్టాప్‌లో ఏదో సమస్య వచ్చి అది పనిచెయ్యలేదు. అందువలన నేను చాలా టెన్షన్ పడి, "బాబా! ఏదో ఒక దారి చూపించు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. తరువాత మావారితో సమస్య గురించి చెప్తే తను, "నువ్వేం టెన్షన్ పడకు, వాళ్లకు ఇలా సమస్య ఉందని చెప్పు" అన్నారు. నేను వాళ్లకు కాల్ చేసి విషయం చెప్పాను. వాళ్లు ‘పర్వాలేదు’ అన్నారు. మరుసటిరోజు, 'మొబైల్‌తో కనెక్ట్ కావడానికి ప్రయత్నిద్దాం' అని నాకొక ఆలోచన వచ్చింది. బాబానే ఆ ఆలోచనను ఇచ్చారు. అలా బాబా దయతో మొబైల్‌లోనే కనెక్ట్ అయి మూడు రౌండ్ల ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తిచేశాను. "ఇంటర్వ్యూ పూర్తిచేసేందుకు నాకొక దారిని చూపించి సహాయం చేసిన మీకు ధన్యవాదాలు సాయీ. మీ చల్లని దీవెనలు సదా అందరికీ అందేలా అనుగ్రహించు సాయీ".


పెన్ డ్రైవ్ దొరికేలా అనుగ్రహించిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః.


నా పేరు వెంకట్రావు. 2021, జులైలో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆరోజు సాయంత్రం నేను ఆఫీసు నుంచి వచ్చాక చూసుకుంటే, నా జేబులో ఉండాల్సిన పెన్ డ్రైవ్ కనిపించలేదు. అలాంటి చిన్న వస్తువు గురించి అంతగా ఆందోళనపడే తత్త్వం కాదు నాది. కానీ అందులో చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. అందువల్ల ఆరోజు ఎక్కడెక్కడ తిరిగానో ఆయా ప్రదేశాలన్నీ స్వయంగా వెళ్ళి మరీ వెతికాను. ఇంకా నా కారులో కూడా అంతా చూశాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆరోజు ఉదయం ఆ పెన్ డ్రైవ్ ఉపయోగించిన గుర్తు ఉండటం వల్ల బహుశా దానిని ల్యాప్టాప్‌కి అలాగే ఉంచేశానేమో అనే ఆశతో ఇంటికొచ్చి చూశాను. ప్చ్.. నిరాశే ఎదురయింది. ఇక మరుసటిరోజు ఆఫీసులో చూడాలనుకుని పడుకున్నాను. కానీ, 'ఒకవేళ అది పోతే పోలీసులకు తెలియపరచాల్సి వస్తుందేమో! తరువాత మరొకటి తెచ్చుకోటానికి సమయం పడుతుందేమో! అంతవరకు ఆఫీసు పని ఎలా కొనసాగించాలి?'  - ఇలాంటి ఆలోచనలతో నాకు సరిగా నిద్ర లేదు. మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తూనే సాయిని తలచుకుంటూ పెన్ డ్రైవ్ విషయమై సహాయాన్ని అర్థించాను. ముందురోజే ఆఫీసు బాయ్‌కి ఫోన్ చేసి, "ఆఫీసు తెరవగానే అంతా వెదకమ"ని చెప్పి ఉన్నందువల్ల అతన్నుంచి 'పెన్ డ్రైవ్ దొరికిందన్న' వార్త వినాలని తహతహలాడుతూ ఆఫీసుకి వెళ్ళడానికి తయారవుతున్నాను. కానీ నేను బయలుదేరేంతవరకు తననుండి ఎటువంటి సమాచారం రాలేదు. మనసులో మాత్రం పెన్ డ్రైవ్ తప్పక దొరుకుతుందని ఏదో నమ్మకం. కానీ ఆఫీసులో పెన్ డ్రైవ్ దొరకలేదు. సరేనని మరోసారి కారంతా వెదికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. మా ఆఫీస్ బాయ్, "నేనొకసారి కారులో చూస్తాన"ని తను కూడా చూశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇక తప్పదని నేను ఆ కంపెనీవాళ్ళకి మెయిల్ పెట్టాను. తరువాత లంచ్‌కి వెళ్ళేందుకు కారులో డ్రైవరు సీటులో కూర్చున్నాను. బహుశా మా ఆఫీస్ బాయ్ పెన్ డ్రైవ్ కోసం కారులో వెతికినప్పుడు సీటును కాస్త జరిపాడేమో, నేను కూర్చోగానే అది అడ్జస్ట్ అయ్యి శబ్దం వచ్చింది. సరిగ్గా అప్పుడే నా దృష్టికి సీటు సందులో ఏదో ఉన్నట్టనిపించి లేచి చూస్తే, అదే నేను వెతుకుతున్న పెన్ డ్రైవ్! హమ్మయ్య… ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. దానికేమీ డ్యామేజీ కాలేదు. వెంటనే పనిచేస్తుందో లేదోనని చెక్ చేశాను - పని చేస్తోంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని సాయినాథునికి మనసారా కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


10 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤🌸😊🌼🌹🌺

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  4. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  5. Baba karthik, santosh health bagundali thandri

    ReplyDelete
  6. Om Sairam
    sai always be with me

    ReplyDelete
  7. Sai please give health to me. Be with me. ������

    ReplyDelete
  8. Om Sai Rakshak saranam namaha🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo