సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 900వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ద్వారకామాయిలో బాబా ఇచ్చిన ఆశీస్సులు
2. వచ్చింది బాబానే! 
3. ప్రతి చిన్న విషయంలో సహాయం అందించే బాబా
4. ఇన్ఫెక్షన్ తగ్గేలా అనుగ్రహించిన బాబా

ద్వారకామాయిలో బాబా ఇచ్చిన ఆశీస్సులు


సాయిబంధువులకు నమస్కారాలు. సాయి లీలలను అందరికీ తెలిపే అవకాశం కల్పించిన బాబాకు అనంత వేల కృతజ్ఞతలు. నా పేరు అలేఖ్య. మాది మంచిర్యాల(తెలంగాణ). నా జీవితంలో ఎన్నో సాయి లీలలు. వాటినన్నిటినీ ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాను. నాకు 2019లో వివాహం అయింది. వివాహానికి ముందు మేము శిరిడీ వెళ్లి, మా పెళ్ళికి రమ్మని ముందుగా బాబాను ఆహ్వానించి వచ్చాము. బాబా ఆశీస్సులతో మా పెళ్లి బాగా జరిగింది. వివాహం అయిన తర్వాత నెలరోజుల వ్యవధిలో మళ్ళీ మేము శిరిడీ వెళ్ళాము. ఆరోజు గురువారం. సాయిసత్యవ్రతం చేసుకుని సమాధి దర్శనం చేసుకున్నాం. తరువాత ద్వారకామాయికి వెళ్లాం. అక్కడ చాలామంది జనం ఉన్నారు. మేము లైన్‌లో వేచి ద్వారకామాయి లోపలికి వెళ్ళాము. అక్కడ పూజారి ఉన్నారు. నేను 16సార్లు శిరిడీ వెళ్ళాను. కానీ ద్వారకామాయిలో పూజారి ఉండటం నేను మొదటిసారి చూశాను. ధుని ప్రక్కన ఉన్న బాబా పాదాలు దర్శనం చేసుకున్నాము. ముందుకు పదమని అక్కడున్నవాళ్ళు తోస్తున్నారు. పూజారి కోపంగా కసిరారు కూడా. కానీ బాబాని ఎంత చూసినా తనివితీరదు, తృప్తి కలగదు. అయినా తప్పక ముందుకు కదిలాను. ఇంతలో, కోపంగా కసిరిన అదే పూజారి హఠాత్తుగా నన్ను వెనక్కి పిలిచి కొబ్బరికాయ ఇచ్చారు. నా భర్తను కూడా పిలవమన్నారు. మావారు వచ్చాక ఆయనకి మరో కొబ్బరికాయ ఇచ్చారు. తరువాత మా ఇద్దరి చేతికి ఉన్న కంకణాలు చూసి, "మీకు క్రొత్తగా పెళ్లయిందా?" అన్నారు. మేము "అవున"ని బదులిచ్చాము. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి, బాబా వాడిన కుండలోని నీళ్లు మా ఇద్దరికీ ఇచ్చి త్రాగమన్నారు. "ఇంతమందిలో మాకే ఎందుకు ఇచ్చార"ని పూజారిని అడిగితే, "బాబా మీకు ఇవ్వమన్నారు" అని అన్నారు. నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. నెలరోజుల్లో నేను గర్భం దాల్చాను. బాబా మాకు పండంటి మగబిడ్డను ప్రసాదించారు. "బాబా! అపారమైన మీ అనుగ్రహానికి చాలా చాలా ధన్యవాదాలు".


వచ్చింది బాబానే! 


నా జీవితంలో సాయి ఎప్పుడూ ప్రక్కనే ఉండి కాపాడుతున్నారు. ఆయన పిలిస్తే పలికే దైవం. ఒకసారి మా తాతయ్యకు ఆరోగ్యం బాగలేకపోతే బాధతో బాబాను ప్రార్థించాను. తరువాత బాబాకు కిచిడీ నైవేద్యం పెట్టి, దక్షిణ సమర్పించి, "బాబా! తాతయ్య ఆరోగ్యం బాగవ్వాలి. మీరు వచ్చి వీటిని స్వీకరించండి బాబా" అని వేడుకున్నాను. ఆ మధ్యాహ్నం తలకి గుడ్డ కట్టుకున్న ఒకతను మా ఇంటికి వచ్చి భిక్ష అడిగారు. నేను సంతోషంగా బాబా దగ్గర పెట్టిన కిచిడీ తీసుకొచ్చి అతనికి పెట్టాను. అతను అది తిన్న తర్వాత దక్షిణ అడిగారు. అప్పుడు, 'వచ్చింది బాబానే' అని నాకనిపించింది. వెంటనే వెళ్లి దక్షిణ తీసుకొచ్చి అతనికి ఇచ్చాను. అతను నేనిచ్చిన రెండు నాణేలు తీసుకొని తన నోటి దగ్గర పెట్టుకుని, ఏదో మంత్రం చదివినట్లు చదివి, "బొమ్మ పడితే నాకు, బొరుసు పడితే నీకు" అని ఒక నాణేన్ని పైకి ఎగురవేసి వెళ్ళిపోయారు. ఆ నాణెం ఇంటి ప్రాంగణంలో చాలా దూరంలో పడి, బొరుసు వచ్చింది. తర్వాత నేను సచ్చరిత్ర తీస్తే 29వ అధ్యాయము వచ్చింది. అందులో, బాబా నాణేన్ని ఎగురవేసి డాక్టర్ కెప్టెన్ హాటేకు ప్రసాదించే అనుభవం ఉంది. దాంతో, 'వచ్చింది సాయినాథుడే'నని నాకు పూర్తిగా నిర్ధారణ అయింది. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సాయి నా జన్మ ధన్యం చేశారు. ఆరోజు నుండి తాతయ్య ఆరోగ్యం బాగైంది. బాబా దయవల్ల మేము అందరమూ బాగున్నాము. "ధన్యవాదాలు బాబా".


ప్రతి చిన్న విషయంలో సహాయం అందించే బాబా


నేనొక సాయిభక్తురాలిని. నేను నా గత అనుభవంలో మా పాపని తీసుకుని మా అమ్మావాళ్ల ఇంటికి వచ్చానని చెప్పాను. అలా వచ్చిన నేను చాలారోజులు అమ్మావాళ్ల ఇంట్లోనే ఉండి ఇటీవల తిరిగి హైదరాబాద్ వచ్చాను. అయితే, నేను గతంలో చెప్పినట్లు మావారు చెప్పుడు మాటలు విని నాతో మాట్లాడట్లేదు, వేరే చోట ఉంటున్నారు. దాంతో ఇల్లంతా దుమ్ముతో నిండి ఉంది. అదంతా దులిపి శుభ్రపరచాలంటే నాకు కష్టంగా అనిపించింది. నిజానికి నేను ఊరికి వెళ్ళే ముందు ఒక పనిమనిషిని మాట్లాడుకున్నాను. కానీ నేను ఊరినుండి ఆలస్యంగా తిరిగి రావటం వల్ల తను వేరే ఇల్లు ఒప్పుకుంది. ఎలాగైనా తనని రమ్మని పిలుద్దామంటే, ఆమె ఎక్కడ ఉందో తెలియదు. పైగా ఆమె ఫోన్ పనిచేయటం లేదు. నేను ఊరినుంచి బయలుదేరినప్పుడే ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సుమారు 50 సార్లు చేసినా ఫోన్ కలవలేదు. ఇంటికి వచ్చాక చూస్తే ఇంటి పరిస్థితి అలా ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. పైగా ప్రయాణం సరిపడక నాకు, మా పాపకి ఒకటే వాంతులు. ఆ స్థితిలో ఇల్లు శుభ్రం చేసుకోవడానికి భయమేసినాసరే ఎలాగో ఓపిక తెచ్చుకుని మరుసటిరోజు ఇల్లు ఊడ్చి, తుడిచాను. కానీ ఇంకా చాలా పని ఉంది. లాక్‌డౌన్ కాలంలో ఇంటి పని, పిల్లల పని, ఆఫీసు పని చేయగలిగాను కానీ, ఇపుడున్న మానసిక ఒత్తిడి వల్ల చేయలేక భయపడి మళ్ళీ పనిమనిషికి కాల్ చేశాను. కానీ ఫోన్ కలవలేదు. అప్పుడు, "బాబా! మూడుసార్లు ఫోన్ చేస్తాను. ఆమె లిఫ్ట్ చేయాలి" అని బాబాతో చెప్పుకుని ఫోన్ చేశాను. అయినా ఆమె ఫోన్ కలవలేదు. అప్పుడే ఏదో ఆశతో బయటికి వెళ్ళాను. బాబా కృప చూడండి! సరిగ్గా మా ఇంటినుండి 100 మీటర్ల దూరంలో ఆ పనిమనిషి ఉంది. వెంటనే తనని ఇంటికి రమ్మని చెప్తే, తను వస్తానని అంది. ఆమె రాకపోతే నేను చాలా ఇబ్బందిపడేదాన్ని. బాబా దయతో నన్ను కాపాడారు. ఆయన దయతో పన్నెండున్నర ఏళ్ల నించి నేను పడుతున్న బాధనుండి కూడా త్వరలో విముక్తి రావాలని కోరుకుంటున్నాను.


నేను మా ఊరు నుంచి వచ్చేటప్పుడు ట్రావెల్స్ కారులో కాకుండా మా పెద్దనాన్నగారి కారులో వచ్చాను. కరోనా కారణంగా మా పెద్దనాన్న, పెద్దమ్మ ఎవరి ఇళ్లకూ వెళ్ళట్లేదు, ఇతరులు కూడా వాళ్ళ ఇంటికి రావట్లేదు. వాళ్ళ డ్రైవరే వాళ్ళకి కావలసిన సరుకులు తెచ్చిపెడుతుంటాడు. అందుచేత ప్రస్తుత పరిస్థితుల్లో ట్రావెల్స్ కారులో కంటే వాళ్ళ కారులో ప్రయాణం సురక్షితమని తలచి, పెదనాన్నతోనూ, డ్రైవరుతోనూ మాట్లాడి, కారుకి పెట్రోలు కొట్టించి, డ్రైవరుకి బేటా ఇచ్చి హైదరాబాదు వచ్చాను. తీరా నేను వచ్చిన మూడు రోజులకి మా పెద్దనాన్నకి కరోనా వచ్చిందని తెలిసింది. అసలే పెదనాన్నకి వయసు పైబడింది. అందుచేత నాకు చాలా భయమేసి, "బాబా! పెదనాన్న త్వరగా కోలుకోవాల"ని బాబాని వేడుకున్నాను. తరువాత వాళ్ళింట్లో అందరూ కరోనా పరీక్ష చేయించుకుంటే, బాబా దయవల్ల అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇక డ్రైవరు ద్వారా పెదనాన్నకి కరోనా వచ్చిందేమో, ఒకవేళ అదే నిజమైతే, హైదరాబాదు వెళ్లొచ్చాకే ఇలా జరిగిందని, నాకోసం కారు పంపడం వల్లే ఈ ముప్పు వచ్చిందన్న మాటపడాల్సి వస్తుందేమోనన్న అనుమానంతో నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను, "బాబా! నేను భయపడుతున్నట్లు ఏమీ జరగకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయతో డ్రైవరుకి కరోనా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం పెదనాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. "బాబా! నాపై అపవాదు రాకుండా కాపాడిన మీకు శతకోటి నమస్కారాలు. పెదనాన్న త్వరగా ఇంటికి వచ్చేలా అనుగ్రహించండి బాబా".


ఇన్ఫెక్షన్ తగ్గేలా అనుగ్రహించిన బాబా


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై! ఈ బ్లాగులో ఎంతోమంది సాయిభక్తులు తమ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ అవకాశమిచ్చిన బ్లాగ్ అడ్మిన్‌కి నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. మా ఇంట్లో అందరమూ సాయిబాబాని చాలా నమ్ముతాము. ఈ బ్లాగ్ నాకు కొత్త. ఇదే నేను పంచుకుంటున్న మొదటి అనుభవం. బాబా నన్ను చాలా కష్టంలో ఆదుకున్నారు. మాకొక పగ్ బ్రీడ్ పెట్ డాగ్ ఉంది. వాడి పేరు బిట్టు. వాడికి రెండేళ్ల వయస్సు. ‘పెట్ గురించా’ అని అనుకోకండి. వాడంటే, నాకు చాలా చాలా ఇష్టం. వాడికి ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను. అలాంటిది ఈమధ్య వాడికి చెవి ఇన్ఫెక్షన్ వచ్చింది. సుమారు మూడు నెలలు డాక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. చివరికి డాక్టరు సర్జరీ చేయాలన్నారు. అది విని నేను చాలా భయపడ్డాను, ఎంతగానో ఏడ్చాను. పగ్స్‌కి సర్జరీ అంటే చాలా కష్టం. బ్రీతింగ్ సమస్య ఉంటుంది. అందువలన నేను "మందులతో వాడికి నయమైతే ఈ బ్లాగులో పంచుకుంటాన"ని అనుకుని, సాయి దివ్యపూజ, ప్రదక్షిణలు చేస్తానని కూడా బాబాకి మ్రొక్కుకున్నాను. సాయిబాబా ఎంతో దయతో బిట్టుకి ఇన్ఫెక్షన్ తగ్గేలా చేశారు. ఆయనకి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో నాకు తెలియడం లేదు, ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలోనే కాదు, అన్నివిధాలా బాబా మనకి తోడు ఉంటారు. "లవ్ యు బాబా".


8 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha ☕🙏❤😊🙏🥰🌹🌸😃🌼😀🌺

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. 🌺🌼🙏🙏🙏🙏🙏🌼🌺

    ReplyDelete
  4. Om sri sai arogya kshemadaya namaha🙏🙏🙏

    ReplyDelete
  5. Om sai ram baba amma Arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni tondarga ee medicine tho karginchu thandri sainatha

    ReplyDelete
  7. Baba karthik, santosh health bagundali thandri

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo