సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఛోటూభయ్యా పరూల్కర్



శ్రీసాయిబాబా సశరీరులుగా ఉన్నకాలంలోనే వారి కీర్తి మహారాష్ట్ర ప్రాంతంలోనేకాక దేశంలోని పలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. మధ్యప్రదేశ్‌లో కూడా ఎంతోమంది ప్రజలు బాబాను ఆరాధిస్తూ ఉండేవారు. వారిలో హార్దా నివాసియైన గౌరవ న్యాయమూర్తి కృష్ణారావు నారాయణ్ పరూల్కర్ అలియాస్ ఛోటూభయ్యా పరూల్కర్ ఒకరు. అతను బాబాకు అంకిత భక్తుడు, బాబాను ఎంతగానో ప్రేమించేవాడు. బాబా అతనిని ప్రేమగా “ఛోటూభయ్యా” అని పిలిచేవారు. నిజానికి మొదట అతను దత్తాత్రేయుని భక్తుడు. తరువాత క్రమంగా అతను బాబా పట్ల ఆకర్షితుడై, ‘బాబా సాక్షాత్తూ దత్తాత్రేయుని అవతారమే’నని నమ్మి భక్తిశ్రద్ధలతో వారిని పూజించడం ప్రారంభించి తరచూ వారి దర్శనార్థం శిరిడీ వెళ్తుండేవాడు. 

ఛోటూభయ్యా సుమారు 10, 12 సంవత్సరాల పాటు పైత్యపు వాంతులతో ఎంతో బాధపడ్డాడు. భోజనం చేసినప్పుడల్లా అతనికి వెంటనే వాంతి అయిపోయేది. ఈ వ్యాధి నివారణ కోసం ఎందరో వైద్యులను సంప్రదించి ఎన్నో రకాల మందులు వాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఒకసారి ఛోటూభయ్యాకు మెరుగైన చికిత్స అందించాలనే ఉద్దేశ్యంతో అతని తండ్రికి స్నేహితుడైన శ్రీసదాశివ రామచంద్ర పట్వర్థన్ నాగపూరు నుండి ఒక ప్రఖ్యాత వైద్యుడిని హార్దాకు పంపించాడు. ఆ వైద్యుడు చాలా వృద్ధుడు. ఆయన ఛోటూభయ్యాను పరీక్షించి, ఒక ఔషధాన్ని తయారుచేసి, దానిని మూడు చిన్న పొట్లాలలో కట్టిచ్చి, ఉదయమొకటి, మధ్యాహ్నమొకటి, రాత్రి ఒకటి చొప్పున ఆ ఔషధాన్ని తీసుకోమని సూచించాడు. ఆ వైద్యుని సూచనమేరకు ఉదయం, మధ్యాహ్నం ఆ ఔషధాన్ని తీసుకున్నాక ఛోటూభయ్యాకు విపరీతంగా విరేచనాలు కాసాగాయి. దాంతో రాత్రి 8 గంటలయ్యేసరికి అతను బాగా నీరసించిపోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతని పరిస్థితి చూసి అందరూ ఎంతో భయపడిపోయారు. అప్పుడా వైద్యుడు పూజాగదిలోకి వెళ్లి కొంతసేపు భగవంతుని ప్రార్థించి విరేచనాలు ఆగటానికి మందిచ్చాడు. ఆ మందు తీసుకున్న తరువాత సుమారు రాత్రి 11 గంటలకు విరేచనాలు ఆగిపోయాయి. అప్పుడు ఆ వైద్యుడు ఛోటూభయ్యా తండ్రితో, "ఇకపై ఈ పైత్యపు వాంతుల నివారణకు ఏ మందులూ వాడకండి. ఈ వ్యాధి కేవలం భగవదనుగ్రహం పొందిన మహాత్ముని దయవల్ల తప్ప మరే మందుల వల్లా నయం కాదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆరోజు నుండి ఆ పైత్యపు వాంతుల నివారణకు అతను ఏ ఔషధాన్నీ తీసుకోలేదు. ఇది జరిగిన ఐదారు సంవత్సరాల తరువాత పరూల్కర్ తన భాగ్యంకొద్దీ శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. అయితే అతను గానీ, ఇతరులు గానీ అతని పైత్యపు వాంతుల సమస్య గురించి బాబాకు చెప్పలేదు. కేవలం బాబా దర్శనంతోనే ఛోటూభయ్యా ఎంతో తృప్తిపడి తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. 

మరుసటి సంవత్సరం గురుపౌర్ణమినాడు ఛోటూభయ్యా తన తమ్ముడితోనూ, మరో వ్యక్తితోనూ కలిసి బాబాను దర్శించుకున్నాడు. మరుసటిరోజు సాయంత్రం 4 గంటల సమయంలో వాళ్ళు ముగ్గురూ బాబా సన్నిధిలో కూర్చొని ఉండగా సరిగ్గా అదే సమయంలో మావిశీబాయి అనే భక్తురాలు అక్కడికి వచ్చింది. బాబా ఆమెను చూసి, "మౌసీ, ఎందుకింత ఆలస్యమైంది?" అని అడిగారు. అందుకామె, "బాబా! నాకు బాగా వాంతులు అవుతున్నాయి. అందుకే ఆలస్యమైంది" అని బదులిచ్చింది. అప్పుడు బాబా హాస్యధోరణిలో ఆమెతో, "నువ్వు బాగా ముక్కా మొయ్యా తింటున్నావు. అందుకే నీకు వాంతులవుతున్నాయి" అని అన్నారు. అప్పుడామె, "బాబా! ఎడతెగని ఈ వాంతులతో నాకు జీవితం మీదే విరక్తి కలుగుతోంది. దయచేసి నా ఈ జబ్బును నయం చేయండి" అని బాబాను ప్రార్థించింది. బాబా కొంతసేపు మౌనంగా ఉండి, తరువాత పరూల్కర్‌ని చూపిస్తూ, "ఇతను కూడా కొన్ని సంవత్సరాలుగా ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు" అని అన్నారు. బాబా మాటలు వింటూనే పరూల్కర్, అతని సోదరుడు ఆశ్చర్యపోయారు. పరూల్కర్ సోదరుడు తన సోదరుని వాంతులు ఆగిపోయేలా అనుగ్రహించమని బాబాను వేడుకొన్నాడు. అప్పుడు బాబా, "ఇకపై అతనికి వాంతులు కావు" అని అభయమిచ్చారు. అప్పటినుండి ఛోటూభయ్యా తన జీవితంలో ఎన్నడూ ఆ వ్యాధితో బాధపడలేదు. 10, 12 సంవత్సరాల పాటు ఎన్ని ఔషధాలు వాడినా తగ్గని ఆ వ్యాధి కేవలం బాబా అన్న ఒకే ఒక్క మాటతో పూర్తిగా నయమైంది. బాబా తనపై చూపిన అపారకృపకు ఛోటూభయ్యా ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉండేవాడు.

1914లో ఒక మహాశివరాత్రినాడు ఛోటూభయ్యా తన కుటుంబంతో కలిసి శ్రీసిద్ధనాథ్ దర్శనానికి నేమావర్ వెళ్లాలని మధ్యాహ్నం 3 గంటలకు ఎండ్లబండిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. దారిలో బండి చక్రం చెడిపోవటంతో దానికి మరమ్మత్తు చేయించి హడియాస్ అనే ప్రదేశానికి చేరుకునేసరికి చీకటిపడింది. అక్కడినుండి వాళ్ళు పడవలో నర్మదా నది దాటి అవతలి తీరానికి చేరుకోవాల్సి ఉంది. కానీ రాత్రివేళ పడవ నడపడానికి పడవవాడు నిరాకరించాడు. పరూల్కర్ రెట్టింపు డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ అతను తమ నియమ నిబంధనలననుసరించి ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించడమే కాకుండా రాత్రివేళలో పడవ నడపాలంటే తన యజమాని నుండి ప్రత్యేక అనుమతి అవసరమని చెప్పాడు. దాంతో అందరూ నిరాశచెందారు. అప్పుడు శ్రీమతి పరూల్కర్, "బాబా! ఇప్పుడు మేము ఏమి చేయాలి?" అని బాబాను తలచుకుంది. తరువాత వాళ్ళంతా సమీపంలో ఏదైనా ఆలయం ఉంటే ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకొని, బండి తోలేవాణ్ణి అక్కడికి పోనిమన్నారు. సరిగ్గా అప్పుడే ఒక ఫకీరు ఒక తెల్లని గుర్రంతో అక్కడికి వచ్చి పడవ నడిపేవానితో, "నేను రోజంతా తిరిగి తిరిగి వచ్చాను. నన్ను కాస్త నది దాటించు" అని అడిగాడు. అందుకు ఆ పడవ నడిపేవాడు, "సూర్యాస్తమయం తరువాత రాలేన”ని చెప్పాడు. అప్పుడు ఆ ఫకీరు పరూల్కర్ కుటుంబంవాళ్ళు వచ్చిన బండి నడిపేవాణ్ణి సమీపించి, "మీరు కూడా నది దాటవలసి ఉందా?" అని అడిగాడు. అందుకతను, "అవును, కానీ నది దాటలేని పరిస్థితి" అని నిరాశగా చెప్పాడు. అప్పుడు ఆ ఫకీరు, "మీరు ఇంత ఆలస్యంగా రావాల్సింది కాదు" అని అన్నాడు. అందుకతను, "బండి చక్రంలో లోపం ఏర్పడినందువల్ల ఆలస్యమైంద"ని బదులిచ్చాడు. ఆ ఫకీరు, "ఈ స్థలం ఎవరిది?" అని అడిగాడు. "ఇది బ్రిటీష్ ప్రభుత్వానికి చెందినది, అవతలి తీరం హోల్కర్ సర్కార్ అనగా ఇండోర్ రాజు యొక్క వంశపారంపర్యానికి చెందినది" అని సమాధానం ఇచ్చాడు. అప్పుడా ఫకీరు, "సరే, నేను వెళ్లి వాళ్ళ యజమాని వద్ద నుండి పడవలో నది దాటడానికి అవసరమైన అనుమతి తీసుకొని వస్తాన"ని గట్టిగా గదమాయించినట్లు చెప్పి తన గుర్రం వద్దకు వెళ్ళాడు. అంతే, అంతవరకు పడవ నడపడానికి నిరాకరిస్తున్న ఆ పడవవాడు తనకై తాను స్వయంగా పరూల్కర్ వద్దకు వెళ్లి, "రండి. నేను మీ అందరినీ అవతలి తీరానికి చేరుస్తాను" అంటూ వాళ్ళ సామాను అందుకున్నాడు. శ్రీమతి పరూల్కర్, "ఇందుకు డబ్బులెంత తీసుకుంటావు? దాని గురించి ఇప్పుడే నిర్ణయించుకుందాం" అని అతన్నడిగింది. అతను, "అమ్మా! మీకు నచ్చినంత ఇవ్వండి. లేకుంటే, ఏమీ ఇవ్వకండి. కానీ ఇప్పుడు దయచేసి పడవ ఎక్కండి" అని అన్నాడు. అకస్మాత్తుగా అతని ప్రవర్తనలో వచ్చిన మార్పుకి ఆ ఫకీరే కారణమని పరూల్కర్‌కి తోచింది. ఆశ్చర్యమేమిటంటే, వాళ్ళెక్కిన పడవ కదలడంతోనే ఆ ఫకీరు అదృశ్యమయ్యాడు. అప్పుడు వాళ్ళకి ‘మార్గంలో తమకు ఎదురైన అవాంతరాన్ని తొలగించడానికి బాబాయే ఆ ఫకీరు రూపం దాల్చార’ని అర్థమై హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తరువాత అవతలి తీరానికి చేరుకొని సిద్ధనాథ్ మహాశివరాత్రి ఉత్సవాలను సంతోషంగా తిలకించి, శ్రీసాయిబాబా ఆశీస్సులతో తిరిగి సురక్షితంగా తమ ఇంటికి చేరుకున్నారు.

సమాధి అనంతరం కూడా బాబా తమ భక్తుల కోరికలను వివిధ మార్గాలలో నెరవేరుస్తూ వాళ్ళను సంతృప్తిపరుస్తున్నారు. దత్తాత్రేయుని ప్రీత్యర్థం కృష్ణారావు నారాయణ్ పరూల్కర్ ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి, అంటే దత్తజయంతినాడు వందమంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేస్తుండేవాడు. ఏ కారణం చేతనైనా ఏదైనా సంవత్సరం ఆ నియమానికి అవాంతరం ఏర్పడితే మరుసటి సంవత్సరం అతను రెండువందలమంది బ్రాహ్మణులకు అన్నసంత్పరణ చేసేవాడు. బాబా సమాధి చెందిన తరువాత ఆరు సంవత్సరాలకు, 1924లో ఒక అనివార్య కారణం వలన అతని నియమానికి భంగం ఏర్పడింది. అందుచేత పరూల్కర్ 1925లో రెండువందలమంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేయాలని నిర్ణయించుకొని అతిథుల జాబితాను సిద్ధం చేశాడు. మరునాడు తెల్లవారుఝామున 5 గంటల సమయంలో భజన జరుగుతుండగా, "బాబా సశరీరులుగా ఉండివుంటే ఈ శుభకార్యానికి ఆయనకు కూడా ఆహ్వానం పంపేవాడిని" అని అనుకున్నాడు పరూల్కర్. అంతలో అతనికి, "నువ్వు నన్ను చూడలేనందువల్ల నేను ఇప్పుడు నీతో లేనని అనుకోకు. నువ్వు నాకు భోజనం పెట్టాలనుకుంటే గనక దీక్షిత్‌కి ఆహ్వానం పంపు. నాకు, అతనికి మధ్య భేదం లేదు. మా మధ్య దైవికమైన అనుబంధం ఉంది. అతనిని ఆహ్వానించి, భక్తితో హృదయపూర్వకంగా భోజనం పెట్టు. అలా చేయడం నాకు భోజనం పెట్టడంతో సమానం" అని ఒక అంతర్వాణి వినిపించింది. తరువాత పరూల్కర్ తన పనులన్నీ ముగించుకొని ఒకచోట కూర్చొని, 'బొంబాయి ఎక్కడ? మధ్యప్రదేశ్‌లోని హర్దా ఎక్కడ? కేవలం ఒకపూట భోజనానికి కాకాసాహెబ్ బొంబాయి నుండి ఇక్కడికి వస్తారా? అది సాధ్యమేనా? అయినా దీక్షిత్‌ని ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం?' అని ఆలోచనలో పడ్డాడు. తరువాత, ‘ఇదంతా నా మనోభ్రమ’ అనుకున్నాడు. అంతలోనే మళ్ళీ అతనికి, "కేవలం ఆహ్వానం పంపడానికి నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు?" అని వినిపించింది. అంతటితో పరూల్కర్, ‘అది తన భ్రమ కాదని, ఆ స్వరం ఖచ్చితంగా బాబాదేన’ని నమ్మి, 'ఆహ్వానం పంపడంలో నష్టమేమీ లేదు. దీక్షిత్ వస్తే నా ఇల్లు పావనమవుతుంది' అని అనుకున్నాడు. అంతేకాదు, 1912లో కాకాసాహెబ్ దీక్షిత్ తన పెద్ద కుమారుని ఉపనయన వేడుకకు, నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహ వేడుకకు బాబాను ఆహ్వానించినప్పుడు, ఆయన తమ ప్రతినిధిగా ఆ రెండు శుభకార్యాలకు షామాను పంపి తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్న సంఘటనను గుర్తుచేసుకున్నాడు. వాళ్లిద్దరూ బాబాను ఆహ్వానించినప్పుడు ఆయన వాళ్లతో, "ఈ షామా, నేను ఒకటే. అతను నా ప్రతిరూపమే. ఇతనిని మీతో తీసుకొని వెళితే నన్ను తీసుకొని వెళ్ళినట్లే" అని అన్నారు. సత్యాసత్యాలను గుర్తించగల నేర్పు ఉన్న ఆ ఇద్దరూ బాబా చెప్పినదానికి వెంటనే సమ్మతించారు. ఆనాడు బాబా చెప్పిన మాటలను గుర్తుచేసుకున్న పరూల్కర్ ఇక ఎటువంటి సందేహం అక్కర్లేదని భావించి, అన్నసంతర్పణకు ఆహ్వానిస్తూ దీక్షిత్‌కు ఒక లేఖ వ్రాశాడు.

అయితే, దత్తజయంతి ముందురోజు రాత్రి వరకు దీక్షిత్ నుండి పరూల్కర్‌కి ఎటువంటి సమాచారమూ అందలేదు. మరుసటిరోజు ఉదయం అతను తన పూజగదిలో కూర్చొని, "ఓ సాయీ! మీరు ఆనందసాగరం వంటివారు, నిజమైన ప్రేమకు నిధి. మీ నామమే ఈ ప్రపంచానికి ఏకైక శరణ్యం. మీ కృపతో ముల్లోకాలనూ పొందవచ్చు. పంటలు ఎండిపోయిన తరువాత వర్షం పడటం వలన ప్రయోజనం లేదు. అలాగే ఈ పవిత్రమైనరోజు గడిచిపోయాక మీరు కాకాసాహెబ్ రూపాన నా ఇంటికి వచ్చినా నిరర్థకమవుతుంది. కాబట్టి మీకు నచ్చిన రూపంలో ఈ పవిత్ర కార్యానికి దయచేయండి బాబా" అని వేడుకున్నాడు. తరువాత మధ్యాహ్నవేళ అయ్యేసరికి భోజన ఏర్పాట్లు మొదలయ్యాయి. వడ్డన కూడా మొదలుపెట్టారు. పరూల్కర్ మళ్ళీ బాబా పటం వద్దకు వెళ్లి, "బాబా! ధనం యొక్క మాయలో పడిన సాధువుని చూసి ప్రపంచమంతా నవ్వుతుంది. అదేవిధంగా మీరుగానీ, మీ ప్రతినిధిగానీ లేనందువల్ల నేను నవ్వులపాలవుతాను" అని చెప్తుండగా అతని గొంతు మూగబోయింది, కళ్ళనుండి కన్నీళ్లు కారగా పెద్దగా ఏడ్చేశాడు. అంతలో పోస్ట్‌మ్యాన్ ఒక టెలిగ్రామ్ తీసుకొని వచ్చాడు. అది కాకాసాహెబ్ పంపిన టెలిగ్రామ్. అందులో, "నేను, మాధవరావు (షామా) శుభకార్యానికి వస్తున్నాము" అని వ్రాసి ఉంది. కాకాసాహెబ్, మాధవరావుల పేర్లు వింటూనే అక్కడున్నవారంతా ఆనందభరితులయ్యారు. పెద్దలు, అతిథుల అనుమతితో భోజన కార్యక్రమాన్ని కొంతసేపు వాయిదావేసి అందరూ రైల్వేస్టేషన్‌కి వెళ్లి, బాబా ప్రతినిధులుగా కాకాసాహెబ్, మాధవరావులకు గొప్ప స్వాగతం పలికారు. వారి రాకతో పరూల్కర్ గృహం పావనమైంది. తరువాత అందరూ సంతృప్తిగా విందు ఆరగించారు. ఈవిధంగా బాబా తమ భక్తుల సత్సంకల్పాలు నెరవేర్చి భక్తివిశ్వాసాలు పెంపొందింపజేస్తారు.

ఒకసారి పూణేకి చెందిన ఒక భక్తుడు బాబాకు పాదుకలు సమర్పించాడు. ఆశ్చర్యకరంగా ఆరోజు బాబా ఆ పాదుకలను ధరించి లెండీకి వెళ్లారు. లెండీనుండి తిరిగి వచ్చాక ఆయన ఆ పాదుకలను విడిచి తమ పాదాలను కడుక్కొని మసీదు లోపలికి వెళ్లారు. కాసేపటికి ఛోటూభయ్యా బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు. ఆ రోజులలో తగినంత రవాణాసౌకర్యం లేని కారణంగా అతను కొంతదూరం ఎండ్లబండిలో, కొంతదూరం కాలినడకన దట్టమైన అడవులు, తోటలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఎంతో శ్రమకోర్చి శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుంటుండేవాడు. బాబా అతనితో, "కేవలం నన్ను చూడటానికి ఎందుకింత కష్టపడతావు?" అని అడిగారు. అందుకతను, "బాబా! నా వద్ద మీ జ్ఞాపకచిహ్నంగా ఏమీ లేదు. ఇక్కడినుండి వెళ్లిన కొన్నిరోజులకు నా మనసులో మీ దర్శనం చేసుకోవాలనే తపన మొదలైపోతుంది. ఆ తపనే నన్ను ఇక్కడికొచ్చి మిమ్మల్ని దర్శించేలా ప్రేరేపిస్తుంది" అని అన్నాడు. దానికి బాబా స్పందిస్తూ, "నా జ్ఞాపకంగా ఈ పాదుకలు తీసుకో. ఇకపై మళ్ళీ మళ్ళీ ఇక్కడికొచ్చి నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు. ఈ పాదుకల రూపంలో స్వయంగా నేను నీతోనూ, నీ కుటుంబంతోనూ కలిసి ఉండటానికి హార్దా వస్తాను" అని అన్నారు. బాబా చూపిన కరుణకు కరిగిపోయిన ఛోటూభయ్యా కృతజ్ఞత నిండిన మనసుతో బాబాకు నమస్కరించి, ఎంతో ఆనందంగా ఆ పాదుకలను తన ఇంటికి తీసుకొనివెళ్ళి ప్రతిరోజూ భక్తిగా పూజించసాగాడు.

1914వ సంవత్సరంలో బొంబాయికి చెందిన ఎమ్.రామకృష్ణారావు అనే చిత్రకారుడు శిరిడీ వచ్చి బాబాను దర్శించి, వారి దివ్యవర్చస్సుకు సమ్మోహితుడై, 07.06.1914న ఒక అందమైన బాబా చిత్తరువును చిత్రించాడు. ఆ చిత్రపటాన్ని చూసి దీక్షిత్, కాకామహాజని తదితర భక్తులందరూ ఎంతగానో ఇష్టపడ్డారు. కానీ, ఆ చిత్రపటాన్ని చూస్తూనే బాబా తీవ్రమైన ఆగ్రహావేశాలకు గురవుతారని వాళ్లందరికీ తెలుసు. కాబట్టి ఆ చిత్రపటంపై ఒక తెల్లని గుడ్డను కప్పి, మసీదులో ఒకచోట ఉంచి, బాబా ప్రసన్నంగా ఉన్న సమయంలో దానిని వారికి చూపించాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఒకరోజు మధ్యాహ్న ఆరతి అనంతరం బాబా ప్రసన్నంగా నవ్వుతూ ఉండటం చూసి షామా ఆ చిత్రకారుడిని చూపుతూ, "దేవా! ఈ చిత్రకారుడు మీ రూపాన్ని చిత్రించాడు. మీరు దానిని చూడాలని మేము ఆశిస్తున్నాము" అని అన్నాడు. అతనింకా తన మాటలు పూర్తిచేయక ముందే బాబా కోపంగా, "ఆ చిత్రపటం ఎక్కడుంది? దానిని నా వద్దకు తీసుకురండి. అసలు మీరెందుకు నా చిత్రపటాన్ని గీశారు? వెంటనే దాన్నిటు తీసుకురండి" అని అరిచారు. బాబా ఆదేశానుసారం భక్తులు మెల్లగా ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి బాబా ముందుంచారు. బాబా అటు ఇటు చూసి తమ సటకాను అందుకొని, దాంతో ఆ చిత్రపటాన్ని కొట్టబోయారు. అంతలోనే అకస్మాత్తుగా బాబా శాంతించారు. అది చూసి షామా కాస్త ధైర్యం తెచ్చుకుని, "దేవా! ఈ చిత్రపటాన్ని ఏం చేయమంటారు?" అని అడిగాడు. భక్తులందరూ నిశ్చేష్టులై నిలబడి ‘బాబా ఏం చెప్తారా?’ అని చూస్తున్నారు. బాబా నలుదిక్కులా చూస్తూ, అక్కడున్న ప్రతి భక్తుని వైపు చూసి తమ ప్రక్కనే ఉన్న ఛోటూభయ్యా వైపు తిరిగి ఎంతో సౌమ్యంగా, "ఈ చిత్రపటాన్ని నీతో తీసుకుపో. నీ సమస్తమూ బంగారమవుతుంది" అని అన్నారు. అతను పట్టలేని ఆనందంతో బాబాకు నమస్కరించుకుని ఆ చిత్రపటాన్ని తన ఇంటికి తీసుకుపోయి పాదుకలతోపాటు నిత్యమూ పూజించసాగాడు.

ఇప్పటికీ బాబా తమ స్వహస్తాలతో ఛోటూభయ్యాకి ఇచ్చిన చిత్రపటం, పాదుకలు హార్దాలోని అతని వారసుల వద్ద ఉన్నాయి. ఆ కుటుంబంలోని మూడవ తరానికి చెందిన శ్రీకిశోర్ రంగనాథ్ పరూల్కర్ తన పూర్వీకులు చేసినట్లే భక్తిశ్రద్ధలతో ఆ చిత్రపటాన్ని, పాదుకలను పూజిస్తూ బాబా పాదుకలను సేవించే గొప్ప భాగ్యం దక్కినందుకు తానెంతో అదృష్టవంతునిగా భావిస్తున్నారు. మొత్తానికి, వందేళ్లకు పైబడిన ఆ బాబా చిత్రపటం, పాదుకలు హర్దాలో నిత్యపూజలందుకుంటున్నాయి. ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలో బాబా చిత్రపటాన్ని, పాదుకలను దర్శించవచ్చు.
చిరునామా:

Shri.Kishore Ranganath Parulkar
No.14, Ganesh Chowk,
Near Tilak Bhavan,
Harda-461 331
MadhyaPradesh, India.
ఫోన్ నెంబర్: +91 83492 76400

మూలం: శ్రీసాయిబాబా అంబ్రోసియా ఇన్ శిరిడీ బై విన్నీ చిట్లూరి.
((Source: Baba’s Vani by Sai Bhakta Vinny Chitluri and personal interview with Shri.Kishore Ranganath Parulkar on 25th November 2016))

10 comments:

  1. ఓo సాయిరాo ఓo సాయిరాo ఓo సాయిరాo సాయి బoదువులకు నమస్కారములతో
    మా పాప ఆరోగ్యo బాగలేదు. pregnant అని అనుమానము. సదరు విషయము 100% 8వ తేదీన టెస్ట్ చేసి నిర్ధారణ చేసి చేస్తామని డాక్టరు చెప్పారు. కాని వారి ఇoటిలో అoదరికి జ్వరము జలుబు చాలా ఎక్కువగా ఉన్నది. అది కరోనా ఏమో అని ఒక పక్క అనుమానము. జ్వరము జలుబు ఉoటే పాపను చూపిoచే ఆసుపత్రి లోనికి ఎవరిని రానీవరు. ఈ విషయo తెలిసి మాకు చాలా బాద వేసినది, ఏమి పాలుపోలేదు. పాప చాలా బాద పడుతుoది. పాప బాద చూడలేక ఏమిచేయాలో అర్ధం కాక
    తోలి కానుపు కరోనా కారణంగా మేము వెళ్ల లేక సాయిని తలచుకొని నీవే దిక్కు అనుకున్నాము, 8 వ తేదీనాటికి అoదరి ఆరోగ్యo చాలా వరకు కుదుటపడినది, ఆ రోజున ఆసుపత్రికి తీసుకుపోయినారు. డాక్టర్ పాపను పరిక్షిoచి బేబి గ్రోత్ బాగుoది నీకు బాగుంది మంచి ఆహారం తీసుకో చిన్న చిన్న పనులు చేసుకో కడుపు కాలిగా ఉంచకూ అని మoచిగా చెప్పినారు. సాయి మాయoదు ఉoడి మా పాపకు న్యాయం చేసినారు. సాయి బాబాకు నాహృధయ పూర్వక నమస్కారములు తెలుపు కొనుచున్నాను. సాయిని మనసారా నమ్మి శరణo కోరితే ఇవ్వాలేనిది ఎదిలేదు అని మాకు చాలా విషయాలలో రుజువు అయినది.🙏🙏

    ReplyDelete
    Replies
    1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌺😃🌸😀🌹🤗🌼

      Delete
  2. Baba amma ki covid negative report ravali thandri pleaseeee

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌺😃🌸😀🌹🤗🌼

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺🥰🌹😃🌼😀🌸💕👪

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. The above mentioned mobile number of Shru Parulkar ji is nit working. someone who have can kindly forward to talk to them.Thanks in advance

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo