- దృఢమైన విశ్వాసం ఉన్నవారికి బాబా ఆశీస్సులు తప్పక లభిస్తాయి
- బాబా అనుగ్రహంతో మరుసటిరోజుకి పూర్తి ఆరోగ్యం
దృఢమైన విశ్వాసం ఉన్నవారికి బాబా ఆశీస్సులు తప్పక లభిస్తాయి
సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిబంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా మాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఈ బ్లాగులో ఎన్నో అనుభవాలు చూశాక మా అనుభవాలను కూడా పంచుకోవాలనిపించింది. ముందుగా 2021, ఏప్రిల్ 26న జరిగిన ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటాను. ఆరోజు మా వాషింగ్ మెషీన్ ఒక్కసారిగా ఆగిపోయింది. నేను బాబా ఊదీని మెషీన్‌కి పెట్టి, బాబాకు నమస్కరించుకున్నాను. బాబా దయవల్ల ఒక్క ఐదు నిమిషాల్లో వాషింగ్ మెషీన్ మామూలుగా పనిచేసింది.
2021లో నేను, మావారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాము. తర్వాత రెండో డోస్ చేయించుకోవాల్సిన సమయం వచ్చినప్పటికీ వ్యాక్సిన్ స్టాక్ లేదని తెలిసి మేము కంగారుపడ్డాము. అప్పుడు నేను బాబాను వేడుకొన్నాను. మరోసటిరోజుకల్లా వ్యాక్సిన్ స్టాక్ వచ్చింది. అంతా బాబా కృప. "ధన్యవాదాలు బాబా".
ఇకపోతే, మరో అనుభవం మా పెద్దమ్మాయికి సంబంధించినది. అది తన మాటల్లోనే ఈ క్రింద ఇస్తున్నాను.
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై! నేను సాయిభక్తురాలిని. ఇటీవల బాబా మాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021లో మేము మా సొంత ఊరు నుండి తిరిగి వచ్చాక మావారికి గొంతునొప్పి వచ్చింది. అది కరోనా సమయం. మావారు ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి ఉండటంతో ముందుజాగ్రత్తగా డాక్టరుని సంప్రదించారు. డాక్టర్, "RTPCR పరీక్ష చేయంచమ"ని సూచించారు. దాంతో మావారు ఆ పరీక్షకు శాంపిల్ ఇచ్చి, అప్పటినుండి ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆశ్చర్యంగా, RTPCR టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. దాంతో మేము భయపడి, ‘మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహాయం చేయమ’ని బాబాను ప్రార్థించాము. తరువాత నేను, పిల్లలు కూడా పరీక్ష చేయించుకున్నాము. బాబా దయవలన మా రిపోర్టులు నెగిటివ్ అని వచ్చాయి. అయినప్పటికీ నాకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించింది. దాంతో డాక్టర్, "ఈసీజీ చేయించమ"ని సలహా ఇచ్చారు. అయితే బాబా సూచన మేరకు నేను ఈసీజీతో పాటు రక్తపరీక్షలు కూడా చేయించుకున్నాను. ఆ రక్తపరీక్షల ఆధారంగా నాకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని బయటపడింది. దాంతో డాక్టరు అందుకు అవసరమైన మందులు ఇచ్చారు. ఇకపోతే బాబా ఆశీస్సులతో మావారి ఐసొలేషన్ పూర్తయింది. ఆయన పూర్తిగా కోలుకొని నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చారు. దృఢమైన విశ్వాసం ఉన్నవారికి బాబా సహాయం, ఆశీస్సులు తప్పక లభిస్తాయి. "థాంక్యూ సో మచ్ బాబా. ప్రస్తుత కరోనా పరిస్థితులను తొలగించి దేశ విదేశాలలోని సామజిక జీవనం తిరిగి సాధారణ స్థితికి వచ్చేలా ఆశీర్వదించండి. ఈ పరిస్థితుల కారణంగా మేము మీ దర్శనానికి శిరిడీ కూడా రాలేకపోతున్నాము. దయచేసి తొందరగా అనుగ్రహించండి బాబా".
బాబా అనుగ్రహంతో మరుసటిరోజుకి పూర్తి ఆరోగ్యం
నా పేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. ముందుగా సాయిభక్తులందరికీ నా వినయపూర్వకమైన ప్రణామాలు. 2021లో కోవిడ్ పాజిటివ్ కేసుల పెరుగుదల చాలా ఎక్కువగా ఉన్నందువల్ల, ‘ఆఫీసుకి వెళ్లడమా? లేక ఇంటినుండి పని చేయడమా?’ అన్నది తేల్చుకోలేక చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. అటువంటి స్థితిలో ఏప్రిల్ నెల మూడవ వారంలో ఒకరోజు రాత్రి హఠాత్తుగా నాకు ఒంటినొప్పులు మొదలయ్యాయి. ఒంటినొప్పులు తగ్గటానికి నేను డోలో టాబ్లెట్ తీసుకున్నాను. ఆ టాబ్లెట్ ప్రభావం వల్ల తాత్కాలికంగా కాస్త ఉపశమనం లభించినప్పటికీ మరుసటిరోజు రాత్రి మళ్ళీ ఒంటినొప్పులు, దానితోపాటు కొద్దిపాటి జ్వరం కూడా వచ్చింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! ఈ ఒంటినొప్పులు, జ్వరం నుండి నాకు ఉపశమనం లభించేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించి ఊదీ పెట్టుకున్నాను. బాబా అనుగ్రహంతో మరుసటిరోజుకి నాకు పూర్తి ఆరోగ్యం చేకూరింది. "సాయి ప్రభూ! మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు"
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

