సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 782వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ‘బాబా నిత్య సత్యంగా ఉన్నారు’
  2. బాబా అనుగ్రహంతో అన్నీ అనుకూలంగా ఉంటాయి
  3. కలలో దర్శనమిచ్చి ధైర్యాన్నిచ్చిన బాబా

‘బాబా నిత్య సత్యంగా ఉన్నారు’ 


సాయిభక్తురాలు శ్రీమతి భారతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం సాయినాథాయ నమః. నేను ఈ బ్లాగ్ గురించి నిన్ననే (2021, ఏప్రిల్ 25) తెలుసుకోవడం జరిగింది. సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకి హాయిగా ఉంది. ముందుగా, ఇలాంటి ఆలోచన వచ్చిన బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదములు. ఈ బ్లాగులో భక్తులు పంచుకునే చిన్న చిన్న అనుభవాల లాంటివి నా జీవితంలో కోకొల్లలు. వాటన్నిటికంటే, నాకు బాగా గుర్తుండిపోయిన, ‘బాబా నిత్య సత్యంగా ఉన్నారు’ అని నేను బలంగా నమ్మిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను.


ఇది ఇప్పటి అనుభవం కాదు. 2010లో జరిగిన అనుభవం. అప్పట్లో మేము కాకినాడలో నివసించేవాళ్ళం. మా పాప 6వ తరగతి చదువుతూ ఉండేది. తనకు అప్పుడు విజయవాడలోని ‘హాయ్‌ల్యాండ్’ అనే అమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లాలని చాలా తీవ్రమైన కోరిక ఉండేది. మావారికి మామూలుగానే అలాంటి సరదాలు కొంచెం తక్కువ, పైగా ఆ సమయంలో తను ఎవరినో నమ్మి పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాక ఆ విషయంలో చాలా టెన్షన్‌గా ఉండేవారు. అందువల్ల, ‘ఆ టెన్షన్లు ఎప్పుడూ ఉండేవే, పాప సరదా పడుతోంది కదా, తన కోరిక తీరిస్తే మనం కూడా బయటకి వెళ్లి కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంద’ని ఎన్నిసార్లు అడిగినా ఆయనకి రావాలనిపించేది కాదు. ‘మీరిద్దరూ వెళ్ళండి’ అనేవారు. విజయవాడలో మా బంధువులు ఉన్నారు. అక్కడికి వెళ్లి వాళ్ళతో కలిసి హాయ్‌ల్యాండ్ చూసి రమ్మని ఆయన ఉద్దేశ్యం. మా పాపకేమో మా ఇద్దరితో కలిసి వెళ్లాలని ఉండేది. ఒకరోజు ఈ విషయంలో మా మధ్య పెద్ద వాదన జరిగి, ఎన్నిరకాలుగా చెప్పినా తను ఒప్పుకోవట్లేదని చిరాకుతో నేను మా పాపను తీసుకుని విజయవాడ బయలుదేరాను. ఆరోజు మావారు మమ్మల్ని కారులో స్టేషన్ దగ్గర దిగబెట్టినప్పుడు కూడా మాతో రమ్మని బ్రతిమాలి విఫలమయ్యాము. వాళ్ళ నాన్న రాననేసరికి పాప ఏడ్చేసింది, అది చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు కూడా మావారు, ‘ఎందుకు ఏడుపులు?’ అని తిట్టారే కానీ మాతో రావటానికి ఒప్పుకోలేదు. కారణం, తనకి మనసంతా ఎన్నో చిరాకులతో నిండివుండి విహారానికి వచ్చే మూడ్ లేదు. సరే, ఇక మేమే బయలుదేరాం. ఏదో పాప సరదా కోసం వెళ్తున్నానే కానీ నాకూ మనసు బాగాలేదు. దారిలో అప్పుడప్పుడూ అలా కళ్ళు తడి అవుతూనే ఉన్నాయి. ఇంతలో, దారిలో కొన్నానో, లేక ఇంటినుంచే తెచ్చానో గుర్తులేదుగానీ, ఆంధ్రభూమి పుస్తకం చదువుతుంటే అందులో సాయిలీలలకు సంబంధించిన వ్యాసం చదవడం జరిగింది. ‘బాబా నిజంగా ఉన్నారు, పిలిస్తే పలుకుతారు’ అని నిరూపించే దృఢమైన నిదర్శనాలేవో అందులో వ్రాశారు. అది చదివి విరక్తిగా నవ్వుకున్నాను. ఆ వెంటనే బాబాను సవాలు చేసినట్టు అనుకున్నాను, “నువ్వు నిజంగా ఉంటే మావారు కూడా అక్కడికి వచ్చేటట్టు చెయ్యి” అని. నేను అప్పటికే దాదాపు 15 సంవత్సరాల నుంచి సాయిభక్తురాలిని. కానీ ఎప్పుడూ ఆయనను ఇలా సవాలు చెయ్యలేదు. సరే, సాయంత్రం అయ్యేసరికి విజయవాడ చేరాం. అన్నయ్య వాళ్ళింటికెళ్లి కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని భోజనం చేసి పడుకున్నాము. పడుకునేముందు మావారు నాకు ఫోన్ చేసి మేము క్షేమంగానే చేరామని తెలుసుకుని పెట్టేశారు. కానీ మనసులో ఏదో దిగులు అలాగే ఉంది. ఎప్పటికో కలతగా నిద్రపట్టింది. నిద్రలో ఏవో కలలు. కాసేపటికి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. కొంచెం తెలివి వచ్చి వింటుంటే మావారి గొంతులా అనిపించింది. కానీ నిద్దట్లో ఏదో కల వస్తోందని అనుకుంటున్నాను. మాటలు అలాగే వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి లేచి చూసేసరికి సమయం తెల్లవారుఝాము 5.30 అయింది. హాలులో నా భర్త కనిపించారు. ఆ క్షణం నాకు కలిగిన అనుభూతిని వర్ణించడానికి నాకొచ్చిన భాష సరిపోదు. తను వచ్చారన్న ఆనందం కంటే సాయి కృప గుర్తొచ్చి ఒళ్ళు అదోరకమైన అలజడికి లోనైంది. ఒళ్ళంతా గగుర్పొడిచినట్టు అయింది. ఆ క్షణం శరణాగతి చెందాను సాయికి. ఈరోజు వరకు ఆ శరణాగతి భావన మనసులో అలానే నిలిచివుంది. ఆ క్షణం నాకు మాటల్లేవు. ఆ తర్వాత మావారితో మాట్లాడితే జరిగిన విషయం చెప్పారు. అదేమిటంటే, మమ్మల్ని రైలు ఎక్కించి వెళ్ళాక తను ఆరోజు అవుతుంది అనుకున్న పని కూడా అవలేదట. దాంతో ఇంకా చిరాకుగా అనిపించిందట. పైగా మా ఏడుపులు గుర్తొచ్చి నిద్రపట్టక ఎందుకో అప్పటికప్పుడు అనిపించి రాత్రి 11 గంటలకు బస్టాండుకి వెళ్లి అక్కడ విజయవాడకు వచ్చే బస్సు ఉంటే ఎక్కేశారట. తెల్లవారేసరికి అన్నయ్య వాళ్ళింటికి వచ్చేశారు. 


సాయిబంధువులూ! మీరే చెప్పండి. మేము ఎన్నోసార్లు అడిగి, ఎంతగానో బ్రతిమాలి, మొత్తుకుని, ఏడ్చినా స్పందించని మనిషికి ఆ ప్రేరణ ఇచ్చిందెవరు?


ఈ సంఘటనకి ముందూ, తర్వాత కూడా నాకు ఎన్నో అనుభవాలున్నా నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయిందీ, నన్ను మరింతగా బాబా బాటలోకి వెళ్లేలా చేసిందీ ఈ అనుభవమే. అద్భుతాలు జరగాలని ఎప్పుడూ అనుకునేదాన్ని, కానీ ఇలా ఇంత త్వరగా ఇంతటి అద్భుతమైన అనుభవం నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు.


ఇక ప్రస్తుతానికి వస్తే, బాబా నా కోరికలన్నీ తీర్చేశారని చెప్పనుగానీ, నా మనసులో చాలా పరిపక్వతను కలిగించారు. ‘నాకు ఇది కావాలి బాబా’ అని అడిగే స్థితి నుండి ‘నాకేది మంచిదో అదే అనుగ్రహించు బాబా, నువ్వు ఇచ్చిందే నీ ప్రసాదంగా భావిస్తాను’ అని అడిగే స్థాయికి బాబా నన్ను తీసుకువచ్చారు. నిజానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ బాబా అనుగ్రహం కోసం వేచిచూస్తున్నాను. ఆ సమస్య నుంచి బాబా నన్ను గట్టెక్కిస్తే బ్లాగులో అనుభవాన్ని పంచుకోవాలని నిన్న ఈ బ్లాగ్ చూసినప్పుడు అనుకున్నాను. కానీ, ‘నా జీవితంలో జరిగిన ఇంతటి అద్భుతాన్ని కూడా ఎందుకు అందరితో పంచుకోకూడదు?’ అనిపించి, వెంటనే బాబా ప్రేరణతో మీతో పంచుకోవడం జరిగింది. బ్లాగ్ రూపకర్తలకు మరొకసారి నా ధన్యవాదములు. రేపటి భాగంలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను.


సర్వం సాయిమయం.


బాబా అనుగ్రహంతో అన్నీ అనుకూలంగా ఉంటాయి


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రీతి. నేను రెండవసారి సాయిబంధువులతో నా అనుభవాలను పంచుకుంటున్నాను.


మొదటి అనుభవం: కొన్ని కారణాల వలన గతంలో నేను ఉంటున్న ఇంటినుండి వేరే ఇంటికి మారాలని అనుకున్నాను. ఆ విషయమై నేను బాబాను, "అందుబాటులో ఉండే అద్దెతో, మంచి ఇరుగుపొరుగు ఉండేలా చక్కటి ప్రదేశంలో మంచి ఇంటిని చూపించమ"ని ప్రార్థించాను. నా ప్రార్థన మన్నించి బాబా ఎంతో కృపతో నాకొక చక్కని ఇంటిని చూపించారు. కానీ కోవిడ్ కారణంగా నేను రెండు, మూడు నెలల వరకు క్రొత్త ఇంటికి మారలేకపోయాను. అప్పుడు నేను, "బాబా! వీలైనంత తొందరగా నేను ఇల్లు మారేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. తరువాత బాబా దయవలన నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇల్లు మారగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా".


రెండవ అనుభవం: ఇటీవల నేను కోవిడ్ బారినపడ్డాను. అయితే బాబా ఆశీస్సుల వలన నీరసం తప్ప ఎక్కువ కష్టాన్ని నేను ఎదుర్కోలేదు. కేవలం నాలుగైదు రోజుల్లో నేను కోలుకున్నాను. 14 రోజుల క్వారంటైన్ తరువాత నేను టెస్ట్ చేయించుకున్నాను. కానీ రిపోర్టు ఎలా వస్తుందో అని ఆందోళన చెంది 'సాయి మహరాజ్ సన్నిధి' వాట్సాప్ గ్రూపు తెరిచాను. అందులో బాబా నాకు ఈ క్రింది మెసేజ్ ఇచ్చారు. అది చూసి నాకు చాలా చాలా ఆనందంగా, ప్రశాంతంగా అనిపించింది. బాబా ఆశీస్సులతో రిపోర్టు నెగిటివ్ వచ్చింది. "థాంక్యూ బాబా".


కలలో దర్శనమిచ్చి ధైర్యాన్నిచ్చిన బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులకు నా నమస్కారాలు. మేము మా అబ్బాయి వివాహం 2021, మే 26న జరపాలని నిశ్చయించుకున్నాము. అలాగే, మే 17న గృహప్రవేశం జరుపుకోవాలని అనుకున్నాము. ఏప్రిల్ 29న లగ్నపత్రిక వ్రాయించుకుందామని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు. అయితే ప్రస్తుత కరోనా ప్రభావం వల్ల నేను చాలా టెన్షన్ పడి, "ఎలా బాబా? పెళ్లికూతురు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి లగ్నపత్రిక గురించి చెప్పాలి బాబా" అని అనుకున్నాను. ఏప్రిల్ 24 రాత్రి బాబా నాకు కలలో దర్శనమిచ్చారు. ఆ కలలో బాబా మా ఇంట్లో నిలబడి, తమ చేతిలో సటకా పట్టుకుని నాకు ధైర్యం చెప్తున్నారు. నేను ఆనందంతో, "బాబా వచ్చారు, బాబా వచ్చారు, ఇక భయం లేదు" అని కలలోనే అంటున్నాను. అంతటితో కల ముగిసింది. నేను కోరుకున్నట్లే పెళ్లికూతురు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. బాబా ఆశీస్సులతో ఏప్రిల్ 29న లగ్నపత్రిక వ్రాసే కార్యక్రమం పూర్తయింది. "బాబా! నాకు కలలో దర్శనమిచ్చి ధైర్యం చెప్పారు. అలాగే వాళ్ళనుండి ఫోన్ వచ్చింది, మీ దయతో లగ్నపత్రిక వ్రాయడం కూడా పూర్తయింది. కరోనా ప్రభావం లేకుండా పెళ్లి కూడా బాగా జరగాలి. అదే నా కోరిక.  మీరే నా ధైర్యం బాబా, భారం మీ మీదే వేస్తున్నాను. ఇక మీరే దిక్కు. మిమ్మల్నే నమ్ముకున్నాను. అంతా మంచిగా, నాకు అనుకూలంగా జరిగితే మళ్లీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా".


9 comments:

  1. Om Sai ram baba see if we trust you you will Procet us.that is your power. Thank you baba.I am your devotee over many years.take care of my family.Om Sai ram 🙏🏽🙏🏽🙏🏽🌹👏🙌❤️🌹

    ReplyDelete
  2. Kothakonda SrinivasMay 22, 2021 at 6:50 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri

    ReplyDelete
  5. 🌼🌺🙏Om Sairam🙏🌺🌼

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo