సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 774వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా నాకు 'రామరక్షాస్తోత్రం' అనుగ్రహించిన వైనం
  2. మనఃపూర్వకంగా ప్రార్థిస్తే బాబా తప్పకుండా కాపాడుతారు


బాబా నాకు 'రామరక్షాస్తోత్రం' అనుగ్రహించిన వైనం


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


అందరికీ నమస్కారం. బాబా ప్రసాదించిన ఒక గొప్ప అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఇది 2017 లేదా 2018లో జరిగింది. ఈ అనుభవాన్ని ఇప్పుడు ఎందుకు పంచుకుంటున్నానో కూడా చెప్తాను. ఆరోజు గురువారం. ఉదయం సుమారు 11 గంటల సమయంలో నేను ఏదో పనిలో ఉండగా అకస్మాత్తుగా, ‘రామరక్షాస్తోత్రం చదువు’ అని ఒక స్వరం చాలా స్పష్టంగా వినిపించింది. అప్పటివరకు నేను ఆ స్తోత్రం పేరు వినటమే తప్ప ఎప్పుడూ చదవలేదు. దానిలో ఏం శ్లోకాలు ఉంటాయో కూడా తెలీదు. వెంటనే గూగుల్‌లో వెతికి శ్రీరామరక్షాస్తోత్రం చదివాను. అలాగే, ఆడియో కూడా విన్నాను. శ్రీరామరక్షాస్తోత్రం చదివాక ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత కాసేపటికి మా చిన్నమ్మ వాట్సాప్‌లో నాకు ఒక ఫోటో పంపింది. ఒక భక్తుడు స్వామికి మాల వేయాలని ప్రయత్నిస్తుంటే స్వామి ముందుకి వంగి మాల వేయించుకునే ఫోటో అది. బహుశా మీలో చాలామంది ఆ ఫోటోను చూసే ఉంటారు. ఆ ఫోటోలో ఒకప్రక్కన ఒక మెసేజ్ – “నిర్మలమైన భక్తి నీదైతే నువ్వు నమ్మే దైవం నీ వెంటే” అని. అది చూసి, ‘బాగుంది’ అనుకున్నాను, అంతే. ఆరోజు సాయంత్రం మా నానమ్మ బంధువులు కొందరు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే మా నానమ్మ, “ఏవో బాజాలు వినిపిస్తున్నాయి, దేవుడు ఊరేగుతున్నాడనుకుంటా” అన్నారు. కానీ మాకెవరికీ ఏ బాజాలూ వినిపించలేదు. ఆరోజు ఏమైనా విశేషమైన రోజేమోనని కేలండర్ చూశాము. కానీ ఆరోజు ఏం విశేషం లేదు. ‘ఏ విశేషం లేకుండా దేవుడి ఊరేగింపు ఎందుకు జరుపుతారు?’ అని అందరం అనుకున్నాం. వచ్చిన బంధువులలో ఒకావిడ ‘నానమ్మది అంతా చాదస్తమ’ని వేళాకోళం ఆడింది కూడా. కాసేపటికి వాళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత రాత్రి 7.30-8.00 సమయంలో నిజంగానే దేవుడు ఊరేగుతూ వచ్చారు. అందరం ఆశ్చర్యపోయాము. అందరం పల్లకి వద్దకు వెళ్ళి దణ్ణం పెట్టుకున్నాము. పల్లకిలో ఉన్న చిన్న చిన్న దీపాల వెలుగు తప్ప చుట్టూ ఎక్కడా వెలుతురు లేనందువల్ల దణ్ణం పెట్టుకునేటప్పుడు పల్లకిలో ఉన్నది ఏ దేవుడో మాకు తెలియలేదు. అలాగే దణ్ణం పెట్టుకున్నాం. నానమ్మ పూజారిగారిని అడిగింది, “ఎందుకు ఇవాళ దేవుణ్ణి ఊరేగించారు?” అని. ఆయన ఏదో సమాధానం చెప్పారు, కానీ వాయిద్యాల హోరులో ఆయన చెప్పిన సమాధానం ఎవరికీ వినిపించలేదు. ఊరేగింపు వెళ్ళిపోయాక నేను పూజారిగారు ఇచ్చిన కుంకుమ పెట్టుకుంటూ అమ్మని అడిగాను, ‘పల్లకిలో ఉన్న దేవుడు ఎవరు?’ అని. “నాకు కూడా తెలియలేదు. అయినా ఇంకెవరు ఉంటారు? మన రాముడే అయివుంటాడు” అంది అమ్మ. కుంకుమ పెట్టుకుంటున్న నేను ఆ మాట విని నిశ్చేష్టురాలినై అలాగే ఉండిపోయాను. కళ్ళలో నీళ్ళు. “కళ్ళలో కుంకుమ పడిందా?” అని అమ్మ అడిగింది. తనకు ఏం చెప్పానో కూడా గుర్తులేదు. ఆరోజు ఉదయం నుంచి జరిగినవన్నీ ఒక్కసారిగా నా కళ్ళముందు మెదిలాయి. ఉదయం నాచేత రామరక్షాస్తోత్రం చదివించారు. ఆ వెంటనే, ‘నువ్వు నమ్మే దైవం నీతోనే’ అనే మెసేజ్ ఇచ్చారు. తిరిగి ఆ సాయంత్రం, ‘నేను బయలుదేరబోతున్నాను’ అని నానమ్మ ద్వారా చెప్పించారు. కాసేపటికి నా గుమ్మం ముందుకే వచ్చి నాకు దర్శనం ప్రసాదించారు. ఇవన్నీ స్వామి ఎంత అందంగా నడిపించారో చూడండి. ఇప్పటికీ మాకు తెలీదు, ఆరోజు దేవుడు ఎందుకు ఊరేగారు అని. అప్పటినుంచి ప్రతి గురువారం శ్రీరామరక్షాస్తోత్రము పఠించడం ప్రారంభించాను. గత ఏడాది వరకూ అలాగే చేశాను. గత ఏడాది నుంచి గురువారంరోజున మహాపారాయణలో బిజీ అవటం వల్ల అదేరోజు రామరక్షాస్తోత్రం చదవటం కుదరక మానేశాను. ‘గురువారం కుదరకపోతే వేరే రోజైనా ఆ స్తోత్రం చదువుకోవచ్చు’ అనే ఆలోచన కూడా రాలేదు. నా సాయి ఆ ఆలోచన ఇవాళ (2021, ఏప్రిల్ 20) కలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ మహాపారాయణ నిర్వాహకులు, “ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న విషమ పరిస్థితుల నేపథ్యంలో బాబా ఆజ్ఞతో రామరక్షాస్తోత్రం గ్రూపులను ప్రారంభిస్తున్నాము. వారంలో మీకు వీలైనరోజున పారాయణ చేయవచ్చు” అని మెసేజ్ పెట్టి, దానికి సంబంధించిన లింక్స్ షేర్ చేశారు. ఆ మెసేజ్ చూడగానే, ‘తానే స్వయంగా నాతో మొదలుపెట్టించిన స్తోత్ర పారాయణ నా మహాపారాయణకి ఇబ్బందిలేకుండా మరోరోజు చదవమని బాబానే చెప్పారు’ అనిపించింది. మళ్ళీ నాతో రామరక్షాస్తోత్ర పారాయణ ప్రారంభింపజేస్తున్న నా సాయికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వెంటనే శనివారం గ్రూపులో జాయిన్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబోతున్న ఈ పారాయణ ఏ ఆటంకాలూ లేకుండా కొనసాగేలా అనుగ్రహించమని బాబాను కోరుకుంటున్నాను. 


"నేడు నీ దివ్య పాదాబ్జముల్ గాక గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మెల్లరున్ కాపాడు దీనబంధూ, మహాదేవా! దయాసింధూ! శ్రీ సాయినాథా! నమస్తే నమస్తే నమః".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు! శుభం భవతు!


మనఃపూర్వకంగా ప్రార్థిస్తే బాబా తప్పకుండా కాపాడుతారు


హైదరాబాదు నుండి సాయిభక్తుడు శశిధర్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు శశిధర్. నేను హైదరాబాదులోని మదీనాగూడలో ఉంటాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2021, ఏప్రిల్ 18వ తేదీన మా కుటుంబసభ్యులమంతా కలిసి గోదాదేవి సమేత రంగనాయకస్వామి (ఏదులబాదు) గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. సాయంత్రం వరకు బాగానే ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చింది. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నాకు ఇలా జ్వరం రావటంతో మా కుటుంబసభ్యులు చాలా భయపడ్డారు. కానీ నేను మాత్రం భగవంతుడైన సాయిబాబాకు నమస్కరించుకుని, “సాయీ! నాకు జ్వరం పెరగకుండా చూడు. రేపు ఉదయానికల్లా పూర్తిగా నయమయ్యేలా అనుగ్రహించు” అని వేడుకుని, అగరుబత్తీల నుంచి రాలిపడిన ఊదీని బాబా ప్రసాదితంగా భావించి బాబాను స్మరించుకుంటూ విభూతి ధారణ చేశాను. సాయినాథ్ మహరాజ్‌ను స్మరిస్తూ ఒక డోలో-650 టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. అర్థరాత్రి సమయానికి చాలావరకు తగ్గిన జ్వరం మరుసటిరోజు ఉదయానికి పూర్తిగా తగ్గిపోయింది. నేను ఇక్కడ చెప్పదలకున్నది ఒక్కటే - సాయిబాబాను మనఃపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన మనల్ని తప్పకుండా కాపాడుతారు.


సర్వేజనాః సుఖినోభవంతు. శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


5 comments:

  1. Om sai ram sai Rama Raksha stotram is very powerful.please read this on Saturday it is very powerful.Hanuman recite it.it is same to homam.udi is powerful medicine to all devotees. ❤❤❤❤

    ReplyDelete
  2. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister..

    ReplyDelete
  3. JAI SAIRAM
    JAI SAIRAM
    JAI SAIRAM

    ReplyDelete
  4. Om sai ram baba amma urology problem tondarga cure cheyi thandri please

    ReplyDelete
  5. శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo