సాయి వచనం:-
'ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగివుంటారో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపిస్తాను.'

''బాబా నావారు, నాకు చెందినవారు, నేను ఆయనకు చెందినవాడిని’ అనే ఎరుక ఉంటే అది చాలు!' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 785వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా మన చెంత ఉండగా కంగారుపడాల్సిన పనిలేదు
  2. సాయి కృపవలన చేకూరిన ఆరోగ్యం
  3. తొందరగా నా బిడ్డకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన దయగల సాయితండ్రి

బాబా మన చెంత ఉండగా కంగారుపడాల్సిన పనిలేదు


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రాజేంద్ర. 2021, తొలినెలల్లో మా ఇంట్లో నాకు, నా భార్యకు, మా ఇద్దరి పిల్లలకు కోవిడ్ వచ్చింది. అందరం జ్వరం, ఒళ్ళునొప్పులతో ఇబ్బందిపడ్డాము. మాతో పాటు పిల్లలకు కూడా కోవిడ్ వచ్చేసరికి మేము చాలా కంగారుపడ్డాము. కానీ, బాబా మన చెంత ఉన్నప్పుడు మనం ఏమాత్రం కంగారుపడాల్సిన పనిలేదు. అందువల్ల నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మాకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ఈ గండం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి” అని చెప్పుకున్నాను. మేము ప్రతిరోజూ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నుదుటన పెట్టుకుంటుండేవాళ్ళము.


నాకు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ‘సాయిబాబా ప్రశ్న-సమాధానాలు’ చూడడం అలవాటు. ఒకరోజు నేను మా ఆరోగ్యం గురించి బాబాను ప్రార్థించి, బాబా సమాధానం కోసం చూశాను. అప్పుడు బాబా నుండి ఇలా సమాధానం వచ్చింది: "బాధపడకు, నీ కష్టాలు తీరి నీకు విజయం లభిస్తుంది. నీ ఆరోగ్యం కుదుటపడుతుంది" అని. దాంతో మేమింక ఏ అనుమానం లేకుండా మా భారమంతా బాబా పైన వేసి నిశ్చింతగా ఉన్నాము. ఒక వారంరోజుల్లో మేమంతా ఎటువంటి ఇబ్బందీ లేకుండా కోవిడ్ నుండి కోలుకున్నాము. అంతా సాయిబాబా దయ. మనం కష్టంలో ఉన్నప్పుడు భారం బాబా పైన వేసి ప్రార్థిస్తే ఇంక మనకు భయం అనవసరం, అంతా బాబానే చూసుకుంటారు. “ధన్యవాదాలు బాబా! ఇలానే ఎల్లప్పుడూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడమని ప్రార్థిస్తున్నాను”.


సాయి కృపవలన చేకూరిన ఆరోగ్యం


సాయిబంధువులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శశి. మా నాన్నగారు బాబాకు గొప్ప భక్తులు. వారివలన నాకు కూడా బాబాపై భక్తి, గౌరవం అలవడ్డాయి. బాబా ఎంతో కృపతో మాకు చిన్న, పెద్ద అనుభవాలు చాలా ప్రసాదించారు. వాటిలో నుండి ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


మావారి వృత్తిరీత్యా మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. 2021లో ఒకరోజు రాత్రి, వేరే ఊరిలో ఉన్న మా మామగారికి ఆరోగ్యం బాగాలేదనీ, ఆయన విరోచనాలు, వాంతులతో బాధపడుతున్నారనీ, తనకు కళ్ళు తిరుగుతున్నాయనీ మాకు ఫోన్ వచ్చింది. రాత్రి సమయం కాబట్టి మాకు ఏం చేయడానికీ తోచక చాలా భయమేసింది. వెంటనే నేను బాబాను తలచుకొని, “మా మామగారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆయనకు ఏ ఆపదా రాకుండా చూడమ”ని వేడుకొని, కొద్దిగా ఊదీని తీసుకొని నా నుదుటన ధరించి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి నేనే త్రాగాను. బాబా దయవలన ఆయనకు విరోచనాలు, వాంతులు తగ్గాయని రెండు గంటలకు మాకు ఫోన్ వచ్చింది. మరుసటిరోజు ఉదయం మేము బయలుదేరి ఊరికి వెళ్లేసరికి ఆయన ఆరోగ్యం కుదుటపడి, టీవీ చూస్తూ కూర్చుని ఉన్నారు. "సాయీ! మీరు చూపించిన కృపకు ధన్యవాదాలు, అనేక వేల నమస్కారాలు. సదా మీ ఆశీస్సులు మా అందరిమీదా వర్షించండి బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


తొందరగా నా బిడ్డకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన దయగల సాయితండ్రి


ముందుగా తోటి సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు సునీత. మాకు ఇద్దరు పిల్లలు. 2021, ఏప్రిల్ 28, బుధవారంనాడు వేరే ఊరిలో ఉండి చదువుకుంటున్న మా పెద్దబాబు మాకు ఫోన్ చేసి, 'తనకు కాస్త గొంతునొప్పి, జ్వరం ఉన్నాయ'ని చెప్పాడు. అది వింటూనే నేను, మావారు కంగారుపడ్డాము. అది కరోనా సమయం అయినందున అసలే కరోనా వలన రోజులు బాగాలేవని చాలా భయపడ్డాము. మేము మళ్ళీ ఫోన్ చేస్తే, నీరసం కారణంగా తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో మా కంగారు రెట్టింపు అయింది. మావారు, "సరే, నేను బయలుదేరి వెళ్తాను" అన్నారు. నేను, "చిన్నబాబుని పంపుదామ"ని అన్నాను. కానీ, "ఒక అబ్బాయి ఆరోగ్యం బాగలేకపోతే, మరో అబ్బాయిని పంపించడం ఏమి న్యాయం బాబా?" అని చాలా బాధపడ్డాము. అయితే, మా చిన్నబాబు, "నేను వెళ్తాను, నాకేమీ కాదు, మీరు కంగారుపడకండి" అని మాకు నచ్చచెప్పి, అదేరోజు మధ్యాహ్నం బయలుదేరి వెళ్లాడు. పిల్లల ఆరోగ్య విషయంలో ఆందోళనతో నేను, "బాబా! శుక్రవారానికల్లా పెద్దబాబుకి జ్వరం తగ్గేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. దయగల తండ్రి శుక్రవారం ఉదయానికల్లా మా పెద్దబాబు జ్వరం తగ్గేలా అనుగ్రహించారు. అది మాములు జ్వరమనీ, వేడి చేయడం వలన వచ్చిందనీ డాక్టరు నిర్ధారించారు. ఒకవేళ అది కరోనా అయి, పిల్లలిద్దరూ అక్కడ ఉంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా ప్రేమతో బాబా కాపాడారు. బాబా తన బిడ్డలను ఎప్పటికీ కష్టపెట్టరు. "దయగల తండ్రీ! మీ పాదాలకు శతకోటి వందనాలు. సదా నా కుటుంబాన్ని, మీ భక్తులందరినీ కాపాడు తండ్రీ. ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి



11 comments:

  1. 🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  2. Om sai ram om sai ram om sai ram❤❤

    ReplyDelete
  3. Om sai ram om sai ram om sai ram❤❤❤ please bless my family

    ReplyDelete
  4. Om Sri Sairam��������

    ReplyDelete
  5. Om sai Sri sai jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  8. 🌟🏵🌺🌸🌺🙏 OM SRI SAINADHAYA NAMAHA🙏🌺🌸🌺🏵🌟

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo