ప్రముఖ చిత్రకారుడు, సాయిభక్తుడైన శ్యామారావు జయకర్ కుమారుడు సురేందర్ చెప్పిన కొన్ని అనుభవాలు:-
- శిరిడీలో రఘునందన్ జయకర్ మరణం
- నానావలి బారినుండి బాబా కాపాడుట.
- నా కుమారుని ఉపనయన వేడుక
- మా నివాసానికి బంగ్లాను ఏర్పాటు చేసిన బాబా
శిరిడీలో రఘునందన్ జయకర్ మరణం
ప్రసిద్ధ ద్వారకామాయి బాబా చిత్రపటాన్ని చిత్రించిన సమయంలో మా నాన్నగారు (శ్యామారావు జయకర్) తన కుటుంబంతోపాటు సుమారు 8 నెలలు శిరిడీలోనే ఉన్నారు. ఆయన కుమారులలో ముఖ్యంగా రఘునందన్ బాబాకు చాలా ప్రియమైనవాడు. బాబా రఘనందన్‌ను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని స్వీట్స్ ఇస్తుండేవారు. తరచూ అతని ముక్కును కూడా శుభ్రపరుస్తుండేవారు. దురదృష్టవశాత్తూ రఘునందన్‌కు మశూచి వ్యాధి సోకి కేవలం 5 సంవత్సరాల వయస్సులో శిరిడీలోనే మరణించాడు. మా అమ్మగారు తీవ్రమైన దుఃఖంతో బాబా వద్దకు పరుగుతీసి ఆయన పాదాలు పట్టుకుని, "బాబా! రఘు మీకు ఇష్టమైనవాడు. తనని మీరు చాలా లాలించేవారు. అయినప్పటికీ మీరు తనని చనిపోనిచ్చారు" అని అన్నది. అప్పుడు బాబా, "రఘు మీ బిడ్డ, నాకిష్టమైనవాడు. కానీ తను చాలా ఆధ్యాత్మిక సామర్థ్యం కలిగి ఉన్నవాడు. అందువల్ల తను ఈ దుష్టప్రపంచంలో ఇమడలేడు. అయినప్పటికీ నేను తనని మీ కొడుకుగా తిరిగి తీసుకువస్తాను" అని అన్నారు. ఈ విధంగా మాట్లాడి బాబా అమ్మను ఓదార్చారు. బాబా మాటలు ఏ కష్టాన్నైనా ప్రశాంతంగా ఎదుర్కొనే మానసిక బలాన్ని ఆమెకు ఇచ్చాయి. బాబా మాటలు చాలా శక్తివంతమైనవి. ఈరోజు కూడా మీరు వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అవి ఎంత శక్తివంతమైనవో గ్రహిస్తారు.
ఆ విషయమై గురించి సురేందర్ ఇలా అన్నారు, "నా తల్లి తన బిడ్డ మరణాన్ని అంగీకరించి ప్రశాంతంగా ఉందని తెలిసి నేను సంతోషించాను" అని. తరువాత అతను ఇంకా ఇలా చెప్పాడు: "రఘు వచ్చిన పని ముగియడంతో బాబా తనకి మరణాన్ని ప్రసాదించారు. తను మంచి ఆధ్యాత్మికస్థితిలో ఉన్నప్పటికీ బాబా తనని తిరిగి తీసుకువస్తానని నా తల్లితో చెప్పారు. దీనిని బట్టి బాబాలో విలీనమైన, అంటే విముక్తి పొందిన ఆత్మలను కూడా బాబా భూమి మీదకి రమ్మని పిలిస్తే అవి ఆయన ఆజ్ఞను పాటిస్తాయి అని తెలుస్తుంది" అని.
నానావలి బారినుండి బాబా కాపాడుట.
మరొక సందర్భంలో నానాబాబా మా నాన్నగారి చిన్నకొడుకైన సుమారు రెండు సంవత్సరాల శ్రీపాద్‌ను తన భుజాలపై ఎత్తుకొని ద్వారకామాయికి తీసుకువెళ్ళాడు. సభామండపంలో అడ్డంగా ఒక తీగ కట్టిబడి ఉంది. నానా శ్రీపాద్‌ని ఆ తీగ పట్టుకోమని చెప్పి, తనని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నేను క్రింద ప్లాట్‌ఫాంపై కూర్చొని ఉన్నాను. బాబా వద్ద కూర్చొని ఉన్న మా నాన్నగారు శ్రీపాద్‌ని చూసి, తను క్రిందపడిపోయే ప్రమాదం ఉందని కంగారుపడ్డారు. అదేసమయంలో బాబా, "నీ కొడుకు బ్రతకాలని అనుకోవడంలేదా? ఏమిటీ చూస్తున్నావు? తీగ పట్టుకొని వ్రేలాడుతున్న నీ కొడుకు కిందపడకముందే వెళ్లి తెచ్చుకో" అని అన్నారు. వెంటనే నాన్నగారు వెళ్లి శ్రీపాద్‌ను పట్టుకున్నారు. ఇంకా అక్కడే ఉంటే అటువంటి భయంకర సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందన్న భయంతో మా కుటుంబమంతా తిరిగి ముంబాయి వెళ్లిపోయాము. బాబా ఏకకాలంలో తన భక్తుల ప్రాపంచిక, ఆధ్యాత్మిక విషయాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉంటారు.
నా కుమారుని ఉపనయన వేడుక
1953వ సంవత్సరంలో నేను నా కుటుంబంతో ముంబైలో నివసిస్తుండేవాడిని. ఆ సంవత్సరం నా పెద్దకొడుకు విజయ్ ఉపనయన వేడుక చేయాలని నిర్ణయించుకున్నాను. మా కుటుంబమంతటికీ విజయ్ ఒక్కడే మగసంతానమైనందున ఆ వేడుకను ఘనంగా చేయాలని అందరమూ అనుకున్నాము. అయితే అది చాలా మొత్తంతో కూడుకున్న పని. సమయానికి నా వద్ద డబ్బులేదు. ఉపనయనానికి తేదీ నిర్ణయించి బంధువులను కూడా ఆహ్వానించాము. కానీ ఆ ఖర్చులు ఎలా భరిస్తాను అన్నదే సమస్య. అటువంటి నిస్సహాయస్థితిలో నేను బాబాను ప్రార్థించి శరణువేడాను. తరువాత నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా, ఆయన ముందు కొంతమంది భక్తులు కూర్చొని ఉండటం కనిపించింది. నేను బాబా వైపు తదేకంగా ఏకాగ్రచిత్తంతో చూశాను. బాబా కఫ్నీ ధరించి ఉన్నారు. ఆయన చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉంది. తరువాత ఆయన తమ స్థానం నుంచి లేచి దూరంగా వెళ్ళిపోతున్నారు. నేను ఆయనను అనుసరించి, ఆయన పాదాలు పట్టుకొని నా సమస్యను వివరించాను. బాబా నన్ను పైకి లేవదీసి, నా తలపై తమ చేయిపెట్టి ఆశీర్వదించారు. తరువాత ఆయన మరాఠీలో, "మీఠ్ (ఉప్పు) ప్యాకెట్ పంపిణీ చేయి" అన్నారు. అంతటితో కల ముగిసింది. బాబా చెప్పినదానికి అర్థం ఏమిటా అని నేను ఆలోచించాను, కానీ నాకేమీ అర్థం కాలేదు. నా భార్యకు, తల్లికి ఆ కల గురించి వివరించాను. వాళ్ళు కూడా బాబా మాటలలోని మర్మాన్ని గ్రహించలేకపోయారు. బాబా ఉప్పు పంపిణీ చేయమని ఎందుకు చెప్పారోనని నేను ఆందోళనపడుతూ ఉండేవాడిని. తరువాత ఒకరోజు ఆ విషయమై నేను తెలివైన, మంచి జ్ఞానమున్న నా సహోద్యోగి దిగాస్కర్‌ను కలిసి తనకి కల గురించి చెప్పి, దాని అర్థం ఏమిటని అడిగాను. అప్పుడు అతను నాతో, "ఉప్పు కాదు, స్వీట్లు పంపిణీ చేయమని బాబా చెప్పి ఉంటారు" అని చెప్పాడు. (మరాఠీలో ఉప్పుని మీఠ్ అని, స్వీట్స్‌ని మిఠాయి అని అంటారు. అదే ఈ గందరగోళానికి కారణం.) తరువాత అతడు, "ఏడు ప్యాకెట్ల స్వీట్స్ తీసుకుని ఏడుగురు ఫకీరులకు ఇవ్వు" అని చెప్పాడు. వెంటనే నేను ఏడు ప్యాకెట్ల మిఠాయి తీసుకొని, ఫకీర్లకు పంపిణీ చేశాను. రెండురోజుల తరువాత అనూహ్యరీతిన నాకు ఇద్దరు వేరువేరు వ్యక్తుల ద్వారా 500 రూపాయల చొప్పున ఋణం లభించింది. ఆ 1000 రూపాయలతో ఉపనయన వేడుకను ఘనంగా జరిపించాము.
మా నివాసానికి బంగ్లాను ఏర్పాటు చేసిన బాబా
నేను రిజర్వు బ్యాంకులో పనిచేసేవాడిని. బ్యాంకు నాకు కేటాయించిన అపార్టుమెంటులోనే నేను నా కుటుంబంతో నివసిస్తుండేవాడిని. 1967లో నా పదవీ విరమణ సమయం సమీపిస్తోంది. ఆ కారణంగా నేను అపార్టుమెంటును ఖాళీ చేయవలసిన పరిస్థితి రానుంది. దాంతో పదవీ విరమణ చేశాక ముంబాయి వంటి మహానగరంలో ఎక్కడ నివాసముండాలా అని నాకు భయం పట్టుకుంది. ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల క్రిందట మా అన్నయ్య విల్లేపార్లేలో ఒక బంగ్లా నిర్మించాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు అతడు మరణించాడు. ప్రస్తుతం మా వదినగారు మాత్రమే ఒంటరిగా ఆ బంగ్లాలో నివాసముంటున్నారు. ఒకరోజు నేను ఆమెను కలిసినపుడు మాటల సందర్భంలో 'నేను పదవీ విరమణ చేయబోతున్నానని, తరువాత వసతి సమస్యగా ఉంద'ని అన్నాను. అప్పుడు ఆమె నాతో, "ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నా భర్త ఈ ఇంటిని మీ కొడుకు పేరు మీద బదిలీ చేయమని నాతో ఇదివరకే చెప్పి ఉన్నారు. కాబట్టి మీరంతా ఇక్కడికే వచ్చి నాకు తోడుగా ఎందుకు ఉండకూడదు? ఇంటి బదిలీ కూడా పూర్తి చేయవచ్చు" అని చెప్పింది. దాంతో నేను నా కుటుంబంతో అక్కడికి వెళ్ళాను. అయితే బంగ్లా బదిలీ చేయడానికి పత్రాలు అవసరమయ్యాయి. ఎంతో శ్రద్ధగా ఇల్లంతా వెతికినప్పటికీ అవి కనిపించలేదు. ఆ స్థితిలో నేను బాబాను ప్రార్థించి, ఒకసారి సచ్చరిత్ర పారాయణ పూర్తిచేశాను. పారాయణ పూర్తి చేసిన రాత్రి నాకొక వింత కల వచ్చింది. కలలో బాబా అటకపై ఉన్న ఒక తుప్పుపట్టిన పెట్టెలో ఏదో వెతుకుతున్నారు. హఠాత్తుగా నాకు మెలకువ వచ్చి, పడక మీద నుంచి లేచి ఇంటి అటకపై పెట్టె కోసం వెతికాను. అచ్చం కలలో కనపడిన పెట్టె వంటిదే అక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను. వెంటనే దాన్ని తెరచి చూస్తే వెతుకుతున్న పత్రాలు అందులోనే ఉన్నాయి. ఆ విధంగా బాబా నేను పదవీ విరమణ చేశాక నాకు ఒక బంగ్లా ఏర్పాటు చేసి సహాయం చేశారు.
సమాప్తం
Ref : సురేందర్ జయకర్, సాయి అనుభవ్.
Source : డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.
Om sai sri sai Jaya Jaya sai. Om sai sri sai Jaya Jaya sai, Om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sairam
ReplyDeleteOm sai ram anta bagunde la chayandi tandri, amma nannalani kshamam ga chusukondi vaalla badyata meede tandri, vaallaki manchi arogyanni ayushni prasadinchandi tandri, ofce lo nannu eam anakunda WFH echaru daaniki chala thanks baba ika mundu kuda ofce lo ye project marchakunda prashantan ga unde la chudandi tandri, na manasuki nachakubda yedi jaragakunda chudandi tandri
ReplyDeleteOm sai ram anta bagunde la chayandi tandri, amma nannalani kshamam ga chusukondi vaalla badyata meede tandri, vaallaki manchi arogyanni ayushni prasadinchandi tandri, ofce lo nannu eam anakunda WFH echaru daaniki chala thanks baba ika mundu kuda ofce lo ye project marchakunda prashantan ga unde la chudandi tandri, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri
ReplyDelete