సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 250వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా పట్ల ప్రేమ నాకు కోపం రాకుండా చేసింది
  2. నిజంగా బాబా ఊదీ అద్భుతమైన ఔషధం

బాబా పట్ల ప్రేమ నాకు కోపం రాకుండా చేసింది

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా నన్ను తన సంరక్షణలోకి తీసుకోవడం నా అదృష్టం. నాపై దయతో ఆయన తమ ఆశీస్సులనిచ్చి నా జీవితంలో అడ్డంకులు దాటడానికి సహాయం చేస్తున్నారు. ఆయన ఉనికి లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను. బాబా ప్రేమను, ఆశీస్సులను అందరికీ పంచుతున్న 'సాయి యుగ్‌నెట్‌వర్క్.కామ్' బృందానికి నా ధన్యవాదాలు. మీరంతా బాబా ఆశీస్సులు పొందిన భాగ్యవంతులు. ఇక నా అనుభవాలకు వస్తే...

మొదటి అనుభవం:

ఒకసారి నేను 10 గంటలు విమాన ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చాను. వచ్చాక నా పాదాలలో వాపు వచ్చి ఉండటం నేను గమనించాను. మొదట కొన్నిరోజులు నేను వాటిని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడుస్తున్నా వాపు అలాగే కొనసాగుతుండటంతో నాలో ఆందోళన పెరిగింది. దాంతో పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. కానీ ఎటువంటి చేదు ఫలితాన్ని వినాల్సి వస్తుందోనన్న భయంతో, "రిపోర్టులన్నీ నార్మల్ గా ఉండేలా చూడండి బాబా" అని బాబాను వేడుకున్నాను. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని కూడా ఆయనకు మాట ఇచ్చాను. తరువాత నేను పరీక్షలకోసం పాథాలజీ ల్యాబ్‌లోకి వెళ్తూ, "ఏదో ఒక రూపంలో మీరు నాతో ఉన్నారన్న భరోసా ఇవ్వమ"ని(ఆయన ఎప్పుడూ నా హృదయంలో ఉంటూ భరోసా ఇస్తున్నప్పటికీ) బాబాను అడిగాను. అకస్మాత్తుగా రోడ్డుమీద వెళ్తున్న ఒక కారు వెనుక భాగంలో ఉన్న 'ఓం సాయిరామ్' అనే అక్షరాలు నా దృష్టిలో పడ్డాయి. నేను చాలా సంతోషించాను. సాయంత్రం వచ్చిన రిపోర్టులన్నీ నార్మల్ గా వచ్చాయి. "బాబా! ఎల్లప్పుడూ నాతో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు".

రెండవ అనుభవం:

సాధారణంగా నాకు కోపం చాలా త్వరగా వస్తుంది. నేను పనులు సంపూర్ణంగా చేయడాన్ని ఇష్టపడతాను. కళ్ళముందు అన్యాయం జరుగుతుంటే అస్సలు సహించలేను. ఏమాత్రం తేడా వచ్చినా హృదయంలో నేను చాలా దయతో ఉన్నప్పటికీ ముందు వెనక చూడకుండా ఇతరుల మీద అరిచేస్తాను. దగ్గరి బంధువులపై కూడా అలాగే అరిచేస్తాను. అలా చేసేసి మళ్ళీ "నా స్వభావాన్ని ఎందుకు మార్చడం లేదు?" అని బాబాను ప్రశ్నిస్తుంటాను. కానీ ఆయనను అలా అడిగినందుకు కూడా చాలా అపరాధభావం కలిగి నాలో నేనే బాధపడతాను. నేను సదా బాబాను, "సబూరీని ప్రసాదించి నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే అది ఆయన కృపతో మాత్రమే సాధ్యమవుతుంది.

ఇటీవల ఒకసారి నేను చాలా క్లిష్టమైన కుటుంబ విషయాలను చర్చించడానికి దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు, "మీరు నాతో ఉండండి బాబా. సబూరీతో ఉండేలా నన్ను ఆశీర్వదించండి" అని బాబాను ప్రార్థించాను. ఆరోజు బాబా నన్ను ఎంతోగానో ఆశీర్వదించారు. నా జీవితంలో మొదటిసారి నేను ఆరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను హృదయంలో 'సాయి, సాయి' అని అనుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్నాను. లోలోపల నేను బాబాతో ద్వారకమాయిలో ఉన్నట్లు ఊహించుకుంటూ, "అన్ని విషయాలూ చక్కగా నిర్వహించండి" అని చెప్పుకుంటూ ఉన్నాను. ఆరోజు నేను మూమూలుగా ఎప్పుడూ చేసే విధంగా టెన్షన్ పడటంగాని, కోపం తెచ్చుకోవడంగాని, ఏడవటంగాని చేయలేదు. ప్రశాంతమైన నా ప్రవర్తనకు నేనే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. సమస్య విషయం ఎలా ఉన్నా బాబా నన్ను ప్రశాంతంగా, ఆనందంగా మరియు ఆయన ప్రేమలో మునిగివుండేలా చేశారు. నా ప్రియమైన బాబాపై నాకు నమ్మకం ఉన్నందున ఆ సమస్యను ఆయనకే వదిలేసి అక్కడినుండి తిరిగి ఇంటికి బయలుదేరాను. దారిలో బాబా నాపై కురిపించిన ప్రేమను తలచుకుంటూ ఏడ్చేశాను. "బాబా! దయచేసి నా తప్పులను క్షమించండి, నన్ను శిక్షించకండి. నన్ను ఎప్పుడూ వదిలివేయకండి. మీరే నా సర్వస్వం. నేను మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను. మీ దయతోనే జీవితాన్ని సాగిస్తున్నాను. అందరికీ తోడుగా ఉంటూ, అందరినీ ఆశీర్వదించండి. మీ దివ్యపాదాలకు శరణు అనేలా నన్ను అనుగ్రహించండి".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2472.html

నిజంగా బాబా ఊదీ అద్భుతమైన ఔషధం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబా భక్తురాలిని. రెండున్నర సంవత్సరాల మా పాప ఒక సంవత్సరకాలంగా స్కిన్ అలెర్జీతో బాధపడుతోంది. డాక్టర్ రోజుకు 3 సార్లు చొప్పున నెలా పదిహేను రోజులు మందులు వాడమని సూచించారు. అయితే ఒకరోజు మా ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు. అతిథులకు ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉండి నేను తనకి మందులు ఇవ్వలేకపోయాను. రాత్రి 8 గంటలకు నిద్రపోయిన తను హఠాత్తుగా 11 గంటలకు లేచి ఒళ్ళంతా గోక్కోవడం మొదలుపెట్టింది. చూస్తే, తన శరీరమంతా దద్దుర్లు లేచి ఉన్నాయి. తక్షణ ఉపశమనం కోసం ఒక లేపనం(ఆయింట్మెంట్) డాక్టర్ ఇచ్చి వున్నారు గానీ సమయానికి ఆ మందు ఇంట్లో అందుబాటులో లేదు. రాత్రివేళ మందులషాపు తెరచి ఉంటుందో లేదో తెలీదు. ఒకవేళ షాపు ఉన్నా ఔషధం ప్రభావం చూపడానికి కనీసం 1, 2 గంటల సమయం పడుతుంది. తను చూస్తే బాధను తట్టుకోలేక, నిద్రపోలేక ఒకటే ఏడుస్తూ ఉంది. ఆ కారణంగా అతిథులకు కూడా నిద్రాభంగమైంది. ఏమి చేయాలో అర్థంకాక ఆలోచిస్తున్న తరుణంలో అద్భుతమైన మన బాబా ఔషధం నా మనసుకి తట్టింది.  వెంటనే నేను పూజగదిలోకి వెళ్లి, శిరిడీ నుండి తెచ్చుకున్న ఊదీ తీసుకుని, బాబాను ప్రార్థించి, తన శరీరమంతా పూస్తూ నెమ్మదిగా తన శరీరంపై రుద్దుతూ, తడుతూ వున్నాను. కేవలం కొన్ని నిమిషాల్లో తను ఏడుపు ఆపి, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మంచి నిద్రలోకి జారుకుంది. నిజంగా బాబా ఊదీ అద్భుతమైన ఔషధం. క్షణాల్లో ఉపశమనం కలిగించింది. "నేను మిమ్మల్ని ప్రార్థించినప్పుడల్లా తక్షణ రక్షణ కల్పిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!" ఎప్పుడైతే మనం ఎదుర్కొనే సమస్యలు మన నియంత్రణలో లేకుండా పోతాయో అప్పుడు వాటిని బాబా చేతుల్లో పెట్టడం ఎంతో ఉత్తమం. ఆయన ఉత్తమరీతిలో వాటిని పరిష్కరిస్తారని మనం భరోసాతో ఉండవచ్చు. ఎందుకంటే ఆయన తన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తారు. 

5 comments:

  1. Sai sadguru maharajuki jai om sainathaya namaha subam bavath

    ReplyDelete
  2. Om Sai Rajaram
    Akilandakoti samastasadgurusainath maharajk jai

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo