సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1841వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబా అండగా ఉండగా సమస్యలు తీరకుండా ఉంటాయా?
2. పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాబా

బాబా అండగా ఉండగా సమస్యలు తీరకుండా ఉంటాయా?

శ్రీసాయినాథాయ నమః. సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. మా తమ్ముడు బెంగళూరులో హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒకసారి కొన్నిరోజులు సెలవులు వస్తే, తను మా అమ్మానాన్నల దగ్గరకు వచ్చాడు. ఇక్కడకు వచ్చాక చూసుకుంటే తన పర్సు కనపడలేదు. వెంటనే తను తన స్నేహితుడికి ఫోన్ చేసి, హాస్టల్లో ఉందేమో చూడమంటే, అతను గదంతా వెతికి లేదని చెప్పాడు. క్రెడిట్ కార్డులు, ఎటిఎం కార్డులు, డబ్బులు, ఇంకా చాలా రసీదులు ఆ పర్సులో ఉన్నందున మా తమ్ముడు చాలా టెన్షన్ పడ్డాడు. అప్పుడు నేను సద్గురు సాయినాథుని, "మా తమ్ముడు పర్సు దొరికేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. బాబా అండగా ఉండగా మన సమస్య తీరకుండా ఉంటుందా? 15 రోజుల తర్వాత మా తమ్ముడి స్నేహితుడు ఫోన్ చేసి, "పర్సు దొరికింద"ని చెప్పాడు. మా ఇంట్లో అందరం చాలా సంతోషించాము.

2024, ఫిబ్రవరిలో ఒకరోజు అర్థరాత్రి సమయంలో ఉన్నట్టుండి నా ఛాతిలో బాగా నొప్పి వచ్చింది. నేను గ్యాస్ సమస్యేమోనని గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను కానీ, ఆ బాధ తగ్గలేదు. అప్పుడు బాబా ఊదీ తీసుకొని కొంచెం నీళ్లలో వేసుకొని తాగి, 'ఓం ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ పడుకున్నాను. ఒక గంట తర్వాత కాస్త ఉపశమనంగా అనిపించి నిద్రపట్టింది. ఇలాగే ఒకసారి కడుపునొప్పి వచ్చి ఎంతకు తగ్గకపోతే, నాకు ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాలేమో అనిపించింది. అప్పుడు బాబా ఊదీ తీసుకుని కడుపుకి రాసుకొని, "ఇంట్లో ఎవరూ లేరు బాబా. నువ్వే ఎలాగైనా ఈ బాధను తగ్గించాల"ని బాబా పటం ముందు బాధపడ్డాను. సాయినాథుడు భక్తులు బాధలు తీర్చే కల్పతరువు. కొద్దిసేపటికి ఏ మందూ  వేయకుండానే నొప్పి తగ్గింది.

ఐదు సంవత్సరాలుగా నాకు మైగ్రేన్ బాధ ఉంది. అది జీర్ణ సమస్య, వాంతులతో నరకంలా ఉంటుంది, తలిస్తేనే నాకు భయమేస్తుంది. దానివలన నేను ఎంతో వేదన అనుభవించాను. నేను ఈ బ్లాగులో సాయికృపతో ఎంతోమంది తమ వ్యాధులను తొలగించుకున్నారని చదివి, "నాకు కూడా ఈ బాధ నుండి ఉపశమనం కలిగించండి. నేను సాయి దివ్యపూజ 9 వారాలు చేస్తాను" అని సాయికి మొక్కుకొని పూజ మొదలుపెట్టాను. మీరు నమ్ముతారో, నమ్మరో కానీ, పూజ మొదలుపెట్టింది మొదలు 9 వారాల్లో ఒక్కరోజు కూడా ఆ బాధ నాకు రాలేదు. నా సాయితల్లి నా బాధను తీసేసారు. మనం శ్రద్ధ-సబూరీతో ఉంటే ఎంతటి సమస్యనైనా బాబా చాలా తేలికగా తీసేస్తారు. బాబా మీద నమ్మకం ఉంచండి, ఆయనే మనల్ని రక్షిస్తారు. సాయినాథునికి శతకోటి వందనాలు.


పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాబా

నేను ఒక సాయి భక్తుడిని. 2023, అక్టోబర్ 10న సెలవు దినం కావడంతో నేను మా బర్రెలను మేపటానికి మా గ్రామ పరిసరాలలో ఉన్న పర్వత శ్రేణులు వైపు వెళ్ళాను. కాసేపు బాగానే ఉంది. తరువాత అడవిలో నుండి  కొన్ని ఏనుగులు మా వైపుగా వచ్చి మాపై దాడి చేయబోయాయి. నాతోపాటు అక్కడున్న వారంతా తలో దిక్కుకు పారిపోయే ప్రయత్నం చేసాం. అందరూ అక్కడి నుండి తప్పించుకొని పారిపోయారు కానీ, నేను ఎటూ వెళ్లలేక కొండ అంచునున్న పొదల్లోకి దూరాను. తర్వాత చూసుకుంటే పక్కనే అతి పెద్ద లోయ. అందులోకి నేను జారిపోబోతున్న స్థితిలో, నన్ను కాపాడేవారెవరూ కనిపించక భయపడుతున్న సమయంలో హఠాత్తుగా నాకు సాయిబాబా గుర్తు వచ్చి, "బాబా! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.. పాహిమాం.. నాకు మీరే దిక్కు. నన్ను కాపాడండి. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. అంతే, మరుక్షణం ఎవరో నన్ను ఒక పక్కకి లాగారు. చూస్తే, ఎవరూ లేరు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా వుంది. బాబా పిలిస్తే పలికే దైవం. ఆయనే నన్ను అంత ఎత్తున పెద్ద ప్రమాదం నుండి కాపాడారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1840వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అనుకున్నది నెరవేర్చే బాబా
2. కాదనుకున్న పనిని నెరవేర్చిన బాబా

అనుకున్నది నెరవేర్చే బాబా


నేను బాబా భక్తురాలిని. నా బ్యాంకు ఎటిఎం కార్డు ఎప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. అలాంటిది ఒకరోజు ఆఫీసు నుంచి వచ్చాక ఆ కార్డు కోసం బ్యాగులో వెతికితే, అది కనిపించలేదు. అకౌంటులో రెండు లక్షల రూపాయిలు ఉన్నందున కంగారుపడుతూ బ్యాగులో మళ్ళీ మళ్ళీ వెతికాను కానీ, కార్డు దొరకలేదు. అప్పుడు బాబాని తలుచుకుని, "సాయంత్రం వాకింగ్ పూర్తిచేశాక కార్డు ఎలాగైనా దొరకాలి బాబా" అని అనుకున్నాను. తర్వాత చూస్తే, కార్డు బ్యాగు పాకెట్స్‌లో కాకుండా విడిగా పడి కనిపించింది.


ఒకసారి నాకు పిప్పి పన్ను నొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. టాబ్లెట్లు వాడుతున్నా తగ్గలేదు. ఒకరోజు రాత్రి పడుకునేముందు ఊదీ నీళ్లలో కలుపుకొని తాగి, "నొప్పి తగ్గాలి బాబా" అని అనుకుని పడుకున్నాను. నేను చెప్పేది మీరు నమ్మరు. రెండు, మూడు నిమిషాల్లో నొప్పి మొత్తం తగ్గిపోయింది. ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. బాబా ఊదీ ఒక దివ్య ఔషధం.


2024, ఏప్రిల్ 11న నేను ఒక ఫంక్షన్ విషయంగా మా ఊరికి బస్సు టికెట్ బుక్ చేసుకున్నాను. ఇంటి నుంచి బయలుదేముందు, "బాబా! ఈ రాత్రివేళ ప్రయాణంలో మీరు నా తోడు ఉండాలి. ఏదో ఒక రూపంలో నాకు దర్శనం ఇవ్వండి" అని బాబాకి చెప్పుకొని బస్సు ఎక్కాను. బస్సు బయలుదేరాక లైట్ల వెలుగులో రోడ్డు పక్కనుండే షాపుల మీద సాయి నామం రూపంలో బాబా రాత్రంతా కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు, మర్నాడు ఫంక్షన్‌కి వెళ్లే దారిలో దాదాపు 100 ఫొటోలలో బాబా నాకు దర్శనమిచ్చారు. ఎటు చూసినా బాబానే. ఆ మరుసటిరోజు రాత్రి మళ్ళీ బస్సులో తిరుగు ప్రయాణమయ్యాను. అప్పుడు కూడా బాబా విగ్రహ రూపంలో నాకు కనిపిస్తూనే ఉన్నారు. అలా ఒక్కసారి కనిపించండని అడిగినందుకు వందల సంఖ్యలో దర్శనమిచ్చారు నా సాయితండ్రి. ఇదంతా యాదృచ్చికమని మీరు అనుకోవచ్చు కానీ, మర్నాడు తెల్లవారుజామున 6:30కి ఈ బ్లాగు ఓపెన్ చేస్తే, "నీ ప్రయాణం అంతా నేను నీతోనే ఉన్నాను. ఇన్ని రోజులు నేను నిన్ను చాలా సందర్భాల్లో రక్షించాను" అన్న ఈక్రింది బాబా సందేశం వచ్చింది. "ధన్యవాదాలు బాబా. సదా మీరు మా వెంట ఉండి మమ్మల్ని నడిపించండి బాబా. ఈ జీవితాంతం మేమెప్పుడూ మిమ్మల్ని స్మరించేలా అనుగ్రహించండి. మా పాపకు బీటెక్‌లో క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి".


కాదనుకున్న పనిని నెరవేర్చిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు నరేష్. నేను పనికోసం జార్ఖండ్ రాష్ట్రానికి వెళితే, అక్కడివాళ్లు నన్ను పనిలో చేర్చుకోవాడానికి నా పూర్తి వివరాలు అడిగారు. నేను అన్నీ వివరాలు చెప్పినప్పటికీ చివరిలో ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే, వాళ్ళు నా PF UAN నెంబర్ అడిగారు. PF గురించి మీకు తెలిసే ఉంటుంది. అదేనండి, మనం ఏదైనా కంపెనిలో పనిచేసేటప్పుడు నెలనెల కొద్ది మొత్తం డబ్బులు PF కింద కట్ చెస్తారు. మనం ఆ కంపెనీ విడిచి పెట్టినప్పుడు ఆ డబ్బు మనకి చెల్లిస్తారు. ఇక విషయానికి వస్తే, జార్ఖండ్ కంపెనీవాళ్ళు నన్ను కంపెనీలో చేర్చుకొని నెలనెలా నాకిచ్చే జీతం నుండి కొంత  PF అమౌంట్ కింద వేయడానికి UAN నెంబర్ అడిగారు. కానీ ఆ నెంబర్ నాకు తెలీదు. అందువల్ల, "ఎలా తెలుసుకోవాలి సార్?" అని అడిగితే, "నువ్వు ఇంతకు ముందు ఏ కంపెనిలో పని చేసావో, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు. వాళ్ళు చెప్తారు" అని అన్నారు. అందుకు నేను, "ఇప్పుడు ఆ కంపెనీ లేదు, మూసేశారు. మరెలా సార్?" అని అడిగాను. అప్పుడు, "నీకు దగ్గరలో అంటే హైదరాబాద్ PF ఆఫీసుకి వెళ్లి అడిగితే, చెప్తారు" అని అన్నారు సార్. సరేనననుకున్నాను కానీ, ఆ ఆఫీస్ హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటుందో నాకు అస్సల తెలీదు. పైగా నేను జార్ఖండ్ నుంచి హైదరాబాద్ పోవాలంటే 24 గంటలు పడుతుంది. అదీకాక నేను ఇంటి నుండి వచ్చి నెల కూడా కాలేదు. ఇంతలోనే ఏ మొఖం పెట్టుకొని పోవాలని బాగా బాధేసింది. కానీ అందరూ PF ఆఫీసుకి పోనిదే పని కాదని అన్నారు. నేను అందరి దేవుళ్ళకు మొక్కుకొని సాయితండ్రిని కూడా, "తండ్రీ! నేను ఇంటికి వెళ్లకుండానే PF వివరాలు నాకు అందేలా చూడండి" అని వేడుకున్నాను. 2, 3 గంటల తర్వాత నా స్నేహితునికి ఫోన్ చేసి విషయం చెపితే, తను తన స్నేహితుని ఫోన్ నెంబర్ నాకిచ్చి, అతనితో మాట్లాడమని అన్నాడు. నేను అతనితో మాట్టాడి నాకు UAN నెంబర్ కావాలని చెప్తే, అతనొక గంట లోపల నా UAN నంబర్ తీసుకొని నాకు చెప్పాడు. అలా నేను హైదరాబాద్ వెళ్లకుండా కాదనుకున్న పని సాయితండ్రిని వేడుకోగానే, ఆయన దయవల్ల నెరవెరింది. ఎవరికైన ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే అస్సలు భయపడకండి. సాయితండ్రి ఉన్నాడని దైర్యం తెచ్చుకొండి. "చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1839వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనం చెప్పే ప్రతిదీ విని అనుగ్రహిస్తారు
2. నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా

బాబా మనం చెప్పే ప్రతిదీ విని అనుగ్రహిస్తారు


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రాణి. 2024, జనవరి 14, భోగి పండగ రోజున నాకు కడుపునొప్పి వచ్చింది. కొద్దిగా ఊదీ నీళ్ళలో వేసుకొని తాగితే కొంచం నొప్పి తగ్గింది. కానీ బండి మీద వెళ్లినప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు కడుపునొప్పి వస్తుండేది. అందుకని జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళితే చాలా పరీక్షలు వ్రాశారు. ఆ టెస్టులు చేయించుకొని రిపోర్టులు తీసుకొని మళ్లీ డాక్టర్ దగ్గరకి వెళ్తే, "కుడి అండాశయంలో తిత్తి ఉంది. ఆపరేషన్ చేయాలి. వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్ళండి" అని అన్నారు. సరేనని నేను గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే, అక్కడ మళ్ళీ స్కానింగ్ చేసి, "తిట్టి చాలా పెద్దగా ఉంది. ఆపరేషన్ చేయాలి" అని చెప్పారు. నేను, "మందుల ద్వారా తగ్గదా?" అని అడిగితే, "ఆపరేషన్ చేయాలి. మందు లేదు" అని డాక్టరు అన్నారు. ఇక చేసేదేమి లేక బాబా అనుమతి తీసుకొని 2024, మార్చి 22న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆపరేషన్‌కి అరగంట సమయం పడుతుందన్నారు కానీ, గంటన్నర పట్టింది. ఎందుకంటే, కేవలం తిత్తిని తొలగించడం సాధ్యం కాలేదు. అది అండాశయాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల తిత్తితోపాటు కుడి అండాశయాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. ఇకపోతే, తిత్తి పరిమాణం పెద్దగా ఉండటం వల్ల దాన్ని బయాప్సీకి పంపించాలన్నారు, నేను చాలా టెన్షన్ పడి, "బయాప్సీ రిపోర్టు నార్మల్‌గా రావాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా మనం చెప్పే ప్రతిదీ వింటారు. ఆయన టైమింగ్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. కానీ మనం మమ్ములు మనుషులం. కొంచెం కూడా ఓపిక పట్టలేము. అందువల్ల ఆ వారం రోజుల్లో నేను పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. కానీ చివరికి బాబా దయవల్ల ఆపరేషన్ అయిన ఒక వారం తర్వాత వచ్చిన బయాప్సీ రిపోర్టు నార్మల్ అని వచ్చింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. బాబాకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలుపుకున్నా తక్కువే.


2024, జనవరిలో మా ల్యాప్‌టాప్ ఛార్జర్ పని చేయకపోతే నా భర్త ఆ ల్యాప్‌టాప్ బాగు చేయించడానికి తీసుకెళ్లి, 'ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పిన్ పని చేయడం లేదంటే' ఆ పిన్ మార్పించి, అలాగే వేరే ఛార్జర్ తీసుకొచ్చారు. అయితే మా పిల్లలు చిన్నవాళ్లు. వాళ్ళు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు, తీసేటప్పుడు వాళ్ళ బలమంతా ఆ ల్యాప్‌టాప్ మీద చూపిస్తుండేవారు. దాంతో 2024, ఏప్రిల్ 7న ల్యాప్‌టాప్ ఛార్జర్ మరోసారి పని చేయలేదు. ఈ విషయంగా నా భర్త చాలా కోప్పడ్డారు. నాకు ఏం చేయాలో తోచక బాబాకి చెప్పుకొని ఊదీ ల్యాప్‌టాప్‌కి పెట్టి, ఆ రోజంతా అలాగే వదిలేసాను. మర్నాడు ఛార్జింగ్ పెడితే ల్యాప్‌టాప్ మాములుగా పనిచేసింది. అలా బాబా మా మీద దయ చూపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అందరి మీద మీ కృప ఇలాగే ఎల్లవేళలా ఉండాలి తండ్రీ".


నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కోమలవల్లి. నా వయస్సు 42 సంవత్సరాలు. నా భర్త తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఆయన వల్ల మేము మా సొంత ఇంటిని పోగొట్టుకొని ఎన్నో ఆర్థిక సమస్యలతో తినడానికి లేక పిల్లలతో సహా పస్తులు వున్నాము. అలాంటి స్థితిలో మా అమ్మాయి వివాహం చేయగలనా అని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ బాబా ఎంత దయ గల వారంటే పెళ్ళిచూపులకి వచ్చిన మొదటి సంబంధమే ఖాయమైంది. వివాహానికి కావలసిన డబ్బు తక్కువ వడ్డీకి, నెలనెలా చెల్లించేలా సమకూరింది. అది కూడా అన్నిటికీ నా జీతం సరిపోయేలా(నేను ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను). బాబా దయతో ఏ ఆటంకాలు లేకుండా అమ్మాయి వివాహం ఎంతో వైభవంగా జరిగింది.

ఇకపోతే, మాకున్న అర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నేనొక ఆవు తీసుకున్నాను. కానీ నాకు కలిసి రాక ఆ ఆవు అనారోగ్యం పాలై నేను చాలా నష్టపోయాను. దాంతో ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఎంతో ఆవేదన చెందాను. ఇలాంటి సమయంలో ఒకరు జీతం మీద లోన్ ఇస్తామంటే, సరేనని అప్లై చేశాను. కాని వాళ్ళు ఒక ముఖ్యమైన పత్రం అడిగారు. దాన్ని ఎలా తీసుకురావాలో నాకు తెలియలేదు. నా ఆర్థిక పరిస్థితి కారణంగా నేను ఎవరితోనూ అంతగా కలవను. అందువల్ల ఆ పత్రం గురించి ఎవ్వరిని అడగాలో నాకు తెలియలేదు. అప్పుడు, "బాబా! నేను అ పత్రం గురించి ఎవరినీ అడగను. మీరే అ పత్రం నా కంటికి కనిపించేలా చేయండి. అలాగే నాకు లోన్ వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. నిజంగా బాబా ఎంత దయమయుడంటే అంతవరకు నేను ఎంత ప్రయత్నించినా దొరకనిది, బాబాను వేడుకున్న తర్వాత ఇంటర్నెట్‌లో ప్రయత్నిస్తే ఒక్క నిమిషంలోనే నాకు కావలసిన పత్రం దొరికింది. ఆ అద్భుతానికి నాకు అస్సలు మాటలు రాలేదు. నాకు లోన్ శాంక్షన్ అయి నా ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. జరగదనుకున్న పని జరిగింది. దీనికి పూర్తిగా బాబా అనుగ్రహమే కారణం. ఇలా ఎన్నో విషయాల్లో సాయినాథుని అనుగ్రహం నేను పొందాను. నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా. "ధన్యవాదాలు బాబా. నా భర్త తాగుడు మానేలా చూడు దేవా".


సాయిభక్తుల అనుభవమాలిక 1838వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మకాన్ని బలపరచిన బాబా
2. అడిగిన వెంటనే ఎలా కావాలంటే అలా అనుగ్రహిస్తారు బాబా

నమ్మకాన్ని బలపరచిన బాబా


నా పేరు శైలజ. మేము అమెరికాలో నివాసముంటున్నాము. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అందమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇలాంటివి చదివాను కానీ, ఎప్పుడూ అనుభవించలేదు. 2023, డిసెంబర్ క్రిస్మస్ సెలవులకి మేము మా సోదరి ఇంటికి వెళ్లి, ఒక గురువారంనాడు కారులో తిరుగు ప్రయాణమయ్యాము. మధ్య దారిలో నాకొక విషయం గుర్తుకొచ్చింది. అదేమిటంటే, నేను ఆరోజు బాబాను ప్రార్థించానుగాని, నా నుదిటిపై ఊదీ పెట్టుకోవడం మర్చిపోయానని. నిజానికి నేనెప్పుడూ ఊదీ పెట్టుకోవడం మర్చిపోను. ఆ విషయం గుర్తొచ్చాక అయిందేదో అయిందనుకున్నాను. కొంతదూరం వెళ్ళాక మేము టిఫిన్ కోసం ఒక రెస్టారెంట్‌ వద్ద ఆగాము. అందరమూ తిన్నాక నేను నా కొడుకుని బాత్రూంకి తీసుకెళ్ళొచ్చి తిరిగి కారు ఎక్కాక మా ప్రయాణం ముందుకు సాగించాము. దాదాపు 3 గంటల తర్వాత నేను మామూలుగా నా కుడిచెవిని తాకితే నా చెవికున్న డైమండ్ చెవిపోగు తాలూకు శీల లేదు. నేను మొదటగా చెవిపోగు ఇంకా నా చెవికే ఉన్నందున ఆ శీల నా ఒడిలో లేదా కారులో ఎక్కడో పడి ఉంటుందనుకొని నా ఒడిలో, కారులో క్షుణ్ణంగా పరిశీలించాను. కానీ ఆ శీల దొరకలేదు. అప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయమేమిటంటే, 'నేను రెస్టారెంట్‌ వద్ద ఆగి, టిఫిన్ చేసి, బాత్రూంకి వెళ్ళొచ్చినప్పటికీ నా చెవిపోగు అక్కడెక్కడా జారిపడిపోకుండా ఇప్పటికీ చెవికి ఎలా ఉందోన'ని(శీల లేకుండా చెవిపోగులు ఎక్కువసేపు ఉండవని  చాలామంది మహిళలకి బాగా తెలుసు). అదివరకు ఒకసారి అదే చెవిపోగు శీల ఇంట్లో ఎక్కడో పడిపోయి చాలాసేపటివరకు దొరకలేదు. అప్పుడు బాబాని ప్రార్థిస్తే దొరికింది. ఇక ప్రస్తుత అనుభవం విషయానికి వస్తే, గురువారంనాడు ఆ శీలను పోగొట్టుకున్నందున నేను సెంటిమెంట్‌గా ఫీలై చాలా కలత చెందాను. కానీ కనీసం డైమండ్ చెవిపోగు పోగొట్టుకోలేదని నన్ను నేను ఓదార్చుకున్నాను. అయినప్పటికీ దాన్ని సెంటిమెంట్‌గా భావించినందున, "పోగుట్టుకున్న ఆ శీల తిరిగి దొరికేలా చేయండి" అని బాబాను ప్రార్థించి 108 సార్లు జపం చేసాను. కానీ ఆ శీల దొరకలేదు. కొన్నిరోజులకి ఆ శీల గురించి నేను మర్చిపోయాను. తర్వాత చాలారోజులకి మేము 2024 కొత్త సంవత్సరం వేడుకలకి వేరే రాష్ట్రంలో ఉన్న మా సోదరుడి ఇంటికి వెళ్ళాము. అక్కడ అంతా బాగా గడిచి నేను సంతోషంగా ఉన్నాను. ఇక అక్కడినుండి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో కారు డిక్కీలో మా సామాను పెడుతూ నా భర్త నన్ను పిలిచారు. నేను వెళ్లి చూస్తే, కారు డిక్కీలో సంవత్సరం క్రితం పోయిన చెవిపోగు శీల ఉంది. చాలాకాలం తర్వాత దాన్ని అక్కడ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలారోజులుగా ఉపయోగిస్తున్న ఆ కారులో చాలాకాలం తర్వాత ఆ శీల దొరకడం నిజంగా బాబా చేసిన అద్భుతం. ఎందుకింత బలంగా ఆ మాట చెప్తున్నానంటే, మావారు ఆ శీల పోయినప్పటినుండి ఎన్నోసార్లు ఆ డిక్కీ తెరిచారు. కానీ ఇంతకు ముందెప్పుడూ ఆ శీలని ఆయన అందులో చూడలేదు. ఈ అనుభవం ద్వారా నా ప్రతి చిన్న మోరను బాబా వింటున్నారన్న నా నమ్మకం మునపటికంటే మరింత బలపడింది. "ధన్యవాదాలు బాబా. మీరు ఏది చేసినా అది మా మంచికోసమే అన్న ఆలోచన నా హృదయంలో, మనస్సులో మరింత బలపడుతుంది. లవ్ యు సాయి. దయచేసి మీ బిడ్డలందరికీ ఈ కొత్త సంవత్సరం ఉగాదితో శుభారంభం అయ్యేలా ఆశీర్వదించండి. మేమంతా మీ బిడ్డలం. దయచేసి మా జీవితాలకు మంచి మార్గం వేయండి. నాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండేలా ఆశీర్వదించండి".


అడిగిన వెంటనే ఎలా కావాలంటే అలా అనుగ్రహిస్తారు బాబా

సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు సరిత. నేను బొంబాయిలో ఉంటాను. 2023, డిసెంబర్‌లో మా కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి శిరిడీ వెళ్ళాము. మేము ముందుగా త్రయంబకేశ్వరం వెళ్లి శివయ్య దర్శనం చేసుకొని తర్వాత శిరిడీ వెళ్ళాము. మేము శిరిడీ చేరుకునేసరికి రాత్రి 8:30 అయింది. 'ఎప్పుడెప్పుడు సాయిని చూస్తానా?' అని నా మనసు ఆరాటపడింది కానీ, మావాళ్లు, 'హోటల్‌కి వెళ్లి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని, రేపు ఉదయం దర్శనానికి వెళదామ'ని నిర్ణయిం చేసారు. ఇక చేసేది లేక సరే అలాగేనని రాత్రి పడుకొని పొద్దున్నే లేచి తయారవుతుంటే నా దురదృష్టం కొద్దీ నాకు విరోచనాలు మొదలయ్యాయి. "అయ్యో.. ఏంటి బాబా ఈ పరీక్ష? మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మీ దర్శనం అయ్యేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. మావారు బయటకి వెళ్లి మెడికల్ షాపులో మందులు తెచ్చారు. ఆ మెడిసిన్ వేసుకొని దర్శనానికి బయలుదేరాను. నా మనసులో, "బాబా! నా మీద మీకు కోపం లేకుంటే నాకు పసుపు రంగు వస్త్రాలు ధరించి నాకు దర్శనం ఇవ్వండి" అని బాబాను వేడుకున్నాను. టికెట్ కోసం కౌంటర్ వద్దకి వెళితే, అక్కడ టీవీలో బాబా ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. చూడండి బాబా కృప! ఆయన నేను కోరినట్లు పసుపు రంగు వస్త్రాల్లో దర్శనం ఇచ్చారు. అది చూసి నా కళ్ళలో నీరు తిరిగాయి. బాబా ఎంత గొప్పవారు? అడిగిన వెంటనే మనకు ఎలా కావాలంటే అలా కనిపిస్తారు. బాబా దయవల్ల మాకు దర్శనం బాగా జరిగింది. తరువాత మేము ఎల్లోరా వెళ్లి సాయంత్రానికి తిరిగి శిరిడీ వచ్చాము. అప్పుడు నేను ఒక్కదాన్నే దర్శనానికి వెళ్ళాను. ఒక్క దర్శనమే చేసుకోలేనేమో అనుకున్న నాకు రెండుసార్లు దర్శనమిచ్చిన గొప్ప తండ్రి నా సాయినాథుడు.

ఒకసారి మేము మా సొంత వాహనంలో బొంబాయి నుండి హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు నేను, "సాయినాథా! క్షేమంగా మమ్మల్ని హైదరాబాద్ చేర్చి, మళ్లీ క్షేమంగా బొంబాయికి చేర్చు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా మా ప్రయాణమంతా మాకు తోడుగా ఉండి మాకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుని క్షేమంగా మా ఇంటికి చేర్చారు. అలాగే మా అబ్బాయి పరీక్షలు బాగా వ్రాసేలా చూడమని బాబాని వేడుకున్నాను. ఆయన అలాగే కృప చూపారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


సాయిభక్తుల అనుభవమాలిక 1837వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనల్ని వదిలేయరు!

2. బంధం నిలబెట్టిన బాబా


బాబా మనల్ని వదిలేయరు!


నా పేరు శర్మ. మేము అమెరికాలో నివాసముంటున్నాము. 2023, అక్టోబర్‌‌‌లో మా అబ్బాయి మాకు చెప్పకుండా క్రెడిట్ కార్డు మీద ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసాడు. తర్వాత తను ఆ విషయం మాకు చెప్పి, తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పి, "ఇలా ఎప్పుడూ చేయను" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరే, తను కొన్న ఆ వస్తువు విషయంలో ఏమి చేయాలో మొదట్లో మాకు తెలియలేదు. దానికి సంబంధించి కొన్ని వివరాలు సేకరించి, చర్చించుకున్న మీదట ఆ వస్తువు వెనక్కి ఇచ్చేద్దామని నిర్ణయించాము. అయితే ఆ వస్తువు ఆన్లైన్లో కొన్నది. వాళ్ళని సంప్రదిస్తే, వాళ్ళు 'ఆ వస్తువు మీ ఊర్లో ఉన్న షాపులో ఇచ్చేయండి' అని మెయిల్ పెట్టారు. కానీ ఆ విషయంలో ఒక తిరకాసు వచ్చింది. మా ఊర్లో ఉన్న షాపులవాళ్ళు, "ఆ వస్తువు మేము తీసుకోమ"ని చెప్పారు. దాంతో ఆన్లైన్లో వాళ్ళకి పరిస్థితి చెప్పి, 'ఇప్పుడు ఏమి చేయాలో తెలిపమ'ని మెయిల్ పెట్టాము. అందుకు వాళ్ళు 'మేము మీకు రిటర్న్ స్లిప్ పంపుతాము' అన్నారు. అయితే ఎన్నిసార్లు అడిగినా 'ఇదిగో', 'అదిగో' అనడమే తప్ప రిటర్న్ స్లిప్ పంపలేదు. ఆఖరికి నాకు ఏమి చేయాలో తెలియక ఆ విషయం గురించి బాబాతో చెప్పుకున్నాను. ప్రతిసారీ చిన్న చిన్న సమస్యలకి వీగిపోయి అలా బాబాని అడగకూడదనుకోండి! కానీ, ఆ పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో తోచలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా కుర్రాడికి మంచి నడవడి రావాలి. మాతో చెప్పకుండా అలా క్రెడిట్ కార్డ్ వాడటం మంచిది కాదు కదా!  అందుకోసం మరియు ఆ వస్తువు వెనక్కి ఇచ్చేయడం కోసం 'సహాయం చేయమ'ని బాబాను అడిగాను. అయితే పని అవ్వలేదు. అయినా నేను, 'సరే, చేసేదేముంది. బాబా మనల్ని అలా వదిలేయరు కదా!' అని అనుకున్నాను. కానీ మనసులో ఆందోళన అలానే ఉంది. దాదాపు ఆరు, ఏడు సార్లు ఫోన్ చేసాక చివరికి 2024, ఫిబ్రవరిలో వాళ్ళు రిటర్న్ స్లిప్ పంపారు. వెంటనే మేము ఆ వస్తువు వెనక్కి పంపేసాము. కానీ వాళ్ళు డబ్బు వాపస్ ఇవ్వలేదు. దాంతో మళ్ళీ వాళ్ళకి అనేకసార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది. చివరికి మార్చ్లో మీ డబ్బులు వాపసు ఇస్తాం అని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఫోన్ చేస్తే, "ఇంక డబ్బులు ఇవ్వం" అన్నారు. నేను ఇంకా ఆశ వదిలేసుకున్నాను. కానీ, 'అదేమిటి? వస్తువు ఇచ్చేసాం కదా! అయినా ఇలా చేస్తున్నారేంటి? లాయర్తో మాట్లాడాలేమో!' అని మధనపడ్డాను. ఆ రోజు ఎందుకో తెలీదు సాయి సచ్చరిత్రలోని "నీ డబ్బులు ఎక్కడకీ పోవు. ప్రశాంతంగా కూర్చో!" అని బాబా ఒక భక్తునితో అన్న ఒక వాక్యం గుర్తు వచ్చింది. ఆశ వదులుకున్న నేను మనసులో 'తప్పకుండా ఆ పని జరుగుతుంది. లేకపోతే ఆ వాక్యం నాకు గుర్తు రావడం ఏమిటి?' అని అనుకున్నాను. అయినా మనసులో ఆందోళన పోలేదు. సరిగ్గా 2024, ఏప్రిల్ 4, గురువారం మాకు ఒక మెయిల్ వచ్చింది. అందులో 'మరోసారి ఫోన్ చేస్తే, రెండు రోజుల్లో మీ డబ్బులు మీకు ఇస్తాము' అని ఉంది. అయితే గంటలోపే డబ్బులు వాపసు వచ్చినట్టు బ్యాంకు నుండి మాకు మెయిల్ వచ్చింది. అది చూసి బాబా అనుగ్రహానికి ఒక్కసారిగా నాకు ఉక్కిరిబిక్కిరి అయినట్టైంది. సమస్య తీరిపోయినందుకు బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి, "మరోసారి ఇటువంటి పరిస్థితి మాకు రాకూడదు. ఎప్పుడూ మిమ్మల్ని ఇలా పనికిరాని విషయాలకోసం అడిగే పని రాకూడదు. అయినా మీరు ఎప్పుడూ మాతో ఉంటే చాలు. ఆ తర్వాత ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది" అని చెప్పుకున్నాను. నేను మా పిల్లలతో, "భగవంతుడితో ఎప్పుడూ 'ఇది ఇవ్వు, అది ఇవ్వు' అని కూరలు బేరం ఆడినట్టు ఆడకూడదు. ఎప్పుడూ మాతో ఉండు అని అడిగితే చాలు. మిగతావి అవే వస్తాయి" అని చెప్తుంటాను. ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంట్లో నాకు ఒక పుస్తకం ఇచ్చారు. ఏదైనా సమస్య వస్తే ఒక అంకె తలుచుకొని ఆ పుస్తకంలో సమాధానం చూడవచ్చు. అయితే ఆ పుస్తకం మొదట్లోనే 'ఇది అదృష్టం పరీక్షించుకునే పుస్తకం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి' అని వుంది. నేను ఆ పుస్తకాన్ని ఇప్పటివరకు ఇండియాలో ఒకసారి, అమెరికాలో ఒకసారి మాత్రమే చూసాను. అదీ కష్టమైన విషయాల్లో. ఈ ఎలక్ట్రానిక్ వస్తువు విషయంలో కూడా చూడలేదు.


బంధం నిలబెట్టిన బాబా


ఓం సాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తురాలిని. బాబా చాలా విషయాలలో నాకు తోడుగా ఉన్నారు. నాది ప్రేమ వివాహం. నా భర్త నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు. అందువల్ల మేము సంతోషంగా ఉంటున్నాము. అయితే ఒకసారి ఒక చిన్న అపార్థం వల్ల మా మధ్య గొడవ మొదలైంది. దాంతో నా భర్త నాతో పొడిపొడిగా మాట్లాడుతుండేవారు. ఎప్పుడూ బాగా చూసుకునే నా భర్త హఠాత్తుగా అలా ఉంటుంటే నేను తట్టుకోలేక చాలా ఏడ్చాను. ఒకరోజు బాబా గుడికి వెళ్లి, బాబా పాదాల మీద పడి, "మేము మళ్ళీ ఎప్పటిలా అంతే ప్రేమగా ఉండాలి" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా దయవల్ల ఒక్క వారం రోజులకి అన్నీ సద్దుమణిగి మళ్ళీ నా భర్త నన్ను అంతే ప్రేమగా చూసుకుంటున్నారు. "చాలా ధన్యవాదాలు బాబా. మేము మా జీవితాంతం ఇలాగే ఆనందంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. నేను ఒక విషయంగా పోరాటం చేస్తున్నాను. ఆ సమస్య నుండి గట్టెక్కించి నా భర్త, బిడ్డతో ఆనందంగా ఉండేలా చేయండి బాబా. ఎప్పుడూ మాతో వుండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1836వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆపరేషన్ అవసరం లేకుండా దయచూపిన బాబా
2. రెట్టింపు లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఆపరేషన్ అవసరం లేకుండా దయచూపిన బాబా

సాయి మహారాజ్ పాదపద్మములకు మా ప్రణామాలు. నా పేరు వాసంతి. మా బాబు పేరు జ్ఞాన సుకుమార్. తనకు 27 సంవత్సరాలు. మాకు సాయి యందు భక్తి, ప్రేమ, నమ్మకం ఉన్నాయి. మేము 18 సంవత్సరాలుగా సాయిని పూజిస్తున్నాము. మాకు ఏ సమస్య వచ్చినా సాయికి చెప్పుకుంటాము. ఆయన మా మనసుకి అర్థమయ్యే విధంగా సమస్యకు పరిష్కారం తెలియజేస్తారు. సాయి ప్రార్థనతోనే మాకు ఎంతో ధైర్యం కలుగుతుంది. ఇక మా అనుభవం విషయానికి వస్తే.. మా అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఐదు నెలల క్రితం ఆ వ్యాపారానికి కావలసిన సరుకులు ఖరీదు చేయడానికి మా అబ్బాయి తన స్నేహితులతో కలిసి కలకత్తా వెళ్ళాడు. అక్కడ తను బురదలో కాలుజారి బోర్లా పడిపోయాడు. ఆ ఘటనలో కంకరరాళ్ల కారణంగా మా అబ్బాయి ఎడమ మోకాలుకి దెబ్బ తగిలింది. అయితే ఆ దెబ్బ పైకి తేలినందున మా అబ్బాయి ఎలాగో తన స్నేహితుల సహాయంతో హైదరాబాద్‌లోని మా ఇంటికి తిరిగి వచ్చేసాడు. తర్వాత తనకి కాలునొప్పి, జ్వరము ఎక్కువగా ఉంటే డాక్టరుని సంప్రదించి మందులు వాడాము. కానీ ఫలితం లేకపోయింది. అప్పుడు మరో డాక్టర్‌కి చూపిస్తే, ఎక్స్‌రే తీసి ఐదు రోజులు కాలు కదలకుండా విశ్రాంతి తీసుకోమన్నారు. అలా చేసినా కూడా ఫలితం కనపడలేదు. మా బాబు అలా బాధపడుతుంటే మాకు ఏమీ తోచలేదు. మరలా డాక్టర్ దగ్గరకి వెళ్తే ఎమ్మారై తీయించమన్నారు. హాస్పిటల్లోని నర్సులు, జూనియర్ డాక్టర్లు "ఆపరేషన్ అవసరం అవ్వొచ్చు" అన్నారు. మాకు చాలా భయంగా, కంగారుగా అనిపించింది. మేము సాయిని, "బాబుకు ఆపరేషన్ అవసరం లేకుండా, అలాగే కాలు ఇబ్బందిపోయేలా చేసి ఆరోగ్యం ప్రసాదించండి. తనకు కాలునొప్పి తగ్గి చక్కగా నడపగలిగితే తోటి సాయిబంధువులతో మీ కరుణను పంచుకుంటామ"ని ప్రార్థించాము. తర్వాత రోజు ఎమ్మారై తీసాక డాక్టరు, "లిగ్మెంట్ 20% కట్ అయింది. ఇంకా కాలు వాపు వలన మోచిప్ప పక్కకు జరిగింది. ఆపరేషన్ అవసరం లేదు కానీ, మూడు నెలలు కాలు కదల్చకుండా కాలు చాపుకొని విశ్రాంతిగా ఉండాల"ని చెప్పారు. అది విని సాయి దయవలన బెడ్ రెస్టుతో బాబుకి కాలు ఇబ్బంది తగ్గిపోతుందని మేము స్థిమితపడ్డాము. ఇప్పుడు బాబు కర్ర సహాయంతో షాపుకు వెళ్లి వ్యాపారం చేస్తున్నాడు. బాబా దయవల్ల ఆపరేషన్ అవసరం లేకుండా బాబు నడగలుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. కానీ బాబు ఐదు నెలల బెడ్ రెస్ట్ తీసుకున్న కాలంలో షాపులోని సరుకు మిస్సై వ్యాపారం తగ్గి చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారంలోనూ, మా జీవితాలలోనూ ఉన్న సమస్యల నుండి బాబా రక్షిస్తారని నమ్మకంతో ఉన్నాము. "బాబా! జీవించడానికి కావలసిన ధైర్యాన్ని, శక్తియుక్తులను మాకు ప్రసాదించండి. మా అందరినీ సదా సన్మార్గంలో నడిపించు సాయి. అన్నిటికి ధన్యవాదాలు సాయి".


రెట్టింపు లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాథునికి పాదాభివందనాలు. సాయిబంధువులందరికీ నమస్కరాలు. నేను ఒక సాయి భక్తురాలిని. గత రెండు సంవత్సరాల నుండి మా కుటుంబం ఆర్ధిక యిబ్బందులతో చాలా ఇబ్బందిపడుతుంది. నేను సాయిని ప్రతిరోజూ మమ్మల్ని ఆదుకోమని వేడుకుంటూ మా స్థిరాస్తిను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ కొరకు శత విధాల ప్రయత్నించాము. అయితే రకరకాల కారణాల వల్ల లోన్ పని ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ 6 నెలలు విపరీతమైన ఒత్తిడిని అనుభవించాము. ఆ సమయంలో నా బాధని సాయికి చెప్పుకుంటూ, "నువ్వే దిక్కు తండ్రీ" అని నిత్యం ఆయనను వేడుకుంటూ వుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు నాకు, "నీ సమస్య నేను పరిష్కరించాను. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో లోన్ వస్తుంది. వెంటనే నాకు శనగల మాల సమర్పించు. వెంటనే శుభవార్త వింటావు" అని ఒక సాయి సందేశం వచ్చింది. మరుసటిరోజు గురువారం. ఆరోజు నేను శనగల మాల గుచ్చి బాబా గుడికి వెళ్ళి, సాయితండ్రికి ఆ మాలను సమర్పించాను. తర్వాత అక్కడే బాబా ముందు ధ్యానంలో కూర్చుని, "తండ్రీ నువ్వు చెప్పినట్టు శనగలమాల నీకు సమర్పించాను. ఇంక నువ్వు నాకిచ్చిన మాటకోసం ఎదురు చూస్తున్నాను" అని మనసులోనే సాయికి చెప్పుకున్నాను. నా ఆ మాటలు ఇంకా పూర్తవలేదు. అంతలోనే అద్భుతం జరిగింది. గుడిలో వున్నానని సైలెంట్లో పెట్టిన నా సెల్‌ఫోన్ వైబ్రేట్ అవ్వసాగింది. చూస్తే, బ్యాంక్ నుండి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే, "లోన్ శాంక్షన్ లెటర్ వచ్చింది. మీరు అడిగిన దానికి రెట్టింపు అప్రూవ్ అయింది" అని బ్యాంకువాళ్లు చెప్పారు. ఆ క్షణంలో నాకు ఊహకందనంత సంతోషం కలిగింది. అది సాయినాథుని అనుగ్రహం, ప్రేమ. ప్రత్యక్షంగా అనుభవించినవారికే తెలుస్తుంది. ఆ తండ్రి లీలలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తమ బిడ్డలను ఎన్ని విధాలుగా ఆదుకుంటారో ఎంతోమంది సాయి భక్తులకు తమ అనుభవాల ద్వారా పరిచయమే. "తండ్రీ సాయినాథా! నీ కరుణాకటాక్షాలు ఎప్పటికీ మాపై యిలాగే వుండేలా మమ్మల్ని అనుగ్రహించు సాయీ. మా తప్పులను క్షమించు, మానవ జన్మ ఎత్తినందుకు మంచి బుద్దిని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. అనుక్షణం మా మనోనేత్రంతో మిమ్మల్ని దర్శించుకునే అదృష్టాన్ని మాకు కల్పించు తండ్రీ."


శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథుని కి జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1835వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరిక తీర్చిన బాబా

2. బాబా కరుణ


కోరిక తీర్చిన బాబా


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. మాది నెల్లూరు. నేను బాబాకి సాధారణ భక్తురాలిని. నా స్నేహితురాలు కల్పన నాకు బాబాని పరిచయం చేసింది  అందరూ 'పిలిస్తే పలికే దైవం బాబా' అని అంటుంటే నేను అంతగా పట్టించు కోలేదు. ఏదో మామూలుగా గుడికి వెళ్లేదాన్ని ఆంతే. అలా ఉండగా మొదటిసారి నేను గర్భవతినని నిర్ధారణ అయ్యాక, "బాబా! నాకు కొడుకు పుట్టాలి, నార్మలా డెలివరీ అవ్వాలి" అని బాబాను కోరుకున్నాను. నేను కోరుకున్నట్టే నాకు నార్మల్ డెలివరీ అయి బాబు పుట్టాడు. తర్వాత నేను రెండోసారి గర్భవతినని నిర్ధారణ అయినప్పుడు నేను, 'బాబా నాకు కూతుర్ని ఇస్తారని మానసికంగా నిర్థారించుకున్నాను. నా భర్తకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. కాబట్టి తను కూడా సంతోషంగా ఉంటారని అనుకున్నాను. రోజూ, "సాయీ! నాకు పాప కావాలి. పాప పుడితే తనని 5వ నెలలో శిరిడీ తీసుకొస్తాను" అని మొక్కుకున్నాను. ఇంకా చెకప్‌కి వెళ్ళినప్పుడల్లా బాబా గుడికి వెళ్లి మరి హాస్పిటల్‌కి వెళ్తుండేదాన్ని. అలా నెలలు నిండి 9వ నెల వచ్చింది. అప్పుడు నాకు శ్రీమంతం చేసారు. నేను అందరి చేత కూతురు పుట్టాలని ఆశీస్సులు తీసుకున్నాను. కానీ అందరూ, "నీకు కూతురు కాదు, కొడుకు పుడతాడ"ని అన్నారు. బాబా మీద నమ్మకం ఉన్నప్పటికీ వాళ్ళు అందరూ అలా 'పాప కాదు బాబు' అంటుంటే నాకు కొంచెం బాధేసింది. తర్వాత డెలివరీ డేట్ ఇచ్చారు. ఆరోజు నేను బాబా గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని, అపై హాస్పిటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యాను. అక్కడ సిస్టర్స్ నన్ను చూడగానే, "నీకు బాబు" అని అన్నారు. నేను మాత్రం ఎవరి మాటలు వినకుండా ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళాను. అక్కడ బాబాని తలచుకుంటూ, "బాబా! నాకు కూతురు పుట్టకపోతే నిన్ను నమ్మను" అని అనుకున్నాను. అంతలో డాక్టర్ ఆపరేషన్ చేసి, "కంగ్రాట్స్ నీకు పాప" అని చెప్పింది. అది విని నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నాకు కొడుకన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఇలా బాబా ఎప్పుడూ నాతోనే ఉంటారు. బాబాని నమ్మినవాళ్లు ఎప్పుడూ ఓడిపోరు. ఇది నిజం. “లవ్ యు బాబా”.


ఈమధ్య మేము తిరుమల వెళ్ళాము. అక్కడ నేను, "బాబా! నువ్వు నాతోనే ఉంటే నాకు కనిపించు" అని మనసులో అనుకుంటున్నంతలో ఒక కారు వెనుక బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. నాకు చాలా సంతోషమేసి, "తొందరగా దర్శనమయ్యేలా చూడు బాబా. ఒక సంవత్సరం పాప, ఇంకా చిన్న బాబు ఉన్నారు. వీళ్ళతో క్యూలైన్‌లో ఎక్కువసేపు ఉండలేను. 2 గంటలలో దర్శనమయ్యేలా చూడు బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల చిన్నపిల్లలు ఉన్నవాళ్ళకి ప్రత్యేక లైన్ ఉందని తెలిసి దాంట్లో వెళ్ళాము. గంటలో దర్శనం అయిపోయింది. దైవ దర్శనం చాలా బాగా జరిగింది. అంతకుముందు నాలుగైదు సార్లు వెళ్ళినపుడు స్మామిని ఇంత బాగా చూడలేదు. పిల్లలు కూడా విసిగించకుండా ఉన్నారు. ఇకపోతే, తిరుపతిలో పొంగలి చాలా బాగుంటుందని అందరూ అంటారు. కానీ నాకు ఒక్కసారి కూడా దొరకలేదు. ఎప్పుడూ లడ్డునే ఇచ్చేవారు. అందువల్ల నేను, "నాకు లడ్డు వద్దు. పొంగలి కావాలి బాబా" అని అనుకున్నాను. తర్వాత మావారితో నాకు, "నాకు లడ్డు వద్దు అండి. పొంగలి కావాలి" అని అన్నాను. అందుకు మావారు, "అంతా నీ ఇష్టమా? ఇక్కడ లడ్డు ఒక్కటే ఇస్తారు. పులిహోర, పొంగలి వంటివి ఎప్పుడో పండగలప్పుడు ఇస్తారు" అన్నారు. అంతలో మా వంతు రానే వచ్చింది. బాబా చేసిన అద్భుతం చూడండి! నేను కోరుకున్నట్లే మాకు పొంగలి ప్రసాదం పెట్టారు. అది చూసి మావారు ఆశ్చర్యపోయారు. ఇలా ఉంటాయి బాబా అద్భుతాలు. "ధన్యవాదాలు బాబా. మీరు ఉండగా దేనికి భయం బాబా? మై సూపర్ హీరో మీరు. నా తల్లివి, ఇంకా అన్నీ నువ్వే బాబా. నా జీవితంలో నేను ఇంకా ఎన్నో అద్భుతాలు చూడాలి బాబా".


సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


బాబా కరుణ


నేను ఒక సాయిభక్తురాలిని. భక్తులందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నా అనుభవాలు పంచుకుంటున్నాను. నా ల్యాప్‌టాప్ కొని 2 సంవత్సరాల 5 నెలలైంది. కానీ ఎక్కువగా వాడలేదు. అలాంటిది ఒకరోజు హఠాత్తుగా మౌస్ సెన్సార్ పని చేయడం మానేసింది. ఎంత ప్రయత్నించినా పని చేయలేదు. అప్పుడు బాబాను వేడుకొని ఊదీ పెట్టాను. కానీ ఆ సాయంత్రం కూడా పని చేయలేదు. వారంటీ ఉందేమోనని బిల్లు తీసి చూస్తే, వారంటీ ఉంది. దాంతో మనసు కుదుటపడింది. అయినా, "బాబా! నా ల్యాప్‌టాప్ సెన్సార్ పని చేసేలా చూడండి" అని బాబాని అడిగాను. అయితే మరుసటిరోజు ఉదయం కూడా ఆ సెన్సార్ పని చేయలేదు. ఇక అప్పుడు ఎక్స్టర్నల్ మౌస్ కనెక్ట్ చేసుకొని వాడుదామని కనెక్ట్ చేసి వాడుతుంటే, ఆశ్చర్యంగా సెన్సార్ కూడా పని చేసింది. ఇదంతా బాబా లీల. బాబా ఊదీకి సాటి మరోకటి లేదు.


2023, అక్టోబర్‌లో నా తమ్ముడు వివాహం నిశ్చయమై నిశ్చితార్థం, వివాహం తేదిలు నిర్ణయించారు. తర్వాత అమ్మాయి తరుపువాళ్ళ పంతులు నిశ్చితార్థం ముహూర్తం బాగాలేదని చెప్పటంతో మళ్లీ చూపించి నిశ్చితార్థం ముహూర్తం మార్చారు. ఆ సమయంలో నేను బాబాను, "తమ్ముడి పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిపించు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా దయవల్ల తమ్ముడి పెళ్లి ఏ ఆటంకమూ లేకుండా బాగా జరిగింది.  "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మనసులో ఎల్లప్పుడు మీ నామస్మరణ చేసేలా, అలాగే ప్రతిరోజూ సచ్చరిత్ర చదివేలా బుద్ధిని ప్రసాదించు తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo