సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1939వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ఆంతర్యమేమిటో మనకు తెలియకపోయినా - ఆయన మన మంచికే చేస్తారు!

సాయినాథునికి, సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేనిప్పుడు బాబా మావారి ఉద్యోగ విషయంలో చేసిన లీలను పంచుకుంటాను. దాదాపు 2023, సెప్టెంబర్ నుండి మావారికి, ఆఫీసులో తన హెడ్‌‌కి మధ్య గొడవలు జరుగుతుండేవి. అతను రోజూ ఏదో ఒక కారణంతో మావారిని ఇబ్బంది పెడుతుండేవాడు. దాంతో మావారు మనశ్శాంతితో ఉండలేకపోయారు. 'గురుచరిత్ర', 'సాయి సచ్చరిత్ర' చదివారు. అలా 2 నెలలు గడిచిపోయాయి కానీ, సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడొకరోజు నాకు ఈ బ్లాగులో 'సాయి మూల బీజాక్షర మంత్రం' చదవడం వలన సమస్య పరిష్కారం అయిందని భక్తులెవరో పంచుకున్న విషయం గుర్తుకు వచ్చి, దాన్ని చదవమని మావారితో చెప్పాను. ఆయన సరేనని రోజుకొకసారి, గురువారం మాత్రం 9 సార్లు చదివారు. 7 నుంచి 8 వారాలలో ఊహించని విధంగా మావారు ఒక ఇంటర్వూకి హాజరవ్వడంతో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీవాళ్ళు 2024, ఫిబ్రవరిలో జాయిన్ అవ్వమన్నారు. మేము ఆ కొత్త ఉద్యోగంలో చేరడానికి గురువారం కలిసి వచ్చేలా తేదీ ఖరారు చేసుకున్నాము. మేము బాబా ఇచ్చిన ఉద్యోగమని సంతోషంగా 2024, జనవరిలో శిరిడీ వెళ్ళాము. అక్కడ ఎందుకో తెలియదుగాని మావారు సంతోషంగా ఉండటానికి బదులు చాలా చికాకు పడ్డారు. నన్ను, పిల్లల్ని అస్సలు ప్రశాంతంగా ఉండనీయలేదు. "ఉద్యోగం వచ్చింది కదా! సంతోషంగా ఉండండ"ని మేము ఎంత బ్రతిమాలి చెప్పినా ఆయన వినలేదు. సరే, బాబా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాము.

శిరిడీ నుండి వచ్చాక మావారు పాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక అసలు సమస్య మొదలైంది. ఆఫీసువాళ్ళు మావారిని రిలీవ్ చేయకుండా జీతం పెంచుతామని, హెడ్ నుండి ఇక మీదట సమస్య రాకుండా చూస్తామని మభ్యపెట్టడం మొదలుపెట్టారు. బాబా దగ్గర చీటీలు వేస్తే, 'కొత్త ఉద్యోగానికి వెళ్ళు' అని వచ్చింది. నేను, పిల్లలు, "వాళ్ళ మాటలు నమ్మొద్దు" అని మావారిని బ్రతిమాలుకున్నాము. కానీ మావారు పాత ఉద్యోగంలోనే ఉంటానని ఎవరి మాట వినకుండా కొత్త ఉద్యోగంలో చేరనని సదరు కంపెనీకి మెయిల్ పంపించారు. అదేరోజు నేను బ్లాగులో ఒక భక్తుని అనుభవం చదివాను. అందులో ఆ సాయి బంధువు 'తనకు ఒక కొత్త ఉద్యోగమొస్తే, పాత కంపెనీవాళ్ళు జీతం పెంచుతామని వెళ్లకుండా ఆపారని, 15 రోజుల తరువాత ఏ వ్యక్తి అయితే ఆవిధంగా మాట ఇచ్చి ఆపారో ఆ వ్యక్తి ద్వారానే సమస్య ఎదురుకోవడంతో భరించలేక ఉద్యోగం వదిలేసానని' వ్రాశారు. నా మనసు కీడు శంకించింది. బాబా ఆ సాయి బంధువు అనుభవం ద్వారా మావారు కొత్త ఉద్యోగంలో చేరకపోతే సమస్య అవుతుందని చెపుతున్నారనిపించింది. కానీ ఎంత చెప్పినా మావారు వినకుండా పాత కంపనీలోనే ఉంటానని రాజీనామా వెనక్కి తీసుకున్నారు. నేను భయపడినట్టే 15 రోజుల తరువాత ఎవరైతే మావారిని ఉండమన్నారో ఆ ఆఫీసర్ ద్వారానే  మావారికి సమస్య మొదలైంది. జీతం పెరగడం అటుంచితే ఆ ఆఫీసర్‌కి, మావారికి మధ్య విపరీతంగా గొడవలు జరిగాయి. ఆ గొడవల కారణంగా మావారు ఇంట్లో చికాకు పడుతుండటంతో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు "దారి చూపమ"ని బాబాని వేడుకున్నాను. ఆయన దయవల్ల ఒకసారి కొత్త కంపెనీవాళ్ళకి మెయిల్ పెట్టి ఇంకో అవకాశమివ్వమని అడగాలన్న ప్రేరణ కలిగి, అదే విషయం మావారితో చెప్పి కొత్త కంపెనీకి మెయిల్ పెట్టించాను. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. కాకపొతే, ఒక వారం రోజుల్లో జాయిన్ అవ్వాలని షరతు పెట్టారు. నేను మావారితో, "బాబా దయవలన రెండోసారి అవకాశమొచ్చింది. జాయినవ్వండి" అని ఎంతగానో చెప్పాను. కానీ ఏవో కారణాలతో మావారు రెండో అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా జాయిన్ కాలేదు. నేను, పిల్లలు చాలా బాధపడ్డాము. 'బుద్ధి కర్మానుసారిణి' అంటారు కదా! ఏం చేస్తామని బాబాను "దయ చూపమ"ని వేడుకొని వదిలేసాను. దాదాపు 8 నెలలు నా భర్త ఆఫీసులో విపరీతమైన టెన్షన్లు, అవమానాలు, దగ్గర స్నేహితులనుకున్న వాళ్ళు చేసిన మోసాలు ఎదుర్కొన్నారు. తట్టుకోలేక రాజీనామా చేద్దామన్నా చేతిలో ఇంకో ఉద్యోగం లేని పరిస్థితి. ఇదంతా తప్పించటానికి బాబా రెండు అవకాశాలిచ్చిన సద్వినియోగం చేసుకోలేదు.

మావారు వీలైనప్పుడల్లా బాబా మూల బీజాక్షర మంత్రం చదువుతూ ఉండేవారు. నేను ఆయన చేత 5 వారాలు 'సాయి దివ్యపూజ' చేయించాను, గురువారం బాబా గుడికి పంపించాను. నేను కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా సమస్య తీర్చమని వేడుకుంటుండేదాన్ని. ఇలా 8 నెలలు గడిచిపోయాయి. నా భర్త, "బాబా తనపట్ల దయ చూపటం లేదు" అనేవారు. నాకు చాలా కోపమొచ్చి, "ఇది మీ స్వయంకృపరాధం. బాబాను అంటే అసలు ఊరుకోను. ఇక అనుభవించాల్సిన కర్మ పూర్తిగా తీరేదాక ఈ సమస్య తీరదు" అని కోపంగా సమాధానం చెప్పేదాన్ని. చివరకి జాబ్ టెన్షన్ వలన నా భర్త ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు బాబాను అడిగితే, 'ఉద్యోగానికి రాజీనామా చేయమ'ని వచ్చింది. నేను మావారితో, "నాకు నమ్మకముంది. బాబా తప్పక ఉద్యోగమిస్తారు. ఆలస్యం చేయకుండా రాజీనామా చేయండి" అని అన్నాను. ఈసారి నా మాట విని నా భర్త నేను చెప్పినట్లే చేసారు. నా మాట వమ్ము కాలేదు. పాత కంపెనీలో నోటీసు పీరియడ్ నెల రోజులుండగా ఆలోపే బాబా దయవల్ల మావారికి ఒకేసారి మూడు ఉద్యోగాలొచ్చాయి. దాంతో ఏ ఉద్యోగంలో చేరాలన్న ఆలోచన వచ్చింది. మావారు, "బాబా ఎందులో చేరమని చెప్తే, అందులో జాయిన్ అవుతాను" అన్నారు. బాబా ఆ మూడింటిలో తక్కువ ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగంలో చేరమన్నారు. బాబా ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు కానీ, ఆయన మన మంచికే చేస్తారు కదా! మావారు మనస్ఫూర్తిగా బాబా చెప్పిన ఉద్యోగంలో 2024, అక్టోబర్ 3, గురువారంనాడు జాయిన్ అయ్యారు. తర్వాత బాబా దయవలన ఎన్నో సంవత్సరాల నుండి తీర్చుకోలేకపోయిన మా ఇంటి దైవం మొక్కు కూడా తీర్చుకోగలిగాం. "శతకోటి నమస్కారాలు బాబా. కష్టకాలంలో మా వెంట ఉండి నడిపించారు. మీకు చాలా ధన్యవాదాలు". సాయి బంధువులారా! బాబాను అడిగాక ఆయన ఆజ్ఞను శిరసా వహించండి. ఆయన మాట వమ్ము కాదు.

మరికొన్ని చిన్నచిన్న అనుభవాలు చెప్పి ముగిస్తాను. కొన్నిరోజులుగా నా రెండు కాళ్ళ చీలమండల దగ్గర దురదగా ఉంటుంది. అది ఇన్ఫెక్షన్‌లా మారి రోజురోజుకి పెరుగుతూ ఉంటే బాబాని తలుచుకొని ఊదీ రాసుకున్నాను. కొద్దిగా తగ్గినట్టు అనిపించింది కానీ మళ్ళీ పెరిగింది. బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కింద పడి ఉన్న అగరబత్తి పొడిని ఊదీగా భావించి, ఊదీ మంత్రం జపిస్తూ ఇన్ఫెక్షన్ ఉన్నా ప్రాంతంలో రాసుకొని బాబాని తగ్గించమని వేడుకున్నాను. అప్పుడు బాబా తమ అభిషేక జలం రాయాలన్న ప్రేరణ నాకు కలిగించారు. దాంతో నేను అదివరకు ఒక సీసాలో సేకరించి పెట్టుకున్న అభిషేక జలం దురద, ఇన్ఫెక్షన్ ఉన్న చోట రాశాను. బాబా దయవల్ల ఇన్ఫెక్షన్, దురద తగ్గాయి. ఇంకోసారి విరేచనాలతో రెండు రోజులు ఇబ్బందిపడ్డాను. అప్పుడు ఊదీ తీసుకున్నాను. బాబా ఊదీ మహత్యం వల్ల ఏ మందు తీసుకోకుండా తగ్గిపోయింది. మరోసారి నా కాలు కండరం పట్టేసి నడవడానికి ఇబ్బందిపడ్డాను. అప్పుడు బాబాను తగ్గించమని వేడుకుంటే, ఆయన దయవలన రెండు రోజులలో తగ్గిపోయింది.

నేను ఒకసారి రెండు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో సరిగా జరగాలని, కోరుకుంటున్నట్లు జరిగితే బాబా నామం 216 సార్లు వ్రాస్తానని అనుకున్నాను. బాబా దయవల్ల బాగా జరిగింది. బాబా నామం వ్రాసి ఆయనకు కృతజ్ఞత చెప్పుకున్నాను.

ఒక వారం ఆదివారంనాడు కూడా నేను ఆఫీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నాకు వెళ్లాలని లేదు. ఆ వారం చాలా వర్క్ చేసి ఉన్నందున విశ్రాంతి కావాలనిపించింది. అందువల్ల బాబాను "ఎలాగైనా డ్యూటీ తప్పిపోవాలి" అని కోరుకున్నాను. బాబా దయ చూపారు. డ్యూటీ వేరే వాళ్లకు ఇచ్చారు. నా తల్లి, తండ్రి, గురువు, దైవం నా తోడు నీడ.  

ఒక సమస్య వలన నేను, మా అమ్మ రెండు రోజులు చాలా మానసిక వేదన అనుభవించాము. అప్పుడు నేను బాబా గుడికి వెళ్లి, "ఈ బాధను తప్పించమ"ని వేడుకున్నాను. అంతే, బాబా దయవలన ఆ రోజు సాయంత్రం వరకు సమస్య పరిష్కారం అయింది. ఏం చెప్పను బాబా దయ గురించి? చిన్నదదైన, పెద్దదైన బాబాకి మొర పెట్టుకుంటే ఆయన తప్పక నెరవేరుస్తున్నారు. "మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. మీరు ఎన్నిసార్లు నన్ను ఆదుకున్నారో లెక్కలేదు". చివరిగా ఇంతసేపు ఓపికగా చదివిన మీకు ధన్యవాదాలు.

6 comments:

  1. Om sai ram, chala rojulu tarwata e roje ofce work start chesthunna baba, anta bagunde la chayandi baba pls ofce lo… ma team ki baga work chese varni okarni allocate chayandi baba pls. Andaru kshamam ga arogyam ga unde la chudandi baba pls. E roju anta prashantam ga gadiche la chayandi baba pls.

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo