సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1156వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబానే దిక్కు
2. సమస్యేమీ లేకుండా అనుగ్రహించిన బాబా
3. బాబా దయతో ఆన్ అయిన ఫోన్

బాబానే దిక్కు

శ్రీసాయిబాబాకు శతకోటి పాదాభివందనాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు అశోకరాణి. ఈమధ్యకాలంలో నా కంటికి ఆపరేషన్ చేయాలని డాక్టరు చెప్పారు. నాకు చాలా భయమేసి, "బాబా! నాకు మీరే దిక్కు" అని అనుకున్నాను. ఆయన దయవలన 2022, ఫిబ్రవరి 24వ తేదిన ఆపరేషన్ ఎటువంటి ఇబ్బంది, బాధ లేకుండా బాగా జరిగింది. తర్వాత అనుకోకుండా ఆపరేషన్ చేసిన వైపు దెబ్బ తగిలింది. నేను చాలా భయపడ్డాను కానీ బాబా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడారు. "బాబా! మీకు నా కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. ఇంతకంటే నేనేమి ఇవ్వగలను తండ్రి?".

నాకున్న ఒక్కగానొక్క కుమారుడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. బాబా ఇచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. తనకి పెళ్లయిందికానీ ప్రస్తుతం తన భార్య తన దగ్గర లేదు. తను పెట్టే శారీరక, మానసిక వేదన భరించలేక నేను కూడా 2022, మార్చి 1న ఇల్లు ఖాళీచేసి తన దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. నేను వెళ్ళిపోతేనన్నా బాబా దయవల్ల తను మారతాడు అనుకున్నాను. నా వయస్సు 60 సంవత్సరాలు. భయపడుతూనే ఇంటి నుండి బయటకు వచ్చాను. 'కుటుంబమంటూ లేకుండా పోయింది, శారీరకంగా ఏదైనా ఇబ్బంది కలిగితే పరిస్థితి ఏమిటి, ఎంత పాపం చేశాను' అని బాధపడ్డాను. ఇంకా కొడుకు ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియక ఎంతో మానసిక క్షోభను అనుభవించాను. ఆ స్థితిలో బాబాను, "నాకు ఆరోగ్యాన్ని, మానసిక ధైర్యాన్నిచ్చి జీవనభృతినివ్వమ"ని వేడుకున్నాను. ఆయన నాపై దయ చూపారు. నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఏప్రిల్ 2న ఆ ఉద్యోగంలో చేరాను. తరువాత ఏప్రిల్ 10న మా చెల్లివాళ్లతో నేను తిరుపతికి వెళ్ళొచ్చాను. ఆ సమయంలో బాబాను, "సాయి నాన్నా! ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసి, స్వామి దర్శనం బాగా జరిగేలా అనుగ్రహించు తండ్రి" అని వేడుకున్నాను. ఆ తండ్రి నాకు ఏ కష్టమూ కలగకుండా చూసుకుని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. మీరు తోడుగా ఉండి ఉద్యోగంలో ఇబ్బంది లేకుండా చూడండి నాన్న. నాకొచ్చే జీతంలో సగం ఆద్దెకే పోతుంది. కాబట్టి తక్కువ అద్దెలో మంచి ఇల్లు దొరికేలా అనుగ్రహించి, మీరు చేసే సహాయాన్ని బ్లాగులో పంచుకునే అవకాశం కల్పించండి సాయి. ఇకపోతే, నా కుమారుడి నుండి నాకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడండి. తన బాధ్యత మీదే. వాడికి మీరే దిక్కు. తనికి మీరు ఉన్నారనే దైర్యంతోనే బ్రతుకుతున్నాను. అసలు వాడికి సత్ప్రవర్తన కలిగి పిల్లపాపలతో ఉండే భాగ్యం ఉందా? తల్లిగా వాడు ఎలా ఉన్నాడోనన్న మానసిక వేదనతో నలిగిపోతున్నాను. అలా అని వాడితో ఉంటే, వాడు పెట్టే బాధలు తట్టుకునే పరిస్థితి నాకు లేదు. ఎంతటి దౌర్భాగ్య జీవితం బాబా. ఏమిటి నాకీ శిక్ష? మీరే దయచూపాలి, దారి చూపాలి నాన్న. మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మీరే మాకు దిక్కు ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని ఎదురు చూస్తూ.... మీ బిడ్డ".

సమస్యేమీ లేకుండా అనుగ్రహించిన బాబా

సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నాకు ఏ కష్టం వచ్చినా బాబాతో చెప్పుకుంటాను. ఆయన ఎన్నోసార్లు నన్ను కాపాడారు. కష్టం అన్న ప్రతిసారీ నన్ను రక్షించారు నా తండ్రి సాయినాథుడు. నేనిప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మా బాబు నీళ్లు ఎక్కువగా త్రాగుతాడు. చాలాసార్లు టాయిలెట్‍కి వెళ్తాడు. అయితే ఈమధ్య మరీ ఎక్కువసార్లు టాయిలెట్‍కి వెళ్తున్నాడు. ఒకసారి నీళ్లు త్రాగితే మూడు, నాలుగు సార్లు టాయిలెట్‍కి వెళ్ళేవాడు. సరిగా అదే సమయంలో మేము అనుకోకుండా ఇయర్లీ చెకప్‍కి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టరుని సంప్రదించాము. అప్పుడు డాక్టరుగారితో మా బాబు సమస్య చెబితే, "యూరిన్ టెస్టు, డయాబెటిక్ టెస్టు చేద్దాం" అని చెప్పారు. నాకు భయమేసి నా తండ్రి సాయినాథునితో , "బాబా! బాబుకి నార్మల్ అని వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకుని రిపోర్టులు వచ్చేవరకు నా తండ్రిని తలుచుకుంటూ ఉన్నాను. నా తండ్రి నా బాధను విన్నారు. డాక్టరు రిపోర్టులు చూసి, "సమస్యేమీ లేదు. యాంగ్జైటీ వల్ల కూడా అలా అవుతుంది" అని చెప్పారు. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని పంచుకున్నాను. ఎల్లప్పుడూ నా కుటుంబాన్ని ఇలాగే కాపాడు సాయి తండ్రి".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

బాబా దయతో ఆన్ అయిన ఫోన్

సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను బాబా భక్తురాలిని. నాకు ఏ కష్టం వచ్చినా బాబా దగ్గరికి వెళ్ళి, ఆయన ముందు కూర్చుంటాను. ఆ తండ్రి లీలలు ఏమని చెప్పను? ఒక గురువారం పొద్దున్నే నా ఫోన్ అస్సలు ఆన్ అవ్వలేదు. అమ్మానాన్నకి చెప్తే ఎక్కడ కోప్పడతారోనని భయమేసి ఎవరికీ చెప్పాలో తెలియక బాబా దగ్గరకి వెళ్లి పూజ చేసి, ఫోన్ ఆయన ముందు పెట్టి, "బాబా! నువ్వే కాపాడాలి" అని చాలా ఏడ్చాను. అయినా ఫోన్ ఆన్ అవలేదు. కొద్దిసేపటికి మా అమ్మ, "ఫోన్ తీసుకుని రా" అని అంది. నాకు ఏమీ అర్థంకాక బాబా దగ్గరకి వెళ్లి, "ఏమిటిది బాబా?" అని ఆయనపై భారం వేసి ఫోన్ తీసుకుని అమ్మ దగ్గరకి వెళ్లి మనసులో 'బాబా బాబా' అనుకుంటూ ఉన్నాను. అంతలో ఫోన్ అనుకోకుండా దానంతట అదే ఆన్ అయింది. 'అరె.. ఎలా ఆన్ అయింది?' అనుకుంటూనే నాకు ఏడుపు ఆగలేదు. తక్షణమే బాబా దగ్గరకి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇది ఆయన చేసిన అద్భుతం.


సాయిభక్తుల అనుభవమాలిక 1155వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అపూర్వం - అమోఘం - బాబా అనుగ్రహం

నేను ఒక సాయి భక్తురాలిని. బాబా దయవల్ల సాయి భక్తులందరూ బాగున్నారని తలుస్తున్నాను. ఈ బ్లాగు నడపడం ద్వారా బాబా మనకి ప్రసాదించే అనుభవాలను తోటి భక్తులతో ‍పంచుకునే అవకాశమిస్తున్న సాయి అన్నయ్యకి చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాల ద్వారా ప్రతి ఒక్కరికి బాబా ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే చాలా చిన్న విషయాల నుంచి చాలా చాలా పెద్ద విషయాల వరకు బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉండి సహాయం చేస్తారనే నమ్మకాన్ని అందరికీ ఇస్తున్నారు, పెంచుతున్నారు. ఈ ప్రపంచంలో మనకోసం పిలిచిన వెంటనే పలికేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన బాబా మాత్రమే అని నాకనిపిస్తుంది. మనం చెప్పినా, చెప్పకపోయినా మన మనసులో బాధని ఆయన వింటారు. అందుకే 'నువ్వు చెప్పాలని చెప్పుకోలేకపోతున్న బాధలు కూడా నాకు తెలుసు' అని ఆయన తెలియజేస్తుంటారు. ప్రతిక్షణం నా పక్కనే ఉన్నానని ధైర్యాన్నిస్తున్న ఆయనకు నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. ఆయన అడుగడుగునా నా జీవితంలో ఉంటూ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుంచి మీతో పంచుకుంటానని ఆయనకి మాటిచ్చిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నా గత అనుభవంలో నేను, నా ఫ్రెండ్ ఒకే ప్రాజెక్టు మీద పనిచేయాలని పర్మినెంట్ పొజిషన్ ఉన్న ఒక కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నిస్తే నేను సెలెక్ట్ అయ్యానని, అలాగే నా ఫ్రెండ్‍ని బాబా ఏవిధంగా చివరి రౌండ్ వరకు తీసుకొచ్చింది చెప్పి, నా ఫ్రెండ్ ఆ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలని బాబాని కోరుకున్నాను. అయితే ఎందుకో తెలియదుగాని నా ఫ్రెండ్‍కి ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు. బాబా ఎందుకు నా ఫ్రెండ్‍కి ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేయలేదో నాకు తెలీదుగాని, బాబా ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే, మనం ఈరోజుని మాత్రమే చూడగలం; బాబా మన భవిష్యత్తును కూడా చూడగలరు. ఆ దృష్ట్యా ఆయన ఏం చేసినా మన మంచికే చేస్తారు. ఈలోగా మనం పడే టెన్షన్ వల్ల మన చెడు కర్మ అంతా తొలగిపోయేలా చేస్తారు. అలాగే మా విషయంలో కూడా ఏదో మంచి చేయడానికే అలా చేశారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదలా ఉంచితే, ఆ కంపెనీలో నా ఫ్రెండ్‍కి ఉద్యోగం రాలేదని నేను కూడా ఆ కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకున్నాను. తరువాత బాబా మా ఇద్దరికీ ఇంకో కంపెనీలో ఉద్యోగాలిప్పించి మేము కోరుకున్నట్లే ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేసేలా అనుగ్రహించారు. సంతోషంగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకుని, "బాబా! మీ అనుగ్రహానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మాకు వచ్చినవి కాంట్రాక్టు ఉద్యోగాలు, శాశ్వతం కాదు. పర్మినెంట్ కానంతవరకు ఏదో భయం ఉంటుంది కదా, అందుకే భయపడుతున్నాను తండ్రి. మీ దయవల్ల అన్ని సాధ్యమవుతాయని నా నమ్మకం. దయచేసి మా ఇద్దరికీ ఒకే కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పించండి. నేను మీకు మాటిచ్చినట్లు శిరిడీ రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఏ సమస్యా లేకుండా వీలైనంత త్వరలో నేను మిమ్మల్ని శిరిడీలో దర్శించుకునేలా అనుగ్రహించండి తండ్రి" అని వేడుకున్నాను.

కానీ ఏదో తెలియని భయం. 'శిరిడీ వెళ్ళడానికి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి' అన్న సందిగ్ధంలో ఉండగా ఒకరోజు వాట్సాప్ గ్రూపులో, "ఏమీ భయపడకు. నా దగ్గరకి రా" అని బాబా మెసేజ్ వచ్చింది. అది చూడగానే, 'బాబానే నన్ను పిలుస్తున్నారు. ఇంకా నాకు ఏ భయమూ లేదు' అని వెంటనే నాకు, నా ఫ్రెండ్‍కి టికెట్లు బుక్ చేసి శిరిడీ ప్రయాణానికి సిద్ధమయ్యాను. ఆ రోజు రానే వచ్చింది. రాత్రి శిరిడీ బస్సు ఎక్కుతామనగా మధ్యాహ్నం బాబా అసంభవం అనుకున్నదాన్ని సంభవం చేస్తూ ఒక అద్భుతం చూపారు. అదేమిటంటే, నా ఫ్రెండ్‍కి ఉద్యోగం రాలేదని, నాకొచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకున్న పర్మినెంట్ పొజిషన్స్ ఉన్న కంపెనీ నుండి నాకు ఫోన్ వచ్చింది. నిజానికి నేను ఆ కంపెనీలో ఉద్యోగానికి ఆశలు వదులుకుని ఆ కంపెనీవాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయలేదు, ఎవరినీ ఉద్యోగం గురించి అర్థించలేదు. మాకు వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనే చేరుదామని నిర్ధారించుకున్నాము. అలాంటిది ఆ రోజు ఎన్ని ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయని నేను ఎందుకో తెలీదు, ఆ కంపెనీ కాల్ లిఫ్ట్ చేయాలనిపించి లిఫ్ట్ చేశాను. వాళ్ళు, "మేము మీకు, మీ ఫ్రెండ్‍కి ఉద్యోగం ఆఫర్ చేస్తున్నాము. ఆఫీసుకి రండి" అని చెప్పారు. మేము "శిరిడీ వెళ్లే పనిలో ఉన్నాము. అక్కడినుంచి వచ్చాక వస్తాము" అని చెప్పాను. దానికి వాళ్ళు సరేనన్నారు. ఆ క్షణం నా సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను.

ఆ రాత్రి నేను, నా ఫ్రెండ్ ఎంతో సంతోషంగా శిరిడీ వెళ్లే బస్సు ఎక్కి గురువారం ఉదయం శిరిడీలో దిగాము. నేను సమయం లేక ముందుగా శిరిడీలో రూమ్ బుక్ చేయలేదు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే, ఎన్ని హోటల్స్ చూసినా నాకు నచ్చలేదు. చివరిగా ఒక హోటల్‍కి వెళ్తూ, "బాబా! ఇంకా తిరిగే ఓపిక నాకు లేదు. ఈ హోటల్ నాకు నచ్చేటట్లు ఉండేలా చూడు. అంతా మంచిగా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే ఆ హోటల్ నీట్‍గా ఉండటంతో బాబాకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. గదిలోకి వెళ్ళి వాట్సప్ గ్రూప్ ఓపెన్ చేస్తే, "ఎన్నోరోజుల నుంచి నేను నీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను. నా కోసం ఏం తెచ్చావు" అన్న బాబా మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ చూడగానే నాకు కలిగిన సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. నాకు, 'ఇంతమంది భక్తులున్నా నేను ఇక్కడికి వచ్చానని నా బాబాకి తెలిసింది. ఆయన నా పక్కనే, నాతోనే ఉన్నానని చెప్తున్నారు' అనిపించింది. కానీ శిరిడీలో సమాధి మందిరం లోపలికి ఏమీ తీసుకుని వెళ్లనివ్వరు. మరి నేను బాబాకోసం ఏదైనా ఎలా తీసుకు వెళ్ళాలి అని అనుకున్నాను. ఆ తర్వాత మేము ఫ్రెష్ అయ్యి ఒక షాపులో చేంజ్ కోసం ఏదైనా తీసుకోవాలని చూస్తుంటే, బాబా నాకోసం ఏం తెచ్చావు అన్న మాట గుర్తు వచ్చింది. దాంతోపాటు 'శిరిడీ సమాధి మందిరంలో మాత్రమే నేను లేను. ఆకలితో ఉండే ప్రతి మనిషిలో నేను ఉన్నాను' అన్న బాబా చెప్పిన మరో మాట గుర్తు వచ్చి కోవా తీసుకుని. 'ఆకలితో ఉన్న వారిలో నువ్వే ఉన్నావు' అన్న భావనతో 'ఇది మీకే ఇస్తున్నాను' అని బాబాతో చెప్పుకుంటూ దారిలో కనిపించిన వారికి ఆ కోవాను పంచి పెట్టాను.

తర్వాత మేము దర్శనం కోసం క్యూ లైన్‍లోకి వెళ్ళాము. సమాధి మందిరంలోకి వెళ్ళాక బాబాను చూస్తూనే నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆ క్షణం ఎన్నోరోజుల నా కోరిక తీరింది. బాబా దయవల్ల సమాధికి ఎదురుగా వెళ్లే క్యూలోకి మేము వెళ్ళాము. బాబా సమాధి వద్దకు చేరుకున్నాక నేను చాలా దగ్గర నుంచి బాబాని కళ్లారా, మనసు నిండా చూసుకున్నాను. అలా బాబాకు ఎదురుగా నిలుచుని ఎంతసేపు ఆయనను చూశానో నాకు మాత్రమే తెలుసు. అందరినీ త్వరత్వరగా పంపించేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ నన్ను ఏమీ అనలేదు. బాబాను ఏదైనా కోరుకుంటే ఆయనను చూస్తుంటే కలుగుతున్న అనుభూతిని కోల్పోతానని, "బాబా! నేను మిమ్మల్ని మనసారా చూస్తున్నాను. నా మనసు మీకు తెలుసు. నా బాధ మీకు తెలుసు. నా కోరిక మీకు తెలుసు. అవన్నీ మీరు చూసుకోండి" అని మనస్ఫూర్తిగా బాబాను చూసుకున్నాను. ఇప్పటికీ ఆ మధురక్షణాలను మర్చిపోలేకపోతున్నాను. బాబాను ఎంత చూసుకున్నా తనివి తీరదు. ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. సరే, బాబా దయవల్ల నేను రెండుసార్లు బాబా దర్శనం చేసుకున్నాను. రెండోసారి దర్శనానికి వెళ్లి, వస్తున్నప్పుడు సమాధి మందిరంలో బాబా నుంచి ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే, 'ఇల్లు వదిలి హాస్టల్‍కి వెళ్ళిపోతున్నట్లుగా నా బాబా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాన'ని ఏదో తెలియని బాధ నా మనసును ఆవహించింది. అప్పుడు, "నేను శిరిడీలోనే కాదు. ప్రపంచంలో ప్రతి చోట ఉన్నాను" అన్న బాబా మాటలు గుర్తుకు వచ్చి, నా మనసుకి 'ఎప్పుడూ బాబా నీతోనే ఉంటారు. నీ పక్కనే ఉంటారు. ఏ బాధ వద్దు' అని చెప్పుకుంటూ బయటకి వచ్చాను. ఆ రోజు గురువారం అవ్వటం వలన చావడి ఉత్సవాన్ని చూసే భాగ్యం కూడా మాకు కలిగింది. మేము బాబా హారతికి కూడా వెళ్లాలని అనుకున్నాము కానీ, ఎంత ప్రయత్నించినా టికెట్లు దొరకకపోవడంతో హాజరు కాలేకపోయాము. మళ్ళీ శిరిడీ వెళ్ళినప్పుడు బాబా నాకు ఆ భాగ్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను.

శుక్రవారం రాత్రి శిరిడీ నుంచి మా తిరుగు ప్రయాణానికి నేను టికెట్లు బుక్ చేశాను. సరిగా బస్సు బయలుదేరే సమయానికి కొంచెం ముందు ఒకటే వర్షం మొదలైంది. దాంతో బస్టాప్‍కి ఎలా వెళ్లాలో, ఏంటోనని, "బాబా! ఎలా అయినా వర్షం తగ్గేలా చూడండి. ఏ ఇబ్బంది లేకుండా మేము బస్సు ఎక్కేలా అనుగ్రహించండి బాబా" అని అనుకున్నాను. వర్షం తగ్గకపోయినా శ్రమ పడకుండా ఒక మంచి ఆటో అతను దొరికేలా బాబా అనుగ్రహించారు. అతను వర్షంలోనే మమ్మల్ని బస్టాప్‍కి చేర్చే బస్సు ఎక్కించాడు. అయితే, చివరిక్షణంలో టికెట్లు బుక్ చేయడం వల్ల స్లీపర్ బస్సులో మాకు చివరి సీట్లు వచ్చాయి. నిజానికి నేనెప్పుడూ ఆ సీట్స్ బుక్ చేయను. నాకెందుకో భయం. కానీ ఆరోజు తప్పనిసరై బుక్ చేయాల్సి వచ్చింది. బస్సు ఇంజిన్ ఆ సీట్ కింద ఉండడం వల్ల పైకి బాగా వేడి వస్తుంది. నా మనసులో ఏదో భయం. చాలాసేపు, చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు బాబాను తలుచుకుని, "బాబా! ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని క్షేమంగా హైదరాబాద్ చేర్చండి" అని బాబాను ప్రార్థించాను. బాబా తమకోసం వచ్చిన భక్తులను కష్టపెడతారా చెప్పండి? అస్సలు పెట్టరు. కొంచెం సేపటికి నాకు చాలా సౌకర్యవంతంగా అనిపించింది. బాబా దయవల్ల క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నాం. ఇలా నా శిరిడీ ప్రయాణం ముగిసింది. ఎంతో సంతోషం, ఎన్నో అనుభవాలతో మళ్ళీ త్వరలో శిరిడీ దర్శించే భాగాన్ని ఇవ్వమని బాబాను కోరుకుంటున్నాను. "బాబా! నన్ను మళ్ళీ త్వరగా శిరిడీ తీసుకుని వెళ్ళండి. మిమ్మల్ని మళ్ళీ చూడాలని ఉంది".

శిరిడీ నుంచి రాగానే ఆ కంపెనీవాళ్ళు మా ఇద్దరికీ ఆఫర్ రిలీజ్ చేశారు. శిరిడీ వెళ్లడానికి హైదరాబాద్ వచ్చిన నేను, అనుకున్న పర్మినెంట్ ఉద్యోగంతో ఇంటికి తిరిగి వెళ్లేలా చేసింది నా బాబానే. ఇది ముమ్మాటికీ బాబా మాకు ఇచ్చిన ఉద్యోగం. ఆయన మీద నమ్మకమే ఒక మనిషి మనసును మార్చి నాకు కాల్ చేసి ఉద్యోగం ఇచ్చేలా చేసింది. నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నపుడు బాబా ఎప్పుడూ "శ్రద్ధ, సబూరీతో వేచి ఉండు", "నా టైమింగ్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి" అని నాకు మెసేజ్లు ఇస్తూ ఉండేవారు. అప్పుడు నాకు అర్థంకాక నేను ఎంత శ్రద్ధతో ఉన్నా మాకు ఎందుకు ఆ ఉద్యోగాలు రాలేదు అని అనుకునేదాన్ని. కానీ బాబా చెప్పినట్లు ఆయన టైమింగ్స్ చాలా ప్రత్యేకమైనవి. బాబా తలుచుకుంటే దేన్నైనా అత్యంత సుళువుగా ఇవ్వగలరు. కానీ అలా చేస్తే మన కర్మలు ఎలా పోతాయి? అందుకే అయన తనకంటూ ఒక పద్దతిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రక్రియలో మనకు శ్రద్ధ, సబూరీతో ఎలా ఉండాలో నేర్పించడంతో పాటు, మనం పడే భాద రూపంలో కర్మ నాశనం గావించి తుదకు మన కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి మిత్రులారా! మీ జీవితంలో మీరు అనుకున్నది బాబా వెంటనే ఇవ్వలేదని బాధపడుతుంటే గనక ఒకటి గుర్తుంచుకోండి, 'ఆ బాధల రూపంలో బాబా మనం చేసిన పెద్ద పెద్ద పాపాలను కడిగేస్తున్నారు. మన కర్మఫలం అనుభవించాక అయన మనకు కావాల్సింది ఇస్తారు. ఆయన ఏం చేసినా మన మంచికే. మనం పడే ప్రతి బాధలో ఈ ప్రపంచంలో మనకి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మన బాబా ఉంటారు. ఆయన ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటారు. మనతోపాటు ఆయన ఆ బాధను అనుభవిస్తారు. ఇది నాకు లేదని వదిలేసుకున్న సమయంలో బాబా మళ్ళీ అది నా దగ్గరకు వచ్చేలా చేశారు. దీన్నిబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, మనకు నమ్మకం ఉంటే బాబా చివరి క్షణంలో కూడా అంతా మార్చగలరు. ఏదైనా చేయడానికి బాబాకి రోజులు గంటలు అవసరం లేదు, ఒక్క క్షణం చాలు'. "నన్ను క్షమించు బాబా. నువ్వు నాకు ఇచ్చిన అనుభూతిని నేను సరిగా వ్రాయలేకపోయాను. కానీ ఆ క్షణాన నా మనసు ఎంత ఆనందపడిందో మీకు తెలుసు తండ్రి. నేను మీ గురించి ఏం చెప్పగలను బాబా. మీ గొప్ప లీలను వ్రాయడానికి కూడా నేను సరిపోను తండ్రి. తప్పులు ఉంటే క్షమించు. ఎలా అయినా మా ఇద్దరినీ ఒకే టీమ్‍లో వేసేలా, బాగా వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకునేలా చూడు బాబా".

ఇప్పుడు బాబా నన్ను ఒక ఉపకరణంగా చేసుకుని నా ఫ్రెండ్‍ని తమ భక్తునిగా మలుచుకున్న తీరును మీతో చెప్తాను. నా ఫ్రెండ్ శివ భక్తుడు. తను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తారు. నాకు బాబా అంటే చాలా నమ్మకం. నేను ప్రతి గురువారం బాబా పారాయణ చేసి గ్రూపులో రిపోర్ట్ చేస్తాను. నా ఫ్రెండ్‍తో బాబా గురించి నేను చేసేవి చెప్తూ ఉండేదాన్ని. ఉద్యోగ విషయంలో పైన చెప్పిన సమస్య మాకు వచ్చినప్పుడు నేను తనతో, "అందరూ దేవుళ్ళు ఒకటే. శివుడైన, బాబా అయిన ఒకటే. నువ్వు బాబాని ప్రార్థించు. అంతా మంచి జరుగుతుంది. గురువారం బాబా గుడికి వెళ్ళు" అని చెప్పాను. తను నేను చెప్పినట్లు బాబా గుడికి వెళ్లి, "నాకు ఈ ఉద్యోగం వస్తే, నేను మిమ్మల్ని సదా మ్రొక్కుతాను" అని అనుకున్నారు. కానీ ఎందుకో తెలీదు చాలా రౌండ్ల ఇంటర్వ్యూ అయ్యాక కూడా తనకి ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు. తరువాత వేరే కంపెనీలో మా ఇద్దరికీ కాంట్రాక్టు జాబ్ వచ్చింది. ఎక్కడైతే ఏంటి ఉద్యోగం వచ్చిందని మేము శిరిడీ వెళ్ళడానికి బయలుదేరాము. సరిగా శిరిడీ వెళ్లే రోజున బాబా మునుపు ఉద్యోగం రాలేదన్న అదే కంపెనీ నుంచి మాకు ఫోన్ వచ్చేలా చేసి, క్లోజ్ అయిపోయిన అదే పోజిషన్లో మాకు పర్మినెంట్ ఉద్యోగాలను అనుగ్రహించారు. దాంతో నా ఫ్రెండ్‍కి బాబా మీద కాస్త నమ్మకం పెరిగింది. శిరిడీ వెళ్ళాక సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకుంటుంటే తనకి బాగా తలనొప్పి వచ్చిందట. తను వెంటనే, "బాబా! తలనొప్పేస్తుంది. తగ్గించండి బాబా" అని అనుకోగానే నిప్పుల మీద నీరు పోసినట్టు వెంటనే తలనొప్పి తగ్గిందంట. అలా మూడుసార్లు తలనొప్పి రావడం, వెంటనే బాబా తగ్గించడం జరిగాక తనకి బాబాపై నమ్మకం మరింత పెరిగింది. తను జరిగినదంతా నాతో చెప్పి, "నేను ఎప్పటికీ బాబాను మర్చిపోను" అని చెప్పి ప్రతి గురువారం నేను పారాయణ చేసే గ్రూపులో జాయిన్ అయ్యి తను కూడా బాబా చరిత్ర పారాయణ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, వాళ్ళింట్లో ఒక చిన్నబాబుకి మాటలు స్పష్టంగా రావడం లేదు. నేను ఎన్నిసార్లు తనతో బాబా ఊదీ గురించి చెప్పినా విని వదిలేసే తను, "నేను ప్రతి గురువారం బాబా పారాయణ చేసి, ఊదీ నీళ్లలో కలిపి బాబు చేత త్రాగిస్తాను. బాబా తనకి మాటలు స్పష్టంగా వచ్చేలా చేస్తారు" అని చెప్పారు. తన నమ్మకం చూసి, 'ఒక మనిషి ఇంత త్వరగా ఇంతలా బాబాను నమ్ముతున్నారా? అందుకు నేను కారణమా?' అని నేను చాలా సంతోషించాను. నా ఫ్రెండ్ చెప్పినట్లే గురువారం పారాయణ చేసి బాబుకి ఊదీ నీళ్లు ఇచ్చి బాబా మెసేజ్ చూద్దామని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, తనకి కనిపించిన మొదట మెసేజ్, "మీకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ నేను తొలగిస్తాను" అని ఉంది. ఇది చాలదా! బాబా తను చెప్పేది వింటున్నారని చెప్పడానికి. ఆ మెసేజ్ చూసాక నా ఫ్రెండ్‍కి బాబా మీద మరింత నమ్మకం పెరిగింది. ఇప్పుడు తను ప్రతిదానికి బాబా మెసేజ్ చూస్తూ, బాబా లీలలను అనుభూతి చెందుతున్నారు. తనలో వచ్చిన మార్పును చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తనతో, "బాబా మిమ్మల్ని తన భక్తునిగా మార్చుకోవాలని అనుకున్నారు. ఆయనే మీలో నమ్మకాన్ని ఏర్పరిచారు, శిరిడీకి తీసుకుని వెళ్లారు, మీ నమ్మకాన్ని ఇంకా పెంచారు. ఇక ఎప్పుడూ బాబా మిమ్మల్ని వదిలి పెట్టరు" అని చెప్పాను. "బాబా! ఒక వ్యక్తిని మీ భక్తునిగా మార్చుకునే ప్రక్రియలో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మకి ఇది చాలేమో అనిపిస్తుంది. థాంక్యూ బాబా. ఐ లవ్ యు సో మచ్ బాబా. ఎప్పుడూ నా చేయి వదిలిపెట్టకండి. నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించు తండ్రి. నా మనసులో ఉన్న బాధ మీకు తెలుసు. మీకు మాత్రమే తెలుసు. నేను అనుకున్నది అనుగ్రహించండి బాబా"

చివరిగా మరో చిన్న అనుభవం: కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని నేను, నా ఫ్రెండ్ ఒకరోజు కారులో వెళుతుంటే హఠాత్తుగా కారుకి ఏదో సమస్య వచ్చింది. మెకానిక్ షాపులో రిపేర్ చేయించుదామంటే, ఆ రోజు ఆదివారం. అందులోనూ రాత్రి వేళ. తెలిసిన షాపు వాళ్ళకి ఫోన్ చేస్తే, "ఆదివారం కదా, షాపు తియ్యలేదు" అంటున్నారు. నేను వెంటనే, "బాబా! ఒక మంచి మెకానిక్ షాపు త్వరగా కనిపించేలా చూపించి కారు బాగయ్యేలా చేసి మాకు ఏ ఇబ్బంది లేకుండా అనుగ్రహించండి. వెంటనే మెకానిక్ షాపు కనిపిస్తే, బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వెంటనే ఒక షాపు కనిపించింది. వాళ్ళు చెక్ చేసి సమస్య చాలా చిన్నదని రిపేర్ చేశారు. డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకున్నారు. ఇలా ప్రతిక్షణం బాబా మనకి తోడుగా ఉంటారు. "థాంక్యూ బాబా".

ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1154వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృప
2. బాబా నాపై చూపిన అపార అనుగ్రహం
3. క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా

బాబా కృప

ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. ఇటీవల రెండు సంవత్సరాల ఎనిమిది నెలల వయసున్న మా బాబు సాయికి జ్వరం, జలుబు, దగ్గు వచ్చి వారం రోజులైనా తగ్గలేదు. నాకు భయమేసి 'జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గింది. తరువాత నాకు, ఆ తరువాత మా వారికి కూడా జ్వరం, జలుబు వచ్చాయి. అప్పుడు నేను, 'మాకు కూడా జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల వారం రోజుల్లో మా ఇద్దరికీ జ్వరం తగ్గింది. రెండు వారాల తరువాత మళ్ళీ బాబుకి బాగా జలుబు చేసేసరికి నేను నా అనుభవాన్ని బ్లాగుకి పంపనందువల్లే ఇలా మళ్ళీ జలుబు చేసిందని, "బాబా! దయతో మళ్ళీ జ్వరం రాకుండా చూడండి తండ్రి" అని బాబాను వేడుకుని నా అనుభవాన్ని బ్లాగుకు పంపాను. అయితే వారం తరువాత మా సాయికి మళ్ళీ జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో సాయికి జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల తొందరగానే మా సాయికి జ్వరం తగ్గింది. "థాంక్యూ బాబా".

2022, మార్చి 30న మావారు, మా బాబుని తీసుకుని బయటకి వెళ్ళారు. మావారు వెళ్తూ ఇంటి తాళాలు తనతో తీసుకుని వెళ్లారు ఆ విషయం నాకు తెలీదు. మరుసటిరోజు ఉదయం మావారు స్కూలుకి వెళ్ళేటపుడు తాళాలు అడిగారు. వాటికోసం వెతికితే అవి కనపడలేదు. మరోపక్క స్కూలుకి టైం అయిపోతుందని మావారు తిడుతున్నారు. నాకు ఏం చేయాలో అర్ధంకాక, "బాబా! తాళాలు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఐదు నిమిషాల తరువాత ఆ తాళాలు మావారికి మా బాబు సాయి జెర్కిన్‍లో కనిపించాయి. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".

ఇటీవల హాస్పిటల్‍కి వెళ్లవలిసి వచ్చి మేము రెండుసార్లు హాస్పిటల్‍కి వెళ్ళాము. రెండుసార్లు కూడా నేను, 'అంతా మంచిగా ఉందని వస్తే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల రెండుసార్లూ బాగానే ఉంది అన్నారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".

2022, ఏప్రిల్ 11న మా ఇంట్లో ఒక గది తాళం కనిపించలేదు. దాని అవసరం ఎంతో ఉందని కొంచెం సేపు వెతికానుగానీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు మావారు నన్ను తిడుతున్నారు. ఇంకా బాబాకి చెప్పుకొని, "తాళం దొరికితే, ఈరోజే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల 10 నిమిషాల్లో ఆ తాళం దొరికింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్. నేను మీకెప్పుడూ ఋణపడి ఉంటాను".

బాబా నాపై చూపిన అపార అనుగ్రహం


సాయి బంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు రేవతి. 2022, ఉగాది పండుగ రోజు ఉదయాన బాబా నాకొక శుభవార్తను ఇచ్చారు. దాని గురించే నేనిప్పుడు ముందుగా మీ అందరితో పంచుకుంటాను. నేను వృత్తిరిత్యా టీచరుని.  2022, మార్చి 6వ తేదీన మాకు ఒక డిపార్ట్మెంటల్ టెస్టు జరిగింది. ఆ టెస్టు జరగడానికి ముందు టెస్టుకు ప్రిపేర్ అవుదామంటే అవసరమైన బుక్స్ నా దగ్గర లేక చాలామందిని అడిగాను. అయితే ఎంతమందిని అడిగినా అందరూ బుక్స్ లేవు అన్నారు. అప్పుడు నేను ఆర్తితో బాబాను ప్రార్థించాను. బాబా దయవలన నాలుగు రోజుల్లో టెస్టు ఉందనగా నాతోపాటు ఆ టెస్టు వ్రాయనున్న ఒక టీచర్ తన వద్దనున్న కొన్ని బుక్స్ నాకిచ్చారు. ఆవిడ గొప్ప మనసుకి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. బాబానే ఆవిడతో నాకు బుక్స్ ఇప్పించారు. అది కూడా శివరాత్రి రోజు. కానీ ఆ రాత్రి నుండి నాకు జ్వరం మొదలైంది. ఎలాగో బాబా దయవల్ల టెస్టు జరగడానికి ముందురోజు జ్వరం తగ్గింది. దాంతో ఆ ఒక్క రోజే టెస్టుకు ప్రిపేర్ అయ్యి, "బాబా! నేను టెస్టుకు సరిగా ప్రిపేర్ కాలేదు. మీ మీదే భారం వేస్తున్నాను. నేను గనక టెస్టులో పాసైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ టెస్టు ఫలితాలు ఉగాది రోజున వెలువడ్డాయి. నేను, నాకు బుక్స్ ఇచ్చిన స్వర్ణ మేడం ఇద్దరమూ పాసయ్యాము. ఇది బాబా నాపై చూపిన అపార అనుగ్రహం. "బాబా! మీ ఋణం ఎప్పుటికీ తీర్చుకోలేను".


ఈ మధ్య మా టివి పని చేయలేదు. మా తమ్ముడు ఏదో ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో తను, "సెట్ అప్ బాక్స్ ప్రాబ్లెమ్ అనుకుంటా, కొత్తది తీసుకుంటే మంచిది" అని అన్నాడు. మేము అలాగే అన్నాం. కానీ ఏదో ఆశతో నేను, "బాబా! ఏ రిపేర్ లేకుండా టివి బాగైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. పది రోజుల తర్వాత మా ప్రింటర్ బాగుచేయడానికని ఒకతను మాఇంటికి వచ్చాడు. నేను ఏదో మామూలుగా మావారితో, "అతణ్ణి ఒకసారి టివి కూడా చూడమని చెప్పండి" అని అన్నాను. మావారు అలాగేనని అతనితో చెపితే, అతను సెట్ అప్ బాక్స్ వైర్లు తీసి మళ్ళీ పెట్టగానే టివి మునపటిలా పని చేసింది. అసలు అతను తనకు టివి రిపేర్ చేయడం రాదని, అయినా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తే ఐదు నిమిషాల్లో టివి ఆన్ అయింది. ఇదంతా బాబా దయకాక మరేమిటి? "థాంక్యూ బాబా. థాంక్యూ సో మచ్. నేను ఏదైనా అనుభవం పంచుకుంటానని మీకు మాటిచ్చి మరిచిపోయి ఉంటే మన్నించి నాకు గుర్తు చేయండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా

"బాబా! మీకు శతకోటి వందనాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును ఆదరిస్తున్న అందరినీ చల్లగా చూడండి తండ్రి". ఈ బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళు ఎంతో ఓపికగా మన అనుభవాలను చదివి, వాటిని సరిచేసి బ్లాగులో ప్రచురిస్తున్నారు. నా పేరు కృష్ణవేణి. ఈ మధ్య మా బాబు స్కూలువాళ్లతో వండర్ ల్యాండ్‍కి వెళ్తానని అన్నాడు. మేము వద్దన్నా వాడు వినలేదు. దాంతో మేము సరేనని, టూర్ కోసం డబ్బులు కట్టాము. కానీ మాబాబు ఎప్పుడూ మమ్మల్ని వదిలి వెళ్ళనందున నాకు కొంచెం భయమేసి, "బాబా! బాబు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటా"ని బాబాను వేడుకుని ఇక బాబా చూసుకుంటారని ధైర్యంగా ఉన్నాను. ఆరోజు గురువారం. బాబు వండర్ ల్యాండ్‍కి వెళ్ళాక వాడి షూస్ పోయి కొంచం ఇబ్బందిపడ్డాడు కానీ, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. "బాబా! మీకు శతకోటి కృతజ్ఞతలు. నావల్ల ఏవైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి బాబా. నేను ఇప్పుడు కొన్ని సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించి, తొందరగా ఆ సమస్యలను తొలగించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1153వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భక్తుల కర్మలను తగ్గించే సాయినాథుడు
2. బాబా రక్ష
3. సాయి దయతో తగ్గిన తలనొప్పి

భక్తుల కర్మలను తగ్గించే సాయినాథుడు

ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా రెండువారాల పాటు నేను బాబాకి దూరంగా ఉన్నందుకు ఆయనకి క్షమాపణలు చెప్పుకుంటూ నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. పుట్టుకతోనే మా పాపకి గుండెలో సమస్య ఉంది. డాక్టర్లు, "ఒక సంవత్సరంలోపు సర్జరీ చేస్తే మరే సమస్య ఉండద"ని చెప్పి, ఈలోపు పాప బరువు పెరగడానికి మందులిచ్చి "ప్రతీ 15 రోజులకు ఒకసారి సాచురేషన్ చెక్ చేస్తూ, సాచురేషన్స్ తగ్గకుండా చూసుకోమ"ని అన్నారు. సాచురేషన్స్ మొదటి నెలలో 100%, రెండో నెలలో 98% ఉన్నాయి. తరువాత నేను మా పుట్టింటికి వచ్చి పదిహేను రోజుల తరువాత హాస్పిటల్లో చెక్ చేయిస్తే, సాచురేషన్ 91% ఉన్నాయి. ఒక్కసారిగా నేను, మా అమ్మ షాకయ్యాము. ప్రమాదమేమీ లేదు కానీ, నాకు చాలా బాధేసి దేవుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. 'నేనేం పాపం చేసానో? అసలు నిజంగా దేవుడు ఉన్నాడా?' వంటి ఆలోచనలతో రెండువారాలు బాబాను వదిలేసి లా అఫ్ అట్రాక్షన్, ఏంజెల్ నెంబర్స్ వంటివి అనుసరించాను. కానీ మనశ్శాంతి లేదు. రెండు వారాల తర్వాత ఒకరోజు మా పాప ఎందుకో బాగా ఏడ్చింది. అప్పుడు నాకు తెలియకుండానే నేను, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరించడం మొదలుపెట్టి పాపకి బాబా ఊదీ పెట్టాను. కాసేపటికి పాప ఏడుపు ఆపి పడుకుంది. గంట తరువాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, "నేను మీ కర్మలను చాలావరకు తగ్గించాను. నేనే లేకుంటే ఇంకా పెద్ద పెద్ద బాధలు, భారాలు మోయాల్సి వచ్చేది" అనే సాయి సందేశం కనిపించింది. ఎన్నో సంవత్సరాల నుండి బాబా మెసేజ్లు చూస్తున్న నేను మొదటిసారి అలాంటి మెసేజ్ చూసాను. అదికూడా నా స్థితికి తగ్గట్టు. "లవ్ యు బాబా. వెరీ వెరీ సారీ బాబా. అన్నిటికీ థాంక్యూ సో మచ్ బాబా".

అమ్మవాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్ అయినందున వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‍లోని మా అత్తగారి ఇల్లు చుట్టూ మొక్కలతో నిండి ఉంటుంది. ఆ కారణంగానే హైదరాబాదులో ఉన్నప్పుడు సాచురేషన్స్ 100, 98% ఉండి అమ్మావాళ్ళ ఇంటికి వచ్చాక 91%కి పడిపోయాయని అనిపించి మావారు పాపను తీసుకుని నన్ను హైదరాబాదు వచ్చేయమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పదిహేను రోజులకి సాచురేషన్ చెకింగ్‍కి పాపని తీసుకుని హాస్పిటల్‍కి వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! సాచురేషన్ మునుపటిలా నార్మల్ వస్తే, నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అద్భుతం! సాచురేషన్ 98% ఉంది. "థాంక్యూ సో మచ్ బాబా". 

ఒకరోజు పాప తల మీద నల్లమచ్చలు కనిపించాయి. అవేమిటో అని నాకు చాలా భయమేసి, "బాబా! వాటివల్ల పెద్ద ప్రమాదమేమి లేదని డాక్టర్ చెప్పాలి. అలాగే అవి త్వరగా తగ్గిపోతే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. డాక్టర్, "ఆ మచ్చలు చుండ్రుకి సంబంధించినవి. పిల్లల్లో కామన్‍గా వస్తాయి. నూనె రాయొద్దు" అని చెప్పారు. డాక్టరు చెప్పినట్లే కొన్నిరోజులు నూనె రాయలేదు. ఇప్పుడు మచ్చలు దాదాపు తగ్గిపోయాయి. "థాంక్యూ సో మచ్ బాబా. ఆలస్యంగా నా అనుభవాలు పంచుకున్నందుకు క్షమించండి బాబా. 2022, ఏప్రిల్ 9న నేను, నా భర్త మా పాపను తీసుకుని ఒక అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. అది నెరవేరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా."  

చివరిగా ఒక మాట, "ఎప్పుడూ బాబాను మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోవాలని అనుకున్నా అది బాబా భక్తులకు సాధ్యపడదు. అంతలా మనం బాబాకు అలవాటు పడిపోతాం. చాలావరకు మన చెడు కర్మలను తగ్గించే ఉంటారు బాబా. మనం ఈ మాత్రమైనా బ్రతుకుతున్నామంటే అది ఆయన దయే. బాబాను నమ్మండి. ఎప్పుడూ మంచే ఆలోచిస్తూ మంచి పనులే చెయ్యండి. బాబా మీ వెంటే ఉంటారు".

ఓం శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!

బాబా రక్ష

నేను ఒక సాయి భక్తురాలిని. బాబా లీలలు అనేకం. ఆయన అడుగడుగునా నాకు రక్షగా ఉంటూ ఎన్నోసార్లు ఆపదల నుండి కాపాడుతూ ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్లాగ్ యొక్క మహిమ అనంతం. నేను ఒక ఉద్యోగస్తురాలిని. ఇటీవల కాలంలో నా వృత్తి జీవితంలో నేను తీవ్ర ఒత్తిడిని ఎదురుకున్నాను. పని ఒత్తిడితోపాటు చాలా క్లిష్టమైన వ్యక్తులతో పని చేయించాల్సి రావడంతో విపరీతమైన ఆందోళనకు గురవుతూ సుమారు రెండునెలలుగా నేను నిద్రకు దూరమయ్యాను. నా పరిస్థితికి ఇంట్లో వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ, సెలవు పెట్టమని చెప్తుండేవారు. కానీ నేను సెలవు పెట్టే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులలో నేను ఎప్పుడూ వెళ్లే టూ టౌన్ బాబా గుడికి వెళ్లి, ఆయన పాదాలు పట్టుకుని, "బాబా! ఈ పరిస్థితి నుండి నన్ను బయటపడేయండి" అని కన్నీళ్ళు పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో అందరూ, "బాబా పలుకుతారు, కంగారుపడకుండా ధైర్యంగా ఉండు" అని అనేవారు. ఇటువంటి సమయంలో నేను ఈ బ్లాగును చూసి, "బాబా! నన్ను ఈ క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు తెస్తే, నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ సాయినాథుడు వెంటనే పలికారు, నన్ను రక్షించారు, నేను ఉన్నానని ధైర్యాన్ని ఇచ్చారు. కానీ నా అనుభవాన్ని ఈ బ్లాగులో ఎలా పంచుకోవాలో నాకు తెలియలేదు. బాబా దయవలన తెలిసిన వెంటనే నా అనుభవాన్ని మీతో పంచుకోవడానికి బ్లాగుకి పంపాను. బాబా లేకపోతే నేను ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయేదాన్ని, "అడుగడుగునా నన్ను కాపాడవలసిందిగా మీ పాదాలు పట్టుకుని శరణు వేడుతున్నాను సాయి మహారాజా". 

జై సాయినాథ్ మహారాజ్!!!

సాయి దయతో తగ్గిన తలనొప్పి

అందరికీ నమస్కారం. బాబా దయ ఈ బ్లాగు నడుపుతున్న అన్నయ్య మీద, భక్తులందరీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, మార్చి 28న ఉదయం నిద్రలేస్తూనే నాకు తలనొప్పి మొదలయ్యింది. ఏదైనా తింటే తగ్గుతుందిలే అనుకున్నాను. కానీ తగ్గలేదు, పైగా కడుపులో వికారం మొదలైంది. మళ్ళీ నిద్రపోతేనైనా తలనొప్పి తగ్గుతుందని నిద్రపోయాను. అయితే ఆ రోజంతా నిద్రపోతూనే ఉన్న కూడా తలనొప్పి తగ్గలేదు. ఇక అప్పుడు నీళ్లలో బాబా ఊదీ వేసుకుని త్రాగి, మరికొంత ఊదీ తలకు పూసుకుని, "బాబా! రేపు ఉదయానికల్లా తలనొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల తెల్లారేసరికి తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1152వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. టెన్షన్ పడిన ప్రతిసారీ శాంతపరచి సంతోషపరిచే బాబా
2. చెప్పినట్లే అనుగ్రహించిన బాబా

టెన్షన్ పడిన ప్రతిసారీ శాంతపరచి సంతోషపరిచే బాబా

శిరిడీవాస సాయిప్రభో!!!
జగతికిమూలం నీవేప్రభో!!!

నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందరో భక్తులు తమ అనుభవాలను సంతోషంగా ఈ బ్లాగులో పంచుకుంటూ నలుగురికి బాబా కలియుగ దైవమని, మనకు ఏ కష్టమొచ్చినా, బాధ కలిగినా ఆయన ఉన్నారన్న ధైర్యాన్ని, ఉపశమనాన్ని ఇస్తున్నారు. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...

మనం సచ్చరిత్రలో బాబా భక్తుల మనస్సులో ఉన్న వాటిని బయటకు చెప్పి వాళ్ళను ఆశ్చర్యపరిచేవారని చదువుకున్నాము. నాకు కూడా బాబా అలాంటి అనుభవమొకటి అనుగ్రహించి నన్ను చాలా సంతోషపరిచారు. ఈమధ్య మా అక్క కొడుకు, కోడలు, వాళ్ళ కుటుంబం శిరిడీ వెళ్ళారు. మేము, వాళ్ళు ఒకే ఊరిలో ఉంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా మాకు చెప్పి వెళతారు. వాళ్ళు శిరిడీ వెళుతున్నామని చెప్పినప్పుడు నేను వాళ్లతో మా బాబుకోసమని ఒక పాలరాతి బాబా విగ్రహం తెమ్మని చెప్పాను. వాళ్ళు సరే అన్నారు. తరువాత ఒకరోజు ఉదయం నేను నిద్రలేచి 'సాయి మహారాజ్ సన్నిధి'లో భక్తులు అనుభవాలు చదువుతూ, 'అరె! నేను ఒక విగ్రహమే తెమ్మన్నాను, ఇంకొకటి కూడా చెప్పాల్సింది' అని అనుకున్నాను. ఎందుకంటే, మాకు ఇద్దరు బాబులు. చిన్నబాబు రూమ్‌లో ఉంటాడు. కొద్దిసేపటిలో అక్క కొడుకు శిరిడీ నుండి ఫోన్ చేసి "మీకు ఎన్ని విగ్రహాలు కావాలి" అని అడిగాడు. నేను చాలా సంతోషించి, "రెండు" అని చెప్పి, "నీకు ఇదివరకు ఒక విగ్రహమని చెప్పాను. మళ్ళీ చెపితే బాగోదని ఊరుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. బాబా అంటే అదే" అని తనతో అన్నాను. సాయి సర్వాంతర్యామి అనుటలో సందేహం లేదు. ఆయన కలియుగ దైవం. మన మనసున ఉన్న ప్రతీది ఆయనకు తెలుసు.

నా భర్తకు చాలారోజుల నుండి భుజం నొప్పి ఉంది. మేము వయసును బట్టి నొప్పులు మామూలే అనుకున్నాము. అందుకు కారణం లేకపోలేదు. అదేమిటంటే, మా అత్తింటి కుటుంబంలో దాదాపు అందరికీ నొప్పులు, ఎముకలు అరిగిపోవడం వంటివి ఉన్నాయి. అయితే మావారికి భుజం నొప్పి కాస్త ఎక్కువగానే ఉండేది. పైగా ఎముక కొంచెం పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుండేసరికి ఈమధ్య ఎక్స్ రే తీయించాము. ఆ ఎక్స్ రే తీసిన అబ్బాయి, "దాదాపు ఎముక పూర్తిగా అరిగింది. కాళ్ళ నొప్పులు అంటే మామూలేగాని, భుజం కదా! ఏమీ కాదని చెప్పలేను. అసలే రోజులు కూడా బాగాలేవు. తొందరగా హైదరాబాద్ వెళ్ళి చూపించుకోండి" అని అనుమానం కలిగేలా చెప్పేసరికి నాకు చాలా భయమేసింది. తరువాత 2022, మార్చి 28న మావారు హైదరాబాద్ వెళ్ళారు. రిపోర్టులో ఏమి వస్తోందోనని నేను బాబాతో, "నా భర్త రిపోర్టులో ఎలాంటి చెడు లేకుండా చూడండి బాబా. మీ దయతో రిపోర్టు నార్మల్ వస్తే, ఈరోజే నా అనుభవాన్ని పంచుకుంటాను" అని చెప్పుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః', 'ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా' మరియు 'ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి' అని నాకు తోచినప్పుడల్లా అనుకుంటూ ఉన్నాను. తరువాత బాబాకి చెప్పుకుని మా అబ్బాయికి కాల్ చేస్తే, "అమ్మా! 'టెన్షన్ పడలసిన అవసరం లేదు. ఎముక అరిగింది నిజమే కానీ వ్యాయామం చేస్తూ చేతికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని చెప్పి, ఈసారి వచ్చినప్పుడు ఎమ్.ఆర్.ఐ చేయించుకోండి' అని డాక్టరు చెప్పారు. మళ్ళీ ఎప్పుడో ఎందుకని వెంటనే ఎమ్.ఆర్.ఐ చేయించాము. అందులో కూడా ఎక్స్ రే లో ఉన్నట్లే వచ్చింది" అని చెప్పాడు. అది విని నా మనసు చాలా తేలికపడింది. అప్పుడు సాయంత్రం ఐదు గంటలైంది. ఇక ఎప్పుడెప్పుడు నా అనుభవాన్ని బ్లాగుకు పంపుదామా అని ఆరాటంతో సమయం చిక్కగానే నా అనుభవాన్ని వ్రాసాను. నాకు ఇలాంటి అనుభవాలు బాబా చాలా ప్రసాదించారు. నా బాబా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. నేను టెన్షన్ పడిన ప్రతిసారీ బాబా నన్ను శాంతపరచి సంతోషపరుస్తారు. మనకోసం బాబా ఉన్నారని తెలుపుటకు నేనెంతో ఆనందిస్తున్నాను.

నేను ఇంతకుముందు నా అనుభవంలో "మా బాబుకి ప్రమోషన్ వస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. మేము బాబుకి ప్రమోషన్ ఏప్రిల్లో వస్తుందని అనుకున్నాము. అయితే మార్చి నెలలో ఒక బుధవారం రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా ఎంతో సంతోషంగా మా ఇంట్లో అటుఇటు తిరుగుతున్నారు. మరుసటిరోజు గురువారం మా చిన్నబాబు ఫోన్ చేసి తనకి ఏరియా సేల్స్ మేనేజరుగా ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు. "ధన్యవాదాలు బాబా. మా కుటుంబం మీద మీ దయ ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రి. దయామయా సాయిప్రభు! మా పెద్ద బాబు విషయంలో ఒక కోరిక ఉంది. దాన్ని అనుగ్రహించి మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి".

చెప్పినట్లే అనుగ్రహించిన బాబా

ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు బాబా చాలా అనుభవాలు ప్రసాదించారు. నేను ఈమధ్య నా భర్తకి H1b వీసాకి అప్లై చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ ఆయనకి H1b వీసా రావాలని సాయి నవగురువార వ్రతం ప్రారంభించాను. నాల్గవ వారం పూజలో బాబా క్రింది విధంగా నాకు దర్శనమిచ్చారు. నాకు చాలా ఆనందమేసింది. 
తరువాత H1b వీసా రిజిస్ట్రేషన్స్ రేపు ముగుస్తాయనగా గురువారంనాడు హఠాత్తుగా అమెరికా నుండి నా భర్త కజిన్ ఒకరు H1b రిజిస్ట్రేషన్ చేయించు అని మెసేజ్ పెట్టారు. బాబా దయవలన మావారు సరేనని, H1bకి అప్లై చేసారు. కానీ తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోలేదు. 2022, మార్చి 31, గురువారంనాడు H1b వీసాకు సంబంధించి లాటరీ తీస్తారనగా రెండురోజుల ముందు నుంచి నేను, "బాబా! మావారికి H1b వస్తుందంటే నేను అనుకున్న రంగు వస్త్రాల్లో నాకు దర్శనం ఇవ్వండి" అని బాబాను అడిగాను. నేను అనుకున్న రంగు వస్త్రాల్లోనే బాబా నాకు దర్శనం ఇచ్చారు. కానీ మార్చి 31, గురువారం నాడు నా పూజ పూర్తయినా, కంపెనీ నుండి మెయిల్ రాలేదు. కొంతసేపు తర్వాత ఒక గ్రూప్ ఓపెన్ చేస్తే, "దాని గురించి ఏమీ బాధపడకు బిడ్డ. అది నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది కాని నన్ను నమ్ము. ఈ వారంలో అది పూర్తవుతుంది. విశ్వాసముంచు" అని, "సాయిబాబాని ధ్యానించడం ద్వారా రేపు ఉదయం నీవు ఫలితాన్ని పొందుతావు. శ్రీసాయిబాబాకు అన్నీ తెలుసు. భాదపడకు" అని నాకు అనుకూలంగా బాబా సందేశాలు వచ్చాయి.(క్రింద ఫోటోలు చూడండి)
మరుసటిరోజు ఉదయం 5:30కి నేను నిద్ర లేచే లోపే నా భర్త H1b లాటరీలో ఎంపిక అయ్యారన్న గుడ్ న్యూస్ వచ్చింది. అది బాబా మిరాకిల్ & టైమింగ్. "ధన్యవాదాలు బాబా! మీ దయతో నా భర్తకి H1b వీసా రావాలి. ఆయన H1b ఇంటర్వ్యూ పూర్తి చేసేలా, ఆయనకి ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించు సాయితండ్రి. మీరే మా గురువు, దైవం, తండ్రి. మీరు లేకుండా నేను లేను సాయి".

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి!!!
శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!!!
శుభం భవతు!!

సాయిభక్తుల అనుభవమాలిక 1151వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మినవాళ్ళ వెన్నంటుండి ఆదుకుంటారు బాబా
2. అనుక్షణం బాబా చూపుతున్న దయ
3. బాబా కృపతో MD సీటు

నమ్మినవాళ్ళ వెన్నంటుండి ఆదుకుంటారు బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. నేను నా గత అనుభవంలో డాక్టరు నా భార్యకి అనామోలీ స్కాన్ బయట చేయించమని చెప్పారని చెప్పాను. 2022, ఏప్రిల్ 4న మనస్ఫూర్తిగా బాబాకి నమస్కరించుకుని, ఆ స్కాన్ చేయించడానికి హాస్పటల్‌కి వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! రిపోర్టులు నార్మల్ అని వస్తే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను  ప్రార్థించాను. ఆ బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. నమ్ముకున్న వాళ్లపై ఎప్పుడూ బాబా దయ చూపుతారు.


2022, ఫిబ్రవరి 26న మేము హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్ ఐడి కార్డు ఉపయోగించాము. డాక్టరు మళ్ళీ మార్చి 18న రమ్మంటే ఇంటికి తిరిగి వచ్చాము. తరువాత చూసుకుంటే పేషేంట్ ఐడి కార్డు కనిపించలేదు. ఎంత వెతికినా కార్డు జాడ తెలియలేదు. అప్పుడు మేము బాబాకి నమస్కరించి, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని స్మరిస్తూ మళ్ళీ వెతికాము. అయినా కార్డు దొరకలేదు. ఇక చేసేది లేక ఐడి కార్డు లేకుండానే మార్చ్ 18న హాస్పిటల్‍కి వెళ్ళాం. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ జరిగింది. తరువాత చాలా రోజులకి ఒక షర్ట్ జేబులో ఆ కార్డు దొరికింది. ఈ అనుభవం ద్వారా బాబాపై నమ్మకముంచి సబూరీతో ఉంటే ఎలాంటి పనిలోనైనా బాబా సహాయం లభిస్తుందని నేను గ్రహించాను.


ఇప్పుడు నా ఉద్యోగంలో సాయినాథుడు చూపిన దయ గురించి పంచుకుంటాను. నేను రైల్వే ఉద్యోగిని. 2022, ఫిబ్రవరిలో సరిగ్గా జి.ఎమ్. ఇన్స్పెక్షన్ జరిగే సమయానికి ఒక మెషిన్ సరిగా పని చేయలేదు. ఆ కారణంగా మా మీద కాస్త బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. నెల రోజుల తరువాత మా డిపార్ట్మెంట్‌కి సంబంధించిన జోనల్ అధికారి ఒకరు ఇన్స్పెక్షన్‌కి వస్తానని అన్నారు. గతంలో జరిగిన అదే పొరపాటు మళ్ళీ జరగకూడదని మేము చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ సాయినాథుని, "ఎటువంటి ఇబ్బందులు రాకుదదు" అని వేడుకున్నాం. బాబా దయవల్ల ఇన్స్పెక్షన్ బాగా జరిగింది. తరువాత మేము ఆ జోనల్ అధికారితో "మా డివిజనల్ ఆఫీసర్స్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నార"ని మా కష్ఠాలు చెప్పుకున్నాం. ఆ విషయం మా డివిజనల్ ఆఫీసర్లకి తెలిసి మా మీద చాలా సీరియస్ అయి మరుసటిరోజు మా మీద విచారణ జరిపి, చార్జిషీట్ కూడా ఇస్తామని భయపెట్టారు. ఆ సమయంలో నేను, "ఎటువంటి విచారణ చేయడంగాని, చార్జిషీట్ ఇవ్వడంగాని జరగకుండా ఉంటే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకున్నాను. ఆయన దయవల్ల ఇప్పటివరకు విచారణ వంటివేవీ జరగలేదు. భవిష్యత్‍లో కూడా అటువంటివి జరగవని, మాకు పనిష్మెంట్ రాదని నమ్ముతున్నాను. ఎందుకంటే, బాబా ఎప్పుడూ నమ్మినవాళ్ళ వెన్నంటుండి ఆదుకుంటారు. "ప్రణామాలు బాబా! ఎప్పటినుండో పెండింగ్‌లో ఉన్న నా ప్రమోషన్ త్వరగా వచ్చేలా చూడు తండ్రి. మేము తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించు తండ్రి. మీ బిడ్డలందరిపై మీ కరుణాకటాక్షాలు ఉండేలా అనుగ్రహించు తండ్రి".


ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


అనుక్షణం బాబా చూపుతున్న దయ


సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నడుపుతున్న సాయి సోదరునికి కృతజ్ఞతలు. నా పేరు లత. నేను ఇంతకు ముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఒకరోజు రాత్రి గ్యాస్ట్రిక్ సమస్యతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్ళలో వేసుకుని త్రాగాను. అంతే, కొద్దిసేపట్లో నాకు ఆ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం లభించింది. "థ్యాంక్యూ బాబా".


ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక మావారు బాగా వీక్ అయిపోయారు. నాకు చాలా భయమేసి, "బాబా! నీవే దిక్కు తండ్రీ" అని బాబాను ప్రార్ధించి రోజూ ఊదీ నీళ్ళు మావారి చేత త్రాగించాను. కొద్దిరోజుల్లోనే మావారిలో చాలా మార్పు వచ్చి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఇది నా తండ్రి సాయినాథుని అనుగ్రహమే. తరువాత మావారికి బైపాస్ సర్జరీ జరిగి ఒక సంవత్సరం అవుతుందని చెకప్‍కి వెళ్ళాము. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్‍గా వచ్చాయి. "బాబా! ఏమిచ్చి  మీ ఋణం తీర్చుకోగలనయ్యా, మీ పాదాల చెంత సర్వస్య శరణాగతి చేయటం తప్ప".


ఒకసారి మా మనవడి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టరు చెప్పారు. అప్పుడు నేను బాబాను ప్రార్ధించి, 'ఇన్ఫెక్షన్ తగ్గితే బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. కొద్దిరోజుల్లో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ దయవలన బాబు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు తండ్రీ! ఎంతని చెప్పను మీ దయాకరుణల గురించి. ఇలాగే మీ ప్రేమను ఎల్లప్పుడూ వర్షిస్తూ మమ్ము చల్లగా చూడమని కోరుతూ మీ ఈ బిడ్డ ఈ బ్లాగు ద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది".


బాబా కృపతో MD సీటు


ప్రియమైన సాయి బంధువులకు నమస్కారం. నాపేరు స్వర్ణలత. మాది విజయవాడ సమీపంలోని మచిలీపట్నం. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నప్పుడు మా నాన్న మొదటిసారి బాబా ఫోటోను మా ఇంటికి తెచ్చారు. నేను అప్పటినుండి బాబాకు అత్యంత భక్తురాలిని. ఆ క్షణం నుండి బాబా నా పట్ల శ్రద్ధ వహిస్తూ ఎన్నో సందర్భాలలో నన్ను రక్షించారు. నేనిప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నా తోటి ఆత్మీయ సాయి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. నా కుమార్తె వైవాహిక జీవితం వైఫల్యం చెందడం వలన ప్రస్తుతం మేము, ఆమె తన జీవిత భాగస్వామితో న్యాయ పోరాటం చేస్తూ బాబా కృపతో అందులో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్నాము. ఈ పరిస్థితుల నుండి బయట పడటానికి, అలాగే డాక్టర్‌గా తన విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నా కుమార్తె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే జనరల్ కేటగిరీకి చెందిన తను దానిని సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందువలన నేను బాబాపై నా ఆశలన్నీ పెట్టుకుని, ఆయననే ప్రార్థించసాగాను. బాబా గొప్ప అద్భుతం చేసారు. నా కుమార్తెకి బెంగుళూరు ENTలో MD సీటు వచ్చింది. ఇది మూమూలుగా సాధ్యం అయ్యేది కాదు. బాబా మాత్రమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆయన దయకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.



సాయిభక్తుల అనుభవమాలిక 1150వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా చల్లని దృష్టి
  2. సాయిని వేడుకో అంతా బాబా చూసుకుంటారు.
  3. బాబా దయవలన దొరికిన స్టోన్(జాతిరత్నం)
  4. ముందస్తు సూచననిచ్చిన బాబా

బాబా చల్లని దృష్టి


సాయి బంధువులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు మూడోసారి ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకుంటున్నాను. నేను నా గత అనుభవంలో బాబా దయవల్ల పోయిన డాక్యుమెంట్స్ దొరికి కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మేము ఆ ఇంటి గృహప్రవేశం 2022,  ఫిబ్రవరి 10న చేసుకున్నాము. ఆరోజు గురువారమే అయింది. మేము బాబాకు బట్టలు పెట్టుకున్నాం. నేను బాబాను మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. సరిగ్గా భోజన సమయానికి మాసిన బట్టలు ధరించి, గడ్డం, కాలికి కట్టు ఉన్న ఒక 60 సంవత్సరాలు వృద్ధుడు మా కొత్త ఇంటి వద్దకు వచ్చారు. మావారు ఆయనని "భోజనం చేస్తారా?" అని అడిగితే, ఆయన "చేస్తాను" అన్నారు. వెంటనే మావారు ఆకువేసి అన్నీ వడ్డిస్తే, ఆయన తిని వెళ్లిపోయారు. నాకు తెలును ఆయన బాబాయేనని. ఆయన దయవల్లే మాకు ఆ ఇల్లు ప్రాప్తించింది. నేను గతంలో పంచుకున్న రెండు అనుభవాలను కొన్ని కారణాల వలన బాధతో పంచుకుని, "ఏ ఆటంకం లేకుండా గృహప్రవేశం జరిగేలా అనుగ్రహించమ"ని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే ఏ ఆటంకమూ లేకుండా గృహప్రవేశం బాగా జరిగింది. ఆ సాయి కృపవల్ల మేము ఇప్పుడు మా కొత్త ఇంటిలో ఉన్నాము. "తండ్రీ సాయి! మీకు శతకోటి నమస్కారాలు. ఇలాగే మా కుటుంబంపై మీ చల్లని దృష్టి సదా ఉంచండి బాబా".


మేము ప్రతి గురువారం సాయంత్రం బాబా గుడికి వెళ్తాము. 2022, మార్చి 17, గురువారం నాడు నా మనసెందుకో అస్సలు బాగాలేదు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి మా అబ్బాయి వస్తాడు, గుడికి వెళదామని అనుకుంటున్నాము. అయితే, వచ్చేదారిలో మా అబ్బాయి యాక్సిడెంట్‍కి గురయ్యాడు. తన చేయి గుత్తి దగ్గర వాచిపోయింది. బాబుని హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. నేను బాబా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది. దాంతో నాకు చాలా భయమేసి, "బాబా! మా అబ్బాయికి ఏమీ కాకూడద"ని బాబాను వేడుకున్నాను. తరువాత బాబుకి ఎక్స్-రే తీశారు. నేను 'ఎక్స్ రే నార్మల్‍గా వస్తే బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల ఎక్స్ రే నార్మల్‍గానే వచ్చింది. చేతికి పిండికట్టు కాకుండా చిన్న బ్యాండేజ్ మాత్రమే వేశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు ఏదో పెద్ద దెబ్బే తగిలే విధంగా కర్మ ఉండి ఉండాలి. కానీ బాబా దయవల్ల చిన్నదానితో పోయింది. "బాబా! మీకు శతకోటి వందనాలు. మీ చల్లని దృష్టి ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంచండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిని వేడుకో అంతా బాబా చూసుకుంటారు


సాయి బంధువులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు 'సాయి కిరణ్'. నేను మొదటిసారి నా అనుభవం మీతో పంచుకుంటున్నాను. రెండు నెలల క్రితం అంటే 2022, జనవరిలో నేను ఒక కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో పాత కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసాను. అయితే పాత కంపెనీలో నోటీసు పీరియడ్ అయిపోవస్తున్నా కొత్త కంపెనీ నుండి నాకు అఫర్ లెటర్ రాలేదు. నాకు ఏమి చేయాలో తోచలేదు. ఆ సమయంలో మా అమ్మ నాతో, "సాయిని వేడుకో అంతా బాబా చూసుకుంటారు. నీ కోరిక నెరవేరితే బ్లాగులో పంచుకుంటానని అనుకో, నీ పని అయిపోతుంది" అని చెప్పింది. నేను అమ్మ చెప్పినట్లే బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల 2022, ఫిబ్రవరి 28న నాకు ఆఫర్ లెటర్ వచ్చి, కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


బాబా దయవలన దొరికిన స్టోన్(జాతిరత్నం)


సాయికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. సాయి లీలలను భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దివ్య సాయికుమారి. సాయి ఆశీస్సులతోనే నాకు ఆ నామకరణం జరిగింది. నేనిప్పుడు బాబా నాపై చూపిన కరుణను మీతో చెప్పబోతున్నాను. 2022, మార్చ్ నెలలో మావాళ్లు త్వరలో నాకు పెళ్లి జరగాలని పూజ చేయించి జాతిరత్నమైన కనకపుష్యరాగం పొదగబడిన ఉంగరం నా చేతికి పెట్టారు. సాయి దయవలన ఆరోజు పూజ, సత్యనారాయణ వ్రతం బాగా జరిగాయి. కానీ ఉంగరం సైజు సరిగాలేదు, టైట్ అయింది. అందుచేత ఒకరోజు నేను నా ఆఫీసు నుంచి షాపుకి వెళ్లి ఉంగరం కొంచెం లూజు చేయించాను. తరువాత ఆ ఉంగరం నా చేతికి పెట్టుకుని ఆఫీసుకి బయలుదేరి దారిలో ఓ చోట ఫ్రూట్ జ్యూస్ త్రాగి ఆఫీసుకి వెళ్ళాను. ఆఫీసులో నా పని చేసుకుంటూ కొంతసేపటికి చేతికున్న ఉంగరం చూస్తే, దానికి ఉండాల్సిన స్టోన్ లేదు. దాంతో చాలా టెన్షన్ పడి నా హ్యాండ్ బ్యాగులో వెతికాను. కానీ స్టోన్ కనపడలేదు. వెంటనే బాబాని తలుచుకుని, "బాబా! స్టోన్ కనబడితే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకుని 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ జ్యూస్ షాపు దగ్గరికి వెళ్లి వెతికాను. కానీ స్టోన్ దొరకలేదు. తిరిగి ఆఫీసుకి వచ్చి, అక్కడంతా వెతికానుగాని స్టోన్ కనపడలేదు. ఇంకా ఏడుచుకుంటూ అందరికీ విషయం చెప్పి, మనసులో 'సాయికి చెప్పుకున్నాను కదా, అయినా ఎందుకు దొరకలేదు' అని అనుకున్నాను. అంతలో ఆఫీసులో వేరేచోట కిందపడి ఉన్న ఆ స్టోన్ ఒక అంకుల్ కంటపడింది. ఆయనకి ఆ స్టోన్ ఏంటో అర్థంకాక వేరే వాళ్లకు చూపించారు. వాళ్ళు ఆ స్టోన్ నాకు చూపించి, "ఇది మీదేనా?" అని అడిగితే, "అవును" అని చెప్పాను. అలా బాబా దయవలన స్టోన్ దొరికింది. "మీ పాదాలకు శతకోటి వందనాలు సాయి. అమ్మ నా పెళ్లి గురించి చాలా బాధపడుతుంది తండ్రి. ఒక మంచి సంబంధం వచ్చి, నాకు వివాహం అయ్యేలా అనుగ్రహించండి. చాలా రోజులు నుండి శ్రద్ధ, సబూరీలతో ఎదురుచూస్తున్నాను సాయి".


ముందస్తు సూచననిచ్చిన బాబా


సాయి భక్తులందరికీ నమస్తే. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈమధ్య నేను నా పాసుపోర్టు వెరిఫికేషన్‍కి వెళ్లాల్సిన రోజున నా వాట్సప్ గ్రూపు ఓపెన్ చేస్తే, పాసుపోర్టు వెరిఫికేషన్‍కి సంబంధించిన అనుభవమే వచ్చింది. అది చదివాక ఈరోజు నా పాసుపోర్టు విషయంలో బాబా సహాయం చేస్తారని నాకు అర్థమై, "బాబా! మీ దయతో పాసుపోర్టు వెరిఫికేషన్ ఏ ఇబ్బంది లేకుండా పూర్తయితే, నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. నేను అనుకున్నట్టుగానే బాబా దయవలన అంతా సజావుగా జరిగింది. ఇలా బాబా నాకు చాలా విషయాలలో సహాయం చేస్తున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా".


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1149వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సంకటహరణ శ్రీసాయినాథ
2. వేడుకుంటే ఏదీ కాదనరు బాబా!
3. గంటలోనే కోరుకున్నది అనుగ్రహించిన బాబా

సంకటహరణ శ్రీసాయినాథ


ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!


అందరికీ నమస్కారం. నా పేరు యశోద. మాది అనంతపురం. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 2022, మార్చి 14న నాకు విరోచనాలు అయ్యాయి. రాత్రికి మరింత ఎక్కువ అవుతాయేమోనని నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, ఇంటిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందుచేత వెంటనే, "బాబా! రాత్రి నాకు విరోచనాలు కాకుండా ఉంటే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నారు. బాబా దయవల్ల రాత్రి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపోయాను. "ధన్యవాదాలు తండ్రి":


నేను డయాబెటిక్ పేషంట్‍ని. ఈ మధ్య నాకు షుగర్ ఎక్కువగా ఉందని డాక్టరు మందుల మోతాదు ఎక్కువ చేసారు. అందువల్ల దాదాపు 6 నెలల నుండి మందులు ఎక్కువగా వాడుతున్న నేను 2002, మార్చి 27న షుగర్ పరీక్ష చేయించుకోవడానికి వెళ్లి, "షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే, మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయతో షుగర్ అదుపులో ఉందని డాక్టరు చెప్పారు. సంతోషంగా బాబాకు కృతజ్ఞతతో శతకోటి ధన్యవాదాలు చెప్పుకుని, "నా కూతురు  సమస్యను కూడా పరిష్కరించండి" అని ఆ తండ్రిని వేడుకున్నాను.


మా అమ్మాయి హైదరాబాదులో ఉంటుంది. తనకు దాదాపు ఒక నెల రోజుల నుంచి నడుము నొప్పి చాలా ఎక్కువగా ఉంది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేదు. చివరికి నేను మా అమ్మాయితో నొప్పి ఉన్నచోట బాబా ఊదీ రాసుకుని సాయి నామాన్ని చెప్పుకోమన్నాను. నేను కూడా, "బాబా! ఈ గురువారంలోగా(2022, మార్చి 31) మా అమ్మాయికి నడుము నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో మా అమ్మాయి నడుము నొప్పి తగ్గించారు. "బాబా! మీకు వేలవేల నమస్కారాలు. ఇలాగే అందరినీ సర్వదా కాపాడండి బాబా. ఇంకొక అనుభవంతో మరలా మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ బాబా మనకు అనుగ్రహిస్తున్న అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశమిస్తున్న సాయికి మరోమారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


వేడుకుంటే ఏదీ కాదనరు బాబా!


ముందుగా సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాపేరు శ్రావణి. నేను సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు సాయి తండ్రి దయవల్ల మళ్ళీ నా అనుభవాలు పంచుకుంటున్నాను. మా అమ్మగారి పేరు లక్ష్మి. తనకి కిడ్నీ మరియు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకరోజు తనకి కడుపు మరియు నడుము ఒకటే నొప్పి పెట్టడంతో తను చాలా ఇబ్బంది పడింది. దానికి తోడు ఏమి తిన్నా జీర్ణంకాక అమ్మకి వాంతులు అవుతుంటే ఇంట్లో ఉన్న మందులు ఇచ్చాము. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. తన బాధ చూసి నాకు, మా నాన్నగారికి ఒకటే టెన్షన్‍గా అనిపించింది. సమయానికి మా దగ్గర హాస్పిటల్‍కి వెళ్లే స్తోమత లేదు. కరోనా వలన  ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నాకు ఏమి చేయాలో తోచక ఏడుస్తూ బాబా దగ్గర కూర్చుని, "సాయి తండ్రీ! నువ్వే మాకు దిక్కు. మా కుటుంబ పరిస్థితులు, మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మీకు తెలుసు" అని బాబాకు చెప్పుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని ఆ రాత్రంతా స్మరిస్తూ ఉన్నాను. మన బాబాను వేడుకుంటే ఏదీ కాదనరుగా! తెల్లవారుఝామున నాలుగు గంటలకల్లా అమ్మ సమస్య సమసిపోయింది. "ధన్యవాదాలు తండ్రి. ఏమైనా తప్పులు ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను బాబా".


రెండు సంవత్సరాలుగా అమ్మవాళ్లు తిరుపతి వెళ్దామని అనుకుంటున్నారు. ఎప్పుడు వెళదామనుకున్నా ఏదో ఒక సమస్య వచ్చి వెళ్ళే సమయానికి వాళ్ళ ప్రయాణం క్యాన్సిల్ అయిపోతుండేది. దాంతో అమ్మానాన్న, 'మొక్కు ఉంది, ఎప్పుడు వెళదామన్నా స్వామి కరుణించడం లేద'ని చాలా బాధపడేవారు. ఇంకా నేను అమ్మతో, " 'ఎలాగైనా తిరుపతి వెళ్లి, స్వామి దర్శనం చేసుకునేలా అనుగ్రహించు బాబా' అని బాబాను వేడుకోమ్మా" అని చెప్పాను. నేను కూడా, "బాబా! అమ్మవాళ్ళు తిరుపతికి వెళ్లేలా చేయండి. నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను సాయితండ్రి" అని అనుకున్నాను. అమ్మ  బాబాను వేడుకుందో లేదో నాలుగు రోజుల్లో వాళ్ళు తిరుపతి ప్రయాణానికి సిద్ధమయ్యారు. బాబా దయవల్ల వాళ్ళు తిరుపతి వెళ్లి, స్వామి దర్శనం చేసుకుని ఏ ఆటంకాలు లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఏ కష్టం రాదు. బాబా చల్లని చూపు మా కుటుంబం మీద ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు ఈ బ్లాగు ద్వారా బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను.


గంటలోనే కోరుకున్నది అనుగ్రహించిన బాబా


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు సత్యసాయి. అందరూ 'సాయి' అంటారు. నాకు కూడా ఆ పేరు అంటే ఇష్టం. ప్రస్తుతం నా వయస్సు 52 సంవత్సరాలు. నేను 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి మా అమ్మమ్మవాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. ప్రతి ఆదివారం అమ్మమ్మ నన్ను సత్సంగం జరిగే చోటుకి తీసుకుని వెళ్ళేది. అక్కడ నిలువెత్తు బ్లాక్&వైట్ బాబా ఫోటో ఉండేది. నెమ్మదిగా నాకు ఆయన మీద భక్తిప్రపత్తులు కుదిరాయి. అప్పటినుంచి నేను ఆయన భక్తురాలిని. బాబా నాకు చాలా విషయాలలో సహాయం చేసారు. నేను ప్రతి క్షణం బాబా నాతోనే ఉన్నారని అనుభూతి చెందుతూ ఎక్కడున్నా, ఏ పని చేస్తున్న అన్నీ బాబాతో పంచుకుంటూ ఉంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా లేనిదే నేను లేను. నేను ప్రతిరోజూ మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడిలో కాకడ ఆరతికి వెళ్తుంటాను. నేను శిరిడీ కూడా వెళ్ళాను. అప్పుడు బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఇక ప్రస్తుత అనుభవానికి వస్తే... ఈమధ్య మా పాపకు, వాళ్ళ నాన్నకు మధ్య చిన్న గొడవ జరిగి నెలరోజులవుతున్నా వాళ్లిద్దరూ సరిగా మాట్లాడుకోలేదు. అప్పుడు నేను బాబాను తలుచుకుని, "బాబా! తండ్రీకూతుళ్ళు మునుపటిలా మంచిగా మాట్లాడుకుంటే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. అంతే, ఒక్క గంటలో నేను కోరుకున్నది జరిగింది. తండ్రీకూతుళ్ళు మాట్లాడుకోవడం చూసి నాకు చాలా ఆనందమేసింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్లాగు వారికి కూడా ధన్యవాదాలు.



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo