సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1145వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన గొప్ప అదృష్టం
2. అడుగడుగునా కాపాడుతున్న సాయి

బాబా ప్రసాదించిన గొప్ప అదృష్టం


అందరికీ నమస్తే. నా పేరు నాగజ్యోతి. మాది తాడిపత్రి. నేను బాబా భక్తురాలిని. బాబా ఎవరి జీవితాల్లో అయితే ఉంటారో వారు అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు, అనంత భాగ్యశాలులు. నేనిప్పుడు బాబా ఆశీర్వాదాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కానీ ఎలా వర్ణించాలో నాకు తెలియడం లేదు. నేను ఇంతకుముందు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాలు కొన్ని పంచుకున్నాను. ఆ పంచుకోవడమే నాకు ఒక గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 2020, సెప్టెంబర్ 7వ తేదీన నా అనుభవాలు చదివిన ఒక సాయి భక్తుడు(ఆయన పేరు కూడా నాకు తెలియదు) నా ఫోన్ కి, "హైదరాబాదులో శ్రీలక్ష్మి, నరసింహారావు అనే దంపతులు ఉన్నారు. వాళ్ళు రెండేళ్ల క్రితం బాబా ఆదేశానుసారం 108 మంది సాయి భక్తుల అనుభవాలతో సాయి అష్టోత్తర శతఅనుభవమాలిక అనే పేరుతో ఒక బుక్ ప్రచురించారు. ఇప్పుడు మళ్లీ బాబా ఆదేశంతో రెండో పుస్తక ప్రచురణకు సంకల్పించారు. మీరు మీ అనుభవాలను వారితో పంచుకుంటానంటే, మీ ఫోన్ నెంబర్ వాళ్ళకు ఇస్తాను. మీ అభిప్రాయం చెప్పండి" అని మెసేజ్ పెట్టారు. అప్పుడు నేను, "అంతకన్నానా! ఇది సాయిబాబా మీ రూపంలో నాకు ఇచ్చే భాగ్యం" అని అన్నాను. మరుసటిరోజు నరసింహారావుగారి నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆయన, "అమ్మా, బాబా తమ ప్రేమను మనకు పంచడం ఆషామాషీ వ్యవహారం కాదు. వారి భక్తులందరూ నివురుగప్పిన నిప్పువలె ఉన్నారు. వాళ్ళు పొందిన అనుభవాలు అందరికీ తెలియాలన్నది ఆ సాయినాథుని సంకల్పం. మీరు మీ అనుభవాలను ఫోన్ లో మాకు వివరిస్తే, మేము రికార్డు చేసుకుని ఆ బాబా ప్రేమను తోటి భక్తులకు పుస్తక రూపంలో అందిస్తాము" అని అన్నారు. నేను, "సరేనండి" అన్నాను. కానీ 'నేనెక్కడ, నరసింహారావుగారు వాళ్ళెక్కడ? నాకన్నా ముందు చాలామంది భక్తులు బాబా తమకు పంచిన ప్రేమను బ్లాగులో పంచుకున్నారు. వాళ్లందరికీ లేని అవకాశం బాబా నాకిచ్చారా!' అని చాలా సంతోషించి బాబానే తమ అనుగ్రహాన్ని భక్తులకు తెలియపరుచుకుంటున్నారని అనుకున్నాను. మరుసటిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఫోన్ లో నేను గత 26 సంవత్సరాలుగా బాబా నాపై కురిపించిన అనుగ్రహాన్ని వాళ్లకు చెప్పడం మొదలుపెట్టి, మధ్యలో కాసేపు విరామం తీసుకున్నా రాత్రి పది గంటల వరకు చెబుతూనే ఉన్నాను. వాళ్లు కూడా ఎంతో ఓపికగా అంతా విన్నారు. 


తరువాత 2021, డిసెంబర్ నెలలో మళ్ళీ నరసింహారావుగారు నాకు ఫోన్ చేసి, "అమ్మా! అష్టోత్తరశత అనుభవమాలిక గ్రంథం పూర్తయింది. 2022, ఫిబ్రవరి 22వ తేదీన శిరిడీలో పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. మీరు, మీ కుటుంబం హాజరవ్వాలి" అని ఎంతో ప్రేమగా పిలిచారు. బాబానే వారి ద్వారా నన్ను శిరిడీకి రమ్మని ఆహ్వానిస్తున్నారని చాలా సంతోషపడ్డాను. 2022, ఫిబ్రవరి 20వ తేదీన బయలుదేరి 21వ తేదీ మధ్యాహ్నానికి మేము శిరిడీ చేరుకున్నాం. ముందుగా బాబా దర్శనం చేసుకుని నరసింహారావుగారు చెప్పిన అడ్రసుకి వెళ్లి, వారిని కలిసాము. బాబా ఆశీస్సులతో ఆ పుస్తకంలో తమ అనుభవాలను పంచుకునే భాగ్యాన్ని పొందిన సాయి భక్తులందరూ అప్పటికే వచ్చారు. అందరూ చాలా ప్రేమగా పలకరించారు. ఒకరితో ఒకరికి ఉన్న ఋణానుబంధం వల్ల బాబా మా అందరినీ శిరిడీలో కలిపారు. శ్రీలక్ష్మి, నరసింహారావు దంపతులు అయితే వచ్చిన అతిథులందరినీ పేరుపేరునా పలకరిస్తూ సొంతవాళ్ళ కన్నా ఎక్కువగా ఆదరించారు. వాళ్ళ ముఖంలో ఎంతటి ప్రశాంతత అంటే వాళ్ల ముఖంలో ఏ కోశానా అలసట అనేది కనిపించలేదు. "నా భక్తుని నేనే ఎన్నుకుంటాన"ని అన్న బాబా వారికి ఆ శక్తిని, ఓర్పును ప్రసాదించి తమ మహిమలను రచించడానికి వారిని ఎన్నుకున్నారు.


ఆ పుస్తకంలో స్థానాన్ని దక్కించుకున్న 108 మంది భక్తుల జీవితాలలో 2022, ఫిబ్రవరి 22 అధ్భుతమైన రోజు. మేమంతా ఆరోజు ఉదయం 6 గంటలకు ఒక పల్లకిలో బాబాను కూర్చుండబెట్టి, 108 మంది భక్తుల అనుభవాలున్న పుస్తకాలు నాలుగైదు బాబా ముందు ఉంచి సమాధి మందిరం, ద్వారకామాయి, చావడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసాము. ఆ సమయంలో మా అబ్బాయి సాయికి పల్లకి మోసే భాగ్యాన్ని బాబా ప్రసాదించారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను మా అబ్బాయి బి.టెక్ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు, "బాబా! బాబు బి.టెక్ ఎటువంటి ఆటంకమూ లేకుండా పూర్తయి, తనకి ఉద్యోగం వస్తే, మీ దర్శనానికి శిరిడీ వచ్చి ద్వారకామాయిలో వాడి మొదటి నెల జీతం మీకు సమర్పించుకుని, కలకండ పంచిన తర్వాతే నేను చక్కెర తీసుకుంటాను" అని అనుకున్నాను. బాబా మమ్మల్ని ఇప్పుడు శిరిడీకి ఆహ్వానించడానికి సరిగ్గా సంవత్సరం ముందే మా సాయికి ఉద్యోగం ప్రసాదించారు. కానీ కరోనా వల్ల బాబా దర్శనానికి వెళ్ళడానికి కుదరలేదు. అయితే బాబా దయను మనం అస్సలు ఊహించలేము. శిరిడీ వెళ్లలేక బాధపడుతున్న తరుణంలో బాబానే 2021, ఫిబ్రవరిలో శిరిడీలో తాము ధరించిన వస్త్రాలను, శివరాత్రిరోజున తమ విగ్రహాన్ని శిరిడీ నుంచి మా ఇంటికి పంపారు. అంతేకాక సంవత్సరం తరువాత మమ్మల్ని ఇలా శిరిడీకి రప్పించుకుని, మా సాయి మొదటి నెల జీతం దక్షిణగా స్వీకరించి, భాజాభజంత్రీల నడుమ మా సాయితో తమ పల్లకి మోయించి, తమ చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుని ఎంతగానో అనుగ్రహించారు బాబా. అందుకు నేను చాలా ఆనందించాను.


తరువాత పల్లకి కిందకి దింపినప్పుడు నేను పల్లకిలో ఉన్న పూలు తీసుకుందామని వెళితే నా చేతికి పువ్వులకు బదులు వత్తులు, నూనె డబ్బా దొరికాయి. బాబా అనుగ్రహానికి నేను ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. ఎందుకంటే, నేను శిరిడీలో దీపారాధన చేయాలని తలచి వత్తులు, నూనె తీసుకుని శిరిడీ వద్దామనుకుని కూడా వాటిని తేవడం మర్చిపోయాను. వాటికోసం శిరిడీలో సమాధి మందిర సమీపంలో వెతికాను కానీ, దొరకలేదు. అలాంటిది బాబానే వాటిని నాకు ఇచ్చారు.


కార్యక్రమంతా ముగిసాక నేను చావడిలోకి వెళ్లి బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఊదీకోసం చూసాను. సాధారణంగా చావడి బయట ఊదీ ఉంచుతారు కదా, కానీ ఇప్పుడు ఉంచట్లేదు. నేను 'అయ్యో ఊదీ లేదు. ఇప్పుడిక సమాధి మందిరం దర్శనానికి వెళితేనే ఊదీ దొరుకుతుంది' అనుకుంటూ నాలుగు అడుగులు వేసి, మరో అడుగు వేయబోతుండగా కింద ఊదీ ప్యాకెట్ కనిపించింది. బాబానే నా మనసెరిగి నాకు ఊదీ ప్రసాదించారనిపించి నా మనసుకి చాలా సంతోషమైంది. మన మదిలోనే బాబా కొలువై ఉన్నారు. వారి ప్రేమను వర్ణించడం సాధ్యమా? ఆయన అనుగ్రహాన్ని పొందిన మనమందరమూ చాలా భాగ్యవంతులం. భక్తులమైన మనం మన జీవితాలలో పొందిన బాబా ఆశీర్వాదాలను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకోవడం మన అందరి భాగ్యమైతే, తమ మహిమలను చిరస్థాయిగా తమ భక్తులకు అందించడానికి బ్లాగు నిర్వహిస్తున్నవారిని, అలాగే శ్రీలక్ష్మీనరసింహారావుగార్లను ఎంచుకున్నారు బాబా. ఎంతటి భాగ్యమో కదా! అది అందరికీ లభిస్తుందా? మరి నేనెంత నా యోగ్యత ఎంత? అలాంటిది అష్టోత్తరశత అనుభవమాలిక పుస్తకంలో నాకు చోటు ఇవ్వడం ద్వారా ఊహించడానికే లేని గొప్ప అనుగ్రహాన్ని బాబా నాపై వర్షించారు. ఒక్క సూర్యుడే వెయ్యి కడవల నీటిలో ప్రతిబింబించినట్లు బాబా ఈ పుస్తకంలోని 108 మంది భక్తుల జీవితాల్లో ఉదయించి జ్ఞానజ్యోతిగా తమ అనుగ్రహాన్ని ప్రకాశింపజేస్తున్నారు. అటువంటి పుస్తకంలో బాబా నాకు స్థానం కల్పించడానికి కారణం ఆయనకు నాపై ఉన్న ప్రేమ, ఆయనతో నాకున్న ఋణానుబంధం. ఇంతకన్నా ఇంకా ఏం చెప్పగలను నేను. ఆ ప్రేమమూర్తికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ వారి అనుగ్రహదృష్టి సదా సాయి బిడ్డలందరీ మీద ఉండాలని కోరుకుంటున్నాను.


అడుగడుగునా కాపాడుతున్న సాయి


సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. నేను ఈ మధ్యకాలంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఒకరోజు నేను పని చేసే కార్యాలయంలో అనుకోని ఒక సమస్య వచ్చింది. నా మూలంగా వచ్చిన ఆ సమస్య వల్ల ఇంకొకరి ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుందని, ఒక అధికారి భయపడి నన్ను కూడా భయపెట్టాడు. నిజానికి అలా జరగదని తెలిసినప్పటికీ నా మనసులో ఆందోళన మొదలైంది. దాంతో నేను, "బాబా! ఈ సమస్య గట్టెక్కితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. అలాగే మీకు 11 ప్రదక్షిణలు చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. ఒక్క గంట లోపల అసలు అది సమస్యే కాదని తేలింది. దానితో నా ఆందోళనంతా పోయి సాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


ఇంకొకసారి ఒక ముఖ్యమైన ఫైల్  కనపడకుండా పోయింది. దానికోసం వెతుకుతూ "ఫైల్ దొరికితే, బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకుని 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. వెంటనే ఆ ఫైల్ దొరికింది. ఇలా నన్ను అడుగడుగునా సాయి కాపాడుతూనే ఉన్నారు, నేను కృతజ్ఞతతో ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉన్నాను. మన జీవితాలు బాబా రక్షణలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.


8 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. జ్యోతి,u r a great devoti..thank u for sharing

    ReplyDelete
    Replies
    1. అంతా బాబా దయ ఆయన నాపై చూపించే అభిమానం సాయి రామ్

      Delete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  6. Lakshmi Narashima rao gari phone no evvandi

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo