సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1142వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టాలెన్నున్నా తరగని నమ్మకంతో పొందిన బాబా అనుగ్రహం
2. బాబా దయతో ప్లాట్ అమ్మకం - ఊదీ అనుగ్రహం
3. బాబా ఆశీర్వాదం

కష్టాలెన్నున్నా తరగని నమ్మకంతో పొందిన బాబా అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

ఓం బహురూప విశ్వమూర్తయే నమః!!!


నేను ఒక సాయి భక్తుడిని. మాది హైదరాబాద్. నేను, నా భార్య గత ఐదారు సంవత్సరాలుగా సాయి భక్తులం. 2017లో మా కుటుంబం చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా ఆఫీసులోని ఒక సహద్యోగి మాకు సాయిమాతను పరిచయం చేసింది. అప్పటినుండి మేము ఆ సాయిమాత ఆజ్ఞానుసారం నడుచుకోవడం మొదలుపెట్టాం. కానీ మాకు ఎటువంటి మనశ్శాంతి కలగలేదు. మునుపటిలాగే కష్టాలు ఎదురుకోసాగాము. అయినా మేము సాయిమాత ఆజ్ఞమేరకు అఖండజ్యోతి ప్రజ్వలన చేసి 49 రోజులపాటు మాకు కలిగినంతలో సాయి భగవానుని కొలిచాము. తరువాత మా పరిస్థితులలో కొద్దిగా మార్పు వచ్చింది. సాయి భగవానుడు కొన్ని కొన్ని విషయాలలో దారి చూపించడం మొదలుపెట్టారు. సాయి భగవానునిపై నమ్మకంతో 2021లో ఒక బిజినెస్ మొదలుపెట్టాను. ఉద్యోగానికి రాజీనామా చేసి స్టాక్ మార్కెట్‍లో పెట్టుబడులు పెట్టాను. అయితే అనుకోని విధంగా నా ఆశలన్నీ కుప్పకూలాయి. బిజినెస్‍లో చాలా నష్టం వచ్చింది. స్టాక్ మార్కెట్లో 6 లక్షలు ఆవిరైపోయాయి. పరిస్థితి మళ్ళీ మెదటికి వచ్చింది. అయినా సాయి భగవానుడు ఎప్పటికైనా కరుణించకపోతాడా అని మా ప్రయత్నాలు మానకుండా ప్రతిక్షణమూ సాయి నామస్మరణలో గడిపేవాళ్ళము. ఇలా ఉండగా 2021 చివరిలో నేను ఒక ఫంక్షన్‍లో ఒక పాత స్నేహితుని కలిసి సలహా ఆడిగాను. తను ఒక మంచి సలహా ఇచ్చి ఏదైనా ఉద్యోగంలో చేరమన్నాడు. అయితే ఉద్యోగంలో చేరే క్రమంలో ఇంటర్వ్యూకి హాజరవ్వడం, ట్రైనింగ్ మొదలైనవన్నీ పూర్తి కావడానికి రెండు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. అదలా ఉంచితే నాకు 44 సంవత్సరాల వయస్సు. అది అసలైన పెద్ద  అవరోధం. ఈ విషయాలన్నీ నా మనస్సులో భయాందోళనలు సృష్టించాయి. కానీ సాయి అనుగ్రహం ఉంటే, కాని పనంటూ ఏదీ ఉండదని సాయి భగవానుని స్మరించుకుని ఒక మంచిరోజు నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా భార్య సాయి దివ్యపూజ ప్రారంభించింది. బాబా అనుగ్రహంతో నాకు ఒక పెద్ద కంపనీలో ఉద్యోగం వచ్చింది. ఇదంతా సాయి చేసిన అద్భుతమని నమ్ముతున్నాను. 2022, మార్చి 16న నేను ఆ కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అయితే నాకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్ లెటర్ వచ్చిందికానీ ఇంకా వర్క్ ప్రారంభం కాలేదు. అయినా ఈ అవకాశం నా విశ్వాసాన్ని దృఢపరిచింది. సాయి నా ప్రొబేషన్ పీరియడ్‍లో, అలాగే నా కెరీర్‌లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తారని ఆశిస్తున్నాను. సాయి భగవానునికి నా నమస్కారాలు. సదా మన మనస్సులందు కొలువైయుండి మనల్ని నడిపించుగాక!.


సర్వేజనా సుఖినో భవంతు!!!

సర్వం సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా దయతో ప్లాట్ అమ్మకం - ఊదీ అనుగ్రహం


నా పేరు భాను. నా పెళ్లికోసమని ఉంచిన డబ్బులతో మా అమ్మ తాను ఉన్నప్పుడు ఒక ప్లాట్ తీసుకుని ఆ స్థలంలో పునాదులు కూడా వేయించింది. నా పెళ్లి నిశ్చయమైనప్పుడు ఆ ప్లాట్ అమ్మేసి ఆ డబ్బులతో పెళ్లి చేద్దామన్నది అమ్మ ఆలోచన. అయితే అనుకోకుండా 2019లో అమ్మ ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. మేము అమ్మ హాస్పిటల్ ఖర్చులకి వేరేవాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాము. ఆ అప్పు తిరిగి చెల్లించడానికి నా పెళ్లికని ఉంచిన డబ్బులతో అమ్మ కొన్న ప్లాట్ అమ్మాలని అనుకున్నాము. అయితే ఆ ప్లాట్‍కి సంబంధించిన డాక్యుమెంట్లను అమ్మ ఎక్కడ పెట్టిందోగాని మేము ఎంత వెతికినా దొరకలేదు. అప్పు తీర్చాలంటే ప్లాట్ అమ్మాలి, అమ్మడానికి డాక్యుమెంట్లు లేక పెద్ద సమస్య అయింది. అదీకాక ఆ ప్లాట్ అమ్మకి అమ్మినవాళ్ళు మేము ఇంకా ఆ ప్లాట్‍ని అమ్మలేదని, గవర్నమెంట్ ద్వారా వాళ్ళకొచ్చిన ఆ ప్లాట్‍ను ఇప్పుడు అమ్మ లేదన్న కారణంతో కబ్జా చేసి తిరిగి తమ సొంతం చేసుకోవాలని చూసారు. అయితే ఆ ప్లాట్ పక్కనే ఉన్న ఇంట్లో ఉండే అంకుల్ బాబా దయవల్ల మాకు సపోర్ట్ చేసారు. ఆ ప్లాట్‍ను కబ్జా చేయలనుకున్న వాళ్ళు ఆ అంకుల్ దగ్గరకి వెళ్ళి, "ఆ ప్లాట్ మాకు కావాలి. మా తరపున మాట్లాడు" అని డబ్బులు కూడా ఇవ్వబోయారు. కానీ బాబా దయవల్ల ఆ అంకుల్ నిజాయితీగా వ్యవహరించారు. నేను బాబాను, "బాబా! ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ ప్లాట్ అమ్ముడయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల వరసకు అత్తమ్మ అయ్యే ఒకామె ఆ ప్లాట్ తీసుకుంది. "ఇలాగే ఇప్పటివరకు నాకు చాలా సహాయం చేసారు బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".


2022, జనవరిలో వరుసగా పదిరోజులు నా ఛాతికి ఎడమవైపున, అలాగే వెనకవైపు ఎడమ భాగంలో నొప్పి వచ్చింది. నేను బాబానే నమ్ముకుని ఊదీ పెట్టుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగడం చేశాను. బాబా దయవల్ల నొప్పి పూర్తిగా తగ్గింది. తరువాత మార్చి నెలలో ఒకరోజు నా ఎడమచేయి నొప్పి పెట్టింది. మరుసటిరోజు రాత్రి ఎడమ చేయితోపాటు ఛాతిలో ఎడమవైపు, ఇంకా వెనుకవైపు ఎడమభాగంలో నొప్పిగా అనిపించింది. దాదాపు అన్ని హార్ట్ ఎటాక్‍కి సంబంధించిన సంకేతాలు కనపడేసరికి నాకు చాలా భయమేసి బాబా ఊదీ పెట్టుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి, "నొప్పి తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవం పంచుకుంటాను" అని అనుకున్నాను. అద్భుతం! నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే నన్ను సదా సంరక్షిస్తూ ఉండు తండ్రి".


బాబా ఆశీర్వాదం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అందరికీ నమస్తే. నాపేరు విజయ. మేము ఢిల్లీలో నివాసముంటున్నాము. నేను ఇప్పుడు బాబా నా బిడ్డను ఏ విధంగా ఆశీర్వదించారో పంచుకోవాలనుకుంటున్నాను. నా కొడుకు చాలా సున్నిత మనస్కుడు. తను తన స్నేహితులు కామెంట్ చేసినా తట్టుకోలేడు, చాలా ఆలోచిస్తాడు. నేను ఎప్పుడూ తనతో, "నీ స్నేహితులు నిన్ను కామెంట్ చేసినప్పుడు పెద్దగా ఆలోచించకుండా సాయి గురించి ఆలోచించుకో!" అని చెపుతుండేదాన్ని. తను అలాగే చేస్తూ ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాడు. ఇప్పుడు తనంతట తానే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వెహికల్లో స్కూలుకి వెళ్లడం, స్వతంత్రంగా తన పనులు తాను చేసుకోవడం చేస్తున్నాడు. బాబా తనని అలా మలచినందుకు ఒక తల్లిగా నేను గర్వపడుతున్నాను. ఇకపోతే నా కొడుకు 10వ తరగతి టర్మ్ 1 బోర్డ్ ఎగ్జామ్స్‌ వ్రాసాడు. తను ఆ పరీక్షలు వ్రాసిన విధానం గురించి కొంచెం కలవరపడుతూ, "అమ్మా! నువ్వు నాకోసం బాబాను ప్రార్థించు" అని ఎప్పటిలానే చెప్పాడు. నేను తన అభ్యర్థనను బాబా పాదపద్మాలపై ఉంచాను. బాబా ఆశీస్సులతో మార్చి మూడోవారంలో సి.బి.ఎస్.ఈ ప్రకటించిన బోర్డు ఎగ్జామ్ ఫలితాలలో నా కొడుకు అద్భుతమైన ఫలితాన్ని సాధించాడు. మన భారాలన్నీ బాబాపై వేస్తే, ఆయన మనకు ఏది మంచిదో, శ్రేయస్సునిస్తుందో అది చేస్తారు. మనం శ్రద్ధ, సబూరి కలిగి ఉండాలి. ప్రస్తుతం నాకు రెండు పనుల విషయంలో బాబా ఆశీస్సులు కావాలి. అవి నెరవేరిన తర్వాత వాటిని మీ అందరితో పంచుకుంటాను. నా అనుభవాలను చదివిన వారికి నా ధన్యవాదాలు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు పంచుకోవడంలో జరిగిన ఆలస్యానికి నన్ను క్షమించండి. దయచేసి మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ అందరినీ రక్షించండి. దయచేసి మాతో ఉండి, మమ్మల్ని సన్మార్గంలో నడిపించమని మీకు మనవి చేసుకుంటున్నాను తండ్రి. ఏవైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి బాబా".



5 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  4. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo