1. బాబానే దిక్కు
2. సమస్యేమీ లేకుండా అనుగ్రహించిన బాబా
3. బాబా దయతో ఆన్ అయిన ఫోన్
బాబానే దిక్కు
శ్రీసాయిబాబాకు శతకోటి పాదాభివందనాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు అశోకరాణి. ఈమధ్యకాలంలో నా కంటికి ఆపరేషన్ చేయాలని డాక్టరు చెప్పారు. నాకు చాలా భయమేసి, "బాబా! నాకు మీరే దిక్కు" అని అనుకున్నాను. ఆయన దయవలన 2022, ఫిబ్రవరి 24వ తేదిన ఆపరేషన్ ఎటువంటి ఇబ్బంది, బాధ లేకుండా బాగా జరిగింది. తర్వాత అనుకోకుండా ఆపరేషన్ చేసిన వైపు దెబ్బ తగిలింది. నేను చాలా భయపడ్డాను కానీ బాబా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడారు. "బాబా! మీకు నా కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. ఇంతకంటే నేనేమి ఇవ్వగలను తండ్రి?".
నాకున్న ఒక్కగానొక్క కుమారుడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. బాబా ఇచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. తనకి పెళ్లయిందికానీ ప్రస్తుతం తన భార్య తన దగ్గర లేదు. తను పెట్టే శారీరక, మానసిక వేదన భరించలేక నేను కూడా 2022, మార్చి 1న ఇల్లు ఖాళీచేసి తన దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. నేను వెళ్ళిపోతేనన్నా బాబా దయవల్ల తను మారతాడు అనుకున్నాను. నా వయస్సు 60 సంవత్సరాలు. భయపడుతూనే ఇంటి నుండి బయటకు వచ్చాను. 'కుటుంబమంటూ లేకుండా పోయింది, శారీరకంగా ఏదైనా ఇబ్బంది కలిగితే పరిస్థితి ఏమిటి, ఎంత పాపం చేశాను' అని బాధపడ్డాను. ఇంకా కొడుకు ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియక ఎంతో మానసిక క్షోభను అనుభవించాను. ఆ స్థితిలో బాబాను, "నాకు ఆరోగ్యాన్ని, మానసిక ధైర్యాన్నిచ్చి జీవనభృతినివ్వమ"ని వేడుకున్నాను. ఆయన నాపై దయ చూపారు. నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఏప్రిల్ 2న ఆ ఉద్యోగంలో చేరాను. తరువాత ఏప్రిల్ 10న మా చెల్లివాళ్లతో నేను తిరుపతికి వెళ్ళొచ్చాను. ఆ సమయంలో బాబాను, "సాయి నాన్నా! ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసి, స్వామి దర్శనం బాగా జరిగేలా అనుగ్రహించు తండ్రి" అని వేడుకున్నాను. ఆ తండ్రి నాకు ఏ కష్టమూ కలగకుండా చూసుకుని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. మీరు తోడుగా ఉండి ఉద్యోగంలో ఇబ్బంది లేకుండా చూడండి నాన్న. నాకొచ్చే జీతంలో సగం ఆద్దెకే పోతుంది. కాబట్టి తక్కువ అద్దెలో మంచి ఇల్లు దొరికేలా అనుగ్రహించి, మీరు చేసే సహాయాన్ని బ్లాగులో పంచుకునే అవకాశం కల్పించండి సాయి. ఇకపోతే, నా కుమారుడి నుండి నాకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడండి. తన బాధ్యత మీదే. వాడికి మీరే దిక్కు. తనికి మీరు ఉన్నారనే దైర్యంతోనే బ్రతుకుతున్నాను. అసలు వాడికి సత్ప్రవర్తన కలిగి పిల్లపాపలతో ఉండే భాగ్యం ఉందా? తల్లిగా వాడు ఎలా ఉన్నాడోనన్న మానసిక వేదనతో నలిగిపోతున్నాను. అలా అని వాడితో ఉంటే, వాడు పెట్టే బాధలు తట్టుకునే పరిస్థితి నాకు లేదు. ఎంతటి దౌర్భాగ్య జీవితం బాబా. ఏమిటి నాకీ శిక్ష? మీరే దయచూపాలి, దారి చూపాలి నాన్న. మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మీరే మాకు దిక్కు ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని ఎదురు చూస్తూ.... మీ బిడ్డ".
సమస్యేమీ లేకుండా అనుగ్రహించిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నాకు ఏ కష్టం వచ్చినా బాబాతో చెప్పుకుంటాను. ఆయన ఎన్నోసార్లు నన్ను కాపాడారు. కష్టం అన్న ప్రతిసారీ నన్ను రక్షించారు నా తండ్రి సాయినాథుడు. నేనిప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మా బాబు నీళ్లు ఎక్కువగా త్రాగుతాడు. చాలాసార్లు టాయిలెట్‍కి వెళ్తాడు. అయితే ఈమధ్య మరీ ఎక్కువసార్లు టాయిలెట్‍కి వెళ్తున్నాడు. ఒకసారి నీళ్లు త్రాగితే మూడు, నాలుగు సార్లు టాయిలెట్‍కి వెళ్ళేవాడు. సరిగా అదే సమయంలో మేము అనుకోకుండా ఇయర్లీ చెకప్‍కి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టరుని సంప్రదించాము. అప్పుడు డాక్టరుగారితో మా బాబు సమస్య చెబితే, "యూరిన్ టెస్టు, డయాబెటిక్ టెస్టు చేద్దాం" అని చెప్పారు. నాకు భయమేసి నా తండ్రి సాయినాథునితో , "బాబా! బాబుకి నార్మల్ అని వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకుని రిపోర్టులు వచ్చేవరకు నా తండ్రిని తలుచుకుంటూ ఉన్నాను. నా తండ్రి నా బాధను విన్నారు. డాక్టరు రిపోర్టులు చూసి, "సమస్యేమీ లేదు. యాంగ్జైటీ వల్ల కూడా అలా అవుతుంది" అని చెప్పారు. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని పంచుకున్నాను. ఎల్లప్పుడూ నా కుటుంబాన్ని ఇలాగే కాపాడు సాయి తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా దయతో ఆన్ అయిన ఫోన్
సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను బాబా భక్తురాలిని. నాకు ఏ కష్టం వచ్చినా బాబా దగ్గరికి వెళ్ళి, ఆయన ముందు కూర్చుంటాను. ఆ తండ్రి లీలలు ఏమని చెప్పను? ఒక గురువారం పొద్దున్నే నా ఫోన్ అస్సలు ఆన్ అవ్వలేదు. అమ్మానాన్నకి చెప్తే ఎక్కడ కోప్పడతారోనని భయమేసి ఎవరికీ చెప్పాలో తెలియక బాబా దగ్గరకి వెళ్లి పూజ చేసి, ఫోన్ ఆయన ముందు పెట్టి, "బాబా! నువ్వే కాపాడాలి" అని చాలా ఏడ్చాను. అయినా ఫోన్ ఆన్ అవలేదు. కొద్దిసేపటికి మా అమ్మ, "ఫోన్ తీసుకుని రా" అని అంది. నాకు ఏమీ అర్థంకాక బాబా దగ్గరకి వెళ్లి, "ఏమిటిది బాబా?" అని ఆయనపై భారం వేసి ఫోన్ తీసుకుని అమ్మ దగ్గరకి వెళ్లి మనసులో 'బాబా బాబా' అనుకుంటూ ఉన్నాను. అంతలో ఫోన్ అనుకోకుండా దానంతట అదే ఆన్ అయింది. 'అరె.. ఎలా ఆన్ అయింది?' అనుకుంటూనే నాకు ఏడుపు ఆగలేదు. తక్షణమే బాబా దగ్గరకి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇది ఆయన చేసిన అద్భుతం.

