1. నమ్ముకుంటే ప్రతి కష్టాన్ని దాటిస్తారు బాబా2. బాబా యందు ఉంచిన నమ్మకానికి దక్కిన ప్రతిఫలం
3. బాబా కృప
నమ్ముకుంటే ప్రతి కష్టాన్ని దాటిస్తారు బాబా
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న, చదువుతున్న సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు హరిణి. మాది నిజామాబాద్. మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని చదివించి పెద్ద చేసింది. మా నాన్న ఉన్నా మా గురించి ఏనాడూ పట్టించుకోలేదు. మా తాతే లేకుంటే మా బ్రతుకులు పూర్తిగా నాశనమయ్యేవి. ఏంతో కష్టం మీద నేను డిగ్రీ పూర్తి చేశాను. బాబా దయవలన వెంటనే నాకు ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది. నా సంపాదనతో అమ్మని, చెల్లిని చూసుకుందామని అనుకున్నాను. కానీ విధి ఆడే ఆట ఇంకా పూర్తి కాలేదనుకుంటా! నాన్నకి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని మేము బాబాను ప్రార్థించాము. బాబా దయవలన ఆయన త్వరగానే కోలుకున్నారు. అంతలో విధి మరో నాటకానికి తెర లేపింది. మా తాతకి కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయనకి వైద్యం చేయించేంత ఆర్థిక స్థోమత లేని మాకు బాబా తప్ప వేరే దిక్కు లేదు. ఆయన పాదాలపై పడి తాతను బతికించే భాధ్యత ఆయనపై వేసి ద్వారకామాయి బిడ్డల గ్రూపులో మా సమస్యను విన్నవించుకున్నాము. ఆ గ్రూపులోని సాయి భక్తులు వెంటనే స్పందించి మాకు ఆర్థిక సహాయం అందించారు. తాత కోలుకోవడానికి 20 రోజులు పట్టినా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుంది. సాయి భక్తులందరికీ పాదాభివందనాలు.
అంతటితో రోడ్డు ప్రమాదాలు మా కుటుంబాన్ని వదిలి పెట్టలేదు. ఈసారి నా వంతు వచ్చింది. నేను ఆఫీసు క్యాబ్ ఎక్కడానికి రోడ్డు దాటుతుండగా కాలికి ఒక తాడు అడ్డుపడి కింద పడిపోయాను. కుడి మోకాలులో బ్లడ్ క్లాట్ అయ్యింది. క్యాబ్‍లో ఉన్న మా ఆఫీసువాళ్ళు నన్ను పెద్ద హాస్పటల్లో చూపించారు. డాక్టరు సర్జరీకి రిఫర్ చేశారు. అయితే మా ఆఫీసు ద్వారా నాకు ఎలాంటి క్లెయిమ్స్ అంటే ఆర్థిక సహాయం రాదని చెప్పారు. మా అమ్మ బాబా గుడికి వెళ్లి, బాబా పాదాలను పట్టుకుని, "బాబా! మీరు తప్ప మాకు వేరే ఏ దిక్కూ లేదు. కరుణించు తండ్రి" అని ఆయన్ను వేడుకుని ఏడుస్తూ అక్కడే కూర్చుంది. ఒక ఫారెస్ట్ ఆఫీసరుకు మా సమస్య తెలిసి, "దిల్‍షుక్‍నగర్‍లోని సాయి ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చూపించుమ"ని సలహా ఇచ్చారు. అతని సలహా మేరకు మేము ఆ హాస్పిటల్‍కి వెళ్ళాము. అక్కడ డాక్టరుగారు కూర్చున్న కుర్చీ వెనుక చాలా పెద్ద బాబా పటం దర్శనమిచ్చింది. దాంతో ఆ డాక్టరు రూపంలో బాబానే చికిత్స చేస్తున్నారనిపించింది. డాక్టరు నా రిపోర్ట్ చూసి, "బ్లడ్ క్లాట్ అవ్వడం వాస్తవమే కానీ, సర్జరీ అవసరం లేదు" అని చెప్పి కేవలం మందులు వ్రాసి పంపారు. బాబా మా వెంటే ఉన్నారని అనిపించింది మాకు. ప్రస్తుతం నా కాలికి చికిత్స జరుగుతుంది. బాబా దయవల్ల తొందరలోనే కోలుకుంటాను. నేను ఉద్యోగంలో చేరిన ఒక సంవత్సరంలో ఇన్ని ఇబ్బందులు వచ్చినా నేను బాబాను నమ్ముకున్నాను. కొన్నిసార్లు నా తోటి ఉద్యోగస్తులు ఉద్యోగం పోతుందని అన్నారుగానీ, బాబా దయవల్ల నా ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. "బాబా! అన్నిటికీ మీకు ధన్యవాదాలు".
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
రక్షరక్ష సాయినాథ రక్షరక్షమాం!!!
బాబా యందు ఉంచిన నమ్మకానికి దక్కిన ప్రతిఫలం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి భక్తులందరికీ కోటానుకోట్ల నమస్కారాలు. నా పేరు పద్మ. మాది తమిళనాడులోని హోసూరు. నాకు ఈ బ్లాగు పట్ల చాలా నమ్మకం. ఈ బ్లాగులోని ప్రతి అనుభవాన్ని చదువుతూ నేను కూడా నా అనుభవాలు పంచుకోవాలని అనుకున్నాను. ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను. నాకు సరిగా తెలుగు రాదు. అయినా నాకు చేతనైనంతలో వ్రాసి పంపుతున్నాను. దాన్ని సరిచేసి బ్లాగులో ప్రచురించవలసిందిగా బ్లాగు వారిని కోరుకుంటున్నాను. నాకు గత 15, 20 సంవత్సరాలుగా షుగరు, బిపి ఉన్నాయి. వాటికోసం ఇంగ్లీషు మందులు వాడుతుండేదాన్ని. సంవత్సరం క్రితం తెలిసినవాళ్ళు, "ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన పని లేదు" అని చెప్పడంతో నేను ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయితే ఒక సంవత్సరకాలంగా టాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల షుగర్ లెవల్స్ 600కి పెరిగిపోయాయి. కాళ్ళనొప్పులు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. డాక్టరు, "షుగర్ చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి" అని చెప్పారు. ఇంట్లో అందరూ భయపడ్డారు. నేను మాత్రం 'బాబా ఉన్నారు. నన్ను కాపాడతారు' అని ఆయన మీద పూర్తి నమ్మకముంచాను. నా పిల్లలు కూడా బాబా యందు విశ్వాసముంచారు. ఆయన దయవల్ల నేను వారం రోజుల్లో కోలుకుని హాస్పిటల్ నుండి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాను.
ఒకసారి హఠాత్తుగా నా తమ్ముడి వెన్నుపూసలో సమస్య వచ్చి లేవడానికి రాక నాలుగు నెలలపాటు పూర్తిగా మంచానికి అతుక్కుపోయాడు. అప్పుడు కూడా నేను బాబా యందు నమ్మకముంచాను. బాబా దయవల్ల ఇప్పుడు నా తమ్ముడు క్షేమంగా ఉన్నాడు.
ఆరునెలలుగా అద్దెకు ఎవరూ రాక మా ఇల్లు ఖాళీగా ఉంటే నేను, "బాబా! మీరు అనుగ్రహిస్తే ఈ మూడు అనుభవాలు ఒకేసారి బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు మా ఇంట్లో అద్దెకు దిగారు. "అన్నిటికి నమస్కారాలు బాబా".
బాబా కృప
సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు సునీత. నా చిన్నప్పటినుండి బాబా నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తోడునీడగా ఉంటూ నా జీవితాన్ని నడిపిస్తున్నారు. బాబాతో మాకున్న అనుబంధం జన్మజన్మలది. బాబా రెండు సంవత్సరాల క్రితం మా అమ్మాయికి జర్మనీలో ఎమ్.ఎస్ సీట్ ఇప్పించారు. అక్కడికి వెళ్ళాక మా అమ్మాయికి తోడుగా ఉండి అన్నివిధాలా కాపాడారు. అంతేకాదు ప్రస్తుత కరోనా సమయంలో బాబా కృపతో మా అమ్మాయికి అసిస్టెంట్ సైంటిస్ట్ గా ఉద్యోగం ప్రసాదించారు. తరువాత బాబా అనుగ్రహంతో మా అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. ఇలా అడుగడుగునా మమ్మల్ని కాపాడే మా సాయిమాతకు మేము ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
అనుకోకుండా 2022, ఉగాది రోజు బాబా మా మీద దయచూపి మా ఇంటికి రెండడుగుల విగ్రహరూపంలో బహుమతిగా వచ్చి సర్ప్రైజ్ చేసారు. బాబాను చూసాక నా మనసు, "బాబా! మీకు సేవ చేసేంత అదృష్టం నిజంగా నాకుందా?" అని ఆనందాశ్చర్యాలలో మునిగిపోగా ప్రశాంతంగా ఆయనను చూస్తూ ఉండిపోయాను. ఇక ఆయన సేవలో జన్మ తెరిస్తే అంతేచాలు. బాబా దయ మన అందరి మీద ఉండాలి, ఆయన కృపతో మనమందరం మన జీవితాలను సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఎప్పుడూ బాబా ప్రేమకోసం పరితపించే బాబా భక్తురాలిని.
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDelete🙏ఓం సాయిరామ్🙏
ReplyDeleteCarpenter manasu marchi money maku vachela cheyi thandri please
ReplyDeleteబాబా నీ కృపా కటాక్షాల తో మాకు రావాల్సిన అమౌంట్ అన్నీ వచ్చేలాగా దీవించు సాయిరాం బాబా దేవా..
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయి
ReplyDeleteశ్రీ సాయి
జయ జయ సాయి
Please baba give courage to me.Be with me
ReplyDeleteJaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDelete🙏
ReplyDelete