సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1168వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మకంతో, శ్రద్ధ-సబూరీ కలిగి ఉంటే శ్రీసాయి మనల్ని కష్టాల నుంచి కాపాడతారు
2. సాయి దేవుడు ఎంతో దయగలవాడు
3. బాబాను తలచుకుని భారం అయనపై వేస్తే ఏదైనా సాధ్యమే

నమ్మకంతో, శ్రద్ధ-సబూరీ కలిగి ఉంటే శ్రీసాయి మనల్ని కష్టాల నుంచి కాపాడతారు

శ్రీసమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి బంధువులందరికీ నమస్కారాలు. నాపేరు మిరియాల వెంకటేశ్వరరావు. మాది హైదరాబాదు. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు కొన్ని మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు ఈ మధ్య జరిగిన మరికొన్ని అనుభవాలు మీతో పంచుకుందామని వ్రాస్తున్నాను. 2022, ఏప్రిల్ 10, శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పడుకుని లేచాక నా పాదాలు రెండు తిమ్మిర్లు ఎక్కి ఎంతకీ తగ్గలేదు. నా వయస్సు దృష్ట్యా నాకు చాలా భయమేసింది. వెంటనే మా ఇంట్లోని పూజగదిలోకి వెళ్లి సాయి విగ్రహం దగ్గర ఉన్న ఊదీ తీసుకుని పాదాలకు రాసి, 'శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః'  అనే మంత్రం జపించాను. రాత్రి నిద్రపోయే ముందు కూడా బాబా ఊదీ పాదాలకు రాసుకుని, పై మంత్రాన్ని పఠిస్తూ నిద్రపోయాను. రాత్రి కలలో శ్రీసాయికి పాయసం నైవేద్యం పెట్టినట్లు కనిపించింది. సాయి కృపతో మరునాడు ప్రొద్దున నిద్రలేచేసరికి తిమ్మిర్లు తగ్గాయి. ఆనందంగా రాత్రి కలలో కనిపించినట్లు బాబాకు పాయసం చేసి నైవేద్యం పెట్టాను,

2022, జనవరి 8న నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టరు అది 'ఒమిక్రావ్' అని, మందులిచ్చి వాడమన్నారు. నేను గృహ నిర్బంధంలో ఉండి మందులతోపాటు, ఊదీ సేవిస్తూ, 'శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ గడిపాను. బాబా దయవల్ల 10 రోజులకు పరీక్ష చేయించుంటే, కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఆ 10 రోజులలో జ్వరం రావడంగాని, మరే ఇతర కరోనా లక్షణాలుగాని నాకు లేవు. శ్రీసాయే నన్ను రక్షించారు. శ్రీసాయిపై నమ్మకంతో, శ్రద్ధ-సబూరీ కలిగి ఉంటే శ్రీసాయి మనల్ని కష్టాల నుంచి కాపాడతారు. "వేలవేల నమస్కారాలు బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించు తండ్రి".

సాయి దేవుడు ఎంతో దయగలవాడు

సాయి భక్తులకు, బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మన సాయి దేవుడు ఎంతో దయగలవాడు. ఆయన మన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయరు. నేను ఇదివరకు బాబా దయతో కరోనా నుంచి బయటపడ్డ నా అనుభవం మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబాకి మాటిచ్చిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకరోజు నేను మా మనవడికి అన్నం తినిపిస్తుంటే, అనుకోకుండా తను నా వేళ్ళు కొరికేసాడు. వేళ్ళపై పంటి గాట్లు పడి బాగా నొప్పి పెట్టింది. అసలే నాకు షుగర్ ఉన్నందున భయపడి, "నాకు ఏమీ ఇబ్బంది లేకుండా వేళ్ళు బాగైతే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, నిదానంగా నా వేళ్ళు బాగయ్యాయి.

ఇటీవల ఒకరోజు ఉదయం నేను నిద్రలేస్తూనే తల తిరగడం వంటివేమీ లేకుండానే కిందపడిపోయాను. ఎడమ కన్నుకి కాస్త పైన, పక్కగా బాగా రక్తం కారింది. నేను చాలా భయపడ్డాను. హాస్పిటల్ 9 గంటలకి తీస్తారంటే, ఎనిమిదింటికి హాస్పిటల్‍కి వెళ్ళాము. కానీ, "డాక్టర్ 11 గంటలకు వస్తారు. అప్పుడు రండి" అని చెప్పి పంపేశారు. దాంతో "ఈ దెబ్బ కారణంగా ఎక్కువ బాధ కలగకుండా, ప్రమాదమేమీ లేకుండా చూడండి బాబా" అని ఆ సాయి దేవుని స్మరిస్తూ పదకొండు గంటల వరకు గడిపి, అప్పుడు మళ్ళీ హాస్పిటల్‍కి వెళ్ళాను. డాక్టరు చూసి, "పెద్దావిడ ఉదయం వస్తే, ఒక కట్టు కట్టి పంపకూడదా?" అని స్టాఫ్‍ని తిట్టి, తానే క్లీన్ చేసి ఒక కట్టు కట్టారు. సాయి దేవుని కృపతో కన్నుకి ఏమీ కాలేదుగాని నొప్పి, వాపు ఎక్కువగా ఉండేవి. నెమ్మదిగా ఒక నెలకి అవి చాలావరకు తగ్గాయి. కానీ కొద్దిగా వాపు ఉండిపోయింది. "బాబా! అది కూడా తగ్గి నార్మల్ అయ్యేలా చూడండి తండ్రి. ఇంకో సహాయం కూడా మీరు తప్పక చేస్తారని నమ్ముకున్నాను తండ్రి. ఆ సహాయం అందినంతనే ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను బాబా".

ఓం శ్రీసాయినాథాయ నమః!!!

బాబాను తలచుకుని భారం అయనపై వేస్తే ఏదైనా సాధ్యమే

సాయి భక్తులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్. నేను గతంలో కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం తెలియజేస్తున్నాను. నేను చాలారోజులపాటు నా బ్యాంక్ యాప్‍కి సంబంధించి ఓ.టి.పి రాక చాలా ఇబ్బందిపడ్డాను. ఆ విషయంగా నేను చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి బ్యాంకుకి వెళ్లి, వాళ్ళకి సమస్య గురించి చెపితే, "మీ ఫోన్ ద్వారా అన్నీ అవుతాయి, మీరే సరి చేసుకోండి" అని చెప్పారేగాని నా సమస్యను పరిష్కరించలేదు. అప్పుడు ఇక బాబాయే దిక్కని, "బాబా! నా ఓ.టి.పి సమస్య తీరితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. 2022, ఏప్రిల్ 14, గురువారం బాబాను తలచుకుంటూ మరోసారి ప్రయత్నం చేశాను. అద్భుతం! వెంటనే ఓ.టి.పి వచ్చి నా యాప్ సమస్య పరిష్కారమైంది. నన్ను నేనే నమ్మలేకపోయాను. నిజంగా ఇది సాయి లీలే. బాబాను తలచుకుని భారం అయనపై వేస్తే ఏదైనా సాధ్యమే. అందుకే ఆయనను మరవకండి. అది చాలు. "ధన్యవాదాలు బాబా. ఏమైనా మరిచిపోయి ఉంటే మన్నించండి బాబా. నన్ను మీ నామస్మరణకు ఎప్పుడూ దూరం చెయ్యొద్దు తండ్రి".

సర్వేజనా సుఖినోభవంతు!!!


6 comments:

  1. Today i am feeling very happy.Sai gave darshanam i my dream.By seeing his feet in dream.i am eagerly to have Sai darshanam in my dream.waiting to have his darshanam .Om sai ram,,

    ReplyDelete
  2. శిరిడీ సాయినాధ దేవా నీవే దిక్కు ఎవరూ లేరు.. మాకు ఈ లోకంలో.. నీవు ఉన్నవని మేమున్నాము.. నీవు లేకుంటే మాకీ జీవితం వద్దు థాంక్యూ సాయి నాథ.. మా అనారోగ్యం రూపుమాపి నిర్మూలించిన.. గొప్ప దేవా థాంక్యూ బాబా.. మీకు ఇవే మా శతకోటి నమస్కారాలు సాష్టాంగ ప్రణామాలు ...

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo