1. బాబా ఉన్నారు
2. బిడ్డ ఆరోగ్య సమస్య సమసిపోయేలా అనుగ్రహించిన బాబా
3. భరించలేని నొప్పి ఉన్నప్పటికీ ఫ్రాక్చర్ కాకుండా చూసిన బాబా
బాబా ఉన్నారు
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా సాయి బంధువులకు నా నమస్కారాలు. నాపేరు లక్ష్మి. నేను సామాన్య సాయి భక్తురాలిని. మా పాపకి తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఐ సైట్ ప్రాబ్లమ్ వచ్చింది. దాంతో తాను కళ్ళజోడు పెట్టుకుంటూ ఉండేది. కళ్ళజోడు అవసరం లేకుండా ఉండేందుకుగానూ 2022, ఏప్రిల్ 22న పాప కళ్ళకు ఒక చిన్న బేసిక్ సర్జరీ చేయించాం. ఆ సమయంలో నేను, "బాబాతండ్రి, సాయినాథా! ఏ ప్రాబ్లమ్ లేకుండా సర్జరీ జరిగేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. ఆ సాయినాథుడు దయతో మా పాపకి చక్కటి కంటిచూపుని ప్రసాదించారు. ఇంకా నా సంతోషానికి అవధులు లేవు. "బాబాతండ్రి! నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వే మా బిడ్డకు మంచి కంటిచూపును ప్రసాదించావు" అని మనసులో బాబాకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నాను
2022లో నేను ఒక ఆపరేషన్ చేయించుకుని మా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్న సమయంలో మా పెళ్లిరోజు వచ్చింది. మేము ప్రతి సంవత్సరం పెళ్లిరోజునాడు అన్నవరం వెళ్లి వ్రతం చేసుకుని వస్తాము. అందుచేత నేను, "బాబా! ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మేము వ్రతం చేయించుకోగలిగేల అనుగ్రహించండి" అని బాబాను మనసులోనే ప్రార్థించుకున్నాను. బాబా దయవలన మేము అన్నవరం వెళ్లి వ్రతం చేయించుకున్నాము, స్వామి దర్శనం బాగా జరిగింది. నేను ఎంతో ఆనందపడ్డాను. "సాయీశ్వరా, తండ్రీ! నువ్వు ఉన్నావయ్యా. తలచిన వెంటనే పలికే దైవం మీరు తండ్రి".
2022లో మా అమ్మకు ఉన్నట్టుండి ఛాతి మీద పెద్ద సెగ్గడ్డలా వచ్చింది. అమ్మకు షుగర్ ఉన్నందున మేమంతా చాలా భయపడిపోయాము. అప్పుడు నేను, "బాబా! ఇది మామూలు సెగ్గడ్డే, ఏమీ కాదని డాక్టరు చెప్పేలా దయ చూపండి" అని బాబాను వేడుకున్నాను. తరువాత అమ్మని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి, డాక్టర్కి చూపిస్తే, బాబా దయవల్ల డాక్టరు, "ఏమీ కాదు. ఇది మామూలు సెగ్గడ్డే" అని చెప్పారు. "బాబాతండ్రి! నువ్వున్నావు" అని మనసులోనే బాబాకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "ఇలాగే మమ్మల్ని సదా కాపాడు తండ్రి. మీ దయవల్ల అమ్మకి చాలావరకు తగ్గింది. ఇంకా కొద్దిగా ఉంది. అది కూడా త్వరగా మానిపోయేలా చూడు తండ్రి. నాకున్న కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కారం చూపించు తండ్రి. అలాగే మాకున్న కొన్ని వ్యాపార సమస్యలను పరిష్కరించి, ఆర్థిక సమస్యలు చక్కదిద్దు నాయనా. ఇంకా పిల్లలు మంచి ఉద్యోగాలలో స్థిరపడేలా చేయి తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బిడ్డ ఆరోగ్య సమస్య సమసిపోయేలా అనుగ్రహించిన బాబా
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు రఘు. మాది హైదరాబాద్. 2022, ఏప్రిల్ నెల మూడో వారంలో ఒకరోజు ఉదయం నా కూతురు తలనొప్పి అని నిద్ర లేవలేదు. హాలిడేసే కదా అని నేను కూడా లేపలేదు. తరువాత ఉదయం పది గంటలకి తనని నిద్రలేపితే, "తల తిరుగుతుంది" అంది. నేను తనకి నిద్ర సరిపోలేదేమో, అందుకే అలా ఉందేమో అనుకుని, "లేచి బ్రష్ చేసుకుని, టిఫిన్ చేస్తే తగ్గుతుంది రా" అని అన్నాను. అయితే టిఫిన్ చేసిన తరువాత కూడా తనకి తగ్గలేదు. తను మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ పడుకుంటే రెండుగంటల తరువాత తనకి వాంతి అయింది. నేను వెంటనే బాబాని ప్రార్థించి, మా ఫ్యామిలీ డాక్టరుకి ఫోన్ చేశాను. డాక్టరు కొన్ని మందులు సూచిస్తే, వెళ్లి ఆ మందులు తెచ్చి పాపకి వేసాను. వాంతులు కాలేదు కానీ తల అలాగే తిరుగుతుంది. ఆ రోజు ఆదివారం అయినందున మరుసటిరోజు వరకు చూసి డాక్టరు దగ్గరకు వెళదామని అనుకున్నాము. అనుకున్నట్లే సోమవారం డాక్టరు దగ్గరకి వెళ్తే, చెక్ చేసి బిపి తక్కువ ఉందని, అన్ని టెస్టులు చేసి మరుసటిరోజు రమ్మన్నారు. నేను తొమ్మిది సంవత్సరాల పాపకి బిపి సమస్య ఏమిటని బాధపడి "రిపోర్టులు నార్మల్ రావాలి, పాపకి నయమవ్వాలి బాబా" అని బాబాని ప్రార్థించాను. బాబాకు దణ్ణం పెట్టుకుని కొంచెం ఊదీ నీళ్ళలో కలిపి పాప చేత త్రాగించి, మరికొంత ఊదీ తన నుదుటన పెట్టాను. ఇంకా డాక్టరు దగ్గరకు వెళ్ళేవరకు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరించసాగాను. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లే రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టరు నన్ను పిలిచి రిపోర్టులన్నీ నార్మల్‍గా ఉన్నాయని చెప్పి బలానికి సిరప్ రాసిచ్చారు. బాబా దయవల్ల మరుసటిరోజు పాపకి తలనొప్పి, ఆ మరుసటిరోజుకి తల తిరగడం కూడా తగ్గిపోయాయి. "బాబా! మీకు వందనాలు. మీరే నాకు తల్లి, తండ్రి మరియు గురువు. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రి. నాకున్న ఆరోగ్య సమస్య తగ్గేలా చేయండి బాబా. ఇంకా నాకున్న రెండు కోరికలను కూడా తీరుస్తారని ఆశిస్తున్నాను బాబా".
శ్రీసాయినాథార్పణమస్తు!!!
భరించలేని నొప్పి ఉన్నప్పటికీ ఫ్రాక్చర్ కాకుండా చూసిన బాబా
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు గీత. 2021 చివరిలో నా కాలి వేళ్ళు ఫ్రాక్చర్ అయితే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో బాగైంది. కానీ అప్పుడప్పుడు కొద్దిగా నొప్పి వస్తుండేది. 2022, ఏప్రిల్ నెల మూడో వారంలో నేను వంట చేస్తూ చూసుకోకుండా అటు ఇటు తిరుగుతున్నప్పుడు అరుగు కిందభాగం నా కాలికి బలంగా తగిలి ప్రాణం పోయినంత బాధ కలిగింది. ఆ భాదకి చిటికెన వేలు పక్కకు జరిగిపోయిందనిపించి, 'బాబా!' అని బిగ్గరగానే అరిచేసాను. వెంటనే మందు రాసుకుని కాలుని గట్టిగా బ్యాండేజ్‍తో చూట్టేసి, "తండ్రీ! నా కాలు మళ్ళీ ఫ్రాక్చర్ కాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. భరించలేని నొప్పి ఉన్నప్పటికీ ఆ సాయినాథుని దయవల్ల ఫ్రాక్చర్ కాలేదు. "ధన్యవాదాలు సాయీ. మాకు అడుగడుగునా తోడునీడగా ఉంటూ మీరే నడిపించాలి".
