సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1175వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఇట్టే తీరిపోయిన సమస్యలు
2. భయంకరమైన నొప్పిని, రెడ్ క్లాట్‌ని తొలగించిన బాబా
3. బాబా అనుగ్రహంతో పూర్తిగా తగ్గిపోయిన ఇన్ఫెక్షన్

బాబా దయతో ఇట్టే తీరిపోయిన సమస్యలు
 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రీతి. నేను హైదరాబాదులో నివాసముంటున్నాను. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకోబోయే ముందు ఆలస్యంగా ఈ అనుభవాలను పంచుకుంటున్నందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...
 
నా భర్త ఉద్యోగరిత్యా వేరే దేశంలో ఉంటున్నారు. ఆయన ప్రతినెలా మొదటి వారంలో మా నెలవారీ ఖర్చులకోసం డబ్బులు పంపుతుంటారు. అయితే ఒక నెల సరైన సమయంలో నాకు డబ్బులు అందలేదు. ఎందుకంటే, ఆ నెల మావారి కంపెనీలో జీతాలు చెల్లించడం ఆలస్యమైంది. దాంతో ఇక్కడ నేను నెలవారీ ఖర్చులకి డబ్బులు చెల్లించడంలో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నాకు డబ్బులు అందితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల నా అకౌంటులో డబ్బులు క్రెడిట్ అయ్యాయని మరోసటిరోజు నాకు మెసేజ్ వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా".    

2022, సంక్రాంతి సెలవులకి మా అత్తయ్య మమ్మల్ని తమ గ్రామానికి రమ్మని పిలిచారు. కానీ అక్కడికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, మా పిల్లలిద్దరికీ ఫిబ్రవరి నెల మధ్యలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకోసం వాళ్ళు చదువుకోవాల్సింది చాలా ఉంది. ఒకవేళ మేము ఊరికి వెళితే, వాళ్ళ ధ్యాస చదువు మీద నుండి మళ్ళుతుంది. అందువలన నేను బాబాను, "సెలవులకు రమ్మని మా అత్తమామలు బలవంతపెట్టకుండా ఉండేలా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల వాళ్ళు మమ్మల్ని రమ్మని ఒత్తిడి చేయలేదు. "ధన్యవాదాలు బాబా".

ఇటీవల నేను తీవ్రమైన నొప్పితో చేయి కదపలేక రెండురోజులు చాలా బాధపడ్డాను. డాక్టరుని సంప్రదించి మందులు తీసుకొని రెండు రోజులు వాడినప్పటికీ ఆ చేయినొప్పి నుండి నాకు ఎటువంటి ఉపశమనం కలగలేదు. తరువాత గురువారం నాడు నేను బాబాకి అభిషేకం చేసి, ఆ అభిషేక తీర్థాన్ని త్రాగాను. బాబా దయవల్ల అదేరోజు నాకు చేయినొప్పి నుండి పూర్తిగా ఉపశమనం లభించింది. "థాంక్యూ సో మచ్ బాబా. నా బ్రదర్ తన దగ్గర బంధువుల నుండి చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడని మీకు తెలుసు బాబా. దయచేసి నా బ్రదర్‍ని ఇబ్బందిపెట్టకుండా వాళ్ళ మనసును మార్చండి. అలాగే తనకి తోడుగా ఉంటూ సమస్యలను ఎదుర్కొనే మానసికబలాన్ని ఇవ్వండి బాబా".

భయంకరమైన నొప్పిని, రెడ్ క్లాట్‌ని తొలగించిన బాబా

నా పేరు శివ. నేను నర్సాపురంలో నివసిస్తున్నాను. కొద్దిరోజుల క్రితం (2022, ఏప్రిల్ నెల రెండవ వారంలో) బాబా ఒక గొప్ప అద్భుత లీలని నా విషయంలో చూపారు. ఆ లీలనే ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. “ఈ అనుభవాన్ని పంచుకోవడంలో చాలా ఆలస్యమైనందుకు నన్ను క్షమించు బాబా”. కొద్దిరోజుల క్రితం నేను ఆఫీస్ పనిమీద ముంబయి వెళ్ళాల్సి వచ్చింది. నా పర్యటన ప్రణాళిక ప్రకారం ముందుగా నేను ముంబయికి వెళ్ళి, అక్కణ్ణించి సూరత్‌కి, ఆ తరువాత హైదరాబాదుకి, అక్కణ్ణించి తిరిగి ఇంటికి (నర్సాపూర్) రావాల్సి ఉంది. కంపెనీవాళ్ళు నాకోసం విజయవాడ నుండి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఆరోజు 12.30 గంటలకి నేను ఫ్లైట్ ఎక్కాను. అంతకుముందే నా ఎడమచెవికి ఆపరేషన్ అయింది. కుడిచెవికి కూడా కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ అది ఇంతకుముందు నన్నెప్పుడూ ఇబ్బందిపెట్టనందువల్ల, ‘ఇప్పుడు కూడా ఏమీ కాదులే, ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేయలేదు?’ అని నిర్లక్ష్యంతో ఏ టాబ్లెట్స్ గానీ, కాటన్ గానీ దగ్గర ఉంచుకోలేదు. ఫ్లైట్‌లో కూర్చుని, నా ఫోనులో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్న ‘సాయి డివోటీ స్పీక్స్’ (Sai Devotee speaks) అనే వీడియోలు చూస్తూ ఉన్నాను. కుడిచెవి కొంచెం ఇబ్బందిపెడుతున్నా నేను అదేమీ పట్టించుకోకుండా వీడియోలు చూస్తూ ఉన్నాను. ఉన్నట్టుండి విపరీతమైన నొప్పి తలలో మొదలై కుడిచెవి, కుడికన్ను వరకు వ్యాపించింది. నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ నొప్పికి కుడికన్ను బద్దలైపోతుందేమో అనిపించింది. నాకు ఏమి చేయాలో తెలియలేదు. ఫ్లైట్ అటెండెంట్‌కి చెబుదామంటే వాళ్ళు ఏమనుకుంటారో అని ఒకప్రక్క భయం. మరోప్రక్క భరించలేని బాధ. జీవితంలో ఇదే నాకు ఆఖరిరోజు అన్నట్టుగా ఉంది. వెంటనే నేను బాబాని స్మరించుకుని, “బాబా, నువ్వే దిక్కు. నేను ఏమైనా తప్పులు చేసివుంటే క్షమించి, నన్ను కాపాడు” అని ఆర్తిగా వేడుకున్నాను. ఒక పావుగంట పాటు నొప్పి అలానే పెరుగుతూ ఉంది. నేను కళ్ళుమూసుకుని బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. బాబా దయవల్ల ఆ భయంకరమైన నొప్పి నుదుటిలో నుండి కుడికన్నులోకి వచ్చి అక్కడితో అదృశ్యమైంది. మొత్తానికి బాబా నన్ను ఆ భయంకరమైన నొప్పి నుండి రక్షించారు. ఫ్లైట్ దిగి హోటల్ రూముకి వచ్చి చూసుకుంటే, కుడికంటిలో పెద్ద రెడ్ క్లాట్(ఎర్రని గడ్డ) కనిపించింది. అది చూసి నేను చాలా భయపడి మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! నా ప్రాణాలను కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించావు. అదేవిధంగా, నేను ఇంటికి వెళ్ళేలోపు నా కంటిలోని ఈ రెడ్ క్లాట్‌ని కూడా తొలగించు” అని ఆర్తిగా వేడుకున్నాను. తరువాత మా ఆఫీసుకి దగ్గరలో ఉన్న సాయి మందిరానికి వెళ్ళి బాబాను దర్శించుకున్నాను. 

నా పర్యటనలోని నాలుగు రోజులూ కంటిలోని ఆ రెడ్ క్లాట్‌ని పరీశీలిస్తూనే ఉన్నాను. అది ఏమాత్రం తగ్గలేదు. ఆశ్చర్యంగా, ఇంటికి వచ్చిన మరుసటిరోజు నిద్రలేచిన తరువాత చూసుకుంటే నా కంటిలో క్లాట్ ఏమీ కనిపించలేదు. “బాబా! మీరు నన్ను కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించారు. ఇలాగే నా జీవితాంతం నాకు ఇలాగే సహాయం చేయండి బాబా. మీ ఋణం తీర్చుకోలేనిది, థాంక్యూ సో మచ్ బాబా”.

బాబా అనుగ్రహంతో పూర్తిగా తగ్గిపోయిన ఇన్ఫెక్షన్

నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు అకస్మాత్తుగా నాకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. నీళ్ళ విరోచనాల కారణంగా నేను చాలా నీరసించిపోయాను. అందుచేత హాస్పిటల్‌కి వెళ్లి సెలైన్ ఎక్కుంచుకున్నాను. తరువాత డాక్టరు కొన్ని టాబ్లెట్లు ఇచ్చి డిశ్చార్జ్ చేసారు. అయితే ఆ టాబ్లెట్ల పవర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎప్పుడూ కడుపులో తిప్పేస్తున్నట్టుగా ఉండేది. అప్పుడు మా ఫ్యామిలీ డాక్టరుని సంప్రదిస్తే, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో తెలుసుకోవడం కోసం బ్లడ్ టెస్టు చేసారు. రిపోర్టులో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉందని వచ్చింది. డాక్టరు 2 వారాలకి యాంటిబయోటిక్స్ రాసి పంపారు. నేను ఆ మందులు వాడుతూ, బాబా ఊదీ తీసుకుంటూ, మరికొంత ఊదీ పొట్ట మీద రాసుకుంటూ ఉండేదాన్ని. రెండు వారాల తరువాత మళ్లీ హాస్పిటల్‍కి వెళితే, టెస్టు చేసి, "ఇన్ఫెక్షన్ ఇంకా ఉంది" అని టాబ్లెట్లు రాసి, "ఈసారి వచ్చేసరికి కూడా తగ్గకపోతే, గాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకి పంపుతాను" అన్నారు. నాకు చాలా భయమేసి బాబాని తీవ్రంగా ప్రార్ధించాను. కానీ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. దాంతో మా ఫ్యామిలీ డాక్టరు ఒక గాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకి నన్ను పంపించారు. ఆ డాక్టరు అవసరమైన కొన్ని వివరాలు అడిగి రెండు వారాలకి మందులిచ్చి, "తగ్గకపోతే 'కోలన్ స్కోపీ' చేస్తాను" అన్నారు. నేను, 'వామ్మో, ఇదేమిటీ దేవుడా?' అని చాలా ఏడ్చి ప్రతిరోజూ బాబాను గట్టిగా ప్రార్థిస్తూ, ఊదీ నీళ్లు త్రాగి, పొట్టకి కూడా రాసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా, 'బాబా! నాకు ఏ టెస్టులు వద్దు, దయతో అవేమీ లేకుండా నాకు గనక ఇన్ఫెక్షన్ తగ్గిస్తే, మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ బాబా దయవల్ల మందులు అయిపోయాక నాకు ఏ సమస్య రాలేదు. పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".

5 comments:

  1. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. థాంక్యూ సాయిరాం బాబా థాంక్యూ వెరీ మచ్.. మీ బిడ్డల మైన మమ్మల్ని మీ అనుగ్రహంతో ఎల్లప్పుడూ కాపాడు తండ్రి..

    ReplyDelete
  4. మీ ఆశీస్సులు వల్లనే మేము ఇలా బాగున్నాము తండ్రి మీరే దిక్కు మీరే రక్ష మీరు తప్ప ఎవరు లేరు ఈ లోకంలో మాకు.. మా అనారోగ్యాలను ఇప్పటికిప్పుడు రూపుమాపి నిర్మూలించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించు సాయినాథ.. మీకు సహస్ర శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము..

    ReplyDelete
  5. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo