సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1171వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయుంటే ఇబ్బందులుండవు
2. బాబా ఉండగా ఏ కష్టమొచ్చినా భయపడాల్సిన పనిలేదు
3. స్మృతిమాత్ర ప్రసన్నులు సాయి

బాబా దయుంటే ఇబ్బందులుండవు


సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు హేమ. మేము విజయవాడలో ఉంటాము. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 


కోవిడ్ సెకండ్ వేవ్‌లో మేము మా అమ్మగారిని, అత్తయ్యగారిని. మావయ్యగారిని, ఆడపడుచుని కోల్పోయాము. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో వాళ్ళ సంవత్సరీకాలు జరపాల్సి ఉండగా నాకు నెలసరి రావడం ఆలస్యమవుతూ వచ్చింది. ఏప్రిల్ నెల మొదటివారంలో రావలసిన నా నెలసరి రెండవవారం పూర్తయినా కూడా రాలేదు. దాంతో, సంవత్సరీకాల సమయంలో నెలసరి వస్తుందేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, జరగాల్సిన అన్ని కార్యక్రమాలకి నేను ఉండాలి. ఆ సమయంలో నెలసరి వస్తే నేను వాళ్ళకి ఏమీ చెయ్యలేనేమోనని నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, నాకు గురువారం లోపు నెలసరి వచ్చేలా అనుగ్రహించండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో షేర్ చేసుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. అయితే గురువారం వచ్చినా కానీ, నాకు నెలసరి రాలేదు. దాంతో నాకు బాబా మీద కొంచెం కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నెలసరి రావడం కోసం నా ప్రయత్నాలన్నీ నేను చేశాను. ఇంక ఏదైతే అదే అవుతుందని అనుకుని బాబాపై భారం వేసి పడుకున్నాను. పడుకునేముందు బాబాకు నమస్కరించుకుని, “బాబా, అనుకున్న సమయానికి నాకు నెలసరి వస్తే 5 వారాలు నీ దివ్యపూజ చేస్తాను” అని మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి, అంటే శుక్రవారం ఉదయానికి నాకు నెలసరి వచ్చింది. బాబా దయవల్ల ఇక ఇప్పుడు నేను మా ఇంట్లో జరిగే అన్ని కార్యక్రమాలకీ హాజరు కావచ్చని ఎంతో సంతోషించాను. నేను అనుకున్నట్లు జరిగితే నా అనుభవాన్ని వెంటనే బ్లాగులో షేర్ చేసుకుంటానని బాబాకి మాట ఇచ్చినట్లు ఇప్పుడిలా మీతో పంచుకుంటున్నాను. “థాంక్యూ సో మచ్ బాబా!”


మరొక అనుభవం: కోవిడ్ సెకండ్ వేవ్‌ సమయం‌లో మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది. అయితే, బాబా దయవల్ల అందరికీ తగ్గిపోయింది. ఆ తరువాత కొన్ని రోజులకే మావారి డిస్ట్రిబ్యూటర్‌గారి తల్లి మరణించారు. వాళ్ళు కర్నూలులో ఉంటారు. వాళ్ళ పాప మా ఊరిలో చదువుకుంటోంది. ఆ డిస్ట్రిబ్యూటర్ మావారిని సంప్రదించి, వాళ్ళ పాపని తీసుకొచ్చి వాళ్ళ ఊరిలో దించమని అడిగారు. అప్పుడే కోవిడ్ నుండి కొంచెం కోలుకుంటున్న మాకు మావారు ఊరు వెళ్ళడం అసలు ఇష్టం లేదు. కానీ, వెళ్ళక తప్పదు. మావారితో మా బాబు కూడా వెళ్తానన్నాడు. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, “బాబా! మావారు, బాబు ఎలాంటి ఇబ్బందీ రాకుండా ఊరికి వెళ్ళి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో సాటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా దయవల్ల మావారు, బాబు కలిసి ఎలాంటి ఇబ్బందీ లేకుండా డిస్ట్రిబ్యూటర్‌గారి పాపని వాళ్ళ ఊళ్ళో దింపి వచ్చారు. “నా అనుభవాన్ని పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా. మీ ప్రేమ, కరుణ మా అందరిపైనా ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను బాబా. త్వరగా ఈ కరోనాని నాశనం చేయండి బాబా. అది కేవలం మీవల్ల మాత్రమే సాధ్యమవుతుంది బాబా. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి బాబా!”


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


బాబా ఉండగా ఏ కష్టమొచ్చినా భయపడాల్సిన పనిలేదు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా నా జీవితంలో అడుగడుగునా అండగా ఉంటూ పిలచినంతనే 'నేనున్నాను' అని అభయమిచ్చే మన సాయినాథునికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే సాయిబంధువులందరికీ, సచ్చరిత్రకు మరో రూపమైన ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. నేనొక సాయి బిడ్డను. నా పేరు శ్రీదేవి. బాబా ప్రసాదించిన ప్రతి అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా అమ్మ ఆరోగ్య విషయంలో బాబా అనుగ్రహానికి ఆనందిస్తూ వారి కృపను మీతో పంచుకుంటున్నాను. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుండి మా అమ్మ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. తన తలలో నరాలు వీక్ అయి, ఆ కారణంగా కంటికి సంబంధించిన నరాల సమస్య వచ్చి కంటిచూపు మసకగాను, ఒకటే వస్తువు రెండుగా కన్పించటం, నీరసం, ఇలా ఎన్నో సమస్యలతో అమ్మ చాలా బాధపడుతుంది. ఈమధ్య అమ్మను 'శంకర్ కంటి ఆసుపత్రి'లో చూపిస్తే, కంటికి సంబంధించి టెస్టులు చేశారు. అప్పుడు నేను, "రిపోర్టులు నార్మల్ వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల డాక్టరు, "కంటి నరాలలో ఏ సమస్య లేదు. తల నుండి కంటికి అనుసంధానమయ్యే నరాలలో సమస్య ఉంది. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయండి" అని చెప్పారు. దాంతో, "బాబా! అమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో ఎలాంటి సమస్యా లేకుండా చూడు తండ్రి. నీవే మాకు రక్ష బాబా. అమ్మను రక్షించు తండ్రి. తనకి తలలోని నరాల వల్ల, కళ్ళకి వచ్చిన సమస్యలను పూర్తిగా తొలగించు తండ్రీ" అని బాబాకి చెప్పుకుని 2022, ఏప్రిల్ 18న అమ్మని హాస్పిటల్‍‍లో అడ్మిట్ చేసాము. అమ్మకి సెలైన్ పెట్టారు. అరగంట గడిచేసరికి అమ్మకు విపరీతమైన వణుకుతో 103 డిగ్రీల జ్వరం వచ్చింది. అమ్మ తట్టుకోలేక బాబా నామాన్ని స్మరించసాగింది. నాకు చాలా బాధగా అనిపించి, "బాబా! అమ్మకు వెంటనే జ్వరం, చలి తగ్గిపోతే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల కొద్దిసేపటికి అమ్మకి జ్వరం తగ్గి నార్మల్ అయింది. ఆ తరువాత అమ్మ కళ్ళకి సంబంధించి మందు ఎక్కించారు. బాబా దయవల్ల నెమ్మదిగా అమ్మ కంటిచూపు నార్మల్ స్టేజ్‍కి వచ్చింది. డాక్టర్లు, స్టాఫ్ అమ్మ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని చికిత్స చేసారు. బాబా ఉండగా ఏ కష్టమొచ్చినా భయపడాల్సిన పనిలేదు. ఆయనకు మన భారం అప్పగించి, ఆయన నామం చేసుకుంటూ మన కర్తవ్యం మనం చేయాలి. అప్పుడు బాబా సర్వమూ తానై మనల్ని రక్షిస్తారు. "ధన్యవాదాలు బాబా. మీ బిడ్డలందరినీ చల్లగా చూడు తండ్రి".


స్మృతిమాత్ర ప్రసన్నులు సాయి


ఓం స్మృతిమాత్ర ప్రసన్న స్వరూప శ్రీసాయినాథాయ నమః!!!


"ఓం సమర్థ సద్గురు సాయినాథా!!! మీ పాదారవిందములకు సంపూర్ణ శరణాగతి వేడుతూ అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను తండ్రి". ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నా పేరు మల్లేశ్వరి. మాది హైదరాబాద్. నేను సాయి దివ్య ఆశీస్సులతో ఇంతకుముందు ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకున్నాను. ఇపుడు ఇటీవల జరిగిన మరో అనుభవం పంచుకుంటున్నాను. 2022, ఏప్రిల్ 18, ఉదయం నేను బాబాకి దణ్ణం పెట్టుకుని నిద్రలేచాను. కొంతసేపయ్యాక నా చెవి నుండి ఏదో పడుతున్నట్లుగా అనిపిస్తే, ఏదైనా పురుగేమో అని విసిరికొట్టాను. తీరా చూస్తే, ముందురోజు ఫంక్షన్‌కని నా చెవులకు పెట్టుకున్న బంగారు దిద్దుల తాలూకు శీలం లేదు. ఒక్కసారిగా నా గుండె ఝల్లుమంది. వెంటనే బ్లాగులో ఒకామె, 'బంగారు వస్తువులు కనపడితే, బ్లాగులో వ్రాస్తాననుకున్నాన'ని వ్రాసింది. కానీ నేను సిల్లీ విషయాలకు అలా అనుకోకూడదేమో అనుకుని చెవి శీలం కోసం అన్ని గదుల్లో వెతికివెతికి విసిగిపోయాను. తరువాత నాకు తెలియకుండానే, 'బాబా! నా చెవి దిద్దు శీల కనపడితే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. అంతే, అలా బాబాను తలుచుకోగానే, మంచం పక్కనే ఆ శీల పడి ఉండటం నాకు కనిపించింది. నా హృదయం బాబాపట్ల భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. నా సంతోషానికి అవధులు లేవు. "బాబా! మీరు స్మృతిమాత్ర ప్రసన్నులని ఋజువు చేశావు తండ్రి. మీ పాదాలకు శతకోటి వందనాలు బాబా".


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo