1. శ్రీసాయి అనుగ్రహ జల్లులు2. బాబా అనుగ్రహిస్తే అద్భుతాలే
3. మొర ఆలకించిన బాబా
శ్రీసాయి అనుగ్రహ జల్లులు
సాయిబంధువులకు నమస్కారం. ముందుగా, ఈ బ్లాగును క్రియేట్ చేసిన సాయికి ఎంతో కృతజ్ఞతలు. బాబా ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అరుణ. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలతో మీ ముందుకు వచ్చాను.
మా అక్కకూతురు 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు తనకి ఉన్నట్టుండి కడుపునొప్పి, నడుమునొప్పి రావడంతో తనను హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. తనను పరీక్షించిన డాక్టర్ తను రెండు రోజులు హాస్పిటల్లో అబ్జర్వేషన్‌లో ఉండాలని చెప్పారు. మా అక్కకూతురికి వివాహమైన చాలాకాలం తరువాత ప్రెగ్నెన్సీ రావటం వల్ల తనకేమైనా సమస్యవుతుందేమోననే భయంతో మా ఇంట్లోవాళ్ళంతా చాలా టెన్షన్ పడ్డాము. తను హాస్పిటల్లో ఉన్న రెండు రోజులూ నేను తన ఆరోగ్యం కోసం బాబాను ప్రార్థిస్తూ, ‘శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అని జపిస్తూనే ఉన్నాను. అంతేకాదు, ‘అంతా నార్మల్ అయి అక్కకూతురు క్షేమంగా ఇంటికి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకి చెప్పుకున్నాను. బాబా ఆశీస్సులతో ఇప్పుడు ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉంది.
మా మావయ్యగారికి ఆరోగ్యం తరచూ ఇబ్బందిపెడుతుంటుంది. ఇటీవల దగ్గు, గొంతునొప్పి మొదలై ఆయన చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్ని సంప్రదించి ఆయన ఇచ్చిన మందులు ఒక వారంరోజుల పాటు వాడినా తగ్గలేదు. రాత్రిపూట దగ్గు ఎక్కువై చాలా ఇబ్బందిపడ్డారు. నేను మామయ్యగారి ఆరోగ్యం గురించి బాబాను ప్రార్థించి, ‘మామయ్యగారికి దగ్గు తగ్గిపోతే ఆ అనుభవాన్ని బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాన’ని బాబాకు మ్రొక్కుకున్నాను. మ్రొక్కుకున్నరోజు నించి మామయ్యగారికి దగ్గు తగ్గడం ప్రారంభించి, రెండు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా కేవలం బాబా దయవల్ల మాత్రమే జరిగింది.
బాబా ఆశీస్సుల వల్ల మాకు బాబు పుట్టాడు. బాబు మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉండేదాన్ని. పుట్టినరోజు తేదీ సమీపిస్తుండగా మా ఇంటిపేరు ఉన్నవాళ్ళెవరో చనిపోవటంతో వేడుకలకు ఆటంకం ఏర్పడింది. మా అత్తయ్య, మామయ్య ఊళ్ళో ఉండటం వల్ల వాళ్ళకి ఇలాంటి పట్టింపులు చాలా ఎక్కువ. అందువల్ల, పుట్టినరోజు వేడుకలను జరుపుకునే రోజును బాబు పుట్టినతేదీన కాకుండా వేరే తేదీకి మార్చుకుందామని అన్నారు. నేను, మావారు ఏమీ చెప్పలేని పరిస్థితి. అందువల్ల వాళ్ళు చెప్పినదానికి ఒప్పుకుని నిర్ణయించిన తేదీన పుట్టినరోజు వేడుకలు జరుగుతాయని తెలియజేస్తూ తెలిసినవారినందరినీ ఆ వేడుకులకు ఆహ్వానించాము. తీరా అందరినీ ఆహ్వానించిన తరువాత, ‘మన గోత్రీకులలో ఒక పెద్దావిడకి ఆరోగ్యం బాగలేక మంచం పట్టారట’ అని అత్తయ్య చెప్పారు. అందరినీ ఆహ్వానించిన తరువాత ఇలా అవుతుందేమిటా అని మరలా మాకు టెన్షన్ మొదలైంది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! అన్నిటికీ నువ్వే ఉన్నావు, నీదే భారం తండ్రీ. నిన్నే నమ్ముకున్నాను బాబా. నన్ను మాత్రం బాధపడేలా చేయకు. పుట్టినరోజు వేడుకలు చక్కగా జరిగేలా అనుగ్రహించు బాబా” అని వేడుకున్నాను. అలాగే, నా స్నేహితురాలి కోసం కూడా నేను బాబాను ప్రార్థించాను. నా స్నేహితురాలు బాబాకి భక్తురాలు. మా బాబు పుట్టినరోజు వేడుకకు రావాలని నా స్నేహితురాలి కుటుంబం ఎప్పటినుంచో అనుకుంటున్నారు. వాళ్ళు మాకు చాలా దూరంలో ఉంటారు. పుట్టినరోజు వేడుకల కోసం వాళ్ళు మా ఊరు రావాలనుకుంటున్నప్పుడు తన భర్తకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. అయినప్పటికీ నా స్నేహితురాలు నా కోసం తన కుటుంబంతో కలిసి కారులో మా ఊరికి బయలుదేరింది. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా కాపాడమని బాబాను ప్రార్థించి, ‘వాళ్ళు క్షేమంగా వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళంతా క్షేమంగా మా వద్దకు చేరుకున్నారు. ఆ ప్రయాణంలో నా స్నేహితురాలి భర్తకి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆ తరువాత బాబా అనుగ్రహంతో ఆత్మీయులందరి సమక్షంలో బాబు పుట్టినరోజు వేడుక చాలా చక్కగా జరిగింది. “బాబా! నీ దయవల్ల బాబు పుట్టినరోజు వేడుక బాగా జరిగింది. చాలా సంతోషం బాబా. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి బాబా. ఎప్పటినుంచో నాకు రెండు కోరికలు ఉన్నాయి. అవేమిటో మీకు తెలుసు బాబా. మీ మీదే భారం వేశాను. సాధ్యమైనంత తొందరగా నా కోరికలు నెరవేర్చండి. అలాగే, నా కోపాన్ని కూడా అదుపులో ఉంచండి బాబా”.
బాబా అనుగ్రహిస్తే అద్భుతాలే
ఓం శ్రీసాయినాథాయ నమః!!! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయిన శ్రీసాయినాథునికి వేల వేల పాదాభివందనాలు. సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు విజయ. నేను ఈ అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, బాబా మహిమను అందరికీ తెలిపే అవకాశం ఇచ్చినందుకు శ్రీసద్గురు సాయినాథునికి నా పాదాభివందనాలు. నేనొక కాంట్రాక్ట్ ఉద్యోగినిని. అందువల్ల నేను ఆరు నెలలు ఉద్యోగంలో ఉండటం, ఆరు నెలలు ఇంట్లో ఖాళీగా ఉండటం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులలో నేను నా తల్లిదండ్రుల సహకారంతోనూ, నా భర్త సహకారంతోనూ ఉద్యోగ బాధ్యతలను, ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నేను సుమారు 16 సంవత్సరాల నుండి ఈ ఉద్యోగం చేస్తున్నాను. శాశ్వత ఉద్యోగులు వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలా రెండుసార్లు కంపెనీవాళ్ళు నన్ను ఉద్యోగం నుండి తొలగించారు, మరలా బాబా దయవల్ల తిరిగి విధుల్లోకి కూడా తీసుకున్నారు. ఒకసారి ఇలాగే నన్ను ఉద్యోగం నుండి తొలగించినప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకు పోయిన ఉద్యోగం తిరిగి అదే చోటులో దక్కితే ఈ అనుభవాన్ని బ్లాగులో సాటి సాయిభక్తులతో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఇక్కడ బాబా నాకు రెండు అద్భుతాలు చేశారు. అసలు ఖాళీ లేకపోయినప్పటికీ, నేను పనిచేస్తున్న అదే చోటులో, అదే పాత స్థానంలోనే నన్ను కొనసాగించేలా చేసి నా ఉద్యోగాన్ని నిలబెట్టారు. అది చూసి అధికారులు, నా సహోద్యోగులు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు, నేను ఉద్యోగం చేసే చోట ఒక సహోద్యోగిని నా స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నప్పటికీ బాబా దయతో కంపెనీవాళ్ళు నన్ను అదే స్థానంలో కొనసాగించారు. అందుకే, బాబాకు మ్రొక్కుకున్నట్లుగా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటూ బాబాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే, ఇప్పుడు నాతోపాటు పనిచేసే ఉద్యోగిని వల్ల నాకు చిన్నపాటి ఇబ్బంది వచ్చింది. బాబా దయవల్ల ఈ ఇబ్బంది కూడా తొలగిపోతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే, ఆ సహోద్యోగిని కూడా బాబా భక్తురాలే. బాబా ఆమె మనసు మార్చి ఉద్యోగంలో నా యథాస్థానంలో నన్ను కొనసాగించేలా చేస్తారని కోరుకుంటున్నాను. అలా జరగకపోతే నేను చంటిబిడ్డతో అడవులలో ఒక నెలరోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఆపదను కూడా సాయినాథుడు తప్పించి, ఈ బ్లాగులో మళ్ళీ నా అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.
మొర ఆలకించిన బాబా
శ్రీసాయి పాదపద్మములకు నా శతకోటి వందనాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు అర్చన. నేను శ్రీసాయికి ఒక చిన్న భక్తురాలిని. నా స్నేహితురాలు ఎప్పటినుండో ఒక ల్యాండ్ అమ్ముదామని ప్రయత్నిస్తుంటే, ఏవేవో అవాంతరాలు వస్తుండేవి. అప్పుడు నేను, "బాబా! నా స్నేహితురాలి ల్యాండ్ అమ్మకం జరిగితే, ఆ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మాట ఇచ్చాను. తరువాత 20 రోజుల్లో ల్యాండ్ అమ్ముడైపోయిందని నా స్నేహితురాలు నాతో చెప్పింది. బాబా నా మొర ఆలకించినందుకు నేను చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా. కొన్ని సమస్యల వల్ల ఈ అనుభవాన్ని బ్లాగులో ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా. నాకు కొంత మొత్తం డబ్బులు రావాల్సి ఉన్నాయి. అవి త్వరలో వచ్చేలా చేయండి సాయి. నేను అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరిగేలా చూడండి. మీరెప్పుడూ మాకు తోడుగా ఉండండి సాయి".
🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram please cure my urine infection.ladies suffer to this problem.i trust you sai.please bless my husband and children with full life.Be with. Them.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha