1. బాబా తోడుగా ఉంటే, అంతకన్నా అదృష్టమేముంటుంది!!
2. కొంతసేపు అయోమయానికి గురిచేసినా అంతలోనే "నేనున్నా" అని చేయూతనిచ్చిన బాబా
బాబా తోడుగా ఉంటే, అంతకన్నా అదృష్టమేముంటుంది!!
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఒక అసాధ్యమైన పరిస్థితిలో ఎంతో బాధలో ఉండి, "బాబా! నాకు సహాయం చేయండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని ప్రార్థించినంతనే బాబా నాకు సహాయం చేసి చాలా సంతోషాన్ని కలిగించారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు ముందుగా మీతో పంచుకుంటాను. ఒక గురువారంనాడు నేను, మా అక్క పని మీద బయటకు వెళ్తుంటే, గేటు దగ్గర నా చెయ్యి ఎవరో పట్టుకుని వెనక్కి లాగినట్టుగా అనిపించింది. చూస్తే, నా చేతికున్న చాలా విలువైన బాబా బ్రేస్లెట్ తాలూకు చైన్ గేటుకు పట్టుకుని ఉంది. వెంటనే దాన్ని సరి చేసుకుని, "ఇదేమిటి బయటికి వెళ్తుంటే, ఇలా అయింది?" అని కొంచం సెంటిమెంట్‌గా ఫీల్ అవుతూనే తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి ఉండటంతో బాబాకు మళ్లీ దణ్ణం పెట్టుకుని వెళ్ళాము. పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు చేతికి బ్రేస్లెట్ లేకపోవడం చూసి నా గుండె ఆగినంత పనైంది. వెంటనే ఇంట్లో, బయట, కారులో వెతికినా ఆ బ్రేస్లెట్ ఎక్కడా కనిపించలేదు. నాకు ఎప్పటినుండో ఆ చైన్ అంటే చాలా సెంటిమెంట్. నాకున్న ఆరోగ్య సమస్యలకోసం చాలా విలువైన రత్నాలు పొదిగి మరీ చేయించుకున్న చాలా ఖరీదైన వస్తువది. అందులోనూ బాబాది. కాబట్టి అది ఎంతో అమూల్యమైనది. అందువలన నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీరు నా నుండి వేరు కాకూడదు. ఆ బ్రేస్లెట్ నాకెంతో అవసరం. నేను దానిని కేవలం బంగారపు విలువైన వస్తువుగా చూడట్లేదు. అదంటే నాకు ఎంతో సెంటిమెంట్. మీరు ఉన్న వస్తువు. అది కోల్పోతే, నా జీవితంలో అతి ముఖ్యమైన, అతి విలువైన వస్తువుని పోగొట్టుకున్నట్లే. అది దొరకడం అసాధ్యమని నాకు తెలుసు. ఎందుకంటే, అంత విలువైన వస్తువు దొరికితే, ఎవ్వరూ తిరిగి ఇవ్వరు. కానీ మీరు నాతో ఉన్నారు. మీకు అసాధ్యం అనేది లేదు, ఉండదు. మీరు తప్పకుండా నాకోసం మిరాకిల్ చేస్తారని నమ్ముతున్నాను. అది దొరికినట్లైతే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకుని బాబాని తలచుకుంటూ ఉన్నాను.
ఇకపోతే మేము పని మీద చాలా చోట్లకు వెళ్లి రావటం వల్ల ఎక్కడ వెతకాలన్న ఆలోచన కూడా రావట్లేదు. అయినా వెళ్లొచ్చిన ప్రతి చోటుకీ వెళ్లి వెతకడం అంత తేలిక కూడా కాదు. అందువలన దగ్గరలో కొన్ని చోట్ల అడిగినా ప్రయోజనం లేకపోయింది. అందరూ మాకు తెలీదనే అన్నారు. ఒకవేళ తెలిసినా అంత విలువైన వస్తువు వెనక్కి ఇవ్వటమన్నది దాదాపు అనుమానమే. అందుచేత ఎక్కడికి వెళ్ళాలో అర్ధంకాక బాబాకు నా బాధను చెప్పుకుంటూ ఉండగా అక్కతోపాటు ఒక చిన్న షాపులోకి వెళ్ళటం గుర్తొచ్చి, ఏ మాత్రమూ ఆశ లేకున్నా ఊరికే వెళ్లి అడుగుదాం, పోయిందేముందని ఆ షాపుకి అక్క, నేను వెళ్ళాము. మమ్మల్ని చూస్తూనే అక్కడున్న ఒక సేల్స్ గర్ల్ నిర్ఘాంతపోయి ఒకలా చూస్తోంది. ఆమె భావాలను చూస్తుంటే ఎందుకో తెలీదుగానీ తనే చైన్ తీసుంటుందని అనిపించలేదుగాని, అబ్బా... వీళ్ళెందుకు వచ్చారని చూస్తున్నట్లనిపించింది. "క్షమించండి బాబా. ఇలా అనుకోకూడదేమో కానీ, ఆ క్షణం నా మనసుకి అదే అనిపించింది. నిజం మీకు తెలుసు". అదలా ఉంచితే, షాపులో ఆమె పక్కనున్న మరో సేల్స్ గర్ల్ ను మేము చైన్ గురించి అడిగాము. ఆమెకి చెప్పడం ఇష్టం లేకపోయినప్పటికీ తను చెప్పకపోతే, పక్కనున్న ఆమె నిజం చెప్పేస్తుందేమో అన్నట్టు సణుగుతూ, "అది మీదా?" అని నిట్టూర్పుగా అడిగింది. ఇంకా "ఇది బంగారందా? బంగారం అనుకోలేదు, కిందపడిపోతే తీసి పక్కన పెట్టాను. మీదేనా?" అంటూ తప్పనిసరై వెనక్కి ఇచ్చింది. ఈలోపు నా మీద ఎంతో ప్రేమతో తన మొక్కులతో బాబాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ నాతోపాటు వెతకటానికి వచ్చిన మా అక్క ఆమెకు చాలా థాంక్స్ చెప్పి, ఆ చైన్ నాకెంత ముఖ్యమో చెప్పి కొంత డబ్బు ఇవ్వబోయింది. ఆమె మోహమాటంతో తీసుకోలేదు. ఏదేమైనా మా వస్తువు మాకు దొరికినందుకు చాలా సంతోషంగా అనిపించి బాబాకి ఎన్నో వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడినుండి వచ్చేసాము. అంతా ఒక కలలా జరిగిపోయింది. నిజానికి ఆ చైన్ దొరికే అవకాశమే లేదు. కానీ బాబా మమ్మల్ని అదే చోటుకు వెళ్ళేలా ప్రేరణ నివ్వటం, ఆ సేల్స్ గర్ల్ గత్యంతరం లేక ఇక్కడ పడిపోతే తీసి పక్కన పెట్టాను అని చెప్పటం ఇదంతా బాబా మిరాకిల్ తప్ప వేరొకటి కానేకాదు. ఆమె నాకు తెలీదని ఒక్క మాట అనేసి ఉంటే మేమేమీ చేయగలిగేవాళ్ళం కాదు. అలాంటిది బాబా అటువంటి పరిస్థితిని నాకు అనుకూలంగా మలిచి మళ్లీ నా వస్తువును నా దగ్గరకు చేర్చారు. అంత విలువైన వస్తువు వెనక్కి దొరకటం అసాధ్యమైనప్పటికీ బాబా దాన్ని సాధ్యం చేశారు. పిలిచిన వెంటనే నేనున్నాను అని నిదర్శనం చూపించే బాబా ఋణం ఎలా తీర్చుకోగలం? కృతజ్ఞతతో ఆయనకు నమస్కరించి ప్రేమించటం తప్ప!
పై అనుభవం జరిగిన వారం, పదిరోజులకి మా అక్క కుటుంబంతో కలిసి మేమందరం గుడికి వెళ్ళాము. దైవ దర్శనానంతరం బయటకు వచ్చి కూర్చున్నాం. అక్కడ కింద పచ్చగడ్డిలో మా అక్క చెవి ఝుంకా పడిపోవటం మేము చూసుకోలేదు. తీరా గుడి నుండి బయటకు వచ్చాక చూస్కుంటే, అక్క చెవికి ఝుంకా కనిపించలేదు. వెంటనే నేను, "బాబా! ఆ బంగారపు ఝుంకా దొరికేట్టు చేయండి. ఆ రోజు నా చైన్ పోయినప్పుడు అక్క నాకోసం చాలా బాధపడి ఎంతో సహాయం చేసింది. అలాంటి తన వస్తువు పోకూడదు బాబా. అది దొరికితే ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్తించి మేము అంతకుముందు కూర్చున్న చోటుకు వెళ్లి చూస్తే, అక్కడ అక్క ఝుంకా దొరికింది. ఈ రెండు సందర్భాలలోనూ బాబా చాంద్‌పాటిల్‌తో అతని తప్పిపోయిన గుఱ్ఱం విషయంలో అక్కడకి వెళ్లి చూడమని చెప్పడం ద్వారా గుఱ్ఱం జాడ తెలిపినట్లు మా మనసుకు తెలిసేలా చాలా స్పష్టమైన ప్రేరణనిచ్చారు. ఆయన సూచించిన చోటే మా వస్తువులు మాకు దొరికాయి.
ఇంకొకసారి మా అక్క సంగీతానికి సంబంధించి సీనియర్ పరీక్షలకు అటెండ్ కావాల్సి ఉండగా కుటుంబ బాధ్యతల బిజీ వల్ల పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేకపోయింది. అదీకాక కరోనా సమయంలో చాలాసార్లు ప్రాక్టికల్ పరీక్షలు కాన్సిల్ చేసి తేదీలు మార్చి చివరికి హఠాత్తుగా పరీక్షల తేదీని ప్రకటించారు. అందువల్ల అక్క చాలా టెన్షన్‌కి గురై చివరి నిమిషంలో ప్రిపేరేషన్ మొదలుపెట్టింది. ఇంకా 'బాబా తోడుగా ఉన్నారు, భయపడొద్ద'ని ధైర్యం తెచ్చుకుని, "బాబా! ఏదో ఒకలా పరీక్ష గట్టెక్కించండి, మీ దయతో ఈ సంవత్సరం వృధా అవకుండా ఉంటే, అంతే చాలు. అదే జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాకు చెప్పుకుని అక్క పరీక్షకి వెళితే మొదటి టెస్టు తనకే తీసుకున్నారు. కానీ ఎందులో అయితే తను వీక్‌గా ఉందో, ఆ భాగం నుండే తనని ప్రశ్న అడిగారు. సరిగా అదే సమయానికి ఎవరో వచ్చి ఆ ఎగ్జామినర్‌ని డిస్టర్బ్ చేయడం, దాంతో ఆవిడ కాసేపు డైవర్ట్ అయి ఏదో డిస్కషన్‌లో పడటం జరిగాయి. ఇకపోతే టెస్ట్ చేయడానికి చాలామంది ఉండటంతో అక్కని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని ఇబ్బంది పెట్టకుండా వదిలేయటంతో తను ఊపిరి పీల్చుకుని బాబాకు ధన్యవాదాలు చెప్పుకుని సంతోషంగా ఇంటికి వచ్చేసింది. అంతా బాబా మహిమకాక మరేమిటి? ఇలా అన్నింటిలోనూ బాబా తోడుగా ఉంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది! "శతకోటి ధన్యవాదాలు బాబా. మీ ఋణం ఎలా తీర్చుకోగలం తండ్రి? ఎప్పటికీ మా చేయి విడవొద్దు బాబా. మీ నీడలోనే మా జీవితాలు తరించాలి" అని వేడుకుంటూ... మీ అమ్మాయి.
కొంతసేపు అయోమయానికి గురిచేసినా అంతలోనే "నేనున్నా"అని చేయూతనిచ్చిన బాబా
సాయి బంధువులకి వినయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి స్వరూపులకు కృతజ్ఞతాభినందనాలు. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు విజయచంద్ర. మాది పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు నేను పంచుకోబోయే అనుభవం 15 సంవత్సరాల క్రితం శ్రీసాయినాథుడు నాపై చూపిన కృపకు నిదర్శనం. బాబా దయవలన మా పెద్దబాబు శ్రీవత్స సాయికి NTTF బెంగళూరులో సీటు వచ్చింది. ఆ సీటు వచ్చినందుకు, అది కూడా బెంగుళూరులో వచ్చినందుకు మేము ఆనందంతో పొంగిపోయాము. అడ్మిషన్ సమయంలో నేను వెళ్ళాను. తరువాత బాబుకి క్లాసులు ప్రారంభించినపుడు, హాస్టల్లో చేర్చడానికి నా శ్రీమతి వెళ్ళింది. సరిగ్గా నెల తరువాత ఒక అర్ధరాత్రి బెంగుళూరు హాస్టల్ నుండి ఆ హాస్టల్ వార్డెన్ మాకు ఫోన్ చేసి, "మీ అబ్బాయికి చాలా సీరియస్ గా ఉంది" అని చెప్పారు. మేము ఉండేది ఏలూరులో. ఆ రోజుల్లో వెంటనే అర్ధరాత్రివేళ బెంగుళూరుకు బయలుదేరే పరిస్థితి లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఎంత భక్తి, నమ్మకం ఉన్నా మనిషి భయబ్రాంతులకు లోనై విచక్షణ కోల్పోతాడు. దానికి ఉదాహరణ నేనే. ఇంట్లో బాబా పటం ముందు కూర్చొని, "ఓ బాబా..! నిరంతరం నిన్నే తలుస్తూ, పూజ, పారాయణాలు చేస్తాను కదా! మీకు ఇంత కూడా దయలేదా? పరిస్థితి చాలా సీరియస్‍గా ఉంది. నేను ఇప్పుడు ఎలా అక్కడికి వెళ్ళాలి? అసలు నువ్వున్నావా? నిన్నే నమ్ముకున్న నన్ను బాధపెట్టడం నీకు తగునా చెప్పు" అని పెద్దగా అరుస్తూ, "'నువ్వు లేవు" అని ఆయన పటం తీసే ప్రయత్నం చేస్తూ పరమ మూర్ఖుడిలా ప్రవర్తించాను. తీవ్రమైన భయాందోలనలతో గంటకు పైగా నా దరిద్రపు వాగుడు కొనసాగించాను. మనం పామరులం, ఎమోషనల్ ఇడియట్లం, కంగారుపడడం మన నైజం కదా మరి. మన దేవుడు, మనకు సర్వస్వం అయిన బాబా నా ఉక్రోషం చూసి నవ్వుకున్నారేమో! సరిగ్గా గంటన్నర తరువాత మా అబ్బాయి ఫోన్ చేసి, "నేను బాగానే ఉన్నాను. మా వార్డెన్ శ్రీకాంత్ అనే అబ్బాయి తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి బదులు మీకు ఫోన్ చేసార"ని చెప్పాడు. అది విని నా మనసు ప్రశాంతించింది. మన బాబా ఎంతటి మహిమాన్వితులో కదా! మనని కొంతసేపు అయోమయానికి గురిచేసినా అంతలోనే "నేనున్నా" అని చేయూతనిస్తారు. ఇదంతా ఇప్పుడు వ్రాస్తుంటే గగుర్పాటు కలుగుతుంది, ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంది. ఈ అనుభవం ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే, బాబా అండ మనకుంటే మనం భయాందోళనలు చెందనవసరం లేదని. బాబాని నమ్మినవారికి ఏ కష్టమూ ఉండదు. ఇది సత్యం, ముమ్మాటికీ నిజం. సాయి నామస్మరణే మనకు రక్ష. చివరిగా ఒక మాట, బాబా దయవల్ల మా అబ్బాయి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు.
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
బాబాని నమ్మిన వారికి ఏ కష్టం రాదు.బాబా అండ దండలు వుంటే భయాందోళనకు తావు లేదు అని రాశారు నా కు చాలా చాలా నచ్చిన మాటలు. నిజమే మనం మానవులం.మన మనసు వినదు.నేను చెడు ఆలోచన లను విడవడానికి చాలా ప్రయత్నం చేస్తున్న కానీ నా వల్ల అవటం లేదు. రోజు సాయి సహాయం చేయమని అడుగు తాను. ఎప్పటికైన నాలో మారుతున్న ఆలోచన లను కలిగించు అని వేడుకుంటున్నాను.ఓం సాయీశ నీ దయ చూపించు
ReplyDeleteతండ్రి నా కడుపు నొప్పి తగ్గించు.వైద్యం చేసిన తర్వాత తగ్గలేదు. ఇంక సాయి ని నమ్మకం పెట్టు కొని ఊదీ నీటి తో తాగుతాను.రోజు ఊదీ నుదుటను పెట్టి దండం పెడతాను. ఆరోగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాను
ReplyDelete🙏🕉️✡️🙏 సాయిబాబా.. నీ మహిమలు అద్భుతం.. సాయి సాయి అనే అమృత మైన నీ నామం సుమధురం.. ఊది తో నయం కాని వ్యాధులు అనేవి లేనేలేవు.. ఆది వ్యాధులు సైతం సాయిబాబా వారి ఊది విభూతి తో నయం అవుతాయి అనే దానికి మేము సాక్షులం.. సాయిరాం నీవే కలవు నీవే తప్పా మాకు ఎవరూ లేరు ఈభువిలో.. జై సాయిరాం జై జై జై సాయిరాం థాంక్యూ థాంక్యూ సాయిరాం
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete