1. చెప్పుకున్నంతనే సమస్యలను పరిష్కరించిన బాబా2. సాయినాథుని సహాయం
3. కంటి ఎర్రదనం తగ్గించిన బాబా
చెప్పుకున్నంతనే సమస్యలను పరిష్కరించిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు రేవతి. ఏదో అనుభవం ఈ బ్లాగులో పంచుకుంటాను అనుకుని, మరిచిపోయానని నాకనిపించి, దాన్ని గుర్తు చేయమని బాబాను అడిగాను. బాబా దాన్ని గుర్తు చేశారు. ఆ అనుభవంతోపాటు ఈ మధ్యనే జరిగిన మరో అనుభవం కూడా నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మా అమ్మ కాళ్లనొప్పులతో ఇంట్లో పనులు చేయలేకపోతుంది. మేము పనిమనిషికోసం చూస్తుంటే, సంవత్సరకాలంగా ఎవరూ దొరకలేదు. ఎలాగోలా ఇంతకాలమూ అమ్మ పనులు చేసుకుంటూ వచ్చింది. ఇలా ఉండగా ఈమధ్య అమ్మ వాళ్ళింటి వెనక భాగంలో స్లాబ్ పనులు మొదలుపెట్టారు. దాంతో అమ్మకి పనులు ఎక్కువయ్యాయి. ఒకరోజు అమ్మ నాకు ఫోన్ చేసి, 'పనులు చేసుకోలేకపోతున్నాన'ని చాలా బాధపడింది. అప్పుడు నేను బాబాతో, "బాబా! మా అమ్మకు ఒక మంచి పనిమనిషి దొరికేలా అనుగ్రహించండి. అదే జరిగితే, నేను ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తరువాత అమ్మవాళ్ల ఊర్లోనే ఉన్న మా పిన్నికి ఫోన్ చేయాలనిపించి, ఫోన్ చేసి విషయం చెప్పాను. పిన్ని వెంటనే ఒకామెను పిలిచి, "రేపటి నుంచి మా అక్క వాళ్ళింట్లో పనికి వెళ్ళు" అని చెప్పడం, అందుకామె ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. మరుసటిరోజు నుండి ఆమె అమ్మవాళ్ళ ఇంటికి వెళ్లడం మొదలుపెట్టి చక్కగా పని చేసుకుంటుంది. బాబాకు మ్రొక్కుకున్న గంటలోపలే పిన్ని ద్వారా మా అమ్మవాళ్లకు ఒక మంచి పనిమనిషిని ఏర్పాటు చేసి, అమ్మ కష్టాన్ని చాలావరకు తొలగించారు బాబా. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేము".
ఇటీవల మా ఇంటికి సంబంధించి పగిలిన అద్దాల పని పూర్తి చేసాము. అందులో భాగంగా ఇంటి ముందున్న మా స్థలంలో బండి పెట్టుకోవడానికి చిన్న రేకుల షెడ్డు కూడా వేయించాము. ఆ విషయంలో మాకు మా ఇంటిని అమ్మిన ఆవిడ మేము మా స్థలం దాటి ముందుకు వచ్చేసాము అంటూ మాతో గొడవకు దిగింది. అప్పుడు నేను, "ఏ తప్పు చేయకుండా ఆవిడతో మాట్లాడటం ఏంటి బాబా? ఎలాగైనా ఈ గొడవను మీరే పరిష్కరించాల"ని బాబాను వేడుకున్నాను. తర్వాత మావారు మా వీధిలోనే ఉన్న ఒక పెద్దమనిషికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ పెద్దమనిషి వచ్చి ఆవిడతో, "వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటే నీకేంటి సమస్య?" అని బాగా బుద్ధి చెప్పారు. "ధన్యవాదాలు బాబా. ఈ గొడవ ఎలా తీరుతుందా అని భయపడ్డాను. కొన్ని గంటల్లోనే మీరు ఈ సమస్యను పరిష్కరించారు బాబా. థాంక్యూ సో మచ్ బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయినాథుని సహాయం
శ్రీసాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి. నేను ఇదివరకు మూడు అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు నాలుగవసారి నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. కరోనా తరువాత తిరిగి స్కూళ్ళు తెరిచాక పిల్లల్ని స్కూలుకి పంపాలంటే నాకు చాలా భయంగా ఉండేది. కానీ తప్పనిసరిగా పెద్దబ్బాయిని స్కూలుకి పంపాల్సిన పరిస్థితి. కానీ తనని స్కూలుకి పంపాలంటే, మేమెక్కడ కరోనా వల్ల బాధపడాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉండేది. ఎందుకంటే, అదివరకే మా కుటుంబం కరోనా వల్ల చాలా బాధపడింది. అందువలన నేను, "బాబా! స్కూలుకు వెళ్లే మా అబ్బాయి స్కూళ్ళు అయిపోయేవరకు కరోనా రాకూడదు. అలా రాకుంటే, ఈ బ్లాగులో పంచుకుంటాను" అని సాయినాథునికి చెప్పుకున్నాను. ఆ తండ్రి దయవల్ల మా అబ్బాయికి కరోనా రాలేదు. ఒకరోజు వాడికి జలుబు చేస్తే, ఊదీ పెట్టాను. పొద్దున్నకల్లా తనకి జలుబు తగ్గిపోయింది. అలాగే ఎప్పుడూ బస్సులో మా దగ్గరకి వస్తూపోతుండే మా అమ్మకి రానూపోనూ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవల్ల అమ్మకి ప్రయాణంలో ఎప్పుడూ ఏ ఇబ్బంది కలగలేదు, తన ప్రయాణం బాగా జరిగేది. ఈ మధ్య మా చెల్లికి జెర్రి కుట్టింది. చాలా నొప్పిగా ఉంటుందని నేను బాబా ఊదీ నీళ్లలో కలిపి తనకి త్రాగమని ఇచ్చి, మరికొంత ఊదీ ఆ జెర్రి కుట్టినచోట రాశాను. బాబా దయవల్ల తనకి ఏ నొప్పీ లేదు. ఇప్పుడు తనకి బాగానే ఉంది. ఇలాగే చాలా సమస్యల విషయంలో సాయినాథుడు నాకు సహాయం చేస్తున్నారు. "థాంక్యూ సో మచ్ సాయినాథా" .
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
కంటి ఎర్రదనం తగ్గించిన బాబా
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు గీత. మాది చిత్తూరు జిల్లా. దయామయుడైన సాయి మాకు ఎన్నో మంచి అనుభవాలను ప్రసాదించారు. అందులో ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2022, జనవరి నెలలో మా ఊరి శివాలయంలో వినాయక, షణ్ముఖ, అయ్యప్పస్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం జరిగింది. అయ్యవార్లకు మా ఇంట్లోనే బస ఏర్పాటు చేసాము. మేమందరం దగ్గర ఉండి ఆ కార్యక్రమానికి సంబంధించిన పనుల్లో పాల్గొన్నాము. తొలిరోజు హోమాలు పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాక చూసుకుంటే, పొగ వల్లనో, మరే ఇతర కారణాల వల్లనోగాని నా కళ్ళు బాగా ఎర్రగా అయ్యి కళ్ళనుండి నీరు కారుతున్నాయి. నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని, "బాబా! మీ ఊదీని నా కళ్ళకు రాసుకుని పడుకుంటాను. మీ దయతో ఉదయం నిద్రలేచేసరికి నాకు నయమవ్వాలి" అని బాబాను వేడుకుని పడుకున్నాను. మరుసటిరోజు ఉదయం నిద్ర లేవగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే, నా కళ్ళు చాలావరకు బాగయ్యాయి. కార్యక్రమం మంచిగా పూర్తయింది. ఆ సాయినాథునికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాను.
శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteఓం శ్రీ సాయి నాధాయ సద్గురువే నమః
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤
ReplyDeleteom sai ram
ReplyDeleteom sai ram please change my bad thoughts into good thoughts.i pray to you to help in this problem.you are my father.om sai ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete