ఈ భాగంలో అనుభవాలు:
1. ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ సంతోషంగా చూసుకుంటున్న బాబా
2. బాబా అందరివాడు - ఎవ్వరు ఏది అడిగినా ఇస్తారు
3. సాయి దయతో చెల్లెమ్మకు కొడుకు
ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ సంతోషంగా చూసుకుంటున్న బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయితండ్రికి నా శతకోటి వందనాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి భక్తులకు నా నమస్కారాలు. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య అంటే 2022, మార్చిలో మేము తిరుమలకి వెళ్లాలని నిర్ణయించుకుని బస్సులో వెళ్లేందుకు టికెట్లు బుక్ చేయించుకున్నాము. మాతో ఇద్దరు పిల్లలు ఉన్నందున నేను బాబాతో, "బాబా! మా తిరుమల ప్రయాణం సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా జరిగేటట్లు చూడండి. దర్శనం విషయంలో ఆలస్యం లేకుండా బాగా తృప్తిగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల నా ప్రయాణం, శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చాలా బాగా, సంతోషదాయకంగా జరిగాయి. "థాంక్యూ బాబా".
మా బాబుకి మార్చి నెల చివరిలో అమ్మవారు పోసింది. ఇంట్లో చిన్నపాప ఉన్నందున నాకు చాలా భయమేసి, "బాబా! బాబుకి త్వరగా తగ్గిపోయేలా చూడండి. అలాగే పాపని, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పుకున్నాను. బాబుకి ఐదు రోజుల్లో చాలావరకు తగ్గి, తొమ్మిదో రోజుకి పూర్తిగా నార్మల్ అయిపోయాడు. మాకు కూడా ఏ ఇబ్బంది కలగలేదు. బాబా దయవల్లనే మా బాబు త్వరగా కోలుకున్నాడు. అయితే అమ్మవారు తగ్గాక బాబు ఒంటిమీద గడ్డలు లేచి బాధపడ్డాడు. అవి చాలారోజుల వరకు తగ్గలేదు. అప్పుడు నేను బాబాతో, "బాబా! బాబుకి పరీక్షలు మొదలయ్యేసరికి తన ఆరోగ్యం బాగయ్యేలా చూడండి. అలా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవలన ఆ గడ్డలు త్వరగా తగ్గిపోయాయి.
ఉగాది రోజు నుంచి మా నాన్న ఒంటి మీద సర్పితో చాలారోజులు ఇబ్బందిపడ్డారు. నాకు భయమేసి, "బాబా! నాన్నకి త్వరగా తగ్గిపోయేలా చూడు తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయతో నాన్నకు సర్పి తగ్గింది కానీ, నొప్పులు తగ్గలేదు. అందువల్ల స్కానింగ్ తీయించుకోవాలని నాన్న హాస్పిటల్ కి వెళ్లారు. అప్పుడు నేను, "బాబా! స్కానింగ్ లో అంతా నార్మల్‍గా ఉండాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన రిపోర్టులో ఏమి ఇబ్బంది లేదని వచ్చింది. డాక్టరు కొన్ని మందులు రాసి పంపించారు. నాన్న ఇప్పుడు ఆ మందులు వాడుతున్నారు. బాబా దయతో నాన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మనం బాబాతో ఏవైనా కోరికలు చెప్పుకుని, బ్లాగులో పంచుకుంటామని చెప్పుకుంటే, బాబా ఖచ్చితంగా వింటారు, తప్పకుండా మన కోరికలను తీరుస్తారు. ఎన్ని సమస్యలున్నా బాబాతో చెప్పుకుంటే చాలా ఊరటగా ఉంటుంది. ఆయన మా ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ మమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నారు. "బాబా! మీకు నా కోరిక ఏంటో తెలుసు. దయచేసి దానిని త్వరగా తీరేలా చూడు తండ్రి. అయినా ఏది, ఎప్పుడు, ఎలా జరగాలో మీకు తెలుసు. ప్లీజ్ బాబా మా జీవితానికి ఒక ఆధారం చూపించు తండ్రి. ఇంకా మా అత్తగారివాళ్ళతో ఉన్న సమస్యలు కూడా త్వరగా తీరిపోయేలా చూడు బాబా. అలాగే అందరూ సంతోషంగా ఉండేలా చూడు తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జైజైజై!!!
బాబా అందరివాడు - ఎవ్వరు ఏది అడిగినా ఇస్తారు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, నా పాలిట రక్షకుడు, మా ఇంటి ఇలవేల్పు అయిన మా సాయినాథునికి పాదాభివందనాలు. సాయి బంధువులందరికీ నమస్కారాలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని బ్లాగులో పంచుకునే అవకాశమిచ్చిన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహకులకు కృతజ్ఞతలు. నా పేరు విద్యారాణి. మావారి పేరు బాలకృష్ణ. మాకు ఇద్దరు పిల్లలు రంగినేని విహాన్, రోహన్. బాబా ఆశీస్సులతో మేము ఈ మధ్యకాలంలో ఒక ఫ్లాట్ తీసుకున్నాము. అయితే ఆ సమయంలో మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేనందున అప్పు చేసి మరీ ఆ ఇల్లు కొన్నాము. అప్పటినుంచి నేనుకానీ, మావారుకానీ సంతృప్తిగా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. కారణం చేసిన అప్పు ఎలా తీర్చాలన్న ఆందోళన. బాబా దయతో అంతా మంచిగా ఉంటుందని అనిపిస్తున్నప్పటికీ లోపల అప్పు ఎప్పుడు తీరుతుందో, వడ్డీలు కట్టలేకపోతున్నామని ఏదో టెన్షన్‍గా ఉండేది. అదలా ఉంచితే, నేను చిట్టీ వ్యాపారం చేస్తాను. అందులో నాకు చాలా నష్టం వచ్చింది, చాలామందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ మా దగ్గర డబ్బులేదు. ఇటువంటి పరిస్థితుల్లో 2022, మే నెల మొదటివారంలో నేను బాబాను, "బాబా! ఈ నెలలో డబ్బులకి చాలా టైట్‍గా ఉంది. చిట్టీల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇంటి అప్పు తీర్చాలి. కానీ నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. మీరే నన్ను రక్షించాలి. మీ దయతో అంతా సవ్యంగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, బాబా నా బిజినెస్ మీద లోన్ పెట్టేలా నాకు ప్రేరణనిచ్చారు. ఆయన దయతో లోన్ సాంక్షన్ అయింది. ఆ డబ్బులతో కొంత అప్పు తీర్చి, మరికొంత చిట్టీల వాళ్ళకి ఇచ్చి టెన్షన్ నుండి 60% ఉపశమనం పొందాను. బాబా నా ఫ్రెండ్. నాకు ఎప్పుడు ఏది కావాలో దాన్ని నా దగ్గరికి పంపిస్తారు. ఆయన అందరివాడు. ఎవ్వరు ఏది అడిగినా సరే ఇస్తారు. అదీ నా బాబా. ఆయన నాకు విలువైనదిచ్చి నేను తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. "ధన్యవాదాలు బాబా. నేను ఎన్నటికీ మిమ్మల్ని మరువను తండ్రి. మీ దయతో ఇప్పటివరకైతే బాగుంది. లోన్ తీసుకున్నాను. కానీ ఏదో టెన్షన్‍గా ఉంది. నెలకు లక్షకు పైన EMI కట్టాలి. ఆ స్థోమతను నాకు ఇవ్వండి. ఇంకా నేను చాలా నష్టపోయాను. ఆ నష్టమంతా తిరిగి పూడ్చుకోవాలి. అలాగే నాకున్న మరి కొన్ని కోరికలు కూడా నెరవేరితే, నా అనుభవాన్ని ఖచ్చితంగా బ్లాగులో పంచుకుంటాను. మీరు నాపై దయ ఉంచి, ఎల్లవేళలా నాతో ఉంటూ నన్ను సంరక్షించండి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు కావాలి బాబా. లవ్ యు బాబా".
సాయి దయతో చెల్లెమ్మకు కొడుకు
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు సాయిరాజ్ కుమార్. మాది వరంగల్. నేను గతంలో మన ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. 24 ఏళ్ళ కిందట మా అమ్మ చనిపోయింది. నాన్న 2019వ సంవత్సరంలో చనిపోయారు. అప్పటినుంచి చెల్లికి పెళ్లికాలేదన్న బాధ మాకు ఎక్కువగా ఉండేది. తను కూడా సాయిబాబా భక్తురాలు. మేము, "బాబా! మీ దయతో చెల్లికి పెళ్ళై కొడుకు పుడితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాము. శ్రీసాయినాథుని దయతో చెల్లికి పెళ్ళై, ఆయన వరప్రసాదంగా 2022, ఏప్రిల్ 15న చెల్లి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతా సవ్యంగా జరగడానికి ఆ శిరిడీ సాయినాథుని అపార అనుగ్రహమే ప్రధాన కారణం. ఇలా అమ్మానాన్న లేని మాకు శ్రీసాయినాథుడే అమ్మానాన్నగా ఉండి నడిపిస్తున్నారు. "హృదయపూర్వక కృతజ్ఞతలు సాయీశ్వరా".
