సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2136వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్న భక్తులను ఎల్లవేళలా కాపాడే బాబా
2. ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేకుండా రక్షించిన సాయినాథుడు

నమ్ముకున్న భక్తులను ఎల్లవేళలా కాపాడే బాబా

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్. 2026, సెప్టెంబర్‌లో నేను శిరిడీ వెళ్ళాను. బాబా దర్శనం బాగా జరిగింది. నేను ఎప్పుడు శిరిడీ వెళ్లినా లోకల్ టెంపుల్స్‌కి, పారాయణ  హాల్‌కి వెళ్లడం నాకలవాటు.  తిరిగి వచ్చే రోజు ఉదయం బాబా దర్శనం చేసుకుని, బయటకు వచ్చాక బూందీ ప్రసాదం తీసుకుని పారాయణ హాల్‌కి వెళ్ళాను. అక్కడ కొంతసేపు కూర్చుని బాబా నామస్మరణ చేస్తూ చేతిలో ఉన్న బూందీ ప్యాకెట్ పక్కనున్న కుర్చీలో పెట్టాను. ఆఖరిలో బాబా చిత్రపటం దగ్గరకు వెళ్లి దణ్ణం పెట్టుకుని, ప్రసాదం తీసుకుని గుమ్మం దాటి బయటకు వస్తుంటే, చేతి నుండి ఏదో పడినట్టు అనిపించింది. ప్రసాదం కవర్ చిరిగిపోయిందేమో అని కంగారుపడ్డాను. కానీ చూస్తే, ఆ ప్రసాదం కవర్ బాగానే ఉంది. నేను ఎప్పుడూ ప్రసాదం కవర్‌ను మడత పెడతాను. ఆ మడతలో చాలా చక్కెర గోలీలు ఉన్నాయి. వాటిని చూసి బాబా నన్ను కరుణించారని సంతోషపడ్డాను. 

2018, జనవరి నెలలో నేను, నా స్నేహితుడు శిరిడీ ప్రయాణం పెట్టుకున్నాం. అయితే ప్రయాణానికి 10-14 రోజుల ముందు మా నాన్న తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. దాంతో శిరిడీ వెళ్లగలనో లేదో అని అనుమానం వచ్చింది. కానీ బాబా దయవల్ల వారం లోపే నాన్న కోలుకుని ఇంటికి వచ్చేశారు. ఇంట్లోవాళ్ళు, "మరేమీ పర్వాలేదు. బాబా దర్శనం చేసుకునిరా" అన్నారు. సంతోషంగా నేను, నా స్నేహితుడు శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాం. మా తిరుగు ప్రయాణానికి వెయిటింగ్ లిస్టులో ఉన్న 2ఏసీ టిక్కెట్లు కన్ఫర్మ్ అవుతాయో, లేదో అని భయపడ్డాం. కానీ బాబా లీల చూడండి. ఆయన మమ్మల్ని 1ఏసీకి పంపారు. బాబాను నమ్ముకుంటే, ఏ ఇబ్బందీ లేకుండా ఆయనే చూసుకుంటారు.

ఇప్పుడు 20 సంవత్సరాలకు పూర్వం జరిగిన సంగతి చెప్తాను. మా కుటుంబ సభ్యులందరం శిరిడీ యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ రావడానికి నగర్సోల్ స్టేషన్‌కి బయలుదేరాం. అయితే అప్పటికే బాగా అలసమైంది. వాహనాలన్నీ నగర్సోల్‌కి ఎప్పుడో వెళ్లిపోయాయి. అందువల్ల మాకు వాహనాలు దొరకలేదు. దాంతో ట్రైన్ అందుతుందో, లేదో అని మాకు ఒక్కటే కంగారుగా అనిపించింది. అప్పుడు బాబాని తలుచుకుంటే, ఆయన దయవల్ల ఒక మారుతి ఓమ్ని వ్యాన్ దొరికింది. మేము స్టేషన్ దగ్గరకు వెళ్లేసరికి ట్రైన్ వచ్చేసింది. వ్యాన్‌లో మా సామాన్లు ఎక్కువగా ఉన్నందువల్ల సహాయం కోసం మనిషి ఉంటే బాగుంటుందనుకున్నాం. అంతలో ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి చకచకా మా సామాను వ్యాన్ నుండి దించి రైలు కోచ్‌లో పెట్టారు. మేము వెళ్ళి రైలు ఎక్కుతూనే రైలు కదిలింది. ఇది బాబా లీల కాకపోతే ఇంకేమిటి? ఎందుకలా అంటున్నానంటే, అప్పట్లో అక్కడ జనసంచారం తక్కువ. ప్రయాణికులంతా రైలు ఎక్కేసారు. ప్లాట్ఫారం అంతా ఖాళీగా ఉంది. మరి ఆ ఇద్దరు కుర్రోళ్లు ఎక్కడినుండి వచ్చారు. బాబానే పంపి ఉంటారు! బాబా మమ్మల్ని ఎప్పుడు కాపాడుతారనడానికి నిదర్శనం ఈ అనుభవం. "ధన్యవాదాలు బాబా. మీ చల్లని చూపు ఇలానే మా కుటుంబ సభ్యులందరిపై ఉంచు తండ్రీ. జన్మజన్మలకు నేను మీ భక్తుడిని అయి, మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించు తండ్రీ"..

ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేకుండా రక్షించిన సాయినాథుడు

సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను 15 సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ స్కూలు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్నాను. 2025వ సంవత్సరం మధ్యలో మా స్కూలు యాజమాన్యం(Management) మారింది. కొత్తగా వచ్చిన యాజమాన్యం 2026, మే నెలలో ఒక ముగ్గురిని ఉద్యోగం నుండి తీసేసారు. తర్వాత జూన్ నెలలో ఒక అమ్మాయిని ఉద్యోగంలోకి తీసుకొని నాకు అసిస్టెంట్‌గా నియమించి, తనకి వర్క్ నేర్పించమని అన్నారు. ఆ అమ్మాయి ఆఫీసులో చేరినప్పటి నుంచీ నా మనసులో ఉద్యోగం పట్ల ఒక రకమైన అభద్రతా భావం(Insecurity feeling) మొదలైంది. అందుకు తగ్గట్టే కొంతమంది స్టాఫ్, "ఆరు నెలల తర్వాత పాత సిబ్బందిని తీసేసి, కొత్తవారిని తీసుకుంటారు" అని చెప్పారు. దాంతో నా భయం మరింత ఎక్కువైంది. ఎందుకంటే,  నా ఉద్యోగమే నా కుటుంబానికి ఏకైక జీవనాధారం. అందుకని నేను బాబాని, "ఆ అమ్మాయి తనంతటతానే మానేసేలా చూడామ"ని ప్రార్థించి నా విధులు నేను నిర్వర్తిస్తూ ఆమెకు పని నేర్పుతూ ఉండేదాన్ని. కానీ ఆ అమ్మాయి ఏ పనీ చేసేది కాదు. మాటలు ఎక్కువ, పని తక్కువ. తను ఏదైనా తప్పు చేస్తే, అది తప్పు అంటే, "నేను చెయ్యను, మీరే చేసుకోండి" అని అనేది. అసలు ఆమె రాకతో నాపై పనిభారం మరింత ఎక్కువైంది. విషయం మేనేజ్‌మెంట్‌కు చెబుదామంటే, ఆ అమ్మాయంటే నాకు ఇష్టం లేనందుకే ఇలా చెప్తున్నానని అనుకుంటారేమో అని మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే,  మేనేజ్‌మెంట్ ఆమెకు ప్రాధాన్యత ఇచ్చేది. అది చూసి నా మనసుకి ఎంతో బాధగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో నేను, 'నాకు ఈ స్కూలులో ఇంతవరకే ఋణం ఉందేమో! ఒకవేళ ఈ ఉద్యోగం పోయినా బాబా నాకోసం మరో మంచి ఉద్యోగాన్ని సిద్ధంగా ఉంచుతారు. నా జీవనాధారానికి ఆయన ఏ లోటు చేయరు' అని ఒక నిర్ణయానికి వచ్చి నా మనసులోని అభద్రతా భావాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాను. ఇకపోతే, మూడు నెలలైనా ఆ అమ్మాయి సరిగా వర్క్ నేర్చుకోలేదు. పైగా పర్మిషన్లు, సెలవులు ఎక్కువగా తీసుకుంటూ నిర్లక్ష్యంగా ఉండేది. ఇదంతా గమనించిన యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుండి తొలగిస్తామని ఒక నెల నోటీసు పీరియడ్ ఇచ్చింది. అయినా ఆమెలో మార్పు రాకపోయేసరికి ఆమెను పూర్తిగా ఉద్యోగం నుండి తీసేసారు. నేను కోరుకున్నట్లు ఆమెకై ఆమె మానేసి వుంటే యాజమాన్యానికి నాపై అనుమానం వచ్చేదేమో! ఏదేమైనా నా మనసులోని ఆందోళనలను, భయాలను తొలగించి నా ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేకుండా రక్షించిన ఆ సాయినాథునికి శతకోటి ధన్యవాదాలు. "బాబా! నా కూతురికి సంతానాన్ని ప్రసాదించు తండ్రీ. దయచేసి నీ చల్లని చూపు మాపై ఉంచు".

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo