సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2134వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయినాథునితో ప్రయాణం 


ముందుగా శ్రీసాయినాథుని చరణాలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. సాయి బంధువులందరికీ ప్రేమపూర్వక వందనాలు. నా పేరు కళ. 2023లో నేను బాబాకి భక్తురాలినయ్యాను. ఆ బంగారు తండ్రి నా జీవితంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లోనే నాకు ఇచ్చిన అనుభవాలు, అవకాశాలు, అదృష్టం మాటల్లో చెప్పలేనివి. ఒకసారి నా సిస్టర్‌కి ఒక సమస్య వచ్చింది. ఆ విషయంగా నేను ఆందోళనలో ఉన్నప్పుడు, ఒకరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో బాబాకు సంబంధించిన ఒక పోస్ట్ కనిపించింది. అందులో “నువ్వు ఏమీ భయపడకు, అంతా సర్దుకుంటుంది” అనే భావం వచ్చేలా సందేశం ఉంది. ఆ సందేశం నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. బాబా నా ఆందోళనను అర్థం చేసుకుని, నాకు ధైర్యం చెబుతున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత బాబా చెప్పినట్లే ఒక గురువారంనాడు మా సిస్టర్‌ సమస్య పరిష్కారమైంది. ఆందోళనలో ఉన్నప్పుడు ఆ సందేశం ద్వారా ధైర్యం లభించడం, ఆ తర్వాత సమస్య పరిష్కారం కావడం అంతా బాబా అనుగ్రహం. ఈ అనుభవం ద్వారా నాకు బాబాపట్ల మరింత నమ్మకం కలిగింది.

నేను ఈ మూడేళ్ళలో మూడుసార్లు శిరిడీ సందర్శించాను. అందులో మొదటి శిరిడీ ప్రయాణం నా జీవితంలో మరపురాని సాయి అనుగ్రహం. ఎందుకంటే, నేను మొదటిసారి నా పుట్టినరోజు సమయంలో శిరిడీ వెళ్ళాను. అలా పుట్టినరోజునాడు శిరిడీలో ఉండటం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆరోజు సమాధి మందిరంలో బాబా దర్శనానంతరం గురుస్థానం వద్ద నేను సాయి నామ జపం చేసుకుంటూ, 'స్వామి ప్రసాదించిన ఒక వేపాకు దొరికితే, ఎంత బాగుంటుంది!' అని అనుకుంటూ ఉన్నాను. అంతలో నా వెనుక ఉన్న ఇద్దరు చిన్న అమ్మాయిలకి ఒక వేపాకు కనపడితే, “నాకు కావాలి… నాకు కావాలి” అంటూ చిన్నగా ఇద్దరూ వాదించుకున్నారు. చివరికి ఆ వేపాకును తీసుకొచ్చి నాకు ఇచ్చారు. వెంటనే నా ఫ్రెండ్, “నీకు బాబా ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ అనుకుంటా!” అని అన్నారు. ఆ క్షణం నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. బాబాను ఏమీ అడగకపోయినా, నా మనసులో అనుకున్న చిన్న కోరికను కూడా తమదైన శైలిలో తీర్చారనిపించింది.

నేను ఈ మూడు సంవత్సరాల్లో నేను 10సార్లు సాయి సచ్చరిత్ర, 4సార్లు గురుచరిత్ర పారాయణ చేశాను. అందులో ఒకసారి ఏకంగా శిరిడీలోనే 3 రోజులు సచ్చరిత్ర పారాయణ చేసుకొనే భాగ్యాన్ని నా తండ్రి బాబా నాకు ప్రసాదించారు. నేను రెండు రకాలుగా పారాయణ చేస్తాను. ఒకటి, ఏడు రోజుల పారాయణ. రెండవది, సచ్చరిత్ర ఫలశ్రుతిలో చెప్పినట్లుగా శ్రీరామనవమి, గురుపౌర్ణమి, విజయదశమి వంటి పర్వదినాల్లో ఒక్క రోజు పారాయణ. ఆ క్రమంలో నేను ప్రతి సంవత్సరం విజయదశమినాడు 'శ్రీసాయి సచ్చరిత్ర', గురుపౌర్ణమినాడు 'గురుచరిత్ర' ఒక్కరోజు పారాయణ ఇంట్లో చేస్తాను. అయితే, పారాయణ చేసేటప్పుడు కొన్ని కొన్ని పదాలు కఠినంగా ఉండటం వల్ల అర్థం చేసుకోవడం నాకు కష్టంగా అనిపిస్తుంది. వాటి అర్థం పూర్తిగా తెలుసుకోకుండా చదవడం కంటే, ప్రతి అధ్యాయంలోని విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలనిపించి ఈ సంవత్సరం(2026) గురుపౌర్ణమికి కొన్ని రోజుల ముందునుంచి రోజుకు ఒక అధ్యాయం చదువుతూ, అందులో అర్థంకాని పదాలకు అర్థాలు వ్రాసుకోవాలని నిర్ణయించుకొని గురుచరిత్ర పారాయణ ప్రారంభించాను. ఆ సమయంలో ఒకరోజు నా బంగారు తండ్రి నాకు స్వప్నదర్శనమిచ్చారు. దాంతో నా మనసుకెందుకో 'గురుపౌర్ణమికి శిరిడీ వెళ్లాలి' అని ఆలోచన కలిగింది. నిజానికి గురుపౌర్ణమికి శిరిడీ వెళ్లాలనే ఆలోచనే నా మనసులో అంతకుముందు అస్సలు లేదు. అలాంటిది బాబానే స్వప్నదర్శనమిచ్చి నన్ను తమ దగ్గరకు రమ్మని పిలిచారు. వెంటనే నేను శిరిడీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాను. అలా గురుపౌర్ణమి రోజున శిరిడీలో ఒకరోజు గురుచరిత్ర పారాయణం చేసుకునే మహద్భాగ్యాన్ని నా తండ్రి నాకు ప్రసాదించారు.  నేను ఎప్పుడూ అడిగినా, నాతో శిరిడీ రావడానికి వెంటనే ఒప్పుకుని, నా ప్రయాణానికి సహకరించిన నా స్నేహితులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ల రూపంలో నా సాయినాథుడే నాకు సహాయం చేశారని నేను నమ్ముతున్నాను.

2026, గురుపౌర్ణమి శిరిడీ ప్రయాణంలో బాబా నాకు ఎన్నో మరపురాని మధుర స్మృతులు ఇచ్చారు. శిరిడీ వెళ్ళేటప్పుడు రైలులో ఒక అక్క పరిచయమైంది. తన ద్వారా నాకు 'సాయి మహరాజ్ సన్నిధి' వాట్సాప్ ఛానల్ గురించి తెలిసింది. ఆ ఛానల్‌లో చేరాక ప్రతిరోజూ ఎంతోమంది భక్తులకు బాబా ప్రసాదించిన అనుభవాలను చదువుతున్నాను. వాటిని చదువుతున్నప్పుడు బాబా తన భక్తులను ఎలా ఆదుకుంటున్నారో, వారికి ఎలా ధైర్యం ఇస్తున్నారో తెలుసుకుంటుండటం వల్ల నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. బాబా ఆ విధంగా తమ లీలల వర్షంలో నన్ను తడిపేస్తున్నారు. ఇకపోతే, అదే ప్రయాణంలో విజయ అక్క ద్వారా నాకు 'సాయిపథం – Path to Happiness' గురించి, గురుదేవులు శరత్ బాబూజీ గురించి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. అది నా సాయినాథుని మరో లీల అనిపించింది. నిజం చెప్పాలంటే, అంతకుముందు నాకు ఆయన గురించి పెద్దగా అవగాహన లేదు. ఈ మధ్యకాలంలోనే ఆయన సత్సంగాలు, భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన అద్భుతమైన సమాధానాలకు సంబంధించిన కొన్ని వీడియోలు చూసే అవకాశం కలిగింది. ఆశ్చర్యంగా అనిపించిన విషయమేమిటంటే, గురుపౌర్ణమి శిరిడీ ప్రయాణం మొదలైనప్పటినుంచి, ప్రయాణం పూర్తయ్యేవరకు ఏదో ఒక విధంగా గురుదేవులను నమ్మే భక్తుల మధ్యే సాగింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ ప్రయాణంలోని ప్రతి అడుగులో సాయి ఏదో ఒక కొత్త పరిచయాన్ని, కొత్త అనుభవాన్ని, కొత్త ఆలోచనను నా ముందుకు తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. మనకు ఏది ఎప్పుడు తెలియాలి, ఎవరిని ఎప్పుడు కలపాలి, ఏ మార్గంలో మనలను నడిపించాలి అన్నది ఆ తండ్రికి తెలుసు. మనకు పరిచయమయ్యే ప్రతి మనిషీ యాదృచ్ఛికం కాదేమో! సాయి పంపిన మనుషులే కావచ్చు. "సాయినాథా! ఈ లోకంలో ఉన్న మీ భక్తులందరికీ అవిచ్ఛిన్నమైన భక్తిని ప్రసాదించు తండ్రీ. మీ పాదాలయందు నమ్మకం మరింత బలపడేలా అనుగ్రహించు. మీ మార్గంలో నడవని వారికి కూడా నీ గురించి తెలుసుకునే అవకాశం కల్పించి, వారికి మీ భక్తులుగా మారే భాగ్యాన్ని ప్రసాదించు. మా జీవితాల్లో జరిగే ప్రతి మంచి వెనుక, మాకు ఎదురయ్యే ప్రతి మనిషి వెనుక, మాకు లభించే ప్రతి అవకాశంలోనూ నీ లీలే ఉందని గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించు. 'నువ్వు ఉన్నావు' అన్న ఒక్క నమ్మకం చాలు..
మిగతాదంతా నువ్వే చూసుకుంటావు".

శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo