ఈ భాగంలో అనుభవాలు:
1. అడుగడుగునా కాపాడుతున్న బాబా
2. సాయిమాత దయ
అడుగడుగునా కాపాడుతున్న బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయితండ్రికి హృదయపూర్వక నమస్కారాలు. సాయిభక్తులందరికీ వందనాలు. నా పేరు సాయిలత. నేను ఒక బాబా బిడ్డని. 'బాబా' అని పలికితేనే నా మనసు ఉప్పొంగిపోతుంది. మేము యుఎస్‌లో ఉంటాము. 2025, మేలో మేము ఫంక్షన్ల నిమిత్తం ఇండియా వెళ్ళాము. అక్కడ మాకున్న ఇంటిని అద్దెకు ఇచ్చాము. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు వెనుకబడిన కులానికి చెందిన వాళ్ళు. వాళ్లతో సమస్య అయ్యి ఇల్లు ఖాళీ చేయమంటే చేయలేదు. అందరూ "వాళ్లు ఖాళీ చేయరు. వాళ్లతో చాలా సమస్య" అన్నారు. నేను ఆమెతో మాట్లాడితే, చాలా దురుసుగా మాట్లాడింది. మా ఫంక్షన్లన్ని అయేటప్పటికి ఆగస్ టు నెల వచ్చింది. అక్టోబర్‌లో మేము యుఎస్ తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంది. అందువల్ల నేను, "ఇంటి సమస్య పరిస్కారం కాలేదు. ఏమి చేయాలి తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. ఆ మర్నాడు బాబా సమాధానం ఇలా వచ్చింది: '9వ నెల 9వ తేదీ నుండి బాబా సచ్చరిత్ర 9వ అధ్యాయం 9 రోజులు చదివితే, నీ సమస్య తీరిపోతుంది' అని. దాంతో నేను సెప్టెంబర్ 9వ తేదీ నుండి సచ్చరిత్ర 9వ అధ్యాయం 9 రోజులు చదివాను. తర్వాత మేము కొంతమంది పెద్దమనుషులను కలిస్తే, వాళ్లలో కొందరు "పోలీసు కంప్లైంట్ ఇవ్వమ"ని, కొందరు డబ్బులిచ్చి పరిష్కరించుకొమ"ని అన్నారు. మేము బాబా మీద భారం వేసి మా ఇంటికెళ్ళాము. మేము వెళ్తూనే, ఆ ఇంట్లో ఉన్న ఆమె, "ఈరోజు ఇల్లు ఖాళీ చేస్తున్నాము మేడం" అంది. బాబా చేసిన అద్భుతానికి ఆనందంతో నోట మాట రాక నేను అలా ఉండిపోయాను. ఏ కంప్లైంట్, డబ్బులు ఇవ్వడాలు లేకుండానే పని జరిపిం చేసారు బాబా. "
ఎంత దయ చూపావు తండ్రీ? అందుకు మీకు ధన్యవాదాలు బాబా".
తర్వాత మేము ఎంతో సంతోషంగా అక్టోబర్ నెల చివరి వారంలో యుఎస్‌కి తిరుగు ప్రయాణమయ్యాము. యుఎస్ ఎయిర్ పోర్ట్‌లో దిగిన తరువాత ఇమ్మిగ్రేషన్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి మేము మా గ్రీన్ కార్డు చూపించాము. అప్పుడు ఒక పొరపాటు జరిగింది. ఇండియాలో మావారు గ్రీన్ కార్డు జిరాక్స్ తీయించారు. ఇండియాలో జిరాక్స్ కాపీలు పనిచేస్తాయి కానీ, యుఎస్‌లో అలా ఉండదు. అయితే మేము పొరపాటున ఒరిజినల్ చూపించబోయి జిరాక్స్ చూపించాము. వాళ్ళు 'ఇల్లీగల్' అని మమ్మల్ని ఆపేసారు. మా బాబుని సంప్రదించే అవకాశం లేకుండా ఫోన్ కూడా తీసుకున్నారు. విషయం తెలియక మా బాబు బయట కంగారుపడుతుంటే లోపల మేము భయపడ్డాము. మావారు అయితే చాలా భయపడిపోయారు. ఆ సమయంలో నేను, "ఈ గండం గట్టెకించు బాబా. ఇంటికి వెళ్ళగానే సచ్చరిత్ర పారాయణ చేస్తాను" అనుకున్నాను. వాళ్ళు మమ్మల్ని ఒక గంట ఉంచిన తర్వాత బాబా మహిమ వల్ల వదిలేశారు.
2026, మేలో మా మేనకోడలి పెళ్లి ఉందని జనవరిలో మేము ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. నా పాస్‌పోర్ట్ ఎక్సపైర్ అయితే అదే నెలలో అంటే జనవరిలో అప్లై చేసాము. మామూలుగా ఒక వారంలో వస్తుంది కానీ, ఒక నెల అయినా రాలేదు. మేము పాస్‌పోర్ట్ ఆఫీసుకి కాల్ చేస్తే, "మేము పంపి 15 రోజులైంది" అన్నారు. దాంతో మేము మా కమ్యూనిటీ, ప్రక్క కమ్యూనిటీ వాళ్లందరినీ అడిగాము. అందరూ రాలేదు అన్నారు. అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. ఆలోగా మార్చి నెల కూడా వచ్చేసింది. పాస్‌పోర్ట్ లేని కారణంగా మేము వెళ్లకపోతే టిక్కెట్ల డబ్బులన్నీ పోతాయని నాకు చాలా బాధేసి, "బాబా! పాస్‌పోర్ట్ దొరికేలా అనుగ్రహించండి" అని అనుకున్నాను. ఆ మర్నాడు గురువారం మా బాబుకి ఎవరో కాల్ చేసి, "మా ఇంటికి ఒక కొరియర్ వచ్చింది. దాని మీద మీ అడ్రస్ చూసి కాల్ చేశాన"ని చెప్పారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇలా అడుగడుగునా బాబా మమ్ము కాపాడుతూనే ఉన్నారు. నా తండ్రి సాయినాథుడు పిలవగానే పలికి ఎన్ని అద్భుతాలు చూపిస్తున్నారో! సాయిభక్తులారా! సాయిఫై నమ్మకముంచండి, అన్నీ బాబానే చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. రెప్పపాటు కాలం కూడా మీ అనుగ్రహం నుంచి మమ్మల్ని దూరం చేయకు తండ్రీ".
సాయిమాత దయ
నా పేరు కల్యాణి. మేము చిన్నప్పటినుంచి బాబా భక్తులం. మా ఇంట్లో అందరూ బాబానే కొలుస్తారు. 2026, ఏప్రిల్ నెలలో మా బాబుకి జ్వరం వచ్చింది. టాబ్లెట్లు, తెలిసిన యాంటిబయోటిక్స్ వాడినప్పటికీ గొంతులో ఇన్ఫెక్షన్ ఎక్కువై జ్వరం పెరిగింది. అప్పుడు నేను 'సాయి నామం' చేస్తూ, "ఎటువంటి పెద్ద ఇబ్బంది లేకుండా చూడమ"ని సాయిమాతకి చెప్పుకున్నాను. సాయిమాత దయవల్ల యాంటిబయోటిక్స్‌తో 5 రోజుల్లో బాబు జ్వరం తగ్గింది. ఇంకోసారి మా అమ్మ చేతి మీద చిన్న గడ్డలా వచ్చింది. డాక్టర్ దగ్గరకి వెళ్తే, టెస్టులు చేసి, "చిన్న ఆపరేషన్ చేసి దాన్ని తీసేయాల"ని చెప్పారు. నేను, "టెస్టులు అన్ని నార్మల్ రావాల"ని సాయిమాతకి చెప్పుకున్నాను. సాయిమాత దయవల్ల అంతా మంచిగా జరిగింది. "బాబా! మీ దివ్య చరణాలకు అనంత కోటి ప్రణామాలు. మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా వుండండి".

