సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనారాయణ్ పురుషోత్తమ్ అలియాస్ నానాసాహెబ్ అవస్థి - 2వ భాగం....



1918 వేసవిలో నానాసాహెబ్ అవస్థి వివాహం జరిగింది. వివాహానంతరం అతను పూణేలోని తమ స్వగృహమందు నివసిస్తూండేవాడు. ఆ ఇంట్లో ఆ దంపతులతోపాటు అతని చిన్నాన్న, పిన్ని, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉండేవాళ్ళు. నానాసాహెబ్ అవస్థి, అతని భార్య ఇద్దరూ శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని అతని పిన్ని కోరుక. ఇంతలో 1918, సెప్టెంబర్ నెలలో పూణే నగర ప్రజలు ఇన్ఫ్లుఎంజా మహమ్మారితో బాధపడ్డారు. జ్వరాలు చాలా తీవ్రంగా ప్రబలుతుండటంతో అవస్థి కుటుంబం పూణే విడిచి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఇండోర్ సమీపంలో హోల్కర్ రాష్ట్రంలోని కన్నోడ్ గ్రామంలో నానాసాహెబ్ అవస్థి తండ్రి పురుషోత్తం అవస్థి న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన అక్కడికి రమ్మని పిలవడంతో నానాసాహెబ్ అవస్థి, అతని భార్య కన్నోడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అవస్థి పిన్ని కోరిక ప్రకారం కన్నోడ్ వెళ్తూవెళ్తూ దారిలో బాబా దర్శనం చేసుకొని ముందుకు పోవాలన్న ఆలోచన వాళ్ళ మనసులో పదేపదే మెదిలింది. కానీ అతని పినతండ్రి ఎంత ప్రేమమయులో అంత కఠిన స్వభావులు. అందువల్ల విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించే ధైర్యం వాళ్ళకి లేకపోయింది. అంతలో అతని పిన్ని, ఇద్దరు సోదరులు(చిన్నాన్న పిల్లలు) కూడా వాళ్ళతోపాటు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు కూడా వెళ్తూవెళ్తూ సమర్థుని దర్శనం చేసుకుని ముందుకు సాగిపోవాలని పట్టుబట్టారు. నానాసాహెబ్ అవస్థి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలచి, సోదరులని తన తండ్రి అనుమతి తీసుకోమని చెప్పాడు. వాళ్ళు అలాగే చేసారు. దాంతో అతని మనసుకి చాలా ఆనందమేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతని చిన్నాన్న కన్నోడ్ వెళ్లేందుకు నేరుగా పూణే నుండి హర్దకి(హర్ద నుండి కన్నోడ్ 34 మైళ్ళ దూరం) దౌండ్-మన్మాడ్ మార్గంలో వెళ్లే విధంగా టిక్కెట్లు తీసుకోమని చెప్పారు. అందుకని వాళ్ళు పూణే నుండి హర్దాకు టిక్కెట్లు బుక్ చేసుకొని 1918, సెప్టెంబర్ 29, ఆదివారం సాయంత్రం 5 గంటల రైలు ఎక్కడానికి వాళ్ళు పూణేలో ఇంటి నుండి బయలుదేరారు. అయితే ఆ రోజు రైలు ఒకటి, రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది, పైగా రైలు మొత్తం కిక్కిరిసి ఉంది. కూర్చోవడానికి ఎక్కడా చోటు లేకపోవడమే కాకుండా, కనీసం నిలబడటానికి కూడా చోటు కనిపించలేదు. చివరికి, ఎలాగోలా అందరూ వేర్వేరు చోట్ల ఆ జనంలో దూరిపోయారు. సుమారు 6:30, 7:00 గంటల ప్రాంతంలో పూణే నుంచి రైలు బయలుదేరి రాత్రి 10 గంటలకు దౌండ్ చేరుకుంది. రైలు ఆలస్యమవడం వల్ల అక్కడ వాళ్ళు ఎక్కాల్సిన రాత్రి 8 గంటల మన్మాడ్ రైలు తప్పిపోయింది. అందువల్ల వాళ్ళు తెల్లవారుజామున బయలుదేరే రైలు ఎక్కి కూర్చున్నారు. తెల్లవారుజామున సుమారు 2:30 లేదా 3 గంటలకు ఒక టికెట్ కలెక్టర్ వచ్చి, "ఆ భోగి సైనికుల కోసం రిజర్వ్ చేయబడిందని వాళ్ళని ఖాళీ చేయమ"ని అన్నాడు. దాంతో వాళ్ళు నిస్సహాయ స్థితిలో ప్లాట్‌ఫారమ్‌పై దిగి వేరే చోట సీటు దొరుకుతుందేమోనని చూసారు. కానీ వాళ్ళకి ఎక్కడా సీటు దొరకలేదు. ఇంకా అవస్థి నిరాశ చెంది తన పిన్నమ్మతో, "శిరిడీ వెళ్ళే ఆశ వదులుకోండి. ఎందుకంటే, మన అసలు ప్రయాణ సమయం ఆలస్యం అవుతోంది, అలాగే రైలు తప్పిపోయినప్పటినుండి రైల్వే నిబంధనల ప్రకారం మనం ఎక్కడా ఎక్కువసేపు ఉండటానికి అనుమతి లేదు" అని చెప్పాడు. అతను అలా అన్న మరుక్షణంలోనే, అదివరకు వాళ్ళని రైలు దింపిన టికెట్ కలెక్టర్ వచ్చి వాళ్ళకోసం ఒక చోటు ఏర్పాటు చేశానని చెప్పాడు. అది విని అవస్థి చాలా ఆశ్చర్యపోయాడు. గతంలో తన తండ్రి రేగేతో కలిసి మొదటిసారి శిరిడీ వెళ్లినప్పుడు సరిగ్గా ఇదేవిధంగా జరగడం గుర్తొచ్చి, బాబా తమపై చూపిన అనుగ్రహానికి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వాళ్ళందరూ ఆ రైలు ఎక్కి సోమవారం మధ్యాహ్నం 1 గంటకి క్షేమంగా శిరిడీ చేరుకున్నారు.


శిరిడీలో వాళ్ళకి మొదట శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ కలిశారు. ఆయన, "మీరు రావడం మంచిదైంది. బాబా జ్వరంతో బాధపడుతున్నారు" అని వాళ్ళని తన వాడాలో దిగమని చెప్పి, తదనుగుణంగా వసతి ఏర్పాటు చేశాడు. వాళ్ళు స్నానాలు చేసి పూజాసామాగ్రి తీసుకొని సాయి సమర్థుని దర్శనం కోసం మసీదుకు వెళ్లారు. ఆ సమయంలో బాబా జ్వరంతో బాధపడుతూ కూడా ఎప్పటిలానే మామూలుగా కూర్చుని ఉన్నారు. అవస్థి వారి పాదాల చెంత తన తలనుంచి ధన్యుడనయ్యానయ్యానని భావించాడు. వాళ్ళు అక్కడ కొంతసేపు కూర్చుని, బాబా ఆజ్ఞ అయ్యాక సెలవు తీసుకొని బయటకి వచ్చి దీక్షిత్‌‌తో, "రేపు మేము మా నాన్నగారి దగ్గరకి వెళ్తున్నామ"ని అవస్థి చెప్పాడు. అప్పుడు దీక్షిత్, "రేపు వెళ్లొద్దు. బాబా రేపు చావడికి వెళ్తారు. మీరు ఉత్సవం చూసి వెళ్ళండి" అని అన్నాడు. కానీ నేరుగా హర్దకి టిక్కెట్లు తీసినందువల్ల మర్నాడు మంగళవారం ఉదయం వాళ్ళు ట్రైన్ ఎక్కాల్సి ఉంది. ఒకవేళ వాళ్ళు ఆరోజు ట్రైన్ ఎక్కకపోతే ఆ టిక్కెట్లు ఇంకా వాళ్ళకి ఉపయోగపడవు. అయినా అవస్థి దీక్షిత్ మాటని కాదనలేకపోయాడు. అదీకాక అతనికి కూడా చావడి ఉత్సవం చూడాలని వుంది. అందువల్ల రైల్వే నిబంధనలతో సంబంధం లేకుండా శిరిడీలోనే ఉండటానికి నిశ్చయించుకున్నాడు అతను. తర్వాత వాళ్ళు వాడాకి వెళ్లి అల్పాహారాలు మొదలైనవి తీసుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ క్షేమసమాచారాలు మరియు ఇతర విషయాల గురించి మాట్లాడారు. తర్వాత, టీ వగైరా తీసుకున్న తర్వాత అవస్థి వెనుక గదిలో ఉన్న శ్రీముక్తారాం వద్దకు వెళ్ళాడు. అంతకుముందు ఎన్నడూ వాళ్ళిరువురూ మాట్లాడుకోలేదు, కేవలం ముఖ పరిచయం ఉంది. అవస్థి గడపలోకి అడుగుపెట్టగానే అతను, "నువ్వు ఈ సమయంలో రావడం చాలా మంచిదైంది" అని అన్నాడు. కానీ అతని ఉద్దేశం ఏమిటో అవస్థికి అర్థం కాలేదు. తర్వాత సాయంత్రం అవస్థి మళ్ళీ సాయి సమర్ధ దగ్గరకి వెళ్ళాడు. ఆ సమయంలో వారి ఆరోగ్యం ఏ మాత్రమూ బాగున్నట్లు కనిపించనప్పటికీ ఆయన కూర్చునే ఉన్నారు. ఆయన లీల ఆయనకే తెలుసు.


అవస్థి మర్నాడు అంతా శిరిడీలోనే ఉన్న కానీ, అతని మనసు సాయి సమర్థ ఆరోగ్యం గురించి విచారంగా ఉంది. ఆ రాత్రికి బాబా ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఆయన ఆరోజు ఎప్పటిలా చావడికి వెళ్ళలేదు. ‘అయితే ఏమైంది? శిరిడీలో ఒకరోజు ఉండగలడం మంచిదే’ అని అనుకున్నాడు అవస్థి. అతను ఆ మరుసటిరోజు అంటే బుధవారం ఉదయాన్నే బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అతని పిన్ని త్వరగా బయలుదేరాలి కాబట్టి, బేసిన్ బాత్ లేదా దశామ్య తయారుచేయాలని అనుకుంది. మర్నాడు తెల్లవారగానే అవస్థి, అతని సోదరులు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి రావడానికి ఒక వాగుకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ముఖం కడుక్కొని, స్నానం చేసి, స్నానానంతరం తిరిగి వస్తుంటే దారిలో ఒక పాలవాడు కలిశాడు. అవస్థి ఏదో మామూలుగా అతన్ని అడిగితే, అతను పాలు తీసుకోమని పట్టుబట్టాడు. దాంతో అవస్థి ఒక షేర్ పాలు తీసుకున్నాడు. శిరిడీలో కొలత తెలియకపోవడం వల్ల అవసరమైన దానికంటే చాలా ఎక్కువ పాలు వచ్చాయి. వాటిని చూసిన అవస్థి పిన్ని ఖీర్ చేస్తానని అంది. అతను సరేనని సరుకులు తెచ్చాడు. ఆమె దయార్దహృదయురాలు. ఆమె ఖీర్‌తో పాటు పూరీలు కూడా చేసింది. ‘బేసిన్ బాత్, దశామ్య ఆలోచన ఎక్కడ? ఖీర్, పూరీ ఎక్కడ! సమర్థుల లీల సమర్థులకే తెలుసు’ అని అవస్థి అనుకున్నాడు. నిజానికి బాబాకి ఖీర్ ఇష్టం కాబట్టి, వారికి ఖీర్, పూరీలు నేవేద్యంగా సమర్పించాలని అవస్థి సోదరుని మనసులో కోరికగా వుంది. దాన్ని బాబా అనూహ్యరీతిలో నెరవేర్చినందుకు అతను చాలా సంతోషించాడు. వాటిని సాయి సమర్థునికి నైవేద్యంగా సమర్పిస్తే, వారు ప్రేమతో స్వీకరించారు. ఆవిధంగా తమ ప్రయాణానికి వారి అనుమతి ఉందని అవస్థి భావించి(ఎందుకంటే, ఆ సమయంలో వారి ఆరోగ్యం చాలా చంచలంగా ఉంది), శ్రీకాకాసాహెబ్ సమ్మతితో సమర్థుని దర్శనం చేసుకొని బయలుదేరుతుండగా, రెండు విషయాలు అతని మనసులో మెదిలాయి. మొదటిది, ఆరోజు బుధవారం అయినందున అతనికి ‘జాశీ బుధి తర్ ఏశీ కది(‘బుధవారం వెళితే, తిరిగి ఎప్పుడు వస్తావు?)’ అన్న మరాఠీ సామెత గుర్తొచ్చింది. ఎందుకంటే, ‘బుధవారం బయలుదేరితే ఎవరినైనా మళ్ళీ కలవడానికి చాలాకాలం పడుతుందని లేదా అసలు కలవలేమని’ కొందరు మహారాష్ట్రీయుల నమ్మకం. అందువల్ల అతను ఆరోజు 'వెళ్ళాలా, వద్దా' అని విచారించాడు కానీ, అతని ఆ ఆలోచన ఒక్క క్షణంలో మారిపోయింది. ఎందుకంటే, సమర్థులకు అన్ని రోజులులాగే ఆరోజు కూడా. ఇక రెండవది, శిరిడీ నుండి కన్నోడ్‌కు వెళ్ళినప్పటినుండి ప్రతిరోజూ స్వయంగా సాయి సమర్థుని పూజించాలని ఆలోచన వచ్చింది. ఈవిధమైన ఆలోచనలతో అతను అందరికీ వీడ్కోలు చెప్పి భక్తుల పుట్టిల్లు(శిరిడీ) నుండి బయలుదేరాడు.


వాళ్ళు క్షేమంగా కోపర్‌గావ్ చేరుకున్నాక, అక్కడ రెండు రోజులు ఉండటానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వమని అతను స్టేషన్ మాస్టర్‌ను అభ్యర్థించాడు(బహుశా శిరిడీలో మరో రెండు రోజులు ఉందామని కాబోలు!). కానీ అతని మాటను స్టేషన్ మాస్టర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో సరేనని, వాళ్ళు రైలు ఎక్కి మన్మాడ్‌ వెళ్లారు. అక్కడ వాళ్ళు వేరే రైలు ఎక్కాల్సి ఉంది. అప్పటికి సాయంత్రం అయింది. వాళ్ళు లైట్లు వేయకముందు చీకట్లో రైలు ఎక్కి. లైట్లు వేసి చూస్తే, కోచ్‌లన్నీ పంజాబీ సైనిక సిబ్బందితో నిండి ఉన్నాయి. అవస్థికి చాలా భయం వేసింది కానీ, బాబా దయవల్ల టిక్కెట్లతో గానీ, మరే ఇతర విషయాల్లో గానీ ఎలాంటి సమస్య రాలేదు. అడుగడుగునా సమర్థుని అపారమైన శక్తి, లీలలు అనుభవానికి వచ్చాయి. వాళ్ళు క్షేమంగా మర్నాడు గురువారం ఉదయం హర్ద చేరుకున్నారు.  


అక్కడ అవస్థి ఒక టాంగా ఏర్పాటు చేసి తన భార్య, పిన్ని, సోదరులను నేమావర్‌కు పంపించాడు. తర్వాత అతను హర్ధాలో ఉంటున్న సాయి భక్తులు సాధుభయ్య నాయక్, ఛోటుభయ్యా పరూల్కర్‌‌లను కలవడానికి సైకిల్ మీద వెళ్ళాడు. అతను ముందుగా ఛోటుభయ్యా పరూల్కర్‌‌ని కలిసి తర్వాత శ్రీసాధుభయ్యాను కలవడానికి, అలాగే వారి ఇంట కొలువై ఉన్న శ్రీసాయి సమర్థుని దర్శనం చేసుకుందామని అతనింటికి వెళ్ళాడు. అతనికి బాబా దర్శనం అయింది కానీ, సాధుభయ్యా ఆరోజు తన కార్యాలయంలో ఉన్నారు. అందువల్ల అతను అతన్ని అక్కడే కలిసి, వెంటనే హడావిడిగా నేమావర్‌కు బయలుదేరాడు. సుమారు ఒక మైలు దూరం వెళ్ళాక, అతని సైకిల్ పంక్చర్ అయి గాలి వదిలేసింది. పైగా ముఖం మీదకి వస్తున్న ఎండ తీవ్రత వల్ల అతను చాలా ఇబ్బందిపడ్డాడు. ఇంకా తప్పనిసరై అతను వెనుతిరిగి వచ్చేసి, సైకిల్‌ బాగు చేయించుకుని, కొత్త టోపీ కొనుక్కున్నాడు. ఆ తర్వాత అతని సామానులో కొన్ని వస్తువులు కనిపించకపోవడంతో డబ్బులకోసం అతను మళ్ళీ శ్రీసాధుభయ్యా ఇంటికి వెళ్ళాడు. అప్పటికి సాధుభయ్యా ఇంటికి వచ్చి ఉన్నారు. అతను అవస్థిని చూసి ఆనందించి సాదరంగా ఆహ్వానించి అల్పాహారం మొదలైనవి తెమ్మని ఇంట్లోవాళ్ళని అడిగాడు. అవస్థి శిరిడీకి సంబంధించిన అన్నీ వాస్తవాలు వివరంగా అతనికి చెప్పాడు. ఒక గంటసేపు అనాయాసంగా బాబా స్మరణలో గడిచిపోయింది. అవస్థి అల్పాహారం తిన్నాక బయలుదేరడానికి సిద్ధపడుతుండగా శ్రీసాధుభయ్యా, "మాకు ఊదీ ఇవ్వలేదు?" అని అన్నారు. అవస్థి వెంటనే తన జేబులోంచి ఊదీ తీసి అతనికి ఇచ్చాడు. అప్పుడు అతను, "దీనికోసమే సమర్థులు నిన్ను వెనక్కి పిలిచారు" అని అన్నాడు. విషయమేమిటంటే, ఆ సమయంలో అతనికి బాబా ఊదీ కావాల్సి ఉంది. అవస్థి ముందు అతన్ని కలిసినప్పుడు హడావిడిలో దానిని వారికి ఇవ్వడం మర్చిపోయాడు, అతను కూడా దానిని అడగడం మర్చిపోయాడు. ఆ తర్వాత అవస్థి అతనికి వీడ్కోలు చెప్పి, ఒక గంటలోపు సంతోషంగా నేమావర్ చేరుకున్నాడు. ఆరోజు వాళ్ళు అక్కడ బస చేసారు. అవస్థి నర్మదా నదిలో స్నానం చేయడానికి వెళ్లి, స్నానమయ్యాక ఏం చేయాలని ఆలోచిస్తూ నది ఒడ్డున కాసేపు నిలబడినప్పుడు, కొద్ది దూరంలో నదిలో ఉన్న మనోహరమైన తెల్లని పువ్వులు చూసాడు. అప్పుడు అతనికి శిరిడీ విడిచి వచ్చేటప్పుడు కలిగిన భావనలు గుర్తొచ్చి, ఆ పువ్వులు కోసుకుని తన బసకి వెళ్లి, బాబా చిత్రపటాన్ని తీసి ఆనందంగా పూజించాడు. మరుసటిరోజు అతను కన్నోడ్ చేరుకుని, తాను అనుకున్న విధంగా ప్రతిరోజూ బాబాను పూజించడం ప్రారంభించాడు. అది నిత్య నియమంగా కొనసాగుంతుండగా విజయదశమి వచ్చింది.


ఆ సంవత్సరం అంటే 1918లో రెండు రోజులు దసరా జరుపుకున్నారు. కొందరు సోమవారం, కొందరు మంగళవారం. ఇండోర్ సంస్థాన్‌లో అక్టోబర్ 14, సోమవారం జరుపుకున్నారు. ఆరోజు నానాసాహెబ్ అవస్థి శ్రీబాబాను, వారి సింహాసనాన్ని తన శక్తిమేరకు అలంకరించి పూజ ఘనంగా చేసాడు. ఆ సంస్థాన్‌లో దసరా మర్నాడు ప్రముఖుల వద్దకు వెళ్లి 'బంగారం' ఇచ్చిపుచ్చుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. కాబట్టి నలుగురూ వస్తారని, ఆరోజు కూడా అవస్థి బాబాని చక్కగా అలంకరించి పూజ ఘనంగా చేయాలని భావించి, అలాగే చేశాడు. హారతి సమయానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భాజాభజంత్రీలు కూడా వచ్చాయి. ఆ విధంగా మొదటిరోజు కంటే ఎక్కువ ఉత్సాహంతో వేడుకగా హారతి జరిగింది. ఆ సాయంత్రం ఒక గాయకుడు దేవా(బాబా) ముందు గానం చేశాడు. అలా 1918, అక్టోబర్ 15న అవస్థి ఇంట పూజ చాలా వైభవంగా జరిగింది. ఆ మర్నాడు, బుధవారం ఉదయం హారతికి సిద్ధమవుతుండగా అవస్థికి కొంచెం బద్ధకంగా అనిపించడంతో అతని అత్త, "ఈరోజు పూజ నేను చేస్తాను" అంది. దాంతో అతను బట్టలు వేసుకుని బయటకు వెళ్ళాడు(ఆ రోజు నుండి అతను పూజ చేయడం మానేశాడు). ఆ రాత్రి అవస్థి తల్లిదండ్రులకు బాబా కేసరి బాత్ అడుగుతున్నట్లు కల వచ్చింది. వాళ్ళు మర్నాడు గురువారం ఉదయం తమకు వచ్చిన కల గురించి ఒకరికొకరు చెప్పుకోకుండా కేసరి బాత్ వండి బాబాకి నివేదించారు. తర్వాత ఆదివారం ఉదయం హార్దలో ఉన్న శ్రీసాధుభయ్య వద్ద నుండి ఒక లేఖ అవస్థికి వచ్చింది. అందులో 'శ్రీ సద్గురు బాబా 1918, అక్టోబర్ 15న దేహం చాలించారు' అని ఉంది. అది చూసాక నానాసాహెబ్ అవస్థికి తాను బుధవారం శిరిడీ విడిచి రావడం, 1918, అక్టోబర్ 15, మంగళవారం(బాబా సమాధి చెందిన రోజు) ప్రత్యేకించి పూజ వైభవంగా జరగడం, 1918, అక్టోబర్ 16, బుధవారం నుండి పూజ ఆగిపోవడం, 1918, అక్టోబర్ 17, గురువారం ఇంట్లో కేసరి బాత్ చేయడం(మరణానంతరం 3వ రోజున తీపి అన్నం చేయడం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంత ప్రజల ఆచారం) మొదలైనవన్నీ చాలా ఆశ్చర్యకరంగా తోచాయి. అతనికి అవన్నీ సమర్థుని చివరి రోజులను స్పష్టంగా తెలియజేస్తున్నాయని అనిపించింది.


తరువాయి భాగం వచ్చేవారం..


సోర్స్: సాయిలీల పత్రికలు 1930, 4వ సంచిక & 1968, అక్టోబర్ నెల 10వ సంచిక

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo