ఈ భాగంలో అనుభవాలు:
1. ప్రేమతో పిలవాలేగానీ ఇప్పటికీ వెంటనే పలుకుతున్న బాబా
2. ఊదీతో తగ్గిన కడుపునొప్పి
ప్రేమతో పిలవాలేగానీ ఇప్పటికీ వెంటనే పలుకుతున్న బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు జయశ్రీ. నేను పెళ్ళికి ముందు ఎక్కిరాల భరద్వాజగారి సాయిబాబా జీవితచరిత్ర చాలాసార్లు చదివాను గాని, దభోల్కర్ గారి 'సాయి సచ్చరిత్ర' ఉందని అప్పట్లో(2003కి ముందు) నాకు తెలియదు. నా పెళ్ళైన 6 లేదా 7 ఏడేళ్ళకి మాకు తెలిసిన బాబా భక్తులు హేమాడ్పంత్ రచించిన 'సాయి సచ్చరిత్ర' ఇచ్చి, చదువుకోమన్నారు. ఆ పుస్తకం నా చేతికి రావటంతో నాకు పెద్ద పండుగలా అనిపించింది. అది చదువుతుంటే, ప్రతి సన్నివేశం బాబా గురించి ఎంతో మధురంగా వర్ణించి కళ్ళకు కట్టినట్లు చూపుతున్న భావన కలిగేది. పనులన్నీ ముగించుకొని పుస్తకం ముందు కూర్చునేదాన్ని. ఒకరోజు పుస్తకంలో, " 'సాయి సాయి' అని నిరంతరం స్మరించు" అని బాబా చెప్పడం, అలా చేయడం వలన బాబా ఎలా కాపాడుతారో కూడా చెప్పి ఉంది. అది చదివాక నాకు ఒక సందేహం వచ్చింది. నేను మాములుగా ఎప్పుడూ 'సాయిరాం' అని మనసులో స్మరిస్తూ ఉంటాను. అందువల్ల నేను 'సాయిరాం' అనుకుంటున్నాను కదా! రామ్ తీసేసి ఒక్క 'సాయి' అని మాత్రమే చెప్పుకోవాలేమో! అని సందిగ్ధంలో పడ్డాను. తర్వాత చదువుతూ చదువుతూ నిద్రొచ్చి, నిద్రపోయాను. అప్పుడొక కల వచ్చింది. కలలో ఇంటిలో ఉన్న నేను బయట ఏదో ఊరేగింపు జరుగుతుందని ఇంటి బయటకి వెళ్లి చూస్తే, ఒక పెద్ద హనుమంతుని విగ్రహం ఊరేగిస్తున్నారు. నేను దణ్ణం పెట్టుకున్నంతలో ఒక పూజారి పెద్ద శిఖతో, మూడు అడ్డ నామాలతో వచ్చారు. ఆయన తల వరకు మాత్రమే పెద్దగా కనిపిస్తుంది. ఆయన తమ నామాన్ని విడువకు, విడువకు, విడువకు అని 3 సార్లు గట్టిగా చెప్పారు. అంతటితో కల ముగిసింది. సచ్చరిత్ర పూర్తిగా చదివాక, 'బాబా కలలో ఎందరికో ఉదేశాలు చేసారని, అలా నన్ను కూడా అనుగ్రహించారని' గ్రహించడంతో నాకు చాలా సంతోషం కలిగింది. ప్రేమతో పిలవాలేగాని ఇప్పటికీ బాబా వెంటనే పలుకుతున్నారు, ఇహ - పర సౌఖ్యాలు రెండింటిలో ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
2010 లేదా 2011లో అనుకుంటా ఒకరోజు నేను, నా భర్త, మా ఇద్దరు చిన్న పిల్లలు బండి మీద చిలుకూరు బాలాజీ దర్శనం చేసుకొని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాము. గుడి నుండి ఒక 10 నిముషాల దూరంలో 3 రోడ్ల కూడలి ఉంది.
సాధారణ వేగంతో వెళ్తున్న మేము అక్కడికి చేరేసరికి కుడివైపున ఉన్న రోడ్డు నుండి హఠాత్తుగా 3 కుక్కలు మా బండికి అడ్డం వచ్చాయి. వాటిలో ఒక కుక్క మా బండి కింద దూరి ఇరుక్కుపోయింది. మా బండి అదుపుతప్పి మేము నలుగురం కింద పడ్డాము. బాబా దయవల్ల ఆ సమయంలో ఎటు వైపు నుండి పెద్ద పెద్ద వాహనాలు రాలేదు. పక్కగా వెళ్తున్న కొందరు పిల్లల్ని, బండిని లేపి సహాయం చేసారు. నాకు, నా భర్తకి అరచేతులు చిన్నగా గీసుకున్నాయి. కానీ పిల్లలు క్షేమంగా ఉన్నారు. బాబానే కాపాడారని నా మనసంతా బాబా నిండిపోయారు. కొంతసేపటికి కంగారు, భయము పక్కన పెట్టి మళ్ళీ బండి మీద వెళ్తుంటే 5 నిమిషాల్లో నాకు మేఘాలు బాబా తలలా చాలా అంటే చాలా స్పష్టంగా కనిపించాయి. బాబానే మమ్మల్ని కాపాడారన్న నా నమ్మకాన్ని బలపరుస్తూ, ఆయన దర్శనం కూడా అనుగ్రహించారని ఆనందంతో ఆయన్ని చూస్తూ తన్మయత్వంలో ఉండిపోయాను కానీ, నా భర్తని చూడమని చెప్పలేకపోయాను. నిజంగా ఇది ఒక పెద్ద అద్భుతం.
2010 లేదా 2011లోనే అనుకుంట నేను మా ఇంట్లో మూడు గురువారాలు బాబా భజన పెట్టుకోవాలని అనుకున్నాను. అంతకుముందు బయట జరిగే భజనలకి హాజరయ్యాను కానీ, ఇంట్లో చేయాలనుకోవడం అదే మొదటిసారి. నేను చాలా ఉత్సాహంగా భజనలో బాబా తల మాత్రమే ఉండే ఫోటో పెట్టాలా, నిలువెత్తు ఫోటో పెట్టాలా అని ఆలోచిస్తుండగా ఒకరోజు కలలో బాబా శిరస్సు క్లోజ్ అప్ లో దర్శనం ఇచ్చింది. ఆవిధంగా బాబా తమ తల భాగం ఉండే ఫోటో పెట్టమని చెప్పారని నాకు అర్ధమైంది. బాబా దయవలన 3 వారాల భజన ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగింది. బాబా ప్రేమను రుచి చూసిన వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే అద్భుతాలు, ఎప్పటికీ మరువలేని మధుర ఘట్టాలు ఇవి. ఇలా నాకు బాబాతో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నేను ఒక పుస్తకం వ్రాయాలని అనుకునేదాన్ని. అలాంటి నాకు బాబా ఈ వేదికను(బ్లాగు) పరిచయం చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మనమంతా సాయి ప్రేమ సాగరంలో మునిగిపోవాలని చాలా ఆశగా ఉంది. ముందుముందు మీ అందరితో చాలా అనుభవాలు పంచుకుంటాను. "ధన్యవాదాలు బాబా. ఐ లవ్ యు బాబా".
ఊదీతో తగ్గిన కడుపునొప్పి
అందరికీ నమస్కారం. నా పేరు శివాని. మాది నెల్లూరు. ఒకరోజు మావారికి హఠాత్తుగా కడుపులో నొప్పి మొదలైంది. మావారు టాబ్లెట్లు వేసుకున్నారు . కానీ ఒకరోజు గడిచినా తగ్గలేదు. మేము దగ్గర్లో ఊరు వెళ్లాల్సి ఉండటంతో అది ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో అని నాకు భయమేసి, మావారి చేతి ఊదీ నీళ్లు తాగించి, అలాగే ఊదీ నీళ్లు మావారి కడుపుకి రాసి, "ఈ కడుపునొప్పి తగ్గిపోవాలి బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో మావారికి తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

