కన్నోడ్లో ఉండగా ఒకసారి నానాసాహెబ్ అవస్థి చిన్నాన్న కొడుకు బాబు ఆరోగ్యం బాగా క్షీణించింది. డాక్టర్ నాయతే చికిత్స ప్రారంభించారు. కానీ బాబు కోలుకోలేదు సరికదా, పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారడం మొదలైంది. దాంతో తొందరలోనే ఏదో అశుభం సంభవించనుందనిపించి డాక్టర్‌తో సహా కుటుంబసభ్యులందరూ నిరాశ చెందారు. ఆ స్థితిలో డాక్టర్ సాహెబ్‌కి బాబాపై నమ్మకం లేనప్పటికీ, ఆయన బాబా పటం ఉన్న గదికి వెళ్లి, ఆ పటాన్ని చేతిలోకి తీసుకుని, "మీ భక్తులకే ఇలాంటి పరిస్థితి అయితే, మేము మీ మీద ఎలా నమ్మకం ఉంచగలం?" అని విచారించాడు. అదే సమయంలో తూము వద్ద ముఖం కడుక్కోవడానికి వెళ్లిన నానాసాహెబ్ అవస్థి తండ్రి పి.ఆర్.అవస్థి మనసులో, "దేవా! కాలం కష్టంగా కనిపిస్తోంది. మీకు ఏది సరైనదనిపిస్తే, అది చేయండి" అని అనుకున్నాడు. ఎవరికి వారు అలా అనుకొని బాబు దగ్గరకి తిరిగి వచ్చారు. చూస్తే, బాబుకి నిద్ర వస్తున్నట్లుగా వుంది. సరేనని కాసేపు బాబుని నిద్రపోనిచ్చారు. కొంత సమయం నిద్రపోయాక బాబు అనారోగ్యం ఉపశమించనారంభించింది. డాక్టరు సాహెబ్, నానాసాహెబ్ అవస్థి తండ్రి పి.ఆర్.అవస్థి ఇద్దరూ బాబా శక్తికి ఆశ్చర్యపోయారు. కానీ ఆ సమయంలో వారిద్దరూ ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉన్నారు. బాబు పూర్తిగా కోలుకున్న తర్వాత సత్యనారాయణ వ్రతం చేసి, వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పుడు వైద్యుడు, పి.ఆర్.అవస్థి తమ అనుభవాన్ని వెల్లడించారు. అప్పుడు, "బాబు కోలుకోవడానికి కారణం బాబా కృపే"నని అందరూ ఆనందించారు.
1924వ సంవత్సరం పుణ్యతిథికి(విజయదశమి) శిరిడీ వెళ్ళాలన్న ఉద్దేశం నానాసాహెబ్ అవస్థికి లేకపోయినప్పటికీ ముందురోజు శ్రీసాయి లీల సంచిక అతని కంటపడటంతో అప్పటికప్పుడు శిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను సాయంత్రం 5 గంటల రైలులో బయలుదేరడానికి సిద్ధమయ్యాక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతని భార్య, "నేనూ రానా?" అని అడిగింది. అతను "సరే" అని చెప్పడంతో ఆమె, తమ కొడుకుతో సహా బయలుదేరింది. వాళ్ళు శిరిడీ చేరుకునేసరికి, శ్రీవారి(బాబా) పాదుకలకు అభిషేకం జరుగుతుంది. తాను కూడా అభిషేకం చేస్తే బాగుంటుందని అవస్థి మనసుకి అనిపించింది కానీ, అప్పటికే చాలా సమయం అయిపోయిందని మౌనంగా ఉండిపోయాడు. హారతి మొదలైనవన్నీ అయ్యాక అతను వాడాలో శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ వద్దకి వెళ్లి కూర్చున్నాడు. అప్పుడు కాకాసాహెబ్ అక్కడున్న భక్తులతో, "సాయంత్రం 5 గంటలకి బాబా సమాధికి అభిషేకం చేయాలని, అనంతరం వచ్చిన భక్తులలో ఎవరైనా స్వచ్ఛందంగా అభిషేకం కోసం విరాళం ఇస్తే, వాటిని బాబావారి ఖర్చుల నిమిత్తం జమచేయాలని సంస్థాన్ నియమము విధించింది" అని అన్నారు. అది విని అవస్థి తన మనసులో మెదిలిన భావనను బాబా నెరవేర్చారని సంతోషంగా అభిషేకం కోసం కొంత మొత్తాన్ని ఇచ్చి, అచంచలమైన బాబా శక్తిని కొనియాడాడు.
ఒకసారి నానాసాహెబ్ అవస్థి, శ్రీగణపతిరావు నరకే అనే అతను సైకిల్ మీద ఆళంది వెళ్ళాలనుకొని మర్నాడు ఉదయం 6-7 గంటలకు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. మర్నాడు అవస్థి సమయానికి తన ఇంటినుండి బయలుదేరాడు కానీ, అతని మనసంతా ఏదో విచారం అలుముకుంది. అతను దారిలో ట్రైనింగ్ కాలేజీ దగ్గర చెక్క వంతెన వైపు వెళ్ళే ప్రధాన రహదారిని తీసుకున్నప్పుడు, అక్కడ కమిటీవాళ్ళు రోడ్డుపై బాగా నీరు పోసి ఉన్నారు, రెండు కుక్కలు పోట్లాడుకుంటూ వచ్చి అతని సైకిల్ వెనక చక్రాన్ని ఢీకొట్టాయి. దాంతో అతను రోడ్డుపై ఉన్న కంకర రాళ్ల కుప్పపై పడి స్పృహ కోల్పోయాడు. ఎదురుగా ఉన్న ఒక వ్యాపారి అతన్ని ఎత్తుకుని తన దుకాణానికి తీసుకెళ్లి తల మీద నీళ్ళు వేస్తే, కొంతసేపటికి అతనికి స్పృహ వచ్చి టాంగాలో ఇల్లు చేరుకున్నాడు. అయితే, అతని బుర్రలో గడియారం వంటి శబ్దం అవుతూ ఉండింది. శ్రీగణపతిరావు అతని ఇంటికి వచ్చి పరిస్థితి చూసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ వచ్చాడు. అప్పటికి అవస్థి ఆరోగ్యం బాగుంది. అప్పుడు గణపతిరావు అవస్థితో, "ఈరోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ట్రైనింగ్ కాలేజీ నుండి సైకిల్‌పై వెళ్తుండగా నా దారికి ఒక భయంకరమైన వ్యక్తి అడ్డంగా వచ్చాడు, వంతెన దాటగానే శిరిడీకి చెందిన వ్యక్తి(కొండజీ) వచ్చి ఇష్టమొచ్చినట్లు ఆ వ్యక్తిని బాగా కొట్టి చంపేశాడు" అని చెప్పి అవస్థికి జరిగిన ప్రమాదానికి ముడిపెట్టి “బాబానే నిన్ను ఆ ప్రమాదం నుండి రక్షించార”ని అన్నాడు.
పూణేలోని కంటోన్మెంట్(సైనికుల నివాస ప్రాంతం)లో శ్రీబాబాజాన్ అనే ఒక మహాత్మురాలు ఉండేది. ఆమె బాబాను తమ 'సోదరుడు' అని చెప్పేది. ఒకసారి నానాసాహెబ్ అవస్థి ఆమె దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఆమెకు టీ అంటే చాలా ఇష్టములా అనిపించి, "టీ తెమ్మంటారా?" అని అడిగాడు. ఆమె అనుమతించడంతో టీ తెప్పించాడు. ఆమె ఆ టీ అందరికీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తి అప్పటికి కొద్దిసేపటి క్రితమే టీ తాగి ఉన్నందున, "బాబా! ఇప్పుడే తీసుకున్నాను!" అన్నాడు. దానికి బాబాజాన్, "లేదు, ఇది నా సోదరుని ఇంటి టీ" అని అన్నారు. ఆమె దివ్యదృష్టికి అవస్థి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, అంతకు ముందెన్నడూ అతను ఆమెను దర్శించలేదు, తనకు ఆమెతో పరిచయం లేదు.
అవస్థి పూణేలో ఒక దీపావళి రోజున లక్ష్మీ పూజకోసం తమలపాకులు కొనడానికి వెళ్ళాడు. అతను ఎక్కడైతే తమలపాకులు తీసుకున్నాడో, అక్కడ అతనికి ఒక అందమైన పూలగుత్తి కనిపించింది. అతను దాన్ని శ్రీబాబా తలపై(పటం మీద) పెట్టాలని అనుకున్నాడు. కానీ తర్వాత అతను బాబాజాన్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చి, వెళ్లి ఆ పూలగుత్తిని ఆమెకు సమర్పించాడు. ఆమె, "దీన్ని నా తలపై పెట్టుకుంటాను" అని అన్నారు. ఆవిధంగా ఆమె బాబాతో తమకు గల ఐక్యతను తెలియజేసారు.
1948వ సంవత్సరంలో నానాసాహెబ్ అవస్థి తండ్రి పి.ఆర్.అవస్థి ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన బ్రతికి ఉన్నంతకాలం, బాబాను క్రమం తప్పకుండా పూజించారు. కానీ ఆయన మరణంతో ఇంట్లో బాబా పూజ ఆగిపోయింది. అదే సంవత్సరం కుర్లాలోని పోలీస్ శాఖలో అధికారి హోదాలో ఉన్న నానాసాహెబ్ అవస్థి పెద్ద కుమారుడు రఘునాథ్‌పై ఒకదాని తర్వాత ఒకటిగా ఆపదలు వచ్చి పడ్డాయి. ఇంట్లోవాళ్ళు కంగారుపడి ఏమి చేయాలని ఆలోచిస్తుండగా వాళ్ళకి బాబా గుర్తొచ్చారు. అదే సమయంలో పి.ఆర్.అవస్థిలా వాళ్లలో ఎవరూ బాబా పూజపై శ్రద్ధ పెట్టట్లేదని వాళ్ళు గ్రహించారు. అది వాళ్ళ దృష్టికి అపరాధం జరిగినట్లు తోచింది. దాంతో నానాసాహెబ్ అవస్థి మునుపటిలా ఇంట్లో బాబా పూజ చేసి, మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాడు. కొద్ది రోజుల్లోనే బాబా కృపతో అతని కొడుకుకి వచ్చిన ఆపద తొలగిపోయింది. అతను ఇలా అంటారు: “ఇలాంటి అనుభవాలు నేను ఎన్ని చెప్పగలను? నేను నా జీవితమంతా బాబా అనుగ్రహాన్ని పొందాను. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నా జీవితం మొత్తంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి; కానీ బాబాపట్ల నా విశ్వాసం ఏమాత్రం సడలలేదు. ఆయన నన్ను ఎప్పటికప్పుడు రక్షించారని నేను నమ్ముతాను. సుమారు 1964-65 ప్రాంతంలో నా కుమారులలో ఒకరు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆ వయసులో ఆ దుఃఖాన్ని భరించడం చాలా కష్టం. కానీ బాబా అనుగ్రహంతో నేను ఆ దుఃఖాన్ని అధిగమించగలిగాను. తర్వాత 1968లో అఖిల భారత సాయి భక్తుల సదస్సు మద్రాసులో జరిగింది. నా మిత్రుడు, సాయి భక్తుడైన శ్రీబాలాసాహెబ్ రేగేని పిలిచినట్లే, నన్ను కూడా ఆ ప్రాంతంలోని ప్రముఖ సాయి భక్తులు ఆహ్వానించారు. నాదిగానీ, శ్రీరేగేదిగానీ అంత దూర ప్రయాణం చేసే వయస్సు కానప్పటికీ, కేవలం సాయిబాబాపట్ల మాకున్న భక్తి మూలంగా మేము మద్రాసు వెళ్ళాము. నేను పూణే నుండి ఒంటరిగా బయలుదేరాను; కానీ నా ప్రయాణం సుఖంగా సాగి, నేను అక్కడికి చేరుకున్నాను. మా రాకకు సభికులు అత్యంత సంతోషించారు. ఏది జరిగినా అది కేవలం బాబా కృపవలనే జరుగుతుంది. మనం ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచాలి, ఆయనే మనల్ని కష్టాల నుండి విముక్తి చేసేవారు, మనమందరం ఆయన చేతిలో కీలుబొమ్మలం. మనం ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ప్రవర్తిద్దాం, ఆయన మన శ్రేయస్సుకు మార్గం చూపిస్తారు”.

