ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తారు!
2. బాబా చేసిన సహాయాలు
బాబా తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తారు!
ఓం శ్రీసాయినాథాయ నమః. నా పేరు మనస్విని. నేను హైదరాబాద్ వాసిని. నాకు బాబా అంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఏ గుడికి వెళ్లినా బాబా నామస్మరణే చేస్తాను. బాబా నా జీవితంలో చాలా అద్భుతాలు చేసారు. అందులో ఒకటి మీతో పంచుకుంటున్నాను. 2015లో నాకు పెళ్లైంది. నాకు పీసీఓడీ సమస్య ఉండటం వల్ల నేను గర్భవతినివ్వడం ఆలస్యమైంది . దాంతో నాకు టెన్షన్ మొదలైనప్పటికీ బాబా మీద నమ్మకంతో ఆయన చూసుకుంటారని అనుకున్నాను. సహజంగా గర్భవతినవ్వాలని 2 ఏళ్ళు వేచి చూసాను. కానీ నేను గర్భవతినవ్వలేదు. ఇంకా అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లి డాక్టరుని సంప్రదించాను. డాక్టర్ పీసీఓడీ సమస్య వల్ల అండాల ఎదుగుదల సరిగా లేదని, ఎదుగుదల కోసం టాబ్లెట్లు ఇచ్చారు. కానీ టాబ్లెట్ల వల్ల వృద్ధి కనపడలేదు. డాక్టర్ మోతాదు పెంచి ఇంజక్షన్ ఇచ్చారు. అయినా వృద్ధి జరగలేదు. డాక్టర్, "ఈనెల ఫలితం కనపడలేదు. వచ్చే నెల ప్రయత్నిద్దాం" అన్నారు. అప్పుడు నేను చాలా ఏడ్చాను. మేము అప్పట్లో ముంబాయిలో ఉండేవాళ్ళం. అక్కడినుండి శిరిడీకి 4 గంటల ప్రయాణం. నేను నా భర్తతో, "నా మనసు బాగాలేదు. శిరిడీ వెళ్లాలని ఉంది" అని చెప్పాను. ఆయన సరేననడంతో ఇద్దరం శిరిడీ వెళ్ళాము. అక్కడ నేను బాబాని, "బాబా! నేను గర్భవతినయ్యేలా చూడు. నాకు భయంగా ఉంది" అని చెప్పుకొని చాలా ఏడ్చాను. శిరీడీ నుండి వచ్చాక హైదరాబాద్ హాస్పిటళ్లలో చికిత్స బాగుంటుందని, అక్కడికి వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామని అనుకున్నాను. మావారు కూడా కంపెనీలో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేయసాగారు. నేను బేగంపేటలోని హాస్టల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలకు అవసరమైన కోచింగ్ కోసం ఎస్ఆర్ నగర్ లోని కోచింగ్ సెంటర్లో చేరాను. ఒక నెల గడిచేసరికి నాకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. హాస్టల్ ఫుడ్ పడటం లేదనుకున్నాను. అసలు ఫుడ్ తినాలనిపించేది కాదు. మరోపక్క మావారు లేరన్న దిగులు. రాత్రుళ్ళు చాలా ఏడ్చేదాన్ని. హాస్టల్ ఫుడ్ తినడం పూర్తిగా మానేచి చాలా నీరసించిపోయాను. అసలు నాకు ఎందుకిలా అవుతుందని చాలా టెన్షన్ పడేదాన్ని. ఆ సమయంలో హాస్టల్ ఫ్రెండ్ ఒకరు, "ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకో. ఇవన్నీ ప్రెగ్నెన్సీ సంకేతాలేమో?" అని చెప్పింది. అయితే అదివరకు ముంబాయి డాక్టర్ టెస్ట్ చేసి చెప్పిన విషయం ఆధారంగా "అలా ఏమీ లేదు. నేను ట్రీట్మెంట్ కోసమే హైదరాబాద్ వచ్చాను" అని తనతో చెప్పి ఊరుకున్నాను. ఆలా ఇంకో నెల గడిచింది. ఇక అప్పుడు నా బాధ చూడలేక నా ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చి, "టెస్టు చేసుకో" అని చెప్పింది. సరేనని టెస్ట్ చేసుకుంటే, పాజిటివ్ వచ్చింది. సమయానికి పక్కన నా కుటుంబం, నా భర్త లేకపోవడంతో నా ఆనందాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియక, 'బాబా..!' అని గట్టిగా ఏడ్చేసాను. మర్నాడు హాస్పిటల్‌కి వెళ్తే, "8 వారాల గర్భవతిని" అని డాక్టర్ చెప్పారు. పీసీఓడీ సమస్య వల్ల నెలసరి రావడం ఆలస్యం అవుతుందనుకున్నాను. అయితే ముంబాయి డాక్టర్ 'ఈ నెల సాధ్యం అవ్వదని' అంత నమ్మకముగా చెప్పినప్పటికీ బాబా తాము తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తామని నిరూపించారు(నేను ఇప్పటికీ ముంబాయి డాక్టర్ రిపోర్ట్ నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాను). బాబా దయవల్ల నాకు బాబు పుట్టాడు. తనకి 'సౌర్య సాయి' అని పేరు పెట్టుకున్నాము. ఇది నా జీవితంలో మర్చిపోలేని అద్భుతం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా చేసిన సహాయాలు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు జ్యోతి. నేను విజయనగరం నివాసిని. ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే నా మెడ కిందభాగంలో బాగా నొప్పి వచ్చింది. అది కాస్త ఎడమ చేయివరకు వెళ్లి, అక్కడ నుంచి గుండెకు చేరి తీవ్రమైన నొప్పి అనిపించి చెమటలు పట్టేసాయి. నేను తట్టుకోలేక సాయిబాబాని తలుచుకొని, ఊదీ రాసుకొని ఏడుస్తూ బాబాని ప్రార్థించాను. కొద్దిసేపట్లోనే నొప్పి ఉపశమించింది. అలాగే ఒకసారి కడుపునొప్పి విపరీతంగా వచ్చి చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు బాబాని తలుచుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యప్రదాయ నమః' అని చదువుకుంటూ బ్లాగులో వ్రాసాను. బాబా దయవల్ల నొప్పి ఉపశమించింది.
మా పిల్లల స్కూలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత రాత్రి పడుకునేవరకు ఫోన్, టీవీ చూస్తూ లేదా ఆటలు ఆడుతూ గడిపేస్తారు. చదవడం తక్కువ, ఆటలే ఎక్కువ. అందుకని నేను వాళ్ళను ట్యూషన్‌కి పంపాలని అనుకున్నాను. కానీ పిల్లలిద్దరూ ట్యూషన్‌కి వెళ్లమని మారం చేశారు. అప్పుడు నేను సాయిబాబాను తలుచుకుని, "పిల్లలు ట్యూషన్‌కి వెళ్లేలా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. అదేరోజు సాయంత్రం పిల్లలిద్దరూ ట్యూషన్‌కి వెళ్లారు. ఇలా బాబా నాకు చాలా చాలా సహాయాలు చేశారు. నాకు తోడుగా ఉన్నారు. 'నేనున్నాను, నీకేం భయం లేదు. నువ్వు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటావని' సందేశం ఇస్తూనే ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. మీరు నా తోడు లేకుంటే నేను ఏమైపోతానో తండ్రీ. ఎప్పుడూ నాకు తండ్రిలా తోడుగా ఉండి కాపాడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".

