ఈ భాగంలో అనుభవం:
- పెళ్ళైన 15ఏళ్లకు సంతాన భాగ్యం ప్రసాదించిన బాబా - మొదటి భాగం
సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు సునీత. మావారి పేరు జయరాజ్. మాది వైజాగ్. నాకు సాయి అంటే చాలా ఇష్టం. నా దినం సాయి నామస్మరణతో మొదలవుతుంది. 2001లో నాకు పెళ్లైంది. మా వైవాహిక జీవితంలో ఎటువంటి కలహాలు, కష్ఠాలు ఎప్పుడూ లేవు. కానీ ఏదో లోటు ఉండేది. కారణం మాకు పెళ్ళైన 14 ఏళ్ల వరకు పిల్లలు లేకపోవడం. ఎందరో దేవుళ్ళను వేడుకొని ఎన్నో పూజలు చేశాము. వైజాగ్‌లో ఉన్న డాక్టర్ల అందరినీ సంప్రదించాము. కానీ లాభం లేకపోయింది. ఎంత ఉన్నా మా జీవితంలో ఆనందం కరువైంది. అటువంటి మా జీవితాల్లో 14 ఏళ్ళ తర్వాత బాబా వరప్రసాదంగా మా బాబు రాకతో ఆనందం వెల్లివిరిసింది. బాబా ఇచ్చిన ఆ గొప్ప వరం గురించి చెప్పే ముందు బాబా నా జీవితంలోకి ఎలా వచ్చారో ముందు చెప్తాను.
నాకు పెళ్ళై 2, 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు నేను ఒక మేడం దగ్గర బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. ఆ మేడమ్ 'సాయి చరిత్ర' చదువు అని మొట్టమొదటిసారి 'సచ్చరిత్ర' పుస్తకం నాకిచ్చింది. అప్పటికి నాకు బాబా గురించి తెలియదు. అయినా నేను ఆ పుస్తకం చదివేదాన్ని. కానీ, కొంచెం చదివితే చాలు నిద్ర వచ్చేస్తుండేది. అందువల్ల కొంచెం చదవడం, పడుకోవడం, మళ్లీ కొంచెం చదవడం, పడుకుండిపోవడం చేసేదాన్ని. అంటే చదివింది మనసుకు పట్టించుకునేదాన్ని కాదు. అయినా బాబా అంటే ఇష్టం ఏర్పడింది. కానీ, లోతైన ప్రేమ కలగలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచే సరికి నాకే తెలియకుండానే నేను బాబాకి దగ్గరయ్యాను. ఎప్పుడూ బాబా నాతో ఉన్నారనే భావన నాలో ఎక్కువైంది. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తున్నా బాబా నాతోనే ఉన్నారన్న నమ్మకంతో ఉండేదాన్ని. ఆయన గురించే ఎక్కువగా ఆలోచిస్తుండేదాన్ని. రోజూ ఫోటో లో బాబాను చూసి మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. అన్ని విషయాలు ఆయనతో పంచుకుంటూ ఉండేదాన్ని. కొంతకాలానికి ఆరోగ్యం బాగాలేదని మా చిన్నాన్నని వైజాగ్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసారు. అప్పుడు మా కజిన్ బ్రదర్(మా చిన్నాన్నగారి అబ్బాయి(సాయిసురేష్)తో సమయం గడిపే అవకాశం వచ్చింది. మేము ఎలాంటి వాళ్ళమంటే, 'ఎవరు ఏమైపోయినా మనకి ఎందుకు? మనకి బాబా ఉన్నారు?' అని అనుకునే రకం. మేము ఎప్పుడు కలిసినా బాబా గురించే మాట్లాడుకునేవాళ్ళం. తన ద్వారా బాబా గురించి నాకు తెలియని విషయాలు తెలిసాయి. బాబా పట్ల నా అవగాహన విస్తృతమై, ఆయన మీద విశ్వాసం మరింత బలపడింది. ఆ తర్వాత నేను బాబా గురించి ఎక్కువగా చదవడం వల్ల ఆయనపై ప్రేమ మరింత అధికమైంది. ఎంతలా అంటే, బాబానే నా జీవితం అనేంతగా. అప్పటినుండి బాబా ప్రేమను ఇంకా ఇంకా అధికంగా పొందుతున్నాను. ఆ తండ్రి అనుగ్రహవర్షంలో తడుస్తున్నాను.
నేను బాబాని నా పెద్దకొడుకు అనుకుంటాను. ఎందుకంటే, నాకు పెళ్ళైన 14 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు(14 సంవత్సరాల తర్వాత బాబా అనుగ్రహంతో బాబు పుట్టాడు). బాబు పుట్టకముందు నాలో నేను బాబాని నా బిడ్డగా భావించేదాన్ని. ఎందుకో తెలియదు కానీ, నాకు ఎప్పుడూ అలానే అనిపించేది. నేను బాబాతో, "నాకు పిల్లల్ని ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. లేదంటే మీరు ఉన్నారు కదా నా కొడుకుగా. మీరే మమ్మల్ని కొడుకులా చూసుకోవాలి" అని ఎప్పుడూ మాట్లాడుకునేదాన్ని. బాబాని చూస్తే చాలు, అలా అనిపించేది నాకు. ఎవరైనా "పిల్లలు లేరా?" అని నన్ను అడిగితే, "ఎందుకు లేరు, బాబాయే నా బిడ్డ" అని అనేదాన్ని. ఇంకా, "బాబా నాకు బిడ్డను ఇస్తారు. లేకపోయినా పరవాలేదు. బాబా ఉన్నారు కదా!" అని ఎప్పుడూ అనేదాన్ని. బాబాని మాత్రం సదా "బాబా! నాకు బిడ్డను ఇవ్వండి. కానీ నేను శిరిడీ వచ్చిన తరువాత ఇవ్వండి" అని అడిగేదాన్ని(సాయి ఫ్రెండ్స్ ఇవన్ని బాబాకి నాకు మద్య జరిగిన సంభాషణలు. ఈ రోజు మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గాని, నన్ను మీరు పిచ్చిదాన్ని అనుకోవద్దు). కానీ నేను, మావారు శిరిడీ వెళ్ళాలని చాలాకాలంగా అనుకుంటున్నప్పటికీ వెళ్ళలేకపోయే వాళ్ళం. అలా ఉండగా మా జీవితంలో ఎన్నడూ జరగని ఒక అనుభవం జరిగింది. అదేమిటంటే, మా ఇంట్లో ఉన్న అక్వేరియంలోని చేపలు పిల్లలు పెట్టాయి. మేము చాలా సంతోషించాము. అప్పుడు నాకెందుకు అనిపించిందో గానీ, 'నాకు బిడ్డను ప్రసాదించడానికి బాబా మమ్మల్ని శిరిడీ రమ్మంటున్నారని' అనిపించింది. దాంతో మేము 2014, నవంబర్‌లో మొట్టమొదటిసారి శిరిడీ వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. మాతోపాటు మా అమ్మ వస్తానంటే, తనకి కూడా రిజర్వేషన్ చేసాము. ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. వీధిలో అందరికీ శిరిడీ వెళ్తున్నామని చెప్పి, ఎంతో ఆత్రంగా ఆరోజు కోసం ఎదురుచూసాను.
ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం 4 గంటలకు ప్రయాణానికి సిద్ధమవుతూ నీళ్ల ట్యాంక్‌లో నీళ్లు లేవని మోటార్ ఆన్ చేసి మర్చిపోయాము. మా ఇంటి మెడ మీద ఉన్న రెండు ట్యాంక్లూ నిండిపోయి నీళ్లు మేడపై నుంచి పైపుల ద్వారా కిందకి భీకరమైన శబ్దం చేస్తూ పోసాగాయి. ఆ శబ్దానికి నాకు భయమేసింది. ఆ స్థితిలో బాబా ఏదో చెప్తున్నారనిపించింది నాకు. కానీ నాకేమీ అర్థం కాలేదు. "బాబా! అంతా నీ దయ. అంతా మంచే జరగాల"ని బాబాని తలుచుకొని ఇంటి నుండి బయలుదేరి రైల్వేస్టేషన్‌కి వెళ్లి రైలు ఎక్కాము. బాబా దయవలన ప్రయాణం చాలా చక్కగా జరిగి మేము శిరిడీ చేరుకున్నాము. నేను మొట్టమొదటిసారి శిరిడీ నేలపై అడుగుపెట్టి, కాసేపట్లో బాబా దర్శనం చేసుకోబోతున్నమనే ఆనందంలో ఉబ్బితబ్బుబ్బి అయ్యాను. రూమ్‌కి వెళ్లి స్నానాలు చేసి బాబా దర్శనానికి వెళ్ళాము. మొదటిసారి బాబాని చూడగానే పట్టలేని ఆనందంతో నాకే తెలియకుండానే నా కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. బాబా తప్ప నాకు ఇంకేమీ కనిపించలేదు. మేము శిరిడీలో ఐదు రోజులు ఉన్నాము. ఆ ఐదు రోజుల్లో కాకడారతి, మధ్యాహ్నరతి, సంధ్యహారతి, శేజారతి అన్ని చూసాము. నేను ఎంతో ప్రశాంతతను అనుభవించాను. బాబా మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చారు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. అదే సమయంలో వైజాగ్‌లో హుధూద్ తుపాన్ బీభత్సం సృష్టించింది. వైజాగ్ అంతా నాశనం అయిపోయింది. ఆ విషయం తెలిసినప్పుడు, 'మేము శిరిడీ రావడానికి బయలుదేరిన రోజు ఉదయం పైపుల ద్వారా వచ్చిన భీకర సంకేతం రూపంలో 'ఏదో ప్రళయం రాబోతుంద'ని బాబా సూచించారని నాకు అప్పుడు అర్ధం అయ్యింది.
బాబాకి కొబ్బరికాయ సమర్పిస్తే, ఆ భక్తులకు బాబా బిడ్డను ప్రసాదించిన వృత్తాంతాలు మనం సచ్చరిత్రలో చదివాము. అందువలన శిరిడీలో బాబాకి కొబ్బరికాయ సమర్పిస్తే, బాబా నాకు బిడ్డను ఇస్తారని నాకనిపించింది. అందుకని నేను ఒక కొబ్బరికాయ తీసుకొని దర్శనానికి వెళ్ళాను. కానీ సెక్యూరిటీ గార్డులు కొబ్బరికాయని సమాధి మందిరంలోనికి తీసుకెళ్లనివ్వలే దు. నేను నా మనసులో, 'మనం బాబాకి ఏదైనా యిస్తామనుకుంటే, దానిని బాబా మన నుండి ఎలాగైనా తీసుకుంటారు కదా! మరి నా దగ్గర ఎలా తీసుకుంటారో బాబా' అని అనుకున్నాను. అందరం బాబా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మా అమ్మ టీ త్రాగుదామంటే, టీ స్టాల్‌కి వెళ్లి టీ త్రాగాము. ఆ పక్కన కొబ్బరికాయల షాపు ఉంది. మేము టీ త్రాగేసి అక్కడినుండి బయలుదేరుతుండగా ఒక చక్కని చిన్న పిల్లాడు మా దగ్గరకి వచ్చి నా చేయి పట్టుకొని, "నాకు కొబ్బరిబొండం కావాలి, ఇవ్వు" అని అడిగాడు. నేను ఆ షాపతనిని ధర ఎంత అని అడిగితే, పెద్దది 50, చిన్నది 40 రూపాయలని చెప్పాడు. నేను, "చిన్నది ఇవ్వు" అని చెప్పాను. కానీ ఆ పిల్లాడు, "నాకు పెద్దది కావాల"ని మారాము చేసాడు. నేను చివరికి వాడి ఇష్టప్రకారం పెద్ద కొబ్బరిబొండం కొని ఇచ్చాను. ఆ పిల్లాడు త్రాగుతుండగా మావారు, "మొత్తానికి బాబాని ఏడిపించావు" అని సరదాగా అన్నారు. వెంటనే నాకు, 'నేను ఇస్తాననుకున్న కొబ్బరికాయని బాబా ఎలా తీసుకుంటారో!' అని అనుకున్న విషయం గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూసాను. కానీ ఆ పిల్లాడు అక్కడ లేదు. మరెక్కడా కనిపించలేదు కూడా. ఆ రూపంలో బాబానే నేను ఇస్తానన్న కొబ్బరికాయని స్వీకరించారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా మా శిరిడీ యాత్ర చాలా బాగా జరిగింది. మనసు నిండా తీపి జ్ఞాపకాలతో శిరిడీ నుండి వైజాగ్‌కి తిరుగు ప్రయాణమయ్యాము.
మిగతా వివరాలు తరువాయి భాగంలో...
