ఈ భాగంలో అనుభవం:
- పెళ్ళైన 15ఏళ్లకు సంతాన భాగ్యం ప్రసాదించిన బాబా - రెండవ భాగం
సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు సునీత. మావారి పేరు జయరాజ్. మాది వైజాగ్. నేను ముందు భాగంలో బాబాతో నా అనుబంధం గురించి, మా మొదటి శిరిడీ యాత్ర గురించి చెప్పాను. ఇప్పుడు నేను కోరుకున్నట్లే మేము శిరిడీ నుంచి వచ్చిన తర్వాత బాబా ఇచ్చిన గొప్ప వరం గురించి చెప్తాను. మా మొదటి శిరిడీ యాత్ర చాలా బాగా జరిగింది. మేము మనసు నిండా తీపి జ్ఞాపకాలతో శిరిడీ నుండి వైజాగ్‌కి తిరుగు ప్రయాణమయ్యాము. మేము విజయవాడ చేరుకున్నాక హుధూద్ తుపాను కారణంగా ట్రైన్లు ఏవీ వైజాగ్ వెళ్ళడం లేదని తెలిసింది. అయినా నేను భయపడలేదు. 'అన్నింటికీ బాబా ఉన్నారు. ఆయన చూసుకుంటారు' అనుకున్నాను. బాబా దయవల్ల కొద్దిసేపటికి స్టేషన్ మైక్‌లో 'వైజాగ్ ట్రైన్ బయలుదేరుతుంద'ని చెప్పారు. మేము ఆ ట్రైన్ ఎక్కేసాము. వైజాగ్ చేరుకున్నాక చూస్తే, సిటీలో కరెంటు లేదు, నీళ్లు లేవు. అంతా భయంకరంగా ఉంది. కాకపోతే నేను శిరిడీ వెళ్లేరోజు మోటర్ వేసి మరిచిపోవడంతో పైన రెండు ట్యాంక్‌లు నిండిన కారణంగా మా ఇంటిలో మాత్రం నీళ్లు ఉన్నాయి. ఒక వారం రోజులపాటు నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాలేదు. అప్పుడు నేను, 'బాబా ప్రతి నిమిషం మమ్మల్ని కనిపెట్టుకొని చూస్తూ మాకు ఏ ఇబ్బంది లేకుండా చేసార'ని అనుకున్నాము.
మేము శిరిడీ నుండి వచ్చిన 3 నెలల తరువాత బాబా నాకు ఒక గొప్ప కానుక ఇచ్చారు. నేను డాక్టర్ దగ్గరకి వెళితే, 'నేను తల్లిని కాబోతున్నాన'ని చెప్పారు. ఆ క్షణం నాకు ఆయన బాబాలానే అనిపించి, ఆ డాక్టర్ కాళ్ళు పట్టుకొని, 'ఇవి నా బాబా చరణాలు' అని ఏడ్చేసాను. నిజంగా అది నాకు ఎంతో సంతోషకరమైన విషయం సాయి ఫ్రెండ్స్. నా ఆనందానికి అంతేలేదు. 'బాబా నాకు ఇంత గొప్ప కానుక యివ్వబోతున్నారా?' అని నా కళ్ళ నుండి ఆనందభాష్పాలు వచ్చాయి. బాబాకి నేను, మావారు శతకోటి వందనాలు చెప్పుకున్నాము. సాధారణంగా కడుపుతో ఉన్న సమయంలో అందరూ ఇంట్లో కనపడేలా చిన్న పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. నేను మాత్రం ఎటుచూసినా కనపడేలా ఇంటి నిండా బాబా ఫొటోలే పెట్టుకున్నాను. ఇకపోతే డాక్టర్ , "చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా బెడ్ రెస్ట్ ఉండాలి, మెట్లు ఎక్కడం, దిగడం చేయకూడదు" అని చెప్పారు. కానీ ఇంట్లో నేను, మావారు తప్ప పెద్దవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి. అదీకాక మా ఇంటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా బ్యూటీ పార్లర్‌ని కూడా నేనే చూసుకోవాలి. స్టాఫ్ ఉన్నా కానీ, నేను కూడా ఉండాలి. షాపుకి వెళ్ళకపోతే కాదు. ఇంకోవైపు పుట్టబోయే బిడ్డ కూడా ముఖ్యమే. అందువల్ల ఏమి చేద్దామని ముందు భయపడ్డాము, ఆలోచించాము. కాని, 'బాబా ఉన్నారు కదా! భయమెందుకు? అన్ని బాబానే చూసుకుంటారు' అని రోజూ ఇంటి పనులు చేసుకుంటూ షాపుకి కూడా వెళ్లి, రాత్రి 8.30కి ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. అందరూ ఏన్నో తిట్టారు. 'ఇంత ఆలస్యంగా ఇంటికి రాకూడదు', 'ఇలా తిరగాకూడదు', 'రెస్ట్ తీసుకోవాలి' అని ఇంకెన్నో పెద్దవాళ్ళు చెప్పేవారు. కానీ నేను ఎప్పుడూ దేనికీ ఆలోచించలేదు, భయపడలేదు. 'బాబా నాతో ఉన్నారు. నాకు ఏమీ కాదు' అనే గట్టి నమ్మకంతో వారంలో ఒక్క రోజు మాత్రమే ఇంటి దగ్గర ఉంటూ మిగతా రోజులు షాపుకి వెళ్లి వస్తుండేదాన్ని. డాక్టర్ 2015, నవంబర్ 8కి డెలివరీ డేట్ ఇవ్వగా నవంబర్ 7 వరకు పనులన్నీ నేనే చేసుకున్నాను. బాబా నన్ను కంటిపాపలా కాపు కాశారు. ఆయన దయవల్ల ఎప్పుడూ ఏ సమస్యా లేకుండా 9 నెలలు గడిచిపోయాయి.
2015, నవంబర్ 8వ తేది ఉదయం నేను ముందుగా సాయి మందిరంకి వెళ్లి, తర్వాత అటు నుంచి అటే హాస్పిటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యాను. అందరూ 'ఈ పిల్ల చెపితే వినలేదు, విశ్రాంతి తీసుకోలేదు, ఏమవుతుందో!' అని ఒకటే భయపడ్డారు. అయితే బాబా అద్భుతం చూపించారు. 5 కేజీల బరువుతో చక్కని బాబు పుట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు, భలే పుట్టాడని ఆనందించారు. చూశారా! బాబా నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో. బాబుకి 'సాయి పుష్కర్' అని పేరు పెట్టాము గానీ, ముద్దగా సాయికొడుకు అని పిలుస్తాను. బాబు పుట్టి ఒక నెలవుతూనే బాబుని తీసుకొని మునుపటిలా నేను షాపుకి వెళ్ళడం మొదలుపెట్టాను. చిన్నపిల్లాడిని అలా తిప్పకూడదు గాలి, ధూలి సోకుతుందని అందరూ అన్నారు. కానీ 'బాబా ఉన్నారు. ఆయనే చూసుకుంటారని' రోజూ బాబుని షాపుకి తీసుకెళ్ళేదాన్ని. ఒక్క రోజు కూడా బాబుకి దిష్టి తీయడం లాంటివి చేయలేదు. బాబా దయవల్ల నా సాయికొడుకుకి చిన్న జలుబు గాని, విరోచనాలు గాని, ఇంకా ఎటువంటి సమస్య గాని రాలేదు. రోజూ బాబా ఊదీ పెట్టేదాన్ని అంతే. బాబా నా బిడ్డకి ఏ ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అనుక్షణం బాబా తోడుంటే భయమెందుకు? నా బాబా నా కొడుకు రూపంలో నాతోనే ఉన్నారు. నా కొడుకు చిరునవ్వులో బాబా కనిపిస్తారు. ఇంత అందమైన కొడుకు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కొడుకుని చూస్తుంటే నాకు అనుక్షణం బాబానే గుర్తు వస్తారు. నేను ఇప్పుడు కూడా 'బాబా నా పెద్దకొడుకు, బాబా ప్రసాదించిన బిడ్డను నా చిన్నకొడుకు' అంటాను. నా మొబైల్ స్క్రీన్‌పైన నా ఇద్దరు కొడుకుల ఫోటోలు ఉంటాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నేను(సాయి సురేష్) ఇప్పుడు మా సిస్టర్ 2014 మొదటిసారి శిరిడీ వెళ్లొచ్చినప్పటినుండి తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి మధ్య ఉన్న మూడు నెలల కాలంలో జరిగిన ఒక అనుభవాన్ని చెప్తాను. 2014. సెప్టెంబరులో మా డాడీ హాస్పిటల్లో ఉన్న సమయంలో మా సిస్టర్‌కి బాబాపట్ల ఉన్న అమితమైన ప్రేమను చూసిన నాకు, వాళ్ళు నవంబర్‌లో శిరిడీ వెళ్లొచ్చాక(అదే నెలలో) వాళ్ళకి ఒకటిన్నర అడుగుల బాబా మూర్తి(విగ్రహం) ఇవ్వాలని ప్రేరణ కలిగింది. బాబాని అడిగితే, ఆయన సమ్మతించారు. కానీ నేను ఆ విషయం గురించి మా సిస్టర్‌తో మాట్లాడినప్పుడు తను ఏవో కొన్ని కారణాల వలన బాబా మూర్తిని తీసుకోవడానికి సుముఖత చూపలేదు. 'బాబా అనుగ్రహం ఉంది కాబట్టి, ఆయనే తను అంగీకరించేటట్లు చేస్తారు' అని నేను ఊరుకున్నాను. తర్వాత 2015, జనవరి నెలలో మా సిస్టర్, బావగారు సంక్రాంతికి మా సొంతూరు వెళ్లి, తిరిగి వైజాగ్ వెళ్ళేటప్పుడు దారిలో మా ఇంటికి వచ్చారు. అప్పుడు మా ఇంట్లో ఉన్న బాబాని చూసి మా సిస్టర్ ఎంతగానో మురిసిపోయింది. కాసేపు అలానే బాబాను చూస్తూ ఉండిపోయింది. తర్వాత తనకి బాబా మూర్తి ఇస్తానన్న ప్రస్తావన వచ్చి, తన సందేహాలకు నేను కొంత వివరణ ఇచ్చాను. దాంతో తను, "సరే, నేను అలోచించి నా నిర్ణయం చెప్తాన"ని వెళ్ళిపోయి
మరికొన్ని అనుభవాలు తరువాయి భాగాలలో ..

Om Sai Ram
ReplyDelete