సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కెప్టెన్ హాటే


సాయిభక్తుడు డాక్టర్ వినాయక్ రావు గోపీనాథ్ హాటే గారి ప్రస్తావన శ్రీసాయి సచ్చరిత్ర 29వ అధ్యాయంలో ఉంది. శ్రీసాయి సచ్చరిత్ర రచించిన శ్రీ హేమాడ్ పంత్(దభోల్కర్) గారు హాటే గారిని కెప్టెన్ హాటేగా సంబోధించారు.
హాటే గారు వృత్తిరీత్యా వైద్యులు. వారు దైవజ్ఞ సంతతికి చెందినవారు. హాటే గారు బాబా శిరిడీలో ఉన్నకాలంలో సైన్యంలో కెప్టెన్ గా పనిచేస్తూ పదోన్నతులు పొందుతూ తుదకు కల్నల్ గా రిటైర్ అయ్యారు. ఒకప్పుడతనికి బాబా స్వప్నంలో దర్శనమిచ్చి శిరిడీకి రప్పించారు. అతను బాబా పట్ల అమితమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉండేవాడు.

ఒకసారి హాటే గ్వాలియర్ లో నివసిస్తున్నప్పుడు బాబా స్వప్న దర్శనమిచ్చి, "నన్ను మర్చిపోయావా?" అని అడిగారు. అప్పుడు హటే బాబా పాదాలని పట్టుకుని, "బిడ్డ తల్లిని మర్చిపోతే, అతనికి ఇంకెక్కడ ఆశ్రయం లభిస్తుంది?" అని అన్నాడు. వెంటనే తాను తోటలోకి వెళ్లి చిక్కుడుకాయలను తెంపి, బియ్యం, పిండి, పప్పుదినుసులు మొదలగు వంట వస్తువులని, కొంత డబ్బుని దక్షిణగా సమకూర్చుకొని భక్తితో బాబాకి సమర్పించబోతుండగా అతనికి మెలకువ వచ్చింది. తనకి కలిగిన ఈ స్వప్నానికి హాటే సంతోషించి బాబాకి తాను స్వప్నంలో సమకూర్చిన వస్తువులతో శిరిడీకి వెళ్లి స్వయంగా వాటిని బాబాకు అర్పించాలని అనుకున్నాడు. కానీ తనకి వీలుపడక బొంబాయిలో నివసిస్తున్న తన మిత్రుడైన శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారికి తన స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తూ లేఖ వ్రాసి, తన తరపున కాకాసాహెబ్ గారిని శిరిడీ వెళ్లి వాటిని బాబాకు సమర్పించవలసిందిగా అభ్యర్ధించాడు. అందుకు సరిపడా డబ్బులను మనీ ఆర్డర్ ద్వారా పంపుతానని, వాటితో నైవేద్యానికి కావాల్సిన బియ్యం, పిండి, పప్పుదినుసులు, మంచిరకం చిక్కుడుకాయలను తీసుకోమని, అవి తీసుకోగా మిగిలిన డబ్బుని బాబాకి దక్షిణగా నివేదించమని అభ్యర్ధించుకున్నాడు. బాబాకి అర్పించిన తరువాత తనకోసం బాబా వద్ద ప్రసాదం తీసుకొని పోస్ట్ ద్వారా గ్వాలియర్ పంపమని కూడా కాకాసాహెబ్ ను హాటే కోరాడు.

హటే వద్ద నుండి మనీ ఆర్డర్ అందిన వెంటనే దీక్షిత్ శిరిడీ వెళ్లి కావలసిన అన్ని వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయగా, వంట వస్తువులన్నీ దొరికాయి కానీ చిక్కుడుకాయలు లభ్యం కాలేదు. ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నంతలో అక్కడికి కూరగాయలు అమ్మే ఒక స్త్రీ బుట్టనిండా చిక్కుడుకాయలతో వచ్చింది. అది చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. కావాల్సిన అన్ని వస్తువులు సమకూరడంతో దీక్షిత్ వాటిని తీసుకొని మశీదుకి వెళ్లి బాబాకు సమర్పించాడు. బాబా వాటిని నిమోన్కర్ కు అప్పజెప్పి మరునాడు వాటిని వండి నైవేద్యానికి తీసుకొని రమ్మని చెప్పారు. మరునాడు బాబా భోజనానికి కూర్చొని అన్నం, పప్పు, ఇతర వంటకాలన్నింటిని ప్రక్కకి తోసేసి చిక్కుడుకాయల కూరనే ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలిసిన హాటే ఎంతగానో సంతోషించాడు.

బాబా హస్తస్పర్శతో పవిత్రమైన రూపాయి నాణెం:

కొద్దిరోజుల తరువాత హాటేకి బాబా హస్తస్పర్శతో పవిత్రమైన ఒక రూపాయి నాణాన్ని తన ఇంటిలో ఉంచుకోవాలని ఒక కోరిక కలిగింది. ఆ కోరికను కూడా కరుణామయుడైన బాబా అనుగ్రహించారు.

ఒకరోజు సావల్ రామ్ అను గ్వాలియర్ వాస్తవ్యుడు తన కుమారుడు తప్పిపోవడం చేత బాధపడుతూ హాటేను కలిసాడు. అప్పుడు హాటే, “శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోండి, బాబా దయవలన తప్పక మీ కొడుకు మీకు దొరుకుతాడు” అని చెప్పాడు. అందుకు సావల్ రామ్ అంగీకరించి శిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఇంతలోనే తన కుమారుడి నుంచి సావల్ రామ్ కు ఒక ఉత్తరం వచ్చింది. తానిప్పుడు ఈజిప్టు దేశంలో క్షేమంగా ఉన్నానని, అక్కడి సైన్యంలో చేరానని, తొందరలోనే భారతదేశానికి తిరిగి వస్తున్నానని, ముంబై నగరంలో వారిని కలుస్తానని లేఖలో వివరించాడు. ఆ లేఖను చదివిన సావల్ రామ్ ఆనందానికి అవధుల్లేవు. తాను తన భార్యతో కలిసి శిరిడీ వెళ్ళడానికి బదులు బొంబాయి వెళ్లి తన కొడుకుని కలుసుకున్నాడు. ఆ సమయంలో అతని కొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అతని ఆరోగ్యం బాగా క్షీణించిపోయివుంది. కొడుకు పరిస్థితి చూసి  సావల్ రామ్ చలించిపోయి వెంటనే చికిత్స కోసం గ్వాలియర్ కి తీసుకొచ్చాడు. గ్వాలియర్ చేరుకున్నాక హటేను కలిసి ఈ విషయాన్ని తెలియచేసాడు. హటే అతనిని బాబా దర్శనం చేసుకోనందుకు మందలించి, “నువ్వు నీ మాటను తప్పావు. ఇప్పుడే నీ కొడుకుని తీసుకొని బాబా దర్శనానికి వెళ్ళు, జ్వరం తగ్గిపోతుంది” అని చెప్పాడు. సరేనని సావల్ రామ్ తన భార్య, కొడుకుతో శిరిడీ వెళ్ళడానికి బయలుదేరాడు. వెళ్లేముందు హటే అతని చేతికి ఒక రూపాయి నాణేన్ని ఇచ్చి, “దీనిని బాబా చేతిలో పెట్టి తిరిగి బాబా ప్రసాదంగా దానిని తీసుకొనిరమ్మ”ని చెప్పాడు. అతడు బాబా హస్తస్పర్శతో  పవిత్రమైన ఆ నాణేన్ని పూజలో పెట్టుకోవాలని ఆశించాడు.

సావల్ రామ్ శిరిడీ చేరి బాబా పాదాలకు నమస్కరించుకొని దక్షిణను ఇచ్చాడు. దాన్ని బాబా తన జేబులో వేసుకున్నారు. ఆ తరువాత అతను హటే ఇచ్చిన నాణాన్ని ఇవ్వగా, బాబా దానిని తదేకంగా చూస్తూ, తన బొటనవేలుతో కిందకి పైకి కాసేపు ఎగురవేసి, సావల్ రామ్ వైపు చూసి, “ఈ నాణాన్ని ఊదీ ప్రసాదంతో పాటు దాని యజమానికి అందజేయి. అతనినుండి నాకేమీ వద్దు, తనని సుఖశాంతులతో ఉండమని చెప్పు” అని అన్నారు. సావల్ రామ్ తన శిరిడీ యాత్రను ముగించుకుని గ్వాలియర్ కు తిరిగి వచ్చాడు. హాటేను కలుసుకొని శిరిడీలో జరిగినదంతా చెప్పాడు. బాబా తనను ఆశీర్వదించి, తన కోరికను మన్నించారని హాటే చాలా సంతోషించాడు. బాబా ఎల్లప్పుడూ మంచి ఆలోచనలను ప్రోత్సహిస్తారని అనుకున్నాడు. సావల్ రామ్ తన కొడుకు కోలుకుంటున్నాడని హాటేకు చెప్పి బాబా తిరిగిచ్చిన నాణేన్ని హాటేకు ఇచ్చాడు. హాటే ఆ నాణేన్ని చూసి, అది తాను ఇచ్చిన నాణెం కాదని బాధపడి సావల్ రామ్ కి తిరిగిచ్చి, మళ్ళీ శిరిడీ వెళ్లి ఆ నాణేన్ని తీసుకొని రమ్మన్నాడు. సావల్ రామ్ ఇంటికి చేరి తన భార్యకు ఈ విషయం చెప్పగా, ఆమె వెంటనే లోపలికి వెళ్లి హాటే ఇచ్చిన నాణేన్ని తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టి, భద్రంగా ఆ నాణేన్ని తాను జాగ్రత్తగా దాచిపెట్టానని చెప్పింది. మరుసటిరోజు సావల్ రామ్ జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పి, ఆ నాణేన్ని తన భార్య భద్రంగా దాచిపెట్టిందని చెప్పి, దానిని హాటేకు అందించాడు. బాబా ప్రసాదంగా లభించిన ఆ నాణేన్ని చూసి హాటే సంతోషంతో ఉప్పొంగిపోయాడు. దానిని పూజలో పెట్టుకొని హాటే ఎంతో తృప్తిచెందాడు.

హాటే మనుమరాలైన శ్రీమతి దేవికా పటేల్ గారు హాటే మరణానంతరం జన్మించారు. ఆమె కొన్ని వివరాలిలా తెలిపారు. హాటేగారికి ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం వాళ్ళెవరూ సజీవులుగా లేరు. హటే కొడుకు మేజర్ ప్రతాప్ హాటే గారి ఒక్కగానొక్క కుమార్తె శ్రీమతి దేవికగారు. ప్రతాప్ హాటే కూడా బాబాకి గొప్ప భక్తులు.

శ్రీమతి దేవికా పటేల్ భర్త డాక్టర్ అల్తాఫ్ పటేల్. అతను వైద్య వృత్తి చేస్తున్నారు. ముంబాయిలోని జస్లోక్ హాస్పిటల్లో డైరెక్టర్ అఫ్ మెడిసిన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతను టైమ్స్ అఫ్ ఇండియా దినపత్రికలో 'ముంబై మిర్రర్' అనే కాలమ్ ని వ్రాస్తూ వుంటారు. అతడు మొదట నాస్తికుడైనప్పటికీ బాబా మహిమలను స్వయంగా అనుభూతి చెంది బాబా భక్తుడయ్యారు.

శ్రీమతి దేవికా పటేల్ బాబా హస్తస్పర్శ పొందిన పవిత్ర నాణెం గురించి ఇలా తెలిపారు.. "ఆ నాణెం హాటే గారి పెద్దకుమారుడి దగ్గర ఉండేదిఅతను కుటుంబసభ్యులెవ్వరికీ దాని వివరాలు తెలియజేయకుండా ఎక్కడో దాచిపెట్టేసాడు. ఒకప్పుడు నేను పెద్దనాన్నగారితో, "బ్లాంక్ చెక్ ఇస్తాను, అందుకు బదులుగా ఆ రూపాయి నాణాన్ని నాకివ్వమ"ని అడిగాను కానీ, ఆయన అందుకు ఒప్పుకోలేదు. కెనడాలో వుండే మా బంధువు ఒకరు కూడా ఆ నాణెం పొందడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్దనాన్న, పెద్దమ్మ, వాళ్ళ ఒక్కగానొక్క కుమార్తె ఇప్పుడు సజీవులుగా లేనందున ఆ నాణెం వివరాలు తెలియకుండా రహస్యంగా ఉండిపోయాయి".


Contact Details:
Smt.Devika Altaf Patel 
Grand Daughter of Dr.Colonel Vinayakrao Gopinath Hate
15/B/1, Woodlands Apartments,
Near Kemp's Corner Fly Over Bridge, 
67, Pedder Road, 
Mumbai-400 026. 
Email:  devikapatel486@msn.com   

(Source: Holy Shri Sai Satcharitra Chapter 29, Shri Sai Leela Magazine, Personal Interview Smt.Shreya Nagaraj had with Smt.Devika Altaf Patel, Grand Daughter of Late Dr.Colonel Vinayakrao Gopinath Hate Photo Courtesy: Smt.Devika Patel
http://saiamrithadhara.com/mahabhakthas/vinayakrao_gopinath_hate.html)

4 comments:

  1. జై సాయిరాం జై గురుదత్త!

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo