సాయి వచనం:-
'దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును. నాయందు విశ్వాసముంచుము. భయపడకు, ఆందోళనపడవద్దు.'

'సాయిభక్తులకు శ్రీసాయినాథుడే దైవం, సాధన, మార్గం, గమ్యం' - శ్రీబాబూజీ.

సత్సంగం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒకసారి పూనా నుండి ఒకాయన వచ్చి పూజ్యశ్రీ మాస్టరుగారిని యిలా అడిగాడు: "మాస్టరుగారూ! మేము చాలా దూరంలో వున్నాము. నేను సత్సంగాలు చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో సెలవివ్వవలసినది" అని.

అప్పుడు మాస్టరుగారిలా చెప్పారు: "సత్సంగము, భజన అనే పుస్తకంలో ఎలా చేసుకోవాలో వ్రాసాను. భజనలు సులభమైన రీతిన అందరూ పాడుకోగలవిగా ఉండాలి. నైవేద్యాలు ఖర్చు ఎక్కువ లేకుండా అతి పేదవారు సైతం చేయగలదిగా వుండాలి. సత్సంగాలు చేయడానికి పేద ధనిక భేదం పాటించకుండా ఎవరింటికైనా వెళ్లి చేయాలి. సత్సంగ సభ్యులంతా విభేదాలు లేకుండా కలిసి మెలిసి వుండాలి.

ముఖ్యంగా సత్సంగం నిర్వహించేటప్పుడు 'నేను చేస్తున్నాను" అనే భావన రానివ్వకూడదు. సాధారణంగా సత్సంగాలు నిర్వహించేవారిని ఇతరులు గౌరవించడం జరుగుతుంది. అప్పుడు మనమేదో గొప్పవాళ్ళమయినట్లు, తక్కినవాళ్లు మనం చెప్పే వాటిని అనుసరించే వాళ్లయినట్లు భావన కలుగుతుంది. అంతేగాక నేను బాబా చెప్పినట్లు నడుచుకొంటున్నాననే భావన మొదలై అది వ్రేళ్లూనుకోని వృక్షమవుతుంది. అందుకని మనం చెప్పినట్లు అవతలి వాళ్ళు నడుచుకోవాలనుకుంటాము. అవతలి వాళ్ళపై అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తాము. బాబా చెప్పిన వాటిని నిజంగా అనుసరించేవారెవరూ అలా అనుకోరు. ఇంకా ఆయన చెప్పినట్లు ప్రవర్తించాలి అనే తపన వుండి, తాను చేయనివే ఎక్కువగా అనిపిస్తూ, తానెంతో తక్కువ చేస్తున్నట్లు అనిపించి లోపల ఆవేదన కలుగుతుంది. అదీ సరియైన మార్గాన మనం పోతున్నట్లు నిరూపణ. అలాగాక కొందరు పైకి మాత్రం మాదేముందండీ, అంతా ఆయనే చేయించుకుంటున్నారు అని అన్నప్పటికీ లోపల మాత్రం తాము చేస్తున్నాననే గర్వం తొంగి చూస్తుంటుంది. అందుకని అనడం కాదు ముఖ్యం - అనుకోవడము ముఖ్యము. మనలను గూర్చి మనం ఏమనుకుంటున్నామన్నది నిశితంగా ఆలోచించుకోవాలి. మన ప్రవర్తనను మలుచుకొంటూ పోవాలి. మన సత్సంగానికి ఎంత మంది వచ్చారు, ఎంత మందిని చేర్చగలిగాము అనేది ముఖ్యం కాదు, మనం ఎంత సేపు బాబా ధ్యాసలో గడుపుతున్నాము అనేదే ముఖ్యము.

సత్సంగం అంటే మంచి సాంగత్యము అన్న అర్ధము. మనము సత్సంగానికి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే అక్కడ సత్సంగానికి కావలసిన ఏర్పాట్లలో సహాయపడవచ్చు. సత్సంగానికి వెళ్ళింది మొదలు వచ్చే వరకు బాబా స్మరణలో గడపాలి. ఎవరితో మాట్లాడినా బాబా లీలలు, అనుభవాల గురించే మాట్లాడుకోవాలి గానీ ఇతర సంభాషణలు చేయకూడదు. వాడిట్లా, వీడిట్లా అని మాట్లాడకూడదు. మనమలా వున్నా ఇతరులు అలా వుండరు గదా! అని అంటే మన వరకూ మనం సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి. సత్సంగంలోని వారంతా భేద భావాలూ లేకుండా ఒకే కుటుంబంలోని వారిలాగా కలిసిపోవాలి. ఎవరికి ఏ సహాయం అవసరమైన ఒకరికొకరు ఆదుకోవాలి. చిన్న చిన్న విభేదాలు వచ్చినా సర్దుకుపోవాలి".
source : భగవాన్ శ్రీ భరద్వాజ(రచన: శ్రీమతి శ్రీదేవి)

పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ గారు సత్సంగం గురించి చెప్పిన వివరాలను కూడా క్రింది వీడియోని చూసి తెలుసుకోండి. అప్పుడే మనకు సరైన అవగాహనా ఏర్పడుతుంది.




3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo