1. కష్టాలు మరీ భయంకరమైన విపత్తుగా పరిణమించకముందే బాబా మనల్ని రక్షిస్తారు
2. మా ఇంట పూజకొచ్చిన బాబా
కష్టాలు మరీ భయంకరమైన విపత్తుగా పరిణమించకముందే బాబా మనల్ని రక్షిస్తారు
నా పేరు సాహిత్య. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. యాభై ఏళ్ళు పైబడ్డ మా అమ్మకి గత కొన్ని సంవత్సరాలుగా నెలసరి సక్రమంగా రాక మూడునెలలకు ఒకసారి వస్తుండేది. ఆ వయస్సులో మెనోపాజ్ దశ కారణంగా అలా వస్తుందని మేము వదిలేశాం. అయితే మరికొన్ని రోజుల్లో మా అన్నయ్య పెళ్లి ఉందనగా హఠాత్తుగా అమ్మకి నడుము నొప్పి మొదలైంది. అది సాధారణంగా నెలసరి సమయంలో వచ్చే నొప్పే. కానీ ఎంతకీ నెలసరి రాలేదు. దాంతో పెళ్లి సమయానికి ఎమన్నా ఇబ్బంది అవుతుందేమోనని చాలా భయపడ్డాము. అప్పుడు నేను, "బాబా! అమ్మకి నెలసరి వలన ఇబ్బంది కలగకుండా అన్నయ్య పెళ్ళి బాగా జరగాలి" అని బాబాని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లు అమ్మకి నెలసరి రాకుండా చేసి, అన్నయ్య పెళ్లి చక్కగా జరిగేలా అనుగ్రహించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
అన్నయ్య పెళ్లి అయ్యాక హఠాత్తుగా ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్, దగ్గు మొదలయ్యాయి. మొదట మేము పెద్దగా పట్టించుకోక అదే తగ్గిపోతుంది అనుకున్నాము కానీ, తగ్గలేదు. దాంతో ఇంట్లో అందరినీ కరోనా టెస్టు చేయించుకోమని అన్నారు. కరోనా వచ్చిన చాలాకాలం వరకు బాబా దయవలన మేము ఒక్కసారి కూడా కరోనా టెస్టు చేయించుకోలేదు. అలాంటిది మొదటిసారి కరోనా టెస్టు అనేసరికి మాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. వెంటనే నాకు బాబా గుర్తొచ్చి, "బాబా! మాకు కరోనా టెస్టులో నెగిటివ్ రావాలి" అని అనుకున్నాను. బాబా దయవలన అందరికీ కరోనా నెగిటివ్ వచ్చింది. అది తెలిసి మాకు చాలా ఉపశమనంగా అనిపించింది. మేము పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. "థాంక్యూ సో మచ్ బాబా".
తరువాత బాబా దయవలన జ్వరం తగ్గినప్పటికీ దగ్గు మాత్రం తగ్గలేదు. ఇంట్లో అందరికీ ఒకటే దగ్గు. నేనేమో తొమ్మిది నెలల గర్భిణిని, అమ్మకేమో హెర్నియా ఆపరేషన్ జరిగింది. అందువల్ల మా ఇద్దరికీ దగ్గు వలన చాలా ప్రమాదముంది. కానీ ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గలేదు. చెప్పుకోడానికి చిన్న జబ్బే అయినా, నిద్రలేక అందరమూ నరకం అనుభవించాం. చివరికి నేను, "బాబా! ఈ దగ్గు మీ దయతో తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల అప్పటికే మేము చేయించుకున్న ఎక్స్-రేలు, రకరకాలు టెస్టుల రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. చివరికి రెండు వారాలపాటు అనుభవించిన దగ్గు నుండి పూర్తిగా ఉపశమనం లభించింది. "థాంక్యూ బాబా".
ఈ అనుభవాల ద్వారా పూర్వ కర్మల ఫలితంగా వచ్చే కొన్ని కష్టాలు అనుభవించాల్సిందేనని, దానివల్ల ఆ కర్మలు అంతటితో తీరిపోతాయని, అలాగే ఆ కష్టాలు మరీ భయంకరమైన విపత్తుగా పరిణమించకముందే బాబా మనల్ని రక్షిస్తారని నాకు అర్థమైంది. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ మీద భక్తి ఇలాగే ఉండేటట్లు, మేమంతా సన్మార్గంలో నడిచేటట్లు ఆశీర్వదించండి బాబా".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!
మా ఇంట పూజకొచ్చిన బాబా
నా పేరు ఉష. నేను సాయిభక్తురాలిని. నాకు మా ఇంట్లో బాబా పూజ చేయించాలని చాలా కోరికగా ఉండేది. కానీ, నాకు అదృష్టం కలిసిరాలేదు. 6 సంవత్సరాలైనా నా కోరిక నెరవేరలేదు. ఆరు సంవత్సరాల తర్వాత ఒకరోజు నా సహాద్యోగి అయిన పావని మేడమ్ వాళ్ళింట్లో బాబా పూజకి నన్ను ఆహ్వానించారు. ఆ పూజకి వెళ్లొచ్చిన తర్వాత ఎలాగైనా సరే మా ఇంట్లో బాబా పూజ చేయించుకోవాలని నాకు చాలా బలంగా అనిపించింది. వెంటనే బాబా అనుగ్రహం కూడా నాకు లభించింది. 2021, ఫిబ్రవరి 20వ తేదీన ఇంట్లో పూజకు అవసరమైన బాబా ఫోటో, ఒక చిన్న బాబా విగ్రహం దొరికాయి. అంతలోనే ఊహించని రీతిన పెద్ద బాబా విగ్రహం మా ఇంటికి వచ్చింది. ఆ బాబాను చూస్తూనే నా కళ్ళవెంట నీళ్లు వచ్చేశాయి. సాక్షాత్తు బాబానే మా ఇంట్లో కూర్చున్నట్టుగా అనిపించింది. ఆ విధంగా బాబా మా ఇంట కొలువుతీరారు. "థాంక్యూ సో మచ్ బాబా".
