1. బాబా ఆశీస్సులు
2. ఆరోగ్యాన్ని అనుగ్రహించిన బాబా
3. బాబా దయవల్ల జలుబు నుండి ఉపశమనం
బాబా ఆశీస్సులు
అందరికీ నమస్తే. నా పేరు అంజలి. 2021 చివరిలో నా కంటి రెప్పల మీద చిన్న చిన్న దద్దుర్లు వచ్చాయి. వాటిపై బాబా ఊదీ పెడుతూ, "అవి తగ్గాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్నిరోజులకి దద్దుర్లు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే నేను వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుని వేయించుకోవాలో, వద్దో బాబాని అడిగి తెలుసుకోవాలని అనుకున్నాను. మరుసటిరోజు తెల్లారి 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో వాక్సిన్‍కి సంబంధించిన ఈ క్రింది మెసేజ్ వచ్చింది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఆ సందేశం నా గురించే అని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. దాంతో నేను, నా భర్త వ్యాక్సిన్ వేయించుకున్నాము. బాబా దయవల్ల మాకు జ్వరం రాలేదు. మాకు నార్మల్ గానే అనిపించింది.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
ఆరోగ్యాన్ని అనుగ్రహించిన బాబా
నేను సాయిభక్తురాలిని. ముందుగా శ్రీసాయి దివ్య పాదపద్మములకు నా నమస్కారాలు. 2021 చివరిలో మా పిల్లలకి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. వాళ్ళకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవో ఒకటి వస్తుండేవి. ‘అవి తగ్గిపోవాల’ని ఆ సాయినాథునికి చెప్పుకున్నాను. అలాగే, మా అన్న కొడుకు, చెల్లెలి కొడుకు జ్వరంతో బాధపడుతుంటే వాళ్లకోసం కూడా 'వాళ్ళకి జ్వరం తగ్గాల’ని అనుకున్నాను. అంతేకాదు, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని పఠించి బాబా ఊదీని వాళ్ళకి పెట్టాను. బాబా దయవల్ల అందరి ఆరోగ్యాలూ కుదుటపడ్డాయి అలాగే, నాకు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే, బాబా ఊదీ పెట్టుకుని, బాబా నామాన్ని పఠించాను. బాబా దయవల్ల నా ఆరోగ్యం కూడా చక్కబడింది. రోజూ ఈ బ్లాగులో ప్రచురింపబడే అనుభవాలు చదువుతూ నేను సాయినాథుని పాదాలకు మరింత చేరువవుతున్నానని అనిపిస్తోంది. ఈ బ్లాగులోని తోటి సాయిభక్తుల అనుభవాలు చదవడం ద్వారా నాకు తెలియని విషయాలను తెలుసుకుంటున్నాను, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో, సాయినాథుని ఎలా అడగాలో అనే విషయాలు నేను నేర్చుకున్నాను. సాయినాథునికి మరియు సాయిభక్తులకు నా ధన్యవాదాలు.
బాబా దయవల్ల జలుబు నుండి ఉపశమనం
నా పేరు శ్రీలక్ష్మి. 2021 చివరిలో మా పాపకి బాగా జలుబు చేసి, ఊపిరి కూడా సరిగా తీసుకోలేక 8 రోజులు చాలా బాధపడింది. అప్పుడు నేను, "బాబా! పాపకి తొందరగా తగ్గిపోవాల"ని బాబాకి చెప్పుకుని బాబా ఊదీ పాప నుదుటన పెట్టి, మరికొంత ఊదీ పాలలో వేసి ఇవ్వటం చేశాను. బాబా కృపతో తనకి తగ్గిపోతుందని నాకు నమ్మకం ఉన్నప్పటికీ మా ఇంట్లోవాళ్ళు భయంతో పాపని హాస్పిటల్‍కి తీసుకువెళదామని గోల చేసారు. దాంతో హాస్పిటల్‍కి వెళ్ళాం కానీ, డాక్టరు ఏమి చెప్తారోనని నాకు భయమేసింది. అయినా బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటారని నమ్మకంతో డాక్టరుతో నేను, "పదిరోజుల నుండి బాగా జలుబు చేసి పాపకి బాగులేదు. మూడు, నాలుగు రోజుల నుంచి దగ్గు కూడా వస్తుంది" అని చెప్పాను. అప్పుడు అయన, "ఏం పర్లేదు అమ్మ. పాపకి తగ్గిపోతుంది" అని చెప్పి ఐదు రోజులకి టాబ్లెట్లు ఇచ్చారు. బాబా దయవల్ల పాపకి నయమైంది. "ధన్యవాదాలు బాబా".
జై జై సాయి జై జై సాయి జై జై సాయి!!!
