సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1000వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీ దర్శనానుభూతుల సమాహారం

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అంజునా గుప్తా. మాది నర్సంపేట, వరంగల్ జిల్లా. నేను మీకు సుపరిచితురాలిని. నేను ఇంతకు ముందు నా అనుభవాలు మూడు పంచుకున్నాను. ఇప్పుడు పంచుకుంటున్న వాటిని అనుభవాలని అనను. ఎందుకంటే, ఇవి నా శిరిడీ సందర్శనాలకి సంబంధించిన నా అనుభూతుల సమాహారం.


మొదటి శిరిడీ దర్శనం:


నేను 1994 నుండి సాయిబాబా భక్తురాలిని. నిజానికి నేను అంతకుముందే ఒకసారి(ఖచ్చితంగా ఏ సంవత్సరం అన్నది గుర్తులేదు) నేను శిరిడీ దర్శించాను. మేము వైశ్యులం. నేను, నా భర్త ఒకసారి మా కుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన వారం రోజుల టూర్‌కి వెళ్ళాం. ఆ టూర్‌లో మేము దర్శించిన ప్రదేశాలలో శిరిడీ కూడా ఒకటి. అదే మేము మొదటిసారి శిరిడీ దర్శించడం. అయితే అప్పటికి నాకు శిరిడీ అంటే ఏంటో, సాయిబాబా అంటే ఏంటో, బాబా తత్వం ఏంటో తెలీదు. 'బాబా ప్రేమ స్వరూపుడని, దయామయుడని, కరుణా సాగరుడని, అడిగినవారికి, అడగనివారికి వరాలిచ్చే దైవమని, పిలిస్తే పలికి వెన్నంటే ఉంటాడ'ని తెలియదు. ఇప్పుడంటే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి 'సాయీ' అనగానే చమత్కారంగా నవ్వుతూ ఆనందిస్తూ ఉంటారు. కానీ అప్పటిరోజుల్లో సాయినాథుడి గురించి పెద్దగా ప్రచారం లేదు. అలాంటి రోజుల్లోనే నేను, మావారు శిరిడీ వెళ్ళాము, కాకడ హారతికి హజరయ్యాం. అప్పట్లో భక్తులకు రోజ్ వాటర్, గంగాజలం తీసుకెళ్ళి స్వహస్తాలతో సాయినాథునికి సమర్పించుకునే అవకాశం ఉండేది. తర్వాత అక్కడే సమాధి మందిరం ప్రధాన హాల్లో కూర్చుని బాబాకి జరిగే అభిషేకాన్ని, మంగళస్నానాన్ని, అలంకరణను తిలకించే వీలుండేది. బయట గులాబీలు, దవనం, సబ్జా దళాలతో కలిపి పుష్పగుఛ్ఛాలుగా మలచి అమ్మేవాళ్ళు. అవి తీసుకొచ్చి బాబా సమాధి మీద మనమే స్వయంగా పెట్టి దణ్ణం పెట్టుకునే సదుపాయం ఉండేది. అలా నేను బాబాను దర్శించుకుని బయటకి వచ్చే మార్గంలో ప్రవేశద్వారానికి సమీపంలో సమాధి అరుగును ఆనుకొని కూర్చుని ఉన్న పూజారి బాబాకి సమాధి మీద భక్తులు సమర్పించుకున్న పుష్పగుచ్ఛాలలోని ఒక పువ్వు తీసి నాకు ఇచ్చారు. నా ముందు, వెనక చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళలో ఎవరికీ పూలు ఇవ్వలేదు. అంతటి భాగ్యాన్ని ఆ సాయినాథుడు నాకు మొదటి దర్శనంలోనే ప్రసాదించినా నేను ఆయనను ఆ క్షణం నుంచి పట్టుకోలేకపోయాను. ఇది ఆ బాబా తండ్రి గురించి ఏమీ తెలియని రోజుల్లో నాకు జరిగిన నా మొట్టమొదటి అనుభూతి.


రెండోసారి శిరిడీ దర్శనం:


2013, అక్టోబర్ 21న నేను రెండోసారి శిరిడీ వెళ్ళాను. అప్పటి నా ప్రయాణం గురించి గుర్తు చేసుకుంటుంటే నాకు చాలా దుఃఖం వస్తుంది, అదే సమయంలో సంతోషం కూడా కలుగుతుంది. నిజానికి అప్పుడు నాకు శిరిడీ వెళ్ళాలన్న ఆలోచనగానీ, ప్రణాళికగానీ లేవు. బాబానే నాకు తమ దర్శన భాగ్యాన్ని మరోసారి అనుగ్రహించారు. వివరాలలోకి వెళితే... మేము రమణానందమహర్షి వారి శిష్యులం. అప్పట్లో మహర్షి భక్తి టీవీలో బాబాతత్వం గురించి, బాబాతో సహజీవనం చేసిన నాటి భక్తుల గురించి వివరిస్తుండేవారు. ఆయన బాబాతత్వం, బాబా లీలల్లోని భావార్ధం గురించి చాలా లోతుగా వివరించి చెప్తుంటే, అప్పటికే సాయిభక్తులమైన మాకు ఎంతగానో నచ్చేవి. తెలియని ఎన్నో విషయాలు వారి ప్రవచనాల ద్వారా తెలుసుకుంటుండటం వల్ల బాబాపై భక్తిశ్రద్ధలు మరింతగా పెరిగి బాబాను విపరీతంగా ప్రేమిస్తుండేదాన్ని. 2011, నవంబర్, కార్తీకమాసంలో నేను, మావారు మొదటిసారి మహర్షి వారిని దర్శించుకున్నాము. అప్పటినుంచి వారి ప్రవచనాలు చెప్పినప్పుడు, కార్యక్రమాలు ఉన్నప్పుడు కుదిరితే నేను, నా భర్త తప్పకుండ హాజరవుతుండేవాళ్ళం. కనీసం శివరాత్రి వేడుకలకైనా వెళ్లేవాళ్ళం. అలా 2012, 2013లో వెళ్లి వచ్చాము. తరువాత 2013 అక్టోబర్లో మహర్షి శిరిడీలో 11 రోజులు ప్రవచనం పెట్టారు. ఆ విషయం తెలిసినా కూడా మాకు శిరిడీ వెళ్లాలన్న ఆలోచన లేదు. దూరమని కాదుగానీ మా కుటుంబ పరిస్థితుల రిత్యా వెళ్లగలిగే స్థితిలో లేము. మా ఇంట్లో, మా శరీరంలో కూడా శక్తి లేదు(ఆర్థికపరమైన విషయం కాదు. అది వేరే విషయం. దాన్ని అతి త్వరలో మీతో పంచుకుంటాను). అందుకనే మేము శిరిడీ వెళ్ళే ఆలోచన చేయలేదు. కానీ ఆ సాయినాథుడు ఊరుకోడుగా! ఆయన ఎవరినైతే తమ చెంతకు రప్పించుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితిల్లో ఉన్నా గాలమేసి మరీ రప్పించుకుంటారు.


అనుకోకుండా మహర్షి వారికి దగ్గరగా ఉండే ఒక సన్నిహితురాలు నాకు ఫోన్ చేసి, "ఫ్రెండ్స్ అందరం శిరిడీ వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నాము. అంజనా నువ్వు కూడా వస్తున్నావా?" అని అడిగారు. "నేను రావడం లేదు" అని చెప్పాను. అందుకు తను కారణమేమిటని అడిగితే, "మా కుటుంబ పరిస్థితులు మీకు తెలిసిందే కదా!" అని చెప్పేసి ఊరుకున్నాను. నేను అలా చెప్పేసరికి తను మరేం మాట్లాడలేకపోయారు. నేను కూడా దాని గురించి మళ్లీ ఆలోచించలేదు. తరువాత వాళ్ళ శిరిడీ ప్రయాణానికి 10 రోజులు ఉందనగా అక్టోబర్ 19న నా స్నేహితురాలు, "శిరిడీ వెళ్తున్న గ్రూపులో అనుకోకుండా ఒకరు తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు. కాబట్టి వాళ్ళ స్థానంలో నువ్వు రా!" అని చెప్పి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. తను నాతో, "అంతా బాబా చూసుకుంటారు. నీ పరిస్థితి కూడా చక్కపడొచ్చు. నువ్వు ఏమీ ఆలోచించక వచ్చేయి" అని అంది. ఇక ఆ విషయం గురించి నేను, మావారు చర్చించుకున్న మీదట మావారు, "సరే వెళ్ళమ"ని తన అంగీకారాన్ని తెలిపారు. నేను వాళ్ళతో వెళ్ళడానికి, తరువాత మావారు వీలు చూసుకుని తన ఆఫీసులో సెలవు తీసుకుని బయలుదేరేలా ప్రణాళిక చేసుకున్నాము. ఆ విధంగా రెండోసారి శిరిడీకి ప్రయాణమైన నేను అక్కడ 11 నిద్రలు చేశాను. ఉదయం లేవడం, బాబా దర్శనానికి వెళ్లడం, టిఫిన్ చేసి రావటం, మహర్షి వారి ప్రవచనం వినటం, భోజనం చేయటం, రూముకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం, మళ్లీ సాయంత్రం బాబా దర్శనానికి వెళ్లడం అలా అక్కడ ఉన్నన్ని రోజులూ ఎలాంటి ఆలోచనలు, బాధలు లేకుండా ఆనందంగా గడిపాను. ప్రతిపూట ప్రతిరోజూ నాలో తెలియని కొత్త ఉత్సాహం, పట్టలేని సంతోషం, ప్రతిక్షణమూ బాబాను చూడాలన్న తపన ఇలా నా రెండో శిరిడీయాత్ర చాలా అద్భుతంగా, అమోఘంగా జరిగింది. బాబాతత్వం తెలిసిన తర్వాత, బాబాను అనన్యంగా ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి శిరిడీ వెళ్లడం, అక్కడ పదకొండు రోజులు నిద్ర చేయటం అంతా ఒక కలలా జరిగిపోయింది. అక్కడినుండి వచ్చిన తరువాత కూడా నన్ను నేనే నమ్మలేక 'నేనేనా అన్ని రోజులు శిరిడీలో ఉన్నాను? ఇది కలా, నిజమా' అనే ఆలోచనలో ఉండేదాన్ని. అద్భుతమైన శిరిడీ యాత్రను, అద్భుతమైన దర్శనాలను అనుగ్రహించిన ఆ సాయినాథుడు మా ఇంట ఉన్న  పరిస్థితుల నడుమ మా వెన్నంటే ఉండి మా కుటుంబాన్ని అనుక్షణం రక్షిస్తూ బాధలను మరిపింపజేస్తూ ఉండేవారు.


మూడోసారి, నాల్గోసారి శిరిడీ దర్శనం:


2014, 2015 సంవత్సరాలలో నవంబరు నెలలో స్వామివారు శిరిడీలో రాధాకృష్ణమాయి గురించి ప్రవచిస్తున్నారని, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఆయనను సన్నిహితంగా సేవించుకున్న భక్తుల వారసులకి సన్మానాలు చేస్తున్నారని తెలిసి ఎలాగైనా శిరిడీ వెళ్ళాలన్న బలమైన కోరిక మాకు కలిగి ఆర్తిగా బాబాను వేడుకున్నాము. ఆ సద్గురు సాయినాథుని అనుగ్రహం మాకు లభించింది. ఆయన కృపవలన మావారికి ఆఫీసులో సెలవు దొరకడం, శిరిడీ ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. రాధాకృష్ణమాయి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం, బాబా సన్నిధిలో గడపాలన్న ఉత్సాహంతో శిరిడీ చేరుకున్న మేము తొలిరోజు నుంచి బాబా దర్శనాలు చేసుకుంటూ వారి స్మరణలో ఆనందంగా గడిపాము. ఇంకా కార్తీకమాసం కాబట్టి లక్ష్మి మందిరంలో శివునికి అభిషేకాలు చేసుకోవడం, ప్రవచనాలకు పాల్గొనడం చేసేవాళ్ళం. ప్రవచనాలలో రాధాకృష్ణమాయి గురించి వింటుంటే, నిజంగా అప్పటి సాయి సన్నిధిలో ఉన్నామా అని అనిపించేది. అంతటి తాదాత్మ్యం చెందడం మూలాన మాయీ పడ్డ కష్టాలు వింటుంటే దుఃఖం తన్నుకొచ్చేది, అదే సమయంలో ఆమెపై బాబా చూపిన వాత్సల్యం, ప్రేమ, అనుగ్రహాలకు ఆనందంతో మనసు ఉక్కిరిబిక్కిరయ్యేది. ఆ అనుభూతి నుంచి బయటికి రావడానికి మాకు ఎంతో కష్టమయ్యేది. ఇటువంటి సత్సాంగత్యం వలన ఆ రెండు సంవత్సరాలలో పదకొండేసి రోజులు తెలియని తన్మయత్వంలో గడిచిపోయాయి. చివరికి తిరుగు ప్రయాణమవుతుంటే దుఃఖం ఆపుకోలేకపోయాను. బాబా సన్నిధి వీడి వెళ్ళడానికి మనసు రాక, "అప్పుడే 11 రోజులు అయిపోయాయా బాబా? ఇంకా ఇక్కడే ఉంటే బాగుండేది" అని ఏడుపు వచ్చింది. ఆ విధంగా నా సాయి తండ్రి ఒడిలో 11రోజులు, 11నిద్రలతో మా మూడు, నాలుగు శిరిడీయాత్రలు పూర్తయ్యాయి. శిరిడీ వెళ్ళిన దగ్గర నుంచి ఏదో తెలియని అనుభూతి కలగడం వలన నాకు, మావారికి బాబాపట్ల అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. మా కుటుంబంలో ఉన్న సమస్య తీరనప్పటికీ నన్ను, మా వారిని, నా పిల్లలని ఏ కష్టం కలగకుండా చూసుకుంటూ ఒక్కోసారి మాకున్న సమస్యను మరిచిపోయేలా చేసేవారు బాబా. పేరుకే సమస్య మాది, అనుభవించేది అంతా ఆ సాయినాథుడే.


ఐదోసారి శిరిడీ దర్శనం:


2015 తర్వాత 2016లో మావారు, మా పెద్దబ్బాయి శిరిడీ వెళ్లొచ్చారు. అప్పుడు శిరిడీ  వెళ్లాలని నాకు ఎంతో కోరికగా ఉన్నప్పటికీ బాబా అనుమతి లభించలేదు. ఆ తర్వాత కూడా మావాళ్ళు శిరిడీ వెళ్లొస్తున్నా నాకు మాత్రం వెళ్ళడానికి కుదరలేదు. 2019, నవంబరులో మావారు, చిన్నబ్బాయి శిరిడీ వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్లాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా నా ప్రయాణం రద్దు అయింది. తరువాత 2020, ఫిబ్రవరి 8న నేను, మా పెద్దబ్బాయి శిరిడీ వెళ్లడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. కానీ తెల్లవారితే ప్రయాణమనగా ఆడవాళ్లకు సహజమైన నెలసరి వచ్చి వెళ్ళలేకపోయాను. బాబా అనుమతి లభించనందుకు చాలా బాధపడ్డాను కానీ, నేను శిరిడీ వెళ్ళడానికి ఇది సమయం కాదేమో, 'నీతోనే ఉన్నాను. ఎక్కడికి వస్తావ'ని బాబా అనుకుంటున్నారేమో అని సరిపెట్టుకున్నాను. అలా ప్రతిసారీ ఏదో ఒక కారణంగా ఆగిపోతున్న నా శిరిడీ ప్రయాణం 2021లో ఫలవంతం అయింది. ఎప్పుడు వెళ్లాలనుకున్నా వెళ్ళలేకపోయిన నేను కార్తీకమాసంలోనే తనని దర్శించుకోవాలని బాబా అనుకున్నారేమో! కార్తీకమాసంలోనే ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించారు బాబా.


2021, కార్తీకమాసంలో నవంబర్ 6వ తేదీన శిరిడీ వెళ్ళాడానికి మేము టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అప్పటికింకా మా ప్రయాణానికి పదిరోజులు ఉంది. గత అనుభవాల దృష్ట్యా, 'ఈసారైనా శిరిడీ వెళ్తానా' అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆరో తారీఖు ఉదయం ట్రైన్ ఎక్కేవరకూ నాకు 'శిరిడీ వెళ్తాను, బాబా దర్శనం చేసుకుంటాను' అనే నమ్మకం లేదు. అలాంటిది ఆ రోజు రానే వచ్చింది. నిజంగా నేను 'శిరిడీ వెళ్తున్నాను. బాబా అనుమతి నాకు లభించింది. నేను బాబా దర్శనం చేసుకోబోతున్నాను' అని చాలా ఉత్సుకతతో నా ప్రయాణం మొదలైంది. ఎప్పుడెప్పుడు శిరిడీ చేరుకుంటానా అని నాలో ఉత్కంఠత అధికమైంది. మరునాడు ఉదయం ట్రైన్ శిరిడీలో ఆగింది. అంతే నా సంతోషానికి అంతులేకుండా పోయింది. నిజంగా వచ్చేసాను, శిరిడి నేలలో అడుగుపెట్టాను. కళ్ళల్లో ఆనందభాష్పాలు, గుండెల్లో సన్నాయి మేళాలు మోగుతున్నాయి. నిజంగా అద్భుతం. అత్యంత ఆరాటం, బాబా తండ్రిపై అంతులేని ప్రేమ ఇవన్నీ ధూళి దర్శనం చేసుకునేంతవరకూ నా కళ్ళల్లో, ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతూనే ఉన్నాయి. తరువాత పలుమార్లు తనివి తీరా బాబాను దర్శించుకుంటూ కార్తీకమాసంలో సాయినాథుని సన్నిధిలో ఆదివారం నుండి బుధవారం వరకు మొత్తం మూడు నిద్రలు చేశాను. ఈసారి శిరిడీ యాత్రలో నీంగావ్ లోని డేంగ్లే ఇల్లు, రహతా, అక్కడ కుషాల్ చంద్ ఇల్లు, రూయి, దూప్ ఖేఢాలోని చాంద్ పాటిల్ ఇల్లు దర్శించి అయా భక్తుల 3, 4, 5 తరాల వారసులను కలిశాము. ఇంకా కల్పవృక్షం చూసాను. మహాలక్ష్మి మందిరంలో ఉన్న శివుడికి అభిషేకం చేసుకున్నాము, మహాలక్ష్మీ అమ్మవారికి చీర కట్టించి ఒడిబియ్యం పోసాము. 


ఇక చివరిరోజు అంటే బుధవారానికి కూడా నా ఆరాటం ఎలా ఉందంటే, ఆరోజు ఉదయం బాబాను దర్శించుకున్నాక కూడా బాబాను ఏం కోరుకున్నానో తెలుసా! "బాబా నీ దర్శనభాగ్యాన్ని మళ్లీ తొందరలో కల్పించు" అని నా మనసులో బాబాకి విన్నవించుకున్నాను. తరువాత బయటికి వచ్చి మా పిల్లలకి ఫోన్ చేసి మాట్లాడాను. బాబా లీలను చూడండి,  కోరుకున్నదే తడవుగా మళ్లీ దర్శనాన్ని అనుగ్రహించారు. విచిత్రంగా మా పిల్లలు 12 గంటలకు మరో దర్శనానికి బుక్ చేశారు. దాంతో నేను మళ్లీ బాబా దర్శనానికి వెళ్లాను. బాబా దర్శనంతో నా తపన తీరింది. ఈసారి 'మళ్లీ దర్శన భాగ్యమెప్పుడు?' అని నా మనసుకు రాలేదు. నన్ను అంతలా మరిపింపజేశారు బాబా. తరువాత మేము తిరుగు ప్రయాణం అయ్యాము. బాబా దయవల్ల ఇంటివద్ద బయలుదేరింది మొదలు, తిరిగి ఇల్లు చేరుకునే వరకు మాకు ఎలాంటి వ్యయప్రయాసలు కలగలేదు. ఇంటికి వచ్చిన తరువాత రెండు, మూడు రోజులు వరకు నా ఈ శిరిడీ యాత్ర కలా, నిజమా అని నాకు అనిపించింది. చాలా చక్కగా అనే కంటే అత్యంత అద్భుతంగా జరిగింది. ఇంతటితో నా శిరిడీ యాత్రల గురించి పంచుకోవడం సంపూర్ణమయ్యింది. సాయిబంధువులందరికీ, బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ....


సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!



11 comments:

  1. Om sai ram om sai ram omSairam om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram

    ReplyDelete
  2. Om sai ram nice leela. Jai Sairam

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of my life and happiness is the only thing I can do to help you out with Baba’s blessings completed Jaisairam

    ReplyDelete
  4. Very very nice anubhavam of sai baba.i also went to Siridi many times.we have desire to visit Siridi.To see baba and take his blessings.your experience about baba is very nice.you wrote very well.om sai ram ������

    ReplyDelete
  5. Sai ram shared urexperience very nice and detailed. Om sai

    ReplyDelete
  6. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai

    ReplyDelete
  7. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  9. Adbudhutam Baba Sai leelalu 🙏🏻

    ReplyDelete
  10. Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo