సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

భావుసాహెబ్ అర్నాల్కర్.


భావుసాహెబ్ అర్నాల్కర్ న్యాయవాది వృత్తి చేస్తూ ముంబాయిలో నివసిస్తుండేవాడు. ఆ సమయంలో అతని మిత్రులు తరచూ పండరీపురం దర్శిస్తుండేవారు. దాదాపుగా బాబా గురించి ఎవరికీ తెలియదు. అయితే న్యాయవాది అయిన అర్నాల్కర్ తరచూ దభోల్కర్‌ను, మామల్తదారైన దేవును కలుస్తుండటం వలన వారి మధ్య స్నేహం అభివృద్ధి చెందింది. ఆ సమయంలో దభోల్కర్ బాబా సచ్చరిత్ర వ్రాయటంకోసం లీలలను, ముఖ్యమైన విషయాలను సేకరిస్తూ, తరచూ దేవుతో కలిసి శిరిడీ సందర్శిస్తుండేవారు. వాళ్ళిద్దరూ బాబా అద్భుతమైన లీలలను భావుసాహెబ్‌తో చెప్తుండేవారు. పర్యవసానంగా అతను కూడా బాబా భక్తుడై ఎప్పుడెప్పుడు శిరిడీ వెళ్తానా అని ఆశగా ఎదురుచూస్తుండేవాడు.

అప్పట్లో చాలామంది బాబాను ముస్లిం ఫకీరని అనుకునేవారు. కానీ అర్నాల్కరుకు ఎలాంటి సందేహమూ లేదు. ఆయనకి బాబా భగవంతుని అవతారం. భక్తుడు తాను నమ్ముకున్న దైవం దగ్గర అన్ని విషయాలు తేలికగా మనస్సు విప్పి చెప్పుకోవచ్చన్నది అతని అభిప్రాయం. నిత్యావసరాలకు కూడా పైకం లేనంత క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అతని శిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. అతను తన ప్రయాణానికి ముందు మనస్సులో, "శిరిడీ వెళ్ళి, నా దైవమైన బాబా పాదాలను శరణు పొందాలి. తరువాత ఆయనతో ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి?" అని పదేపదే ఆలోచించుకుంటూ, "భక్తుడు తన సమస్యలను, బాధలను భగవంతునికి తానే చెప్పుకోకపోతే, ఇంకెవరు వాటిగురించి చెప్తారు?" అని పరిపరివిధాల నెమరువేసుకుంటూ మొత్తానికి శిరిడీ ప్రయాణమయ్యాడు.

శిరిడీ చేరుకున్న తరువాత ద్వారకామాయికి వెళ్ళి, ఎంతో భక్తితో బాబా ముందర సాష్టాంగపడ్డాడు. మూడురోజులపాటు తరచూ ద్వారకామాయికి వెళ్ళివస్తూండేవాడు. అతను వెళ్ళిన ప్రతిసారీ బాబా చుట్టూ చాలామంది భక్తులు ఉండేవారు. ఒక్కసారి కూడా బాబా ఒంటరిగా ఉండకపోవడంతో తాను అనుకున్నది బాబాకు చెప్పలేకపోయాడు. అందరిముందు తన సమస్యలను బాబాకు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. 4వ రోజు బాబా అతన్ని పిలిపించి, తమ దగ్గరగా కుర్చోబెట్టుకొని, "ఇప్పుడు నీవు బయలుదేరాలి. నీకు కుటుంబం, బంధువులు ఉన్నారు కదా?" అని అన్నారు. వెంటనే అతడు తన శిరస్సును బాబా పాదాలపై ఉంచి, భావోద్వేగాలకు లోనయ్యాడు. ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా తన మనస్సులో, "బాబా వెళ్లిపొమ్మని చెప్పిన తరువాత ఎవరూ ఇక్కడ ఒక్కనిమిషం కూడా ఉండరు, ఇది శిరిడీ ఆచారం. కానీ నా సమస్యలు బాబాకు చెప్పాలి, కానీ చెప్పలేకపోయాను. ఏది ఏమైనా ఇక నేను బయలుదేరడం మంచిది" అని అనుకుని నిరాశతో ద్వారకామాయి నుండి బయటకు వెళ్ళబోయాడు. ఇంతలో బాబా అతనిని పిలిచి, "భావూ! నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి?" అని అడిగారు. భావుకు ప్రాణం లేచివచ్చినట్లు అనిపించి తన మనస్సులో, "బాబా ఎంత గొప్పవారు! స్వయంగా ఆయనే డబ్బు విషయం ప్రస్తావిస్తున్నారు" అని అనుకుంటూ బాబాతో, "నా వద్ద మూడు రూపాయలు, కొన్ని అణాలున్నాయి. అవి నా తిరుగుప్రయాణానికి సరిపోతాయి" అని చెప్పాడు. అప్పుడు బాబా, "అరె! ఆ మొత్తం పైకం నాకివ్వు. ఫకీరుకు కూడా డబ్బులు అవసరమే" అని అన్నారు. దానితో భావు మౌనంగా బాబాకు డబ్బు ఇచ్చేసాడు. వెంటనే బాబా, "టాంగా నీకోసం బయట వేచివుంది. తొందరగా వెళ్ళు!" అని అన్నారు. నిరాశతో భావు వేచివున్న టాంగా వద్దకు వెళ్ళాడు. టాంగావాడు భావుకి పరిచయస్తుడై ఉండటంతో, టాంగా నిండుగా ఉన్నప్పటికీ అతనికి స్థలం సర్దుబాటు చేసాడు. నిండుగా ప్రయాణికులు ఉన్నందున టాంగావాడు అతనివద్ద డబ్బులు కూడా తీసుకోలేదు. "ఇప్పుడు ముంబాయి ఎలా వెళ్ళాలి? టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం" అని ఆలోచిస్తూ ప్లాట్‌ఫారమ్ మీద వేచి ఉన్నాడు. ఇంతలో ముంబాయి వెళ్ళే రైలు వచ్చి ఆగింది. తనకి ఎదురుగా ఉన్న బోగిలోనుంచి ఎవరో, "వకీల్ సాహెబ్, ఈ బోగీలోకి రండి!" అని పిలవడం వినిపించింది. అది రెండవతరగతి బోగీ. ఒక మరమనిషిలా భావు బోగీలోకి ఎక్కి చూస్తే, ఆ పిలిచిన వ్యక్తి ఎవరో కాదు, ఇతని పాత స్నేహితుడైన రైల్వే అధికారి. భావు తన దగ్గర టిక్కెట్ లేదని తెలియజేయగా, ఆ స్నేహితుడు, "నేను నీతో ముంబాయికి ప్రయాణం చేస్తుండగా నీకెందుకు చింత? బాబా కృపవలన చాలా నెలల తరువాత మనం కలిసాం" అని అన్నాడు. భావు ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. ఇద్దరూ కలిసి సుఖంగా ప్రయాణం చేసి ముంబాయి చేరుకున్నారు.

ముంబాయిలో దిగిన తరువాత అతని స్నేహితుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. బయటకు వెళ్ళే ద్వారంవద్ద రైల్వే అధికారి టికెట్లు పరిశీలిస్తున్నాడు. అందువలన అతడు బయటకు వెళ్లలేక అక్కడే నిల్చొని చూస్తున్నాడు. అంతలో ఇద్దరు మొరటుగా వున్న పల్లెటూరి వ్యక్తులు స్టేషన్ లోపలికి ప్రవేశిస్తూ ఆ అధికారిని దారినుంచి పక్కకు నెట్టుకుంటూ నేరుగా భావు దగ్గరకు వెళ్లి, ఒక సంచి అతని చేతిలో పెట్టారు. అందులో 300/- రూపాయలు ఉన్నాయి. వాళ్లలో ఒక మనిషి, "వకీల్ సాహెబ్, నేను నా స్నేహితుడైన ఇతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ బాబా కృపవలన నేనిక్కడ మిమ్మల్ని కలిసాను. మూడురోజుల తరువాత నా కేసు మొదలు కాబోతోంది. కాబట్టి దయచేసి ఈ డబ్బులు తీసుకోండి. మీరిప్పుడు తీసుకోకపోతే ఇదే పనిమీద మీకు ఫీజు ఇవ్వడానికి అంతదూరంలో ఉన్న వసయికి రావాలి" అని చెప్పాడు. ఆ మాటలు వింటున్న భావుకి, బాబా తన సమస్యకి నిశ్శబ్దంగా తగిన నివారణ చేసారని అర్థమై నోటమాట రాలేదు.

భావుసాహెబ్ అర్నాల్కర్‌లా మనకి కూడా బాబాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే బాబా మూలాలతో సహా ఆ సమస్యలను/అడ్డంకులను తొలగించి మనలను పరిశుద్ధం చేస్తారు. ఒకసారి మనల్ని పరిశుద్ధం చేసిన తరువాత, మన పురోగతికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మన బాధ్యత ఏమంటే, ఆయన చెప్పినవి ఒక మరమనిషిలా అనుసరించడం. ఒకసారి అనుసరించడం మొదలుపెట్టాక, మన పురోగతికి, అభివృద్ధికి అవసరమైన త్రిగుణాలను నిర్వహించే శక్తిని అనుగ్రహిస్తారు.


Ref: శ్రీసాయిలీల పత్రిక, అక్టోబర్ 1979.


సోర్స్: Baba's Divine Manifestations by Vinni Chitluri.

4 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤😊

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤🌺😊🌸😀🌹🥰🌼

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo