సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నవగురువార వ్రతంతో ఉద్యోగం




ఆస్ట్రేలియా నుండి ఒక సాయిబంధువు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

నేను ఇండియాలో ఉన్నప్పటినుండి బాబా భక్తురాలినే అయినా, నా వివాహమైన తరువాత నా భర్తకి బాబాపట్ల ఉన్న అపారమైన భక్తి, విశ్వాసాల కారణంగా నాలో కూడా బాబాపై విశ్వాసం రెట్టింపు అయ్యింది. మేము మా జీవితాలలో బాబా చేసిన ఎన్నో అద్భుతాలు చూసాము. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసానికి సంబంధించి మేము చివరిరోజున దరఖాస్తు చేసుకున్నా బాబా మమ్మల్ని అనుగ్రహించారు. ఇండియాలో పనిచేసిన అనుభవం ఉన్నా, 6 సంవత్సరాలు ఖాళీగా ఉండవలసి వచ్చింది. అయినా కూడా బాబా నాకు ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం లభించేలా చేసి నా కోరిక తీర్చారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను ఫార్మసీలో డిగ్రీ పూర్తిచేసి, ఇండియాలోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో 5 సంవత్సరాలు పనిచేసాను. పెళ్ళైన తరువాత నేను ఆస్ట్రేలియాకి వచ్చేసాను. కుటుంబ కారణాల దృష్ట్యా నేను ఏ ఉద్యోగానికీ దరఖాస్తు చేయకుండా కొంతకాలం ఖాళీగా ఉన్నాను. పరిస్థితులన్నీ చక్కబడ్డాక నా చదువుకి తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాను. కానీ, ఆస్ట్రేలియాలో నాకు పనిచేసిన అనుభవం లేకపోవడం, రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళెవరూ లేకపోవడంతో ఏ కంపెనీ నుండి కూడా ఫోన్ కాల్స్ వచ్చేవి కావు. నేను నా అర్హత కంటే తక్కువ స్థాయి ఉద్యోగానికి ప్రయత్నించినా కూడా ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు నవగురువార వ్రతం చేయాలని నిశ్చయానికి వచ్చాను. అలా అనుకున్న మరుక్షణమే మావారు తన సహోద్యోగిని కలిశారు. మాటల్లో నా ఉద్యోగ ప్రయత్నాల గురించి చెప్పగా, ఏదైనా వృత్తి నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఒక కోర్సులో చేరమని తను సలహా ఇచ్చారు. నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోర్సులో చేరేందుకు నిర్ణయించుకుని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాను. వెంటనే, “మీ వివరాలు నమోదు చేయబడ్డాయి. త్వరలోనే మా ప్రతినిధి ఒకరు మిమ్మల్ని సంప్రదిస్తారు” అని ఒక ఇ-మెయిల్ వచ్చింది.

తరువాత వచ్చిన గురువారంనాడు నేను నవగురువార వ్రతం మొదలుపెట్టాను. సరిగ్గా అదేరోజు సాయంత్రం నాకు ఆ ఇన్స్టిట్యూట్ వారు ఫోన్ చేసి, మరుసటిరోజు ఇన్స్టిట్యూట్ కి వచ్చి పేరు నమోదు చేసుకోమని చెప్పారు. నేను మరుసటివారం నుండి ఆ కోర్సులో చేరిపోయాను. తరువాత బాబా ఆశీస్సులతో మెల్బోర్న్ లోని ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇంటర్న్‌షిప్(ట్రైనింగ్, జీతం ఉండొచ్చు, ఉండకపోవచ్చు) చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ ఇంటర్న్‌షిప్ పూర్తయ్యే సమయానికి ఆ కంపెనీలో ఖాళీలు లేకపోవడంతో, ఇంక ఆ కంపెనీ విడిచిపెట్టి మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నించాల్సిన పెద్ద సవాలు ఎదురైంది. అప్పుడు నేను మనస్పూర్తిగా, గుండెలోతుల్లో నుండి, "బాబా! ఎలాగైనా ఇదే కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చేలా చేయండి" అని ప్రార్థించాను. వెంటనే బాబా మిరాకిల్ మొదలైంది. హఠాత్తుగా నేను ఇంటర్న్‌షిప్ చేసిన అదే డిపార్టుమెంటులో ఇద్దరు ఉద్యోగులు రాజీనామా ఇచ్చారు. కానీ అప్పటికీ నాకు మార్గం సుగమం కాలేదు. ఎందుకంటే నాతో పాటు ఒక చైనా వ్యక్తి కూడా ఇంటర్న్‌షిప్ చేసాడు. మా హెడ్ కూడా చైనా అతను కావడంతో అతన్నే ఉద్యోగంలో తీసుకోవడానికి ఆసక్తి కనబరిచేవాడు.

కానీ బాబా అద్భుతమే చేసారు. పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. కంపెనీ మెయిన్ హెడ్ (అంటే చైనా హెడ్ కంటే పైఅధికారి) ఇంటర్న్‌షిప్ చేసిన ఆ చైనా వ్యక్తితో పోలిస్తే నాకే ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు, అనుభవం ఉన్నాయని నన్నే ఎంపిక చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. చివరికలా సాయిబాబా నేను కోరుకున్న కంపెనీలో నేను పనిచేసిన డిపార్టుమెంటులోనే నాకు 8 నెలల కాంట్రాక్టు ఉద్యోగాన్ని ఇచ్చారు. ఈ ఆస్ట్రేలియాలో నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించేందుకు ఎవరైనా సాయం చెయ్యకపోతారా అని ఆర్తిగా వేచి చూసిన సమయంలో బాబాయే నాకు సహాయం చేసారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" సాయిభక్తులమైన మనమంతా కేవలం 'శ్రద్ధ' మరియు 'సబూరి' అన్న రెండు పదాలపై సదా నమ్మకం ఉంచాలి. బాబా సహాయం తప్పక అందుతుంది.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo