సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి ప్రేమను మించినదేదీ లేదు


అందరికీ సాయిరాం! నా పేరు భాను. నిజామాబాదు నివాసిని. ఇదివరకు రెండుసార్లు నా అనుభవాలను బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.

మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. నాకు ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. నా చిన్నతనంలోనే వాళ్ళ వివాహాలు జరిగిపోయాయి. నా చిన్ననాటినుండి నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. మా అమ్మ అన్న దగ్గర ఉండేది. మా అన్న ఎప్పుడూ త్రాగి ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాడు. నేను సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు అన్న చేసే గొడవల గురించి అమ్మ నాతో చెప్పుకునేది. నన్ను కూడా మా అన్న తిట్టి గొడవ చేస్తుండేవాడు. అందువలన హాస్టల్లోని వారంతా సెలవలు ఎప్పుడు వస్తాయా, ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని ఎదురుచూస్తుంటే, నేను మాత్రం సెలవులు వస్తున్నాయంటే చాలు భయపడిపోయేదాన్ని. చిన్ననాటినుండి బాబా భక్తురాలినైన నేను ప్రతి విషయంలో బాబాపైనే ఆధారపడుతుండేదాన్ని.

మొదటి అనుభవం:

2012వ సంవత్సరంలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు చాలా రోజుల పాటు కుడి ఉదరభాగంలో బాగా నొప్పి వస్తుండడంతో ఒకరోజు మా అమ్మ, అక్క నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. డాక్టరు కొన్ని పరీక్షలు చేసి, స్కానింగ్ చేయించమన్నారు. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టరు, "కిడ్నీలో రాయి ఉంది. పైగా కుడి కిడ్నీ వాచింది. చిన్న వయసే కాబట్టి ఖచ్చితంగా నయమవుతుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజీ డాక్టరుని సంప్రదించండి" అని చెప్పారు. దాంతో అమ్మ, అక్క చాలా భయపడిపోయారు. అక్క, "ఎప్పుడూ దేవుడిని అతిగా నమ్ముతావు కదా! ఇప్పుడు నిన్నే దేవుడు ఆదుకోలేకపోయాడు" అని పెద్దగా ఏడ్చేసింది. నేను మాత్రం బాబాయే దిక్కు అని ధైర్యంగా ఉన్నాను. ఆ రాత్రి నేను, "బాబా! రేపు స్కానింగులో ఏ సమస్యా చూపించకూడదు. నన్ను నువ్వే కాపాడాలి" అని ప్రార్థించాను. మరుసటిరోజు నెఫ్రాలజీ డాక్టరుని సంప్రదిస్తే, అతను ఇంజక్షన్ ఇచ్చి స్కాన్ చేసారు. బాబా చేసిన చమత్కారం చూడండి! కిడ్నీలో ఎటువంటి సమస్యా లేదు, అంతా బాగానే ఉందని రిపోర్ట్ వచ్చింది. ఆ కష్టసమయంలో నన్ను ఆదుకున్న నా సాయినాథునికి నేను సదా కృతజ్ఞురాలినై ఉంటాను. 

రెండవ అనుభవం:

2013వ సంవత్సరంలో ఒకరోజు, నాకు బాబా అంటే చాలా ఇష్టమని, మా హాస్టల్లో ఉండే ఒక చెల్లి నన్ను బాబా మందిరానికి తీసుకెళ్ళింది. ఆ మందిరం మెయిన్ రోడ్డు నుండి బాగా లోపలకి ఉండడం వలన అక్కడొక మందిరం ఉందని చాలామందికి తెలియదు. అక్కడ బాబా విగ్రహం నుండి తేనె వస్తుందని చెప్తారు కానీ, నేను వాటిని నమ్మలేదు. కేవలం బాబా దర్శనం కోసం మందిరానికి వెళ్లి ఆనందపడేదాన్ని. ఆ తరువాత ప్రతిగురువారం వేకువనే 4 గంటలకి లేచి హమల్ వాడి బాబా మందిరానికి నడిచి వెళ్తుండేదాన్ని. ఎక్కడ బాబా మందిరం ఉందన్నా వెళ్లి చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంటుంది. అందువలన నేను చాలా మందిరాలు దర్శించాను. 3 సంవత్సరాలు గడిచాక ఒకరోజు రాత్రి నేను మొదటిసారి వెళ్ళిన తేనె సాయిబాబా మందిరం స్వప్నంలో కనిపించింది. ఆ మందిరం ఎందుకు కలలో కనిపించిందో నాకు అర్థం కాలేదు కానీ, మరుసటిరోజు ఆ మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. బాబా విగ్రహాన్ని చూస్తుండగా పక్కనే ఉన్న ద్వారకామాయి సాయి ఫోటో మీద నా దృష్టి పడింది. ఆ ఫొటోలో బాబా చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఎన్నో మందిరాలు దర్శించినప్పటికీ ఈ మందిరంలోనే బాబాకి చామరం వీచే అవకాశం నాకు వచ్చింది. తరువాత మందిర ప్రాంగణంలో ఉన్న చెట్ల ఆకులు రాలిపడి అక్కడంతా చెత్తగా ఉండటం చూసి నా మనస్సుకు బాధగా అనిపించి, ఎవరినీ అడగకుండా చీపురు తీసుకుని ఆ ఆవరణ అంతా శుభ్రం చేసాను. అక్కడే ఎక్కువ సమయముంటే పూజారిగారు తిడతారేమోనని మొదట్లో భయపడేదాన్ని. కానీ బాబా కృపవలన అతనేమీ అనలేదు. అతను ఇతర పూజార్ల వలె దక్షిణలు వంటివి ఏమీ తీసుకోకుండా అందరితో కలుపుగోలుగా ఉండేవారు. అక్కడి పద్ధతులన్నీ నచ్చి ప్రతిరోజూ మందిరానికి వెళ్లి ఎక్కడా చెత్త లేకుండా శుభ్రంగా చూసుకునేదాన్ని. ఎక్కువ సమయం మందిరంలోనే కూర్చుని బాబా విగ్రహాన్ని చూస్తూ ఉండేదాన్ని. ఒకరోజు మధ్యాహ్న ఆరతి అయ్యాక కూర్చుని బాబాను చూస్తుంటే పూజారిగారు నా దగ్గరకి వచ్చి, "అమ్మా, గుడికి తాళం వెయ్యాలి. కానీ నువ్వు బాబాని చూస్తూ కూర్చున్నావు. అందుకే ఈరోజు నీకోసం తాళం వెయ్యను. సాధారణంగా అయితే తాళాలు వేసే వెళ్తాను. నువ్వు బాబాను చూసుకున్నంతసేపు చూసుకుని, తాళం వేసి, నేను ఒక చోటు చూపిస్తాను, ఎవ్వరూ చూడని సమయంలో అక్కడ తాళం చెవి పెట్టి వెళ్ళు. నీకు కాబట్టి ఆ రహస్యం చెప్పాను, వేరే ఎవరికీ చెప్పము" అని చెప్పారు. అప్పటినుండి నేను ప్రతిరోజూ నాకు నచ్చినంతసేపు బాబాని చూసుకుంటూ ఉండేదాన్ని. బాబా వస్త్రాలు తీయగానే ఉతికి ఆరవేసేదాన్ని. ఆరతుల సమయానికి అన్నీ సిద్ధం చేసేదాన్ని. ఆరతి పూర్తైన తరువాత బాబా కోసం భక్తులు తెచ్చిన భోజనం, చపాతీలు, పండ్లు బాబాకి నైవేద్యం పెట్టి, తరువాత వాటిని నాకిచ్చేవారు. అక్కడే తిని అక్కడే పడుకునేదాన్ని. నాకెప్పుడూ భయం అనిపించలేదు. అలా హాస్టల్లో కంటే బాబా మందిరంలోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని, బాబా దగ్గరే నా రోజంతా గడిచిపోయేది. నా భక్తిని చూసి పూజారిగారు, "ఇంత చిన్నవయసులో నీకింత భక్తి ఎలా వచ్చిందమ్మా” అని ఎంతో సంతోషపడేవారు. మందిరానికి వచ్చేవారంతా నన్ను వారి కూతురిలా చూసుకునేవారు. నాకు ఉండడానికి చోటు లేక బాధపడుతున్న సమయంలో బాబా నా కలలోకి వచ్చి నన్ను తన దగ్గరకి తీసుకున్నారు. బాబా మందిరమే నాకు ఆశ్రయం అయింది. బాబాకి వచ్చిన భోజనం నా కడుపు నింపింది. ఒకప్పుడు ఏడుస్తూ గడిపిన నా జీవితానికి బాబా ఆనందం తీసుకుని వచ్చారు. నా జీవితంలో బాబా చేసిన సహాయం నేనెప్పటికీ మరిచిపోలేను. నిజంగా బాబా తోడు లేకుండా నేను బ్రతకలేను. ఆయనిచ్చిన జీవితమే నాది. బాబాతో నాకు ఎన్నోజన్మల ఋణానుబంధం ఉందేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే తండ్రిలేని నన్ను తండ్రిలా అక్కున చేర్చుకున్నారు.

11 comments:

  1. ఓం సాయిరాం. జీవితం ధన్యం. బాబా కృప మీపై చాలా ఉంది.

    ReplyDelete
  2. Sairam bhanugaru.u r very lucky person.baba ki sevalu chesi babatho undagaligaru temple lo milantyvarito okkasari matladite baba anugraham maku tondara labistundi.

    ReplyDelete
  3. Sairam sai,meeru nijanga chala lucky sai,Mee jeevitam lo Baba meeku eppudu ilage thodu vundalani manaspoorthiga korukuntunna.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo